తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో పలు విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశాడు.
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలో తేళ్ళమిట్ట పల్లెలో 1912 జూలై 1న కె.వి.రెడ్డి జన్మించాడు. అతని పూర్తి పేరు కదిరి వెంకట రెడ్డి. తల్లిదండ్రులు వెంకటరంగమ్మ, కొండారెడ్డి.చిన్నతనంలోనే అతని తండ్రి మరణించాడు. దాంతో తల్లితో పాటు తాడిపత్రిలోని అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేశారు. ఆకాలంలో వైధవ్యం మీద పడ్డ అతని తల్లి జీవితం మీది వైరాగ్య భావంతో గడుపుతూ ఉండడంతో చిన్ననాట కె.వి.రెడ్డి అల్లరికి పట్టపగ్గాలు ఉండేవి కాదు
తాడిపత్రిలో అతని బాల్యమంతా అల్లరి, ఆటపాటల్లో సంతోషంగా గడిచింది. చెరువుల్లో ఈతలు, కొండలు గుట్టలు ఎక్కడాలు, చేపలు పట్టడాలు, చెట్లూ పుట్టల వెంబడి తిరగడాలు, మహిమలు చేసే శక్తులు సంపాదించేందుకు శ్మశానాల్లో ఎముకలు సేకరించడం వంటి సాహసాలు, అల్లరులు చేసేవాడు. ఒకసారి అడవుల్లో తిరుగుతూ కె.వి.రెడ్డి, అతని మిత్రులు ఎలుగుబంటి కనిపిస్తే దాని మీద రాళ్ళు వేసి దాన్ని రెచ్చగొట్టారు. అది కోపంతో వెంబడిస్తే అందరూ పారిపోయారు. పారిపోతున్న పిల్లలని వదిలి ఎలుగుబంటి వెనక్కి వచ్చి చూస్తే కె.వి.రెడ్డి మాత్రం భయం వల్ల దారితోచక అక్కడే ఉండిపోయాడు. భయంతో వణుకుతున్న కె.వి.రెడ్డిని చూసి అది జాలిపడి విడిచిపెట్టేస్తే అతని ప్రాణాలు దక్కాయి. ఈ సంఘటన తర్వాతికాలంలో గుర్తుచేసుకున్న కె.వి.రెడ్డి “జంతువులకు కూడా జాలి, దయ వంటి సుగుణాలు ఉంటాయని ఆ సంఘటన వల్లే తెలిసిందని” చెప్పాడు.

గుణసుందరి కథ సినిమాలో ఎలుగుబంటి పాత్ర రూపకల్పన వెనుక చిన్నతనంలో అతను చూసిన జాలిగుండె గల ఎలుగుబంటి స్మృతి ఉంది.
ఆటపాటలలో మునిగితేలుతున్నా కె.వి.రెడ్డి తొలినుంచి బాగా చదివేవాడు. చదువుతో పాటుగా ఫుట్ బాల్, హాకీలాంటి ఆటల్లోనూ ముందుండేవాడు. ఈ పాఠశాల దశలోనే మూలా నారాయణస్వామితో స్నేహం ఉండేది. కె.వి. స్కూల్ ఫైనల్ పూర్తయ్యాక మేనమామలు, ఇతర కుటుంబ పెద్దలు సమీపంలోని అనంతపురం కళాశాలలో కాక ప్రతిష్టాత్మకమైన మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోనే చదివించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేశారు. మద్రాసు (నేటి చెన్నై)లో విక్టోరియా హాస్టల్లో ఉంటూ, ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకునేవాడు. పల్లెటూళ్ళలో చెరువుల్లో మునుగుతూ, కొండలెక్కుతూ ఉత్సాహభరితంగా గడిపిన కె.వి.రెడ్డికి హఠాత్తుగా మద్రాసు నగర జీవితం చాలా ఒంటరిగా, విసుగ్గా తోచింది. దాంతో నగర జీవితంలో ప్రాచుర్యం పొందుతున్న సినిమా థియేటర్ల మీద అతని దృష్టి పడింది. కాలక్షేపం కోసం సినిమాలు చూడడం మొదలుపెట్టి ఆదివారాల్లో మూడు ఆటలూ చూడసాగాడు. అలా క్రమేపీ డిగ్రీ పూర్తిచేశాడు. దర్శకుడు పి. పుల్లయ్య గ్రాడ్యుయేషన్లో కె.వి.రెడ్డికి సీనియర్. కె.వి. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేనాటికే పుల్లయ్య సినిమాల్లోకి ప్రవేశించి హరిశ్చంద్ర సినిమాకు దర్శకత్వం వహించాడు. కాలక్షేపం కాక సినిమాలు చూసినా చాలా శ్రద్ధతో సినిమాల్లోని అంశాలు పరిశీలించే అలవాటు కె.వి.రెడ్డికి ఉండడంతో పి.పుల్లయ్య అతనితో సినిమాలకు పనికివచ్చే కథల గురించి చర్చలు చేస్తూండేవాడు. పుల్లయ్య, కె.వి.రెడ్డి స్టార్ కంబైన్స్ లాడ్జిలో కలిసి రాత్రి తెల్లవార్లూ సినిమా కథల గురించి చర్చించేవారు


చదువు పూర్తికాగానే కె.వి.రెడ్డి ఏదైనా ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశాడు. ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఏ ఉద్యోగమూ దొరకలేదు. డిగ్రీ ఆనర్స్ పాసైన కె.వి. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నించినా కనీసం ఆరు నెలల విద్యాబోధన అనుభవం లేదన్న కారణంతో తిరస్కరించారు. ఉద్యోగ ప్రయత్నాల్లో వైఫల్యంతో విసిగి వేసారిన కె.వి.రెడ్డి, ఎ.ఎ.వి.కృష్ణారావు అన్న స్నేహితునితో కలిసి “ది స్టాండర్డ్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ” ని స్థాపించాడు. 250 రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ పాఠశాలలు, కళాశాలల్లో ప్రయోగశాలలకు ఉపకరించే శాస్త్రోపకరణాలను తయారుచేసేది. 1936-37 మధ్యకాలంలో ఏడాది పాటు చేసిన ఈ వ్యాపారం లాభాలను సంపాదించిపెట్టింది.
కె.వి.రెడ్డి భార్య శేషమ్మ. ఆ దంపతులది చాలా అన్యోన్యమైన దాంపత్యం. పున్నమి దగ్గర పడే కొద్దీ రాత్రిళ్ళు డాబా మీదికి భార్యని తీసుకువెళ్ళి వెన్నెల్లో గడపడం కె.వి.కి సరదా. అలానే ఉదయాన్నే భార్య తల దువ్వనిదే బయటకు అడుగు పెట్టేవాడు కాదు. అవుట్ డోర్ షూటింగులు లేక చెన్నైలోనే ఉన్నప్పుడు నిత్యం తన భార్య చేతి వంటే తినేవాడు. వయసు పెరిగే కొద్దీ బలపడిపోయిన ఆ అనుబంధం చివరికి భార్యకు క్యాన్సర్ అనీ, తగ్గడం కష్టమనీ తెలిసిన తర్వాత తాను రోజూ వేసుకోవాల్సిన రక్తపోటు, మధుమేహం మందులు వేసుకోవడం మానేసే వరకూ వెళ్ళిపోయింది.


కె.వి.రెడ్డి-శేషమ్మ దంపతులకు తొమ్మిది మంది సంతానం. పెద్ద కూతురు లక్ష్మీదేవిని ఓ వ్యాయామ ఉపాధ్యాయునికి ఇచ్చి పెళ్ళిచేశాడు. రెండో కూతురు సుమిత్రాదేవి భర్త లాయరు, వ్యాపారవేత్త. మూడవ సంతానమూ, పెద్ద కుమారుడు అయిన శ్రీనివాసరెడ్డి కె.వి. ఆఖరు చిత్రాల్లో కొన్నిటికి సహాయ దర్శకుడిగా పనిచేసి, ఆ పని మాని గోల్డ్ స్పాట్ సంస్థ మేనేజరుగా పనిచేస్తూ చిన్నవయసులోనే గుండెజబ్బుతో మరణించాడు. నాలుగవ సంతానమైన నరసింహారెడ్డి నావికాదళ అధికారిగా పనిచేసి అమెరికాలో స్థిరపడ్డాడు. ఐదవ సంతానం పార్వతీదేవిని బేతంచర్లకు చెందిన రామనాథరెడ్డికి ఇచ్చి వివాహం చేశాడు. ఐదవ సంతానమైన రామచంద్రారెడ్డి ఐఐటీలో చదువుకుని, అమెరికాలో 30 ఏళ్ళు పనిచేసి, హైదరాబాద్ లో సెమికండక్టర్స్ తయారుచేసే కంపెనీ పెట్టాడు. ఏడో సంతానం కొండారెడ్డి చెన్నైలో ఆటోమొబైల్ వర్క్ షాపు నిర్వహిస్తూ చిన్నతనంలోనే చనిపోయాడు. ఎనిమిదో సంతానమైన గీతలక్ష్మి వ్యాపారవేత్త రాచమల్లు సుదర్శన్ రెడ్డి భార్య. ఆఖరు సంతానమైన వరలక్ష్మి కర్నూలుకు చెందిన న్యాయవాది ఎ. ప్రభాకరరెడ్డి భార్య.
తన పిల్లలు సాంకేతిక నిపుణులుగానో, వైద్యులుగానో స్థిరపడాలని ఆశించాడే తప్ప, వారు సినిమా రంగంలోకి రావాలని కోరుకోలేదు. ఆ ప్రకారమే కొడుకులు సినిమా రంగానికి బయటే వేర్వేరు రంగాల్లో పనిచేశారు. అల్లుళ్ళను కూడా సినిమా రంగం నుంచి తెచ్చుకోలేదు. పిల్లలను క్రమశిక్షణతో పెంచాడు. సినిమా రూపకల్పనలో హడావుడి ఉన్నా ఉదయం, మధ్యాహ్నం పిల్లల కోసం సమయాన్ని కేటాయించి, వారిని తానే చదివించేవాడు. తన పిల్లల్లో ప్రత్యేకించి కూతుళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉండేది.
కె.వి.రెడ్డి ఎవరితో మాట్లాడినా బ్రదర్ అనే సంబోధించేవాడు. వందేమాతరం సినిమాకి కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మేనేజరుగా, కమలాకర కామేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసే రోజుల్లో ఒకరినొకరు ఆప్యాయంగా బ్రదర్ అని పిలుచుకునేవారు. ఈ అలవాటే క్రమేపీ కె.వి.కి జీవితకాలం ప్రతివారితోనూ కొనసాగింది. ఇది వాహినీ సంస్థలో బి.ఎన్.రెడ్డి, విజయా సంస్థలో నాగిరెడ్డి-చక్రపాణిలకు పాకి, అలా ఆ సంస్థల్లో పనిచేసి ఎన్.టి.రామారావు కూడా జీవితకాలం అలవాటైన పిలుపుగా మారింది.ఏదీ మనసులో పెట్టుకోకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం, ఎదుటివారి మెప్పుకోసం చూడకుండా బాగోలేనిది బాగోలేదనే స్పష్టంగా చెప్పడం కె.వి.రెడ్డి మాటతీరు.కె.వి. మాట్లాడేప్పుడు ఎక్కువగా ఆంగ్లంలోనే సంభాషించేవాడు.ఆంగ్ల సినిమాలు, పుస్తకాలు విరివిగా చదివేవాడు, వాటి నుంచి చాలాసార్లు తన సినిమాలో మూల కథకు స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి చేసుకునేవాడు. కె.వి.రెడ్డికి తెలుగు సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది. అతను చదువుకునే రోజుల్లోనే తెలుగు సబ్జెక్టు మీద బాగా మక్కువ ఉండేది, ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టులో ప్రెసిడెన్సీ కాలేజి మొత్తానికి ప్రథమ స్థానం సాధించాడు. కావ్యాలు, ఇతిహాసాలు అధ్యయనం చేశాడు.తాను ఎన్ని సినిమాలు తీసి, ఎన్ని అవార్డులు సాధించినా మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటర్మీడియట్లో తెలుగులో కాలేజీ ఫస్టు వచ్చిన సంగతే చివరిదాకా అందరికీ గర్వంగా చెప్పుకునేవాడు.
కె.వి.రెడ్డి భక్త పోతన (1943) మొదలుకొని శ్రీకృష్ణసత్య (1972) వరకు దాదాపు మూడు దశాబ్దాల కెరీర్లో 14 సినిమాలకు దర్శకత్వం వహించాడు. భక్త పోతన మినహా మిగతా అన్నిటికీ తానే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇవి కాక వాహినీ ప్రొడక్షన్స్ బ్యానర్లో కె.వి. దర్శకుడు కాక మునుపు బి.ఎన్.రెడ్డి తీసిన 3 సినిమాలకి, అయ్యాకా తీసిన స్వర్గసీమకీ ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు.
అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపించి తొలి సినిమా తీయడానికి కె.వి.రెడ్డి కోసం రెండు సంవత్సరాల పాటు వేచి చూశారంటే, మంచి విజయవంతమైన ప్రారంభం అందిస్తాడన్న నమ్మకం కన్నా అతను సినిమాలు తీసే పద్ధతి, ప్రణాళికాయుతమైన నిర్మాణశైలి నేర్చుకోదగ్గవన్నదే ముఖ్య కారణం. కె.వి.రెడ్డి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నామని, తర్వాత తర్వాత తమ సంస్థ అన్నపూర్ణా పిక్చర్స్ అలాంటి విధానాలతోనే కొనసాగిందని అని మధుసూదనరావు చెప్పేవాడు.


కె.వి.రెడ్డి వాహినీ సంస్థతో అనుబంధం
శాస్త్రోపకరణాల తయారీ వ్యాపారంగా చేస్తున్న కె.వి.రెడ్డిని అతని బాల్య స్నేహితుడు మూలా నారాయణస్వామి తాను భాగస్వామిగా ఓ సినిమా నిర్మాణమవుతోందని ఆసక్తి ఉంటే నిర్మాణ శాఖలో పనిచేయవచ్చని ఆహ్వానించాడు. కె.వి.రెడ్డి అలా వచ్చి రోహిణీ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న గృహలక్ష్మి సినిమాకి క్యాషియర్ ఉద్యోగం చేశాడు.1938లో గృహలక్ష్మి సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయినా సినిమా నిర్మాణంలో విలువల విషయమై హెచ్.ఎం.రెడ్డి ధోరణి బి.ఎన్.రెడ్డికి నచ్చకపోవడంతో బి.ఎన్.రెడ్డి, మూలా నారాయణస్వామి రోహిణీ పిక్చర్స్ నుంచి విడిపోయి, తమ వాటా సొమ్ముతో బయటకు వచ్చేశారు. మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి స్వంతంగా వాహినీ పిక్చర్స్ సంస్థ ప్రారంభించారు. వాహినికి మూలా నారాయణస్వామి ఛైర్మన్, బి. ఎన్. రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్. కె.వి.రెడ్డి కూడా వీరితో వచ్చి వాహినీ సంస్థలో చేరాడు. వాహినీ వారు తీసిన వందేమాతరం (1939), సుమంగళి (1940), దేవత (1941) సినిమాలకు ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేశాడు. క్యాషియర్‌గా గృహలక్ష్మికి పనిచేసిన నాటి నుంచీ ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్నా సినిమా నిర్మాణంలో ఇతర అంశాల పట్ల కూడా అవగాహన పెంచుకున్నాడు.
1968లో భాగ్య చక్రం విడుదలయ్యాకా ఇక కె.వి.రెడ్డికి రెండేళ్ళ పాటు ఏ అవకాశం రాలేదు. దీనికి తోడు తన రచయితను, సాంకేతిక నిపుణులను విజయా ప్రొడక్షన్స్ లో ఉద్యోగం నుంచి తొలగించడం, తనకు ఇచ్చిన కారును వెనక్కి తెప్పించుకోవడం వంటివాటిని అవమానంగా భావించి మరింత కుంగిపోయాడు. మరో సినిమా చేసి హిట్ కొట్టే వీలు లేకుండా ఇలా చివరి సినిమాల్లో ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడిగానే మిగిలిపోతానేమోనని మథనం చెందేవాడు. ఎవరినీ అవకాశం అడగలేని, అడిగినా ఇవ్వని స్థితిలో మిగిలిపోయాడు. హెచ్.వి.సంజీవరెడ్డి, ఎం.లక్ష్మీకాంతరెడ్డి అన్న వ్యాపారులు నిర్మాతలుగా మారి కె.వి.రెడ్డి అసిస్టెంట్ అయిన సింగీతం శ్రీనివాసరావుకు దర్శకత్వం అవకాశం ఇచ్చి, దర్శకత్వ పర్యవేక్షణ కె.వి.రెడ్డితో చేయిద్దామని ముందుకువచ్చారు. ఎలాగైనా సినిమా తీసి విజయం సాధించి కెరీర్ ముగించాలన్న ఆతృతలో “ఈ సినిమా నేనే దర్శకత్వం చేస్తాను. రెండో సినిమా సింగీతానికి ఇద్దురు గాని” అనే స్థితికి వెళ్ళిపోయాడు. కె.వి.రెడ్డికి మార్కెట్ లేదన్న దృష్టితో వాళ్ళు చెప్తాం లెండి అని వెళ్ళిపోయారు.
ఈ స్థితిలో కె.వి.రెడ్డి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్.టి.రామారావు అతని ఇంటికి వచ్చి “రెడ్డి గారూ, మీ రచయిత పింగళి నాగేంద్రరావు గారితో రాయించుకున్న స్క్రిప్టులు రెండు నా దగ్గరున్నాయి. చాణక్య చంద్రగుప్త, శ్రీకృష్ణసత్య – నా స్వంతానికి ఈ రెండిటిలో ఏదోక సినిమా తీసిపెట్టండి. మీరేది తీసినా ఓకే” అని ఆఫర్ చేశాడు. శ్రీకృష్ణసత్య తీస్తానన్నాడు కె.వి.రెడ్డి. శ్రీకృష్ణసత్య సినిమా కథ త్రేతా, ద్వాపర యుగాల మధ్య సాగుతుంది. శ్రీకృష్ణుడికి సత్యభామకీ మధ్య ఉన్న అనురాగం, పలు జన్మల పాటు సాగిన వారి బంధం ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. పలు ఉపకథలతో సాగిన ఈ సినిమాలో చాలా భాగం తీశాకా కె.వి.రెడ్డి అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ ఉంటే రామారావు అతన్ని కూర్చోబెట్టి సూచనలు తీసుకుంటూ పూర్తిచేశాడు. 1971 డిసెంబరు 24న విడుదలైన శ్రీకృష్ణసత్య మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా దర్శకత్వం, దాని ఫలితం కె.వి.రెడ్డికి చాలా సంతృప్తిని కలిగించాయి. సన్నిహితులతో “రామారావు నాకు కొండంత బలమూ, ధైర్యమూ ఇచ్చాడు. ఒక మంచి చిత్రం తీసి తృప్తిగా రిటైరై హాయిగా తాడిపత్రి వెళ్ళిపోతాను” అనేవాడు. కానీ అప్పటికే అనారోగ్యంతో బాధపడుతుండడంతో మరో సినిమా తీయడం సాధ్యపడలేదు. ఆరోగ్యం క్షీణించి 1972 సెప్టెంబరు 15న కె.వి.రెడ్డి మరణించాడు.కె.వి.రెడ్డి చనిపోయిన కొద్ది నెలలకే అతని భార్య కూడా మరణించింది.

సేకరణ:- చందమూరి నరసింహా రెడ్డి . ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత

చందమూరి నరసింహా రెడ్డి .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s