కట్టా నరసింహులు

కల్నల్‌ కాలిన్‌ మెకంజీ కైఫియత్తులు అధ్యయన నిపుణులు పురాతన ఆలయాల చరిత్ర పరిశోధకులు కట్టా నరసింహులు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి దేవాలయంకు గుర్తింపు తెచ్చిన ప్రముఖులలో విద్వాన్ కట్టా నరసింహులు కూడా ఒకరు.కవి ,రచయిత పరిశోధకుడు విద్వాన్ కట్టా నరసింహులు కడప జిల్లా ఒంటిమిట్టకు రెండు కిలోమీటర్ల దూరంలోని చిన్న కొత్తపల్లి గ్రామంలో 5 ఏప్రిల్ 1947 లో జన్మించారు .వీరి ప్రాథమిక విద్య చిన్నపల్లి గ్రామంలో కొనసాగించారు. ఉన్నత పాఠశాల విద్య ఒంటిమిట్ట లో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివారు . తిరుపతిలోని ఎస్ వి ఓరియంటల్ కళాశాలలో విద్వాన్ విద్య పూర్తి చేసుకున్నారు. తెలుగు ఉపాధ్యాయులు గా కడప జిల్లాలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. చాలా గ్రామాలలో పని చేశారు. వీరు ఎస్ వి యూనివర్సిటీ నుంచి దూర విద్య యం.ఏ చదివారు . వీరు ఆరవ తరగతి నుండి పద్యాలు రాయడం ప్రారంభించారు. వీరు పద్య రచన కాకుండా నాటికలుకూడ రాయడం జరిగింది. వీరి నాటక రచనలకు మంచి ఆదరణ లభించింది . వీరు 25 దాకా అవధాన కార్యక్రమాలు నిర్వహించారు కొన్ని అననుకూల పరిస్థితుల వల్ల అవధాన కార్యక్రమాలకు స్వస్తి పలికారు.

ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడుగా విద్వాన్ కట్టా నరసిం హులు పనిచేశారు.నరసింహులు ఉపాధ్యాయుడిగా ఎన్నో సేవలందిం చారు. 2005లో పదవి విరమణ పొందారు.
2005 డిసెంబరు నుంచి 2011 జూన్ వరకు సీపీ బ్రౌన్ గ్రంథాలయం బాధ్యుడిగా సేవలందించి ఎంతో అభివృద్ధి చేశారు. ఎన్నో రచనలు చేశారు. తితిదే ప్రచురణ విభాగంలో పనిచేశారు.

కడప జిల్లాలోని మెకంజీ కైఫీయత్తులను అధ్యయనం చేసి పుస్తక రూపంలో ప్రచురించారు.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి పుస్తకాలుగా ప్రకటించారు. వేమన, వీరబ్రహ్మం, పోతన పద్యాలకు వ్యాఖ్యానం చేసి పుస్తకాలుగా తీసుకొచ్చారు.సీపీ బ్రౌన్ గ్రంథాలయ భవన నిర్మాణంలో తన వంతు సహకారం అందించారు. కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించిన ప్రాచీన విశేషాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

ఒంటిమిట్ట రామాలయంలో రాష్ట్రప్రభుత్వం అధికారికంగా సీతారాముల కల్యాణం నిర్వహించడంలో కట్టా నరసింహులు విశేషంగా కృషి చేశారు.

వీరికి డాక్టరు జానమద్ది హనుమ చ్చాస్త్రి సాహితీ పీఠం సప్తమ సాహితీ పురస్కారం వరించింది. జానమద్ది 94వ జయంతి సందర్భంగా కడప నగరంలో సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో పురస్కారం ప్రదానం చేశారు. బద్దెన కళాపీఠం అవార్డు, మైనంపాటి వెంకటసుబ్రమణ్యం సాహిత్య పురస్కారం తదితర అవార్డులు అందుకున్నారు.

గత కొన్ని సంవత్సరాల క్రితం తిరుపతిలో స్థిరపడ్డారు. కరకంబాడి రోడ్డులో బృందావన్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండేవారు. ఆసుపత్రిలో కరోనా తో పోరాడుతూ15 మే 2021 శనివారం రాత్రి 9 గంటలకు తనువు చాలించారు.
కట్టా వారు మెకంజీకైఫియత్ ల అధ్యయనంలో నిపుణులు. స్థానిక చరిత్రలు,స్థానిక సాహిత్యం పట్ల ఆయనకు ఆసక్తి ఎక్కువ.మెకంజీ కైఫియత్ ల చేతిరాత, అందులోనిభాష అందరూ అర్థం చేసుకోలేరు. కట్టా వారు కొన్ని కైఫియత్ లను వర్తమాన తెలుగు భాషలోకి మార్చి ప్రచురించారు.అప్పుడు అర్థమైంది కైఫియత్ ల లోని సామాజిక విలువ. బ్రౌన్ గ్రంథాలయంలో నేను బాధ్యునిగా ఉన్నప్పుడు ప్రతిరోజూ సాయంకాలం క్రమం తప్పకుండా నేను,కట్టా వారు, శశిశ్రీగారు, మూలమల్లికార్జునరెడ్డి కలిసే వాళ్ళం. కనీసం గంటన్నర సేపు సాహిత్య కాలక్షేపమే. శబ్దమూలాలను అన్వేషించడం లో ఆయన దిట్ట.ఒంటిమిట్టకు పోతనకు సంబంధం ఉందని నిరూపించడానికి ఆయన చాలా పరిశోధన చేశారు. వీరబ్రహ్మం గారి శిష్యుడు సిద్ధప్ప తన స్వహస్తాలతో రాసుకున్న వేమన పద్య ప్రతిని చాలా శ్రమించి పరిష్కరించారు. దానిని బ్రౌన్ గ్రంథాలయం తన రజతోత్సవాల సందర్భంగా ప్రచురించింది. ఆయనకు మట్లిరాజులచరిత్రపట్ల ప్రత్యేక ఆసిక్తి ఉండేది.ఆ రాజులు దగ్గర కూడా అష్టదిగ్గజాలు ఉండేవారని చెబుతుండేవారు. నేను వీరబ్రహ్మం ,వేమన గార్ల పద్యాలకు వ్యాఖ్యానం రాసేటప్పుడు నిరంతరం ఆయనను సంప్రదిస్తూ ఉండేవాడిని. కడపలో మెకంజీ కైఫీయత్ లను చదవగలిగినవారు ఒక్కరే అంటే ఆయన ఒక కట్టా వారేనని మేం చమత్కరించేవాళ్ళమని రాచపాళ్యం చంద్రశేఖర్ రెడ్డి కట్టా నరసింహులు తో ఉన్న అనుబంధం గురించి పేర్కొన్నారు .

కట్టలు కట్టలుగా వున్న కైఫీయత్ లను చక్కగా ఒక దారిలో పెట్టి కైఫియత్ ల బ్రహ్మగా తెలుగు సాహిత్యంలో నిలిచిపోయిన ఓ మంచి సాహితీవేత్త
ఎవరు తనకు సహాయం చేసినా దానిని మరువక సదా గుర్తు చేసుకుంటూ సన్నిహితుల వద్ద వారిని గురించి చెప్పుకునే మంచి మనసున్న మనిషి సి పి బ్రౌన్ భవన నిర్మాణంలోను,దాని నిర్వహణ లోను మా నాన్నగారికి ( కీ.శే.జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు) ఎంతో చేదోడువాదోడుగా వుండేవారు.ఎందరో రచయితల పుస్తక రచనల్లోని అక్షర దోషాలను సరిచేసిన మంచి శిక్షకుడు మంచి రచయితగా సాహితీవేత్త గా ఉపన్యాసుకుడిగా ఓ మంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎందరో హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని
జానమద్ది నాగరాజ్ పేర్కొన్నారు.

సేకరణ :- చందమూరి నరసింహా రెడ్డి. ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s