జిక్కీ


పాట పరవశంలో తేలియాడే ప్రతి నిమిషం ఆనందంగా గడిచిపోతుంది. ప్రతి మనిషి ఏదో ఒకపాట ఏదో ఒక సందర్భంలో పులకించేలా చేసి ఉంటుంది, పరవిశించి ఉంటాడు. అదే పాట గొప్పతనం.

పాట పాడి పదిమందినీ మెప్పించటం ఏమీ చిన్న విషయం కాదు. అందుకు పడే శ్రమ వినేవారికంటే పాడేవారికే ఎక్కువ.

గాయనీగాయకులు గళం నుంచి సుతిమెత్తగా జాలువారే సుస్వరాల గంగాఝరి.

అలనాటి మధురగీతాలు ఇప్పటి తరాన్నీ మైమరిపింప చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. రాత్రి వేళ…నిశబ్దాన్ని మీటుతూ గాలి అలల్లో తెలియాడి వచ్చే ఓ గీతం అమృత జలపాతం.

జిక్కి గళం స్వరరాగ గంగా ప్రవాహం. వైవిధ్యమైన గాత్రంతో అవలీలగా గీతాలను ఆలపించడం జిక్కి స్పెషాలిటీ. అలాగే తన మృధు మధుర స్వరంతో ప్రేక్షకులను రంజింప జేసిన ఈ గాయనీమణీ పాడిన ప్రతీపాట.. ప్రతీగీతం.. మధురాతిమధురం.

పులకించని మనసులను సైతం పులకింపజేసే మధుర స్వరం ఆమె సొంతం. పాట ఏదైనా తన గాత్రంతో వన్నెలద్దిన గొప్పగాయని.

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా…అంటూ ప్రణయ గీతాలు ఆలపించినా….హాయి హాయిగా ఆమని సాగే.. అంటూ హాయి గొలిపే గీతాలను పాడినా.. ఆమెకే సాధ్యం అనేలా చేసింది.

అలాంటి పాటల్ని ఎన్నింటినో పాడి… తరతరాల తరగని గనిలా మనకు అందించిన ఎందరో గాయనీమణుల్లో జిక్కి కూడా ఒకరు.

1935 నవంబర్‌ 3న మద్రాసులో జన్మించింది.తిరుపతి సమీపంలోని చంద్రగిరి వీరి స్వస్థలం.తల్లిదండ్రులు గజపతి నాయుడు, రజకాంతమ్మ. పచయ్యప్ప కాలేజ్ మద్రాసు లో బి.ఎ. చదివారు.

అసలు పేరు పిల్లవలు గజపతి కృష్ణవేణి. పి.జి.కృష్ణవేణి సినిమాల్లోకి వచ్చాక జిక్కీగా మారింది. పి.జి.కృష్ణవేణి అంటే చాలా మందికి తెలీదు. జిక్కీ అంటే దాదాపు తెలియని వారుండరు.

చంద్రగిరి నుంచి మద్రాసు వలస వెళ్లిపోయారు. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుండేవారు.జిక్కి మేనమామ దేవరాజ్‌ నాయుడు సినిమా రంగంలో మ్యూజిక్‌ డైరెక్టర్ .ఈ కారణంగా జిక్కి సంగీత, సినిమా ప్రపంచానికి పరిచయమయ్యారు.

అద్భుత గాయనీ మణుల్లో జిక్కి ఒకరు.ఆమె గళం స్వరరాగ గంగా ప్రవాహం. వైవిధ్యమైన గాత్రంతో అవలీలగా గీతాలను ఆలపించడం జిక్కి స్పెషాలిటీ.

ఆమె పాట వింటే పులకించని మది పులకిస్తుంది, ఆమని హాయిగా సాగుతుంది.
‘హాయి హాయిగా ఆమని’లా సాగే జాణ పదాల స్వరం – ‘పులకించని మదిని సైతం పులకింపచేసే భా’స్వరం’ జిక్కీ సొంతం.

దాదాపు పదివేలకు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీ తదితర భాషలలో పాటలు పాడారు.

1943లో బాల నటిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు.పంతులమ్మ సినిమా సారధీ పిక్చర్స్ పతాకం క్రింద గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో తయారైనది.

దీనిలో లక్ష్మీరాజ్యం, ఉమామహేశ్వరరావు, ముదిగొండ లింగమూర్తి, డాక్టర్ గిడుగు వెంకట సీతాపతి, డి.హేమలత మొదలైన వారు నటించారు.

ఒక బాలిక పాత్రలో బాలగాయని పి.జి.కృష్ణవేణి (జిక్కి)ని రామబ్రహ్మం పరిచయం చేశారు. ” ఈ తీరని నిన్నెరిగి పలుకగా – నా తరమా – జగదేక కారణా” అనే పాటను జిక్కీ పాడింది. ఈ పాటను సముద్రాల రాఘవాచార్య రచించారు. సముద్రాల వారే ఈ చిత్రానికి సంభాషణలు కూడా వ్రాసారు.

స్క్రీన్ ప్లే రచనలో ఇంటూరి వెంకటేశ్వరరావు సహకారాన్ని అందించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి.కె.మంగరాజు గారి పూర్ణా సంస్థ ద్వారా విడుదల చేశారు.

1946లో హాలీవుడ్‌ సినిమా ‘ఎక్స్‌క్యూజ్‌ మీ’కి రీమేక్‌ అయిన ‘మంగళసూత్రం’ సినిమాలో నటించారు.

‘త్యాగయ్య’, ‘మంగళసూత్రం’, ‘గొల్లభామ’ చిత్రాల్లో బాలనటిగా నటిస్తూనే పాటలు పాడారు ఈమె.పదహారేళ్ల వయసు వచ్చాక.. పూర్తి స్థాయి గాయనిగా మారి నటనకు స్వస్తి చెప్పింది.

1948లో తమిళ సినిమా ‘జ్ఞానసౌందరి’ సినిమాలో పాట పాడే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించింది ఎస్‌.వి.వెంకట్రామన్‌. ఈ సినిమాలో జిక్కి పాడిన ‘అరుళ్‌ తారం’ అనే పాట పెద్దవిజయవంతమైంది. జిక్కి కెరీర్‌ ఈపాట తొ మలుపు తిరిగింది.అప్పటి నుంచి కృష్ణవేణి కాస్త జిక్కీగా మారిపోయారు.

తమిళ, తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళ భాషలలో కూడా జిక్కికి వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి.ఎస్‌.ఎస్‌.వాసన్‌ జిక్కీని హిందీ పరిశ్రమకు ‘మిస్టర్‌ సంపత్‌’ అనే సినిమాతో పరిచయం చేశారు. ఈ సినిమాలో పి.బి.శ్రీనివాస్‌ కూడా తన మొదటిపాటని కోరస్‌లో పాడారు. జిక్కి శ్రీలంకదేశ సినీ పాటలను కూడా పాడారు.

నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా విజయవంతమైన ఎ.ఎం.రాజాని 1958 లో ప్రేమ వివాహం చేసుకున్నారు.వీరిద్దరూ కలిసి పాడిన యుగళ గీతాలు విజయవంతమయ్యాయి. భర్త దర్శకత్వంలో జిక్కి ఎన్నో పాటలు పాడారు.

జిక్కి, రాజా దంపతులకు ఆరుగురు సంతానం .4గురు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు.

ఎ.ఎం.రాజా, జిక్కి యూఎస్‌ఏ, మలేషియా, సింగపూర్‌ వంటి దేశాలలో చాలా సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

పలువురు సంగీత దర్శకులతో జిక్కి పనిచేశారు.98 తెలుగు సినిమాలలో, 71 తమిళ సినిమాలలో జిక్కి పాటలు పాడారు.

తెలుగు సినిమాల్లో జానపద గీతాల రచనకు పెట్టింది పేరు కొసరాజు, మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో వచ్చిన ‘రోజులుమారాయి’ చిత్రంలో ఆమె ఆలపించిన ఏరువాక సాగారో పాట.. నేటికీ నిత్యనూతనం. అదీ జిక్కి గాన మహత్యం.

ఈ పాట ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో తాజాగానే ఉంది.దక్షిణ భారత సినిమా ప్రపంచాన్ని జిక్కి ఏలారు.

‘అనార్కలి’ చిత్రంలో జిక్కి పాడిన ‘‘రాజశేఖరా…నీపై మోజు తీరలేదురా!..’’ పాట

దొంగరాముడు సినిమాలో ఘంటసాలతో కలిసి, జిక్కి ఆలపించిన ‘చిగురాకులలో చిలకమ్మ’ పాట..

‘ఆదిత్య 369’ చిత్రంలో ‘‘జాణవులే…నెరజాణవులే… ’’ ‘శ్రీకృష్ణ పాండవీయం’లో ఛాంగురే బంగారు రాజా అంటూ ఆమె పాడిన పాట ఇలా ఎన్నో మాధుర్యభరిత గీతాలు ఆలపించారు. ఆమె పేరు చెప్పగానే ఆణిముత్యాల్లాంటి పాటలు మదిలో మెదిలి కచేరి చేస్తాయి. కవ్విస్తాయి. అలరిస్తాయి.

భర్త ఎ.యం.రాజా 1989 లో సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు వెలుతూ రైలు ఎక్కేటప్పుడు ట్రాక్ మధ్య జారిపడిపోయి ప్రాణాలను కోల్పోయారు. ఆ సమయంలో ఆమె అదే రైల్లో ఉంది. భర్త ఎ.ఎం.రాజా రైలు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత తన ఇద్దరు కొడుకులతో కలిసి సంగీత బృందాన్ని ప్రారంభించి, విదేశాల్లో అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

‘మురారి’లో “అలనాటి రామచంద్రుడు” పాట గాయనిగా ఆమె చివరి పాట.ఈమె విరహగీతాలతో పాటు ఉల్లాభరితమైన పాటలు, ప్రేమగీతాలు ఎన్నో పాడారు.

జిక్కి గాన ప్రతిభను గుర్తించి మద్రాస్‌ తెలుగు అకాడమీ ‘ఉగాది పురస్కారం’తో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ఆమెకు ‘కలై మా మణి’ పురస్కారాన్ని అందించింది.

ఆమె ఎప్పుడూ డబ్బు ముఖ్యమనుకోలేదు.
దానికి తార్కాణం ఓ తమిళ సినిమాలో మొత్తం పాటలు పాడే అవకాశం ఇచ్చినా ఆ చిత్ర నిర్మాత సోమనాథన్‌ ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చినా తనంతటతానే ఆ డబ్బులు తగ్గించుకున్నారు.

జిక్కీ తన జీవిత చరమాంకంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు.

బ్రెస్ట్ కాన్సర్ కి ఆపరేషన్ అయిన ౩ సం౹౹ తరువాత మళ్లీ కిడ్నికి కాన్సర్ సోకింది.
జిక్కి ప్రాణ స్నేహితురాలు, గాయని జమునా రాణి జిక్కీని బతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.

అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లక్ష రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2 లక్షల రూపాయలు జిక్కి వైద్య ఖర్చులకు కోసం ఇచ్చారు. చెన్నైలోని 2004 ఆగస్టు 16న జిక్కి మరణించారు.

ఆమె శ్వాస ఆగిపోయినా మన గుండెల్లో జిక్కి గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంది.

సేకరణ:– చందమూరి నరసింహారెడ్డి. ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత

చందమూరి నరసింహారెడ్డి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s