గుత్తి రామకృష్ణ


స్వాతంత్య్రసమరయోధులు, సాహిత్యవేత్త, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తుదిశ్వాస వరకు కృషి చేసిన గొప్పవ్యక్తి , కమ్యూనిస్టు నాయకుడు,పాత్రికేయులు ,
అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు గుత్తి రామకృష్ణ . ఈయనపలువురికి ఆదర్శం.
గుత్తి రామకృష్ణ 1915, జూలై 13న అనంతపురం పాతవూరులోని అంబారపు వీధిలో గుత్తి వెంకటప్ప, నారాయణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు జన్మించిన తరువాత ఇతని తండ్రి సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మిక జీవనం గడిపి, ఎక్కడెక్కడో తిరిగి చివరకు హంపిలో మరణించాడు. అప్పటికి రామకృష్ణ వయసు 3 సంవత్సరాలు. తండ్రి మరణంతో ఇతడు తన మేనమామ వెంకటరమణప్ప వద్ద పెరిగాడు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం అనంతపురం మునిసిపల్ హైస్కూలులో నడిచింది. చదివే రోజులలో ఇతడు క్లాసు పుస్తకాల కంటే ఇతర పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. అనంతపురం కాలేజీలో దఫేదారుగా పనిచేసిన ఇతని మేనమామ ఇతనికి లైబ్రరీ నుండి మంచి మంచి పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. హైస్కూలు చదివే రోజులలోనే వీరేశలింగం రచనలు  చదివాడు. ఇతడికి చిన్ననాటి నుండే ఆంగ్లేయులంటే ద్వేషం అబ్బింది. అందుకే ఇతడు ఇంగ్లీషు భాష పట్ల కూడా ద్వేషంతో ఆ సబ్జెక్టు చదివేవాడు కాదు. ఫలితంగా ఎస్.ఎల్.సి. పరీక్షలో ఇంగ్లీషు పరీక్ష తప్పాడు. 1936-39లో మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో నెలకు 8 రూపాయల ఉపకార వేతనంతో చదివాడు. అక్కడ అడివి బాపిరాజు, కాటూరి వేంకటేశ్వరరావులు ఇతని గురువులు. 1937లో ఆచార్య ఎన్.జి.రంగా రైతాంగ విశ్వవిద్యాలయంలో సమ్మర్ స్కూల్‌లో చదివాడు.


పెనుకొండలోని కాంట్రాక్టర్ బండి రామప్ప కుమార్తె నాగలక్ష్మమ్మతో వివాహం జరిగింది.
చదువు ముగించుకుని అనంతపురం వచ్చి ఐదుకల్లు సదాశివన్ తొ కలిసి హరిజన హాస్టల్ నిర్వహించాడు. ఎర్రమల కొండప్ప 1934లో గాంధీ అనంతపురం వచ్చిన సందర్భంలో దానంగా ఇచ్చిన రెండెకరాల స్థలాన్ని హరిజనోద్ధరణ కోసం కేటాయించగా ఆ స్థలంలో కొట్టాలు వేసి హరిజన హాస్టల్‌ను ప్రారంభించారు. ఇతడు ,సదాశివన్ కలిసి గ్రామగ్రామం తిరిగి తిండిగింజలు సేకరించి హాస్టల్ పిల్లలకు భోజన వసతి కల్పించారు.
కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ కమ్యూనిస్టు భావాలవైపు ఆకర్షితుడయ్యాడు.
1939లో తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి, ఐదుకల్లు సదాశివన్ లతో కలిసి అనంతపురం జిల్లాలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ శాఖ ప్రారంభించాడు.
ఇతడు కల్లూరు సుబ్బారావు, పప్పూరు రామాచార్యులు, ఎర్రమల కొండప్ప మొదలైనవారి నాయకత్వంలో పనిచేశాడు.
  1941లో ఆకాశవాణి రహస్యపత్రిక నడపడంతో ఐదుకల్లు సదాశివన్, గుత్తి రామకృష్ణ , మరొకరికి శిక్ష విధించారు . బళ్ళారి, అల్లీపురం జైళ్లలో ఒక సంవత్సరం శిక్ష విధించారు. జైలులో కూడా ఇతడు తోటి ఖైదీలలో కమ్యూనిస్టు భావాలను రేకెత్తించాడు. అక్కడ జరిగిన కాల్పులలో ఇతడు ఒక కన్నును కోల్పోయాడు. సంవత్సరం తరువాత మొదటగా విడుదలైన గుత్తి రామకృష్ణ వి.కె.ఆదినారాయణ రెడ్డితో కలిసి జిల్లా అంతటా తిరిగి కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేశాడు. విద్యార్థి, రైతు ఉద్యమాలలో కూడా చురుకుగా పనిచేశాడు.

ఇతడు పోలీసుల అరెస్టు నుండి తప్పించుకునేందుకు 1943లో వ్యాపారం నెపం తో సిలోన్  (శ్రీలంక) వెళ్లి ఒక సంవత్సరం తలదాచుకున్నాడు.
కమ్యూనిస్టురాజకీయాలనుండి తప్పించాలనే ఉద్దేశంతో ఇతని బంధువులు ఇతడిని సిలోన్ (శ్రీలంక)కు ఉల్లిగడ్డల  వ్యాపారానికి పంపించారు. ఆ రోజులలో అనంతపురం జిల్లాలో ఉల్లిగడ్డలు విస్తారంగా పండించేవారు. సిలోన్ లో ఉల్లిగడ్డలకు మంచి గిరాకీ ఉండేది. ఇతడు కొలంబోలో ఉంటూ అనంతపురం నుండి ఉల్లిగడ్డలు తెప్పించి విక్రయించేవాడు. కొలంబోలో ములాస్ అనే వ్యాపారికి మిలటరీ కాంట్రాక్ట్ ఉండేది. రామకృష్ణ ములాస్‌కు ఉల్లిగడ్డలు సప్లై చేసేవాడు. సిలోన్లో ఉంటూ ఇతడు కమ్యూనిస్టు పార్టీ సభలకు హాజరౌతూ పార్టీతో సంబంధాలు పెంచుకున్నాడు కాంట్రాక్టర్ ములాస్ ఇతడిని అనంతపురం జిల్లాకు తన ఏజెంట్‌గా వెళ్లమని ప్రతిపాదన చేశాడు. దానికి ఇతడు అంగీకరించి అనంతపురం తిరిగి వచ్చి ధర్మవరం కేంద్రంగా చేసుకుని పలుప్రాంతాల నుండి ఉల్లిగడ్డలు సేకరించి కొలంబోకుపంపించసాగాడు. ధర్మవరం లో వ్యాపారం చేస్తున్నపుడే వివాహం చేసుకొన్నారు.ఆ రోజుల్లో అనంతపురంలో  తరిమెల నాగిరెడ్డి పార్టీ తరపున పుస్తకాల షాపు పెట్టాలని తీర్మానించాడు. ఆ పనిని గుత్తి రామకృష్ణకు అప్పగించారు. పార్టీ ప్రోత్సాహసహకారాలతో 1947లో కృష్ణాబుక్‌స్టాల్ గుత్తిరామకృష్ణ ప్రారంభించాడు. అయితే సంవత్సరం తిరగకముందే ఇతడిని డిటెన్యూగా కడలూరు జైలుకు పట్టుకెళ్లి మూడు సంవత్సరాలు శిక్ష విధించారు. దీనితో బుక్‌స్టాల్ మూతపడింది. 1952లో జైలు నుండి విడుదలయిన తర్వాత రెండవసారి కృష్ణా బుక్‌స్టాల్ ను ప్రారంభించాడు. కమ్యూనిస్టు పుస్తకాలతో పాటు ఇతర సాహిత్య పుస్తకాలు, వేదాలు, పురాణాలు మొదలైన అన్ని పుస్తకాలను అమ్మేవాడు. 15 ఏళ్లపాటు ఈ పుస్తకాల షాపు బాగా నడిచింది. కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా చరిత్రలో అది ఒక స్వర్ణయుగం. కృష్ణా బుక్ స్టాల్ పార్టీకి సమన్వయ కేంద్రంగా ఉండేది. ఇతడు కమ్యూనిస్ట్ పార్టీ కో ఆర్డినేటర్‌గా పనిచేశాడు. తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి, నీలం రామసుబ్బారెడ్డి, పైడి లక్ష్మయ్య తదితర నాయకులు, పలువురు మేధావులకు కృష్ణా బుక్‌సెంటర్ ఒక అడ్డాగా మారింది. పట్టణంలో జరిగే అనేక రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ రూపుదిద్దుకునేవి. ఆవిధంగా జిల్లా రాజకీయ, సాంస్కృతిక వికాసంలో కృష్ణా బుక్‌స్టాల్ పాత్ర అమోఘమైనది. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చిన నేపథ్యంలో ఈ కృష్ణాబుక్ స్టాల్ మూతపడింది.

ఇతడు స్వాతంత్ర్యానికి పూర్వమే బ్రిటీష్ హయాంలోనే స్వతంత్రభారత్, ఆకాశవాణి పత్రికలకు జిల్లా సమస్యల గురించి వ్యాసాలు, వార్తలు వ్రాస్తూ ప్రజా సమస్యలను ప్రతిబింబింప జేసేవాడు. ప్రజాశక్తి, విశాలాంధ్ర, దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, జనశక్తి, ఉజ్జ్వల, జనత మొదలైన పత్రికలకు తొలి విలేఖరిగా పనిచేశాడు. దాదాపు 70 సంవత్సరాలు పత్రికా విలేఖరిగా పనిచేశాడు. భారత బంజార సంఘం ప్రోత్సాహంతో బంజారా పత్రికను అనంతపురం నుండి రెండేళ్లపాటు సంపాదకుడిగా ఉండి నడిపాడు. జనప్రభ దినపత్రికకు కూడా సంపాదకుడిగా పనిచేశాడు.
జర్నలి స్టుగా ఉంటూ పీడిత, బడుగు బలహీన వర్గాల పక్షాన నిజాలను వెలుగులోకి తెచ్చే విధంగా తన కలాన్ని నాట్యం చేయించారు. ప్రాంతీయవెనుకబాటుతనాన్ని సాహిత్య రూపంలో చక్కగా ప్రపంచానికి తెలియజేశారు.ఇతడు పాత్రికేయుడే కాదు కథారచయిత కూడా. ఇతడు వ్రాసినవి సుమారు 10 కథలే అయినా అవి ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. మొన్నమొన్నటి వరకు ఇతడినే అనంతపురం జిల్లా తొలి కథారచయితగా భావిస్తూ వచ్చారు. ఇతడు వ్రాసిన కథలలో కొన్ని గంజి కోసరం, చిరంజీవి, శిల్పి,వడ్లగింజలో,జొన్నచేను, కూటికోసం.1964లో అనంతపురంలో కథాసమ్మేళనం జరిగింది. ఆ సభలో పాల్గొన్నారు.గుత్తి రామకృష్ణ శతజయంతి వేడుకలను సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  శతజయంతి సందర్భంగా ‘అనంత ఆణిముత్యం’ పేరుతో గుత్తి రామకృష్ణ రచనలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ ఆవిష్కరించారు.  అప్పట్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేదని అందుకే రామక్రిష్ణ లాంటి వారు ధైర్యంగా అన్యాయాన్ని వెలుగులోకి తేగలిగారన్నారు. రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ పూర్వపు కమ్యూనిస్టులను మరచిపోతున్న రోజుల్లో మరోసారి గుర్తు చేసుకునేలా సీనియర్‌ కమ్యూనిస్టు నేత గుత్తి రామకృష్ణ శతజయంతి వేడుకలను సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టడం అభినందనీయం అన్నారు. నేటి వామపక్ష పార్టీల పోరాటాలకు ఆయన స్ఫూర్తి ప్రదాత అన్నారు. జిల్లాలో 1952-53 సంవత్సరంలో కరువు దుర్భిక్షం ఏర్పడినప్పుడు జిల్లా స్థితిపై గంజి కోసం అనే కథను రచించారన్నారు. వెట్టి చాకిరీపై చిరంజీవి, శిల్పి, వంటి కథలు రచించారన్నారు. గంజి కోసం అనే కథ చారిత్రకంగా, సామాజికంగా, సాహిత్యపరంగా విశిష్టతను సంపాదించిందన్నారు. ప్రాంతీయ జీవనాన్ని మాండలిక భాషలో కథలు రచించి ఆదర్శంగా నిలిచారన్నారు.
గుత్తి రామకృష్ణ 2009, మే 12వ తేదీన తన 95వ యేట తుదిశ్వాస విడిచాడు.✍️సేకరణ:– చందమూరి నరసింహా రెడ్డి.ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

చందమూరి నరసింహా రెడ్డి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s