సాకీ:- మద్రాసు మహానగరంలో
శ్రీబాగ్ సదనంలో
పురుడు పోసుకొనెను సీమ!
రాణకెక్కెను రాయల సీమ !!
ఆనాడే తొలికేకయినది
సీమస్వరం!
ఈనాటికి పొలికేకయినది
నిరంతరం!!

పల్లవి:-రాయలేలిన సీమ
రతనాల సీమయని
రసరమ్య రాగాలు తీసేము
రాళ్ళరప్పల సీమనీ
మరచేము !!రా!!

1వ చరణం:-శ్రీశైల మల్లన్న
శేషాద్రి వెంకన్న
ఒంటిమిట్ట రామన్న
కదిరి నరసింహన్న
చల్లంగ కాపాడు
“చల్లకుండ”రా సీమ
కఱవులెన్ని కలచినా
సురకల్పతరువు సీమ
!!రా!!
2వ చరణం:-సీమశౌర్యపతాకమే
సైరా నరసింహారెడ్డి
విశ్వజనుల మేల్కొల్పెను
విశ్వకవి వేమన్న
అచ్చతెనుగు పాటలతో
అలరించెను అన్నమయ్య
కాలజ్ఞానం పలికి
కళ్ళుతెరిపించెను వీరబ్రహ్మం
!!రా!!
3వచరణం:-
అలనాడు అలుముకొనెను
గడియడవుల కానలు !
అందుకే నెలకు మూడు
అమృతపు జడి వానలు!!
పసిడి పచ్చల సౌరులు
పరిమళించె నానాడు
పైరుపంటల సిరులు
పొంగి పొరలె నాడు
!!రా!!
4వచరణం:-
ఈనాడు కొండలన్ని
బోడికొండలాయె
నానాటికి తరులు లేక
గిరులు చిన్నబోయె
వరుణ కరుణ వర్షించక
వాగులువంకలు పారక
అటవీ సంపద తరిగె
కలబందలపొదలూ కరిగే
!!రా!!
5వచరణం:-పాడిపంట తగ్గినా
పౌరుషానికేం కొదువ?
వలసబ్రతుకులైనా
ఆత్మాభిమానమెక్కువ!
చితికి ఛిద్రమైనా
చేచాచదు సీమ జాతి!
బ్రతికిచెడిన బ్రతుకైనా
బ్రతిమాలదు సీమనీతి
!!రా!!

.6వచరణం:-
కారం ఎక్కువ తిన్నా
మమకారం ఎక్కువేను
మాట కాఠిన్యమైన
మనసు నవనీతమౌను
ముఠాకక్షలకు నెలవని
చలనచిత్రములు తీతురే
నిశ్చల నిర్మల సీమపై
నిందలు మోపగజూతురే
!!రా!!
7వచరణం:-
హంద్రీనీవ గాలేరునగరి
కాలువల నీళ్ళు
అనంతసీమ అవసరాలు
తీర్చలేని కన్నీళ్ళు
ప్రకృతి వికృతిగ మారినా
ప్రభుతపని మెరుగైతే
సమాంతరపు కాలువలే
శరణ్యమిక జలకళకై
!!రా!!
8వచరణం:-
ఎందరెందరొ ఎంఎల్ ఏల్
మంత్రులైరి సీమసుతులు
ఎందరో ముఖ్యసచివు
లైనారు సీమ ఘనులు
పదవులకై పరితపించి
ప్రాకులాడిరే తప్ప!
సీమప్రజల బాగు కొఱకు
చేసిందేమిటి గొప్ప!!
!!రా!!
9వచరణం:-
దగాపడిన రైతన్నలు
దిగులుపడే కూలన్నలు
కార్మికులు శ్రామికులు
ఉపాధ్యాయులుద్యోగులు
సీమతల్లి బిడ్డలెల్ల
సీమవిముక్తికి దండు!
చేయిచేయి కలుప లెండు!
పిడికిలెత్తి కదలి రండు !!
!!రా !!
జై రాయలసీమ!
జైజై రమణీయ స్వప్నసీమ!
జైజై భావికాల బంగరు సీమా !!

--- ఏలూరు యంగన్న(జనప్రియకవి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s