వావిలికొలను.

వావిలికొలను సుబ్బారావు 1863  జనవరి23న ప్రొద్దుటూరు లో జన్మించారు. తండ్రి రామచంద్రరావు. తల్లి కనకమ్మ. భార్య రంగనాయకమ్మ. నెల్లూరు శ్రీ కాంచనపల్లి శేషగిరి రావు గారిపుత్రిక శ్రీమతి రంగనాయకమ్మ.వీరికి ఒక కొడుకు పుట్టినా చిన్నతనం లోనే చనిపోయాడు .భార్య 1910లో పరమపదించారు .

వావిలికొలను సుబ్బారావు కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించారని కొందరు చెబుతున్నారు వీరి జన్మస్థలంలో కొంత వివాదం నెలకొంది. ఎఫ్ఫే వరకు చదివిన ఆయన కొంతకాలం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం చేశారు. 25వ ఏటనే ‘కుమారాభ్యుదయం’ అన్న ప్రౌఢ ప్రబంధాన్ని రచించారు. నెల్లూరులో జరిగిన ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో సుబ్బారావు పాండిత్యాన్ని శంకించగా, ఆశువుగా శ్రీతల్పగిరి రంగనాయక శతకాన్ని చెప్పి విమర్శకులను మెప్పించారట. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 1904లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు విభాగంలో ప్రధాన అధ్యాపకులుగా నియమించింది. ఈ సమయంలోనే ఆర్యనీతి, కుమార కుమారీ హితచర్యలు, సులభవ్యాకరణం, సుభద్రావిజయం, ద్విపద భగవద్గీత తదితర గ్రంథాలను రచించారు. ‘భక్తిసంజీవనీ’ అనే పత్రికనూ నడిపారు.

ఆయన వాల్మీకి సంస్కృత రామాయణాన్ని ఇరవైనాలుగువేల ఛందోభరిత పద్యాలుగా తెలుగులో వ్రాశారు. దానికి మందరం అని పేరు. ఇది అనితర సాధ్యమైన విషయం.
      వాల్మీకి రామాయణంలోని 24000 శ్లోకాలకు యథాతథ అనువాదం ఈ వావిలికొలను రామాయణం.

ఆయన వ్రాశిన రామాయణాన్ని మహాసభామధ్యంలో ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామునకు అంకితం ఇచ్చారు.అప్పుడు బళ్ళారిరాఘవ గారి అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు ఆయనకు ‘ఆంధ్రావాల్మీకి’ అని బిరుదు ప్రదానంచేసారు. అలా ఇవ్వడం వల్ల ఆ ఇచ్చినవారే ధన్యులయ్యారు.
కం || ఆంధ్రా వాల్మికి వనుచున్సాంద్రముగా బిరుదునిచ్చి సత్కవి కికనాచంద్రార్క ఖ్యాతిం గనిమందరమై నిల్చితీవు మహినటతిలకా ||

ఓ నటతిలకమా.బళ్ళారి రాఘవా! ‘ఆంధ్రావాల్మీకి’ అంటూ బిరుదును ఈ మహానీయునకు ఇవ్వడం వల్ల నీ ఖ్యాతి ఇనుమడించింది సుమా.

ఆ || బిరుదు నిచ్చె నిచట బళ్ళారి రాఘవఆంద్ర వాల్మికంచు నాదరమునగణుతి కెక్కినావు ఘనసభామధ్యమునవాసుదాస భక్తవర వికాస ||
తుచ్చమైన లోకంలో స్వచ్చమైన జీవితాన్ని గడపి శ్రీరామసాక్షాత్కారాన్ని పొందిన ధన్య జీవి. నవీనయుగంలో రుషివలె బ్రతికి చూపిన మహాపురుషుడు.

ఇదంతా ఒకెత్తు ఒంటిమిట్ట రామాలయం ఉద్ధరణకు ఆయన చేసిన కృషి ఒకెత్తు.
      భార్య రంగనాయకమ్మ మరణించాక సుబ్బారావు యోగసాధనకు ఘటికాచలానికి వెళ్లారు. అక్కడ ఓమారు ఇద్దరు బాటసారులు, తర్వాత ఇద్దరు బైరాగులు కలలోకి వచ్చారట. ఆ బైరాగులు ఆయన్ను ఒంటిమిట్టకు రమ్మన్నారట. అంతకుముందే తనను ఒంటిమిట్టలో అన్నం పెట్టమని ఎవరో అడిగినట్లు అనిపించడం, సిద్ధవటం తహశీల్దారు ఒంటిమిట్ట రామాలయం ధూపదీపాలకు ఏదైనా సాయం చేయమన్న సంఘటనలు గుర్తుకురావడంతో సుబ్బారావు ఘటికాచలం నుంచి ఒంటిమిట్టకు పయనమయ్యారు. ఆలయానికి తన సర్వస్వమూ ధారపోసి, చేతిలో టెంకాయచిప్ప పట్టుకొని భిక్షాటన చేశారు.

ఆలయ జీర్ణోద్ధారణ

విమాన గోపుర జీర్ణోద్ధారణ గర్భాలయ ,అంతరాలయ నేలను బాగు చేయించటం ,మహాద్వారానికి తలుపులు సంజీవరాయ దేవాలయ జీర్ణోద్ధరణ ,శ్రీరామ సేవాకుటీరం అనే సత్రనిర్మాణం నూతన రథం ఏర్పాటు ,శృంగి శైలంపై వాల్మీకి ఆశ్రమం ,ఇమాం బేగ్ బావి మరమ్మత్తులు ,ప్రక్కన భవన నిర్మాణం వాసుదాసు గారు సేకరించిన నిధితో సమ కూర్చారు ఈపనులన్నీ 1923నుంచి 4ఏళ్ళు 1927 వరకు జరిగాయి .

వస్తు పరికరాలు ఆభరణాలు

వెయ్యి మందికి వంట చేయటానికి పాత్ర సామగ్రి ,108కాసులమాల ,108మంగళసూత్రాలహారం ,ఉత్సవ మూర్తులకు బంగారు కిరీటాలు ,మరికొన్నిఆభరణాలు వెండి సామాను చేయించి స్వామికి అర్పించారు ఆంధ్రవాల్మీకి .

ఆ భిక్షాటనకు గుర్తుగా ‘టెంకాయచిప్ప శతకం’ రాయడం విశేషం.

కం ||ఏమీ నీ యదృష్టం
బేమీ నీ భాగ్యగరిమ నెంతని పొగడన్ఏమీ నీ జీవితమిటనేమీ నీ ధన్యచరిత టెంకయచిప్పా ||

ఆంధ్రవాల్మీకి హస్తంబు నందు నిలిచి రూప్యములువేన వేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వానిలో దాచుకొనక ధరణి జాపతి కర్పించి ధన్యవైతి కలదె నీకంటె గొప్ప టెంకాయచిప్ప!అంటూ శతకాన్ని మొదలుపెట్టారు. ఆపై తను ఒంటిమిట్ట ఆలయాన్ని బాగుచేయడం కోసం ఎంత శ్రమించానో వర్ణిస్తూ, ఆ రాముని గొప్పదనాన్ని వివరిస్తూ, మధ్యమధ్యలో కాస్త తాత్వికతను జోడిస్తూ… 201 పద్యాలతో శతకాన్ని పూర్తిచేశారు.వావికొలను సుబ్బారావుగారు ఆ తర్వాతకాలంలో వాసుదేవస్వామిగా మారి సీతాదేవి చరిత్రము, శ్రీకృష్ణ తత్వము, వాసుదేవ కీర్తనలు… లాంటి గ్రంథాలెన్నో రాశారు.

గిడుగు రామ్మూర్తి పంతులు ఆధ్వర్యంలో వ్యవహారిక భాష ఉద్యమం జరుగుతున్నప్పుడు, సుబ్బారావుగారు ఆ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.గిడుగు వారి వ్యావహారిక భాష వల్ల తెలుగు సాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరి మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన ఆంధ్రాసాహిత్య పరిషత్ ఏర్పడింది. వావిలికొలను సుబ్బారావు, వేదం వెంకట్రాయ శాస్త్రి లాంటి పండితులు గ్రాంధికభాష పరిరక్షణ కోసం ఉద్యమం లేవదీసారు.ఆంద్ర భాషాభి వర్దినీ సమాజం ‘’స్థాపించి ఎందరినో భాషా సంస్కృతులలో నిష్ణాతులను చేశారు .ఇక్కడ పని చేస్తున్నప్పుడే ‘’ఆర్యనీతి,ఆర్య చరిత్ర రత్నావళి ,హిత చర్యమాలిక రాశారు.

వైరాగ్యపూరితుడై భోగమయ జీవితాన్ని త్యజించి గోచీ ధరించి రామునికోసం ఒంటిమిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేసారు. కాని ఊరిలోని కొందరు స్వార్థపరులు కుళ్ళు రాజకీయాలతో ఆయన్ను అవమానించి ఆలయం లోనికి రానివ్వక వెడలగొట్టారు. ఆయనకు ఊరిలో నిలువలేని పరిస్తితి కల్పించారు. ఆయన దుఖించి, ఆ ఊరిని వీడి, మొదట గుంటూరు జిల్లా నడిగడ్డపాలెం లోనూ తరువాత అంగలకుదురులోనూ తన ఆశ్రమాన్ని స్తాపించుకొని అక్కడే ఉన్నారు. వారు మొదలు పెట్టిన గురుపరంపర నేటికీ కొనసాగుతూ ఉన్నది. 

తాను  సంపాదించిన సర్వస్వం  ట్రస్టీ లను ఎన్నుకొని వారి ద్వారా శ్రీరామునికి అర్పిస్తానని ఒక సభలో ప్రకటించారు .తాను  నడుపుతున్న ‘’భక్త సంజీవని ‘’పత్రిక లోనూ అలానే రాశారు .కాని అలా చేయలేదు .చనిపోవటానికి13రోజుల ముందు ఒంటిమిట్టవచ్చారు..చాలా నీరస౦గా ఉండటం చేత స్వామిని దర్శించి మద్రాస్ వెళ్ళారు .అక్కడ అవసాన దశలో తమ తమ్ముడికొడుకు  శ్రీ లక్ష్మాజీ రావు ను ట్రస్టీ గా చేసి ,శ్రీ వరదాభయ కోదండ రామ స్వామి పేర తమకున్న యావదాస్తీ సమర్పిస్తూ వీలునామా రాశారు .అప్పటికి వారి ముద్రితాముద్రిత గ్రంథాలు ,ఆభరణాలు తప్ప ద్రవ్యం ఏమీ లేదు .రెండు వందలు మిగిలితే ఉత్తరక్రియలకు వాడమని రాశారు .నమ్మిన శిష్యుడు శ్రీ దాస శేష స్వామికి చక్రాంకం వేసే శంఖ చక్రాలు భక్తి సంజీవని పత్రికా నిర్వహణ అధికారమిచ్చారు .ఆంధ్రవాల్మీకి వాసుదాసకవి శ్రీ వావికొలను సుబ్బారావు గారు మద్రాస్ లోనే 73వ ఏట 1-8-1936పరమపదించారు .

Source :- సత్యనారాయణ శర్మ గుంటూరు బ్లాగ్.

సరసభారతి ఉయ్యూరు వారిఒంటిమిట్ట శ్రీ కోదండ రామదేవాలయం-4(చివరి భాగం) దుర్గాప్రసాద్ వ్యాసం.

పై రెండు సోర్స్ నుంచి యథాతథంగా కొంత తీసుకోవడం జరిగింది.

సేకరణ :-చందమూరి నరసింహా రెడ్డి.

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s