రామభక్తిలో పరవశించి ఆనందంగా ఉన్న ఆంజనేయులు నిత్యం రామునితో ఉంటాడు. హనుమ లేని రాముని విగ్రహాలు బహు అరుదు. దేశంలో హనుమంతుడు లేని రామాలయం ఒకటే ఒకటుంది. అంతే కాదు ఒకే శిలపై రాముడు, సీత ,లక్ష్మణుడు ఆ దేవాలయం లో కన్పిస్తారు. మూడుగోపురాలు కలిగిన దేవాలయం అది. పోతన తాను రచించిన తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం చేశారు. స్వయంగా జాంబవంతుడు ఏకశిలపై సీతారాములను,లక్ష్మణున్ని ప్రతిష్టించినట్లు చెబుతారు.అందుకే ఇది ఏకశిలానగరమని పేర్కొన్నారు. త్రేతాయుగం లో ఈ ప్రాంత పరిసరాల్లో మునులు తప్పస్సులు యాగాలు నిర్వహిస్తువుండేవారు వారిలో మ్రుకండు మహర్షి శృంగిమహర్షి యాగం నిర్వహిస్తున్నపుడు రాక్షసులు యాగం జరగకుండా ఆటంకపరుస్తూ ఉన్నపుడు ఆ మహర్షులు రామచంద్రమూర్తి గూర్చి ప్రార్ధించగా అప్పుడు ఈ క్షేత్రానికి సీతారామలక్ష్మణులు రాక్షసులను హతమార్చటానికి అంబులపొది, పిడిబాకు కొదండాలతో వచ్చారు.కనుక ఇచ్చట రాములవారికి కోదండరామస్వామి అని పేరువచ్చింది.

ఈ ఆలయ నిర్మాణం 1350 ప్రాంతంలో బుక్కరాయల కాలంలో ప్రారంభమైంది. 16వ శతాబ్ది నాటికి సిద్ధవటం కేంద్రంగా పాలించిన విజయనగర సామంతులు మట్లి రాజులు ఆలయాన్ని పూర్తిచేశారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని మూడు దఫాలుగా నిర్మించినట్లు శాసనాలద్వారా అవగతమౌతోంది. చోళరాజులు, విద్యానగర రాజులు, మట్టి రాజుల పరిపాలనలో ఈ ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విద్యారణ్య ప్రభువులు, సదాశివ రాయలు, చోళ రాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలు ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

ప్రధానాలయం ఎత్తయిన ప్రాకారం మధ్యలో ఉంది. ప్రాకారానికి తూర్పు, ఉత్తరం, దక్షిణదిశల్లో గాలిగోపురాలు ఉంటాయి.
“భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి” అనిఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో పేర్కొనట్లు చెబుతున్నారు.ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు.గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు.

ఆలయ ప్రధాన గోపురం తూర్పుదిక్కులో అయిదు అంతస్తులతో ఉంది. తూర్పు ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే బలిపీఠం, దానితర్వాత ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాళం, గర్భాలయాలతో ఉండే నిర్మాణమే ప్రధాన ఆలయం. ప్రధాన ఆలయం మూడు గోపురాల మధ్యలో ఉంటుంది. చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వీలుగా ఉంది. స్తంభాల మీద వేణుగోపాలుడు, నరసింహ స్వామి, కృష్ణుడు, కోదండ రాముడు ఇలా వివిధ శిల్పాలు ఉంటాయి. రంగ మండపంలో 12 స్తంభాల మీద గుర్రం శరీరం, సింహ ముఖం, ఏనుగుతొండం ఉన్న మృగం.వాటిని అధిరోహించిన వీరుల శిల్పాలు ఇలా ఆకర్షణీయమైన శిలసంపద ఉంది.కుడిచేతిలో బాణం, ఎడమచేతిలో కోదండంతో ఉన్న శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతంగా గర్భాలయంలో విగ్రహం ఉంటుంది.

ఆగ్నేయంలో రాములవారి యాగశాల,వాయువ్యంలో రాములవారి ఎదుర్కోలు మండపం, ఈశాన్యంలో సీతమ్మవారి ఎదుర్కోలు మండపం, నైరుతిలో కల్యాణ మండపం ఉంటాయి. చోళ, విజయనగర వాస్తు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. లక్ష్మణమూర్ఛ, సీతాదేవికి ఆంజనేయస్వామి ఉంగరం చూపించే దృశ్యం, గోవర్ధనగిరి ఎత్తుతున్న దృశ్యం, శ్రీ కృష్ణ కాళీయమర్దనం, పూతన అనే రాక్షసిని సంహరించుట వంటి శిల్పాలు కనిపిస్తాయి. ఏకశిలానగరం అని పేర్కొన్న ప్రాంతాన్ని ఒంటిమిట్ట అని ప్రస్తుతం చెబుతున్నారు. ఈ ఒంటిమిట్ట పేరుకు ఓ ప్రత్యేక ఉన్నట్లు చెబుతారు.ఆపేరెలా వచ్చింది కడపజిల్లా ఒంటిమిట్ట కైఫీయెత్తు లో ఉన్న ప్రకారం ఇలా చెబుతున్నారు.
పూర్వం ఒంటిమిట్ట ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండేవి. ఇక్కడ ఒంటడు, మిట్టడు అనే బోయ సోదరులు నివశించే వారు. విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర, బుక్క రాయల సోదరుడు కంపరాయలు ఓరోజు వేటకు ఈ అడవి కి వచ్చాడు. బాగా దాహం వేయడంతో నీటికోసం వెతుకు తుండగా దార్లో తారసపడ్డ ఒంటుడు మిట్టుడులను నీటి జాడ అడిగాడు. వాళ్లు స్థానిక రామతీర్థాన్ని చూపించారు. ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకొన్న కంపరాయలు ఆ ప్రాంతాన్ని బోయ సోదరులకు ఇనాంగా ఇచ్చాడట. అప్పుడే ఒంటడు, మిట్టడు అక్కడే జాంబవంత ప్రతిష్ఠిత ఏకశిలా సీతారాముల,లక్ష్మణ మూర్తిని చూపించి, ఆలయం కట్టించమని అడిగారు. కంపరాయలు ఆలయాన్ని నిర్మించి, దేవాలయ ధూపదీపనైవేద్యం కోసం చెరువు తవ్వించి, భూములు దానంగా ఇచ్చాడట. అలా ఏర్పడిన పల్లెనే ఒంటడు, మిట్టడు పేరుమీద ఒంటిమిట్ట వెలిసినట్లు చెబుతున్నారు.

ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 – 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు.
ఆలయానికి తన సర్వస్వమూ ధారపోసి, చేతిలో టెంకాయచిప్ప పట్టుకొని భిక్షాటన చేశారు. అలా వచ్చిన సొమ్ముతో ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆ భిక్షాటనకు గుర్తుగా ‘టెంకాయచిప్ప శతకం’ రాయడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఈ ఆలయము ఆంధ్రా భద్రాచలంగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు.

ఒంటిమిట్ట, కడప జిల్లా లో ఉంది. కడప నుంచి తిరుపతి వెళ్ళే మార్గంలో కడపకు 27 కి.మీ. దూరంలో ఉంది. తిరుపతి నుంచి కానీ కడప నుంచి కానీ రైలులో వెళితే రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి బస్సులో చేరుకోవచ్చు.
కడప నుంచి తిరుపతి,రాజంపేట బస్సు లో వెళ్లి ఒంటిమిట్ట చేరుకోవచ్చు.
తిరుపతి విమానాశ్రయం నుంచి 100 కి.మీ.దూరంలో కడప మార్గం లో ఒంటిమిట్ట రామాలయం ఉంది.

సేకరణ :- చందమూరి నరసింహారెడ్డి . ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

చందమూరి నరసింహారెడ్డి .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s