
నేడు శ్రీ పప్పూరు రామాచార్యుల వర్థంతి సందర్భంగా …
రాయలసీమ అభివృద్ధి కాంక్షతో ముందుకు సాగిన సాహితీవేత్త. చైతన్య దీప్తి , రచయిత, పాత్రికేయ బృహస్పతి పప్పూరు రామాచార్యులు.
రాయలసీమ ప్రముఖుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. శ్రీబాగ్ ఒడంబడికలో రాయలసీమకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులలో పప్పూరు రామాచార్యులు కూడా ఒకరు.
1896 నవంబర్ 8వ తేదీనఅనంతపురంలో పప్పూరు రామాచార్యులు జన్మించాడు. వీరి తండ్రి నరసింహాచార్యులు, తల్లి కొండమ్మ. ఇతని పూర్వీకులు పప్పూరు నుండి అనంతపురానికి వచ్చి స్థిరపడినవారు కాబట్టి ఇతని కుటుంబాన్ని పప్పూరువారని అనటం ఆనవాయితీ అయింది.
ఇతని తండ్రి నరసింహాచార్యులు పేరు మోసిన పౌరాణికుడు. హరికథలు చెప్పడంలో సిద్ధహస్తుడు. అతడి పురాణప్రసంగాలలో హాస్యధోరణి అధికం. ఆ లక్షణాలే కుమారునికి కూడాపుణికి పుచ్చుకొన్నాయి. పప్పూరు రామాచార్యులు తండ్రివద్దే సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నాడు.
ప్రాథమిక విద్య అనంతపురం మునిసిపల్ హైస్కూలులో సాగింది. రాజమండ్రిలో అతని బావ కుంటిమద్ది రంగాచార్యుల వద్ద చేరి స్కూలు ఫైనల్ పాసయ్యాడు.రాజమండ్రి పాఠశాలలో వడ్డాది సుబ్బారాయుడు ఇతనికి ఆంధ్రభాషను బోధించే గురువు. అక్కడే కందుకూరి వీరేశలింగంతో పరిచయం ఏర్పడింది. 1914-16లో మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.
ఆ సమయంలోనే రాజకీయాలంటే మక్కువ ఏర్పడింది. 1917లో అనంతపురం లోని దత్తమండల కళాశాలలో బి.ఏ.చేరాడు.రామాచార్యులు 1917-1918లలో బి.ఏ. చదువుకుంటున్న సమయంలో సహాధ్యాయి కర్నమడకలగోపాలకృష్ణ మాచార్యులతో కలిసి పదిహేను రోజులకొకసారి ‘వదరుబోతు’ పేరున వ్యాసాలను ప్రచురించి కరపత్రాలుగా పంచేవాడు.
1917లో పప్పూరు రామాచార్యులు, వారి మిత్రులు అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో .వదరుబోతు పేరుతో అనేక కరపత్రాలు ప్రచురించి పంచేవారు. హరినాథరెడ్డి ఆనాటి కరపత్రాలను వెలికి తీసి “వదరుబోతుకు వందేళ్ళు” పుస్తకం ప్రచురించారు. ఆనాటి సామాజిక జీవన సమస్యలు, చైతన్యాన్ని ఇది తెలియజేస్తుంది.
అప్పటి సమకాలీన సమాజ పరిస్థితులు, సాంఘిక దురాచారాల ఖండన, జాతీయోద్యమం మొదలైన అంశాలపై హాస్య, వ్యంగ్యాత్మక ధోరణిలో, సులభమైన భాషాశైలిలో రెండు సంవత్సరాల పాటు యాభైకి పైగా వ్యాసాలను వెలువరించారు. వీటిలో ఒక వ్యాసం మాత్రం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు. వీటినిఅనాటిఅనంతపురం లోని స్వామి విలాస ప్రెస్సు లో ముద్రించారు. ఆంగ్ల సాహిత్యంలో టాట్లర్ పేరుతో వ్యాసాలు రాసిన స్టీలు ప్రేరణతో వీరు ఈ వ్యాసాలు రాశారు.
యాబై వ్యాసాలలో ఇరవై రెండువ్యాసాలను వ్యాస పాఠకుడైన హిందూపురానికి చెందిన పక్కా గురు రాయాచార్యుల నుండి సేకరించి, 1932న పుస్తకరూపంలో ముద్రించారు. ఈ పుస్తకానికి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మముందుమాట రాశాడు.
1920లో బి.ఏ. పూర్తికాగానే కలెక్టర్ ఆఫీసులో చిన్న ఉద్యోగంలో చేరాడు.
స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో 1921లో ఆ ఉద్యోగాన్ని మానివేశాడు. ఆ సమయంలో అతనికి కైప సుబ్రహ్మణ్యశర్మతో పరిచయం ఏర్పడింది.
అతనిసహకారంతోఇల్లూరులో నీలంసంజీవరెడ్డికి , మరికొందరు పిల్లలకు ప్రైవేటు పాఠాలు చెప్పేవాడు. కైప సుబ్రహ్మణ్యశర్మ, అతని సోదరుడు మహానందయ్య, ఐతరాజు నరసప్ప, పాలకొండ రామచంద్రశర్మ,ఆత్మారామప్ప మొదలైన వారితో కలిసి 1922లో ‘ పినాకిని ‘ అనే వారపత్రికను ప్రారంభించాడు. 1925 వరకు ఈ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు.
ఆ పత్రికభాగస్వాములతో భేదాభిప్రాయాలు ఏర్పడి బయటకు వచ్చి 1926లో ‘శ్రీ సాధన ‘అనే పత్రికను స్థాపించారు.
పినాకిని కేవలము కాంగ్రెస్ పక్షపాతి అని సాధనపత్రిక అన్ని పక్షముల సానుభూతితో వ్యవహరిస్తుందని తొలిసంచిక లో పేర్కొనబడింది.
రాయలసీమ ప్రాంతంలో రాజకీయ చైతన్యం కలిగించే ఆశయంతో శ్రీసాధన పత్రిక అనే రాజకీయ వారపత్రిక ప్రారంభించబడింది. ప్రతి శనివారం వెలువడే ఈ పత్రిక తొలి సంచిక 1926 ఆగస్టు 14వ తేదీ వెలువడింది. పప్పూరు రామాచార్యులు వ్యవస్థాపకుడు.సంపాదకుడు.
ఆలయంబునకేగ ననుమతివ్వరు మాకు స్వరాజ్యమెటుల జేకూరు మాకు అంగళ్లపై కేగ ననుమతివ్వరు మాకు స్వరాజ్య మెటుల జేకూరు మీకు భ్రాతలము మమ్ము నేడిట్లు భ్రాంతి చేత కడకు ద్రోచిన కలుగునే మన స్వరాజ్య మకట ఇకనైనా దెలియుడే ప్రకటితముగ ఐకమత్యమే స్వరాజ్యకై పతాక అంటూ ఆనాటి ‘సాధనపత్రిక (1929)’లో అరుంధతీయ సమాజం’ పేరుతో పై కవితను ప్రచురించారు.
పప్పూరు రామాచార్యులు సంపాదకత్వంలో రాయలసీమ అంశాల ప్రాధాన్యతతో అనంతపురం కేంద్రంగా 1926 నుండి 1972 దాకా వెలువడిన “శ్రీ సాధన పత్రిక” వేల ప్రతులు అధ్యయనం చేసి సాహిత్య అంశాలతో ” సీమ సాహితీ స్వరంశ్రీ సాధన పత్రిక” అనే వ్యాసాల గ్రంథాన్ని 2013 లో అప్పిరెడ్డి హరినాథరెడ్డి వెలువరించారు. వీరి కృషిని గుర్తించి ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు 2014లో యువ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది సాధన పత్రిక ఆధారంగా 1926 నుండి 1947 వరకు వెలువడిన కవితలను “శ్రీ సాధన పత్రిక కవిత్వం” పేరుతో ఒక కవితా సంకలనాన్ని 2012లో వెలువరించారు.
రాయలసీమలో పిలిస్తే పలికేది కరువు అనంతపురం జిల్లాలో పిలవకుండానే పలికేది కరువు’ అని శ్రీసాధన’లో పత్రిక సంపాదకుడు పప్పూరు
రామాచార్యులు అనంతపురం జిల్లా కరవు గురించి పలురచనలు చేసి చైతన్య పరిచారు.
1932లో సహాయ నిరాకరణోద్యమము సందర్భంగా కొంతకాలం ఈ పత్రిక ఆగిపోయింది.
తరువాత 1934 ఆగస్టు 18న పునఃప్రారంభమైంది. 1940 మార్చి నెలలో శ్రీసాధన పత్రిక,సాధనముద్రణాలయాన్ని లిమిటెడ్ కంపెనీగా మార్చారు. డైరెక్టర్లుగా పప్పూరు రామాచార్యులు, కల్లూరు సుబ్బారావు, కె.ఎస్.రాఘవాచార్యులు తదితరులు ఉండేవారు.
బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలో దత్తమండలాల్లో భాగంగా వున్న అనంతపురం జిల్లాలో ఆ కాలంలోని సాహిత్యానికి సంబంధించిన అంశాలు కొన్నింటిని అలనాటి “శ్రీసాధన’ పత్రిక సంచికలలో మనం గమనించవచ్చు
శ్రీసాధన’ పత్రిక గత శతాబ్దపు తొలిదినాల్లో నలభై సంవత్సరాలసుదీర్ఘకాలంపాటు ఎందరో స్థానిక కవులకు ప్రోత్సాహం అందించిన ఒక ప్రసిద్ధమైన స్థానిక పత్రిక. శ్రీసాధన అలనాటి సంచికల్లో కవితలేగాక, అరవై పైగా కథలు 1926-1941 సంవత్సర కాలంలో వచ్చాయి.
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పప్పూరు రామాచార్యులు జైలు జీవితం గడిపాడు. ఆ సమయంలో పత్రిక కొంతకాలం ఆగిపోయిన తిరిగి ప్రారంభమైంది. ఈపత్రిక పప్పూరురామాచార్యులు మరణించేవరకు అంటే 1972వరకు పైన పేర్కొన్న సందర్భాలలో మినహా నిరాటంకంగా కొనసాగింది.
తరువాత దీనిని పప్పూరు రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యులు 1996 -97 ప్రాంతాలవరకు నడిపాడు. అనంతరం తెరమొరుగైంది.
సాధన పత్రిక సాధించిన విజయాలు ఘనమైనవి. సంఘంలోని కుళ్ళును, ప్రభుత్వ ఉద్యోగములలోని అవినీతిని సాధన తీవ్రంగా విమర్శించేది.ఉద్యోగులకు సాధన పత్రికంటే గుండె గుభేలుమనేదని తిరుమల రామచంద్ర వ్యాఖ్యానించారు.
ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, శ్రీసాధనపత్రిక త్రిఫలరసాయనంగా మాకు బలవర్ధకమయ్యాయి – వావిలాల గోపాలకృష్ణయ్య
శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారు ఏర్పరచిన ఒరవడిలో పప్పూరు వారు పత్రికారచన సాగించారు. సత్యం కఠోరమైనది. కావున సత్యవాక్యరచన వలన ఆచార్యులవారికి కష్టనిష్టూరాలు తప్పలేదని సర్దేశాయి తిరుమలరావు అన్నారు.
అనంతపురము జిల్లాలో మారుమూలలకు పోయే పత్రిక ఏదైనా ఉందీ అంటే అది సాధన పత్రిక మాత్రమే! గ్రామీణులకు ప్రపంచజ్ఞానం, రాజకీయ చైతన్యం కలిగించడానికి సాధన ద్వారా జరిగిన కృషి మహత్తరమైనది. ఎన్ని కష్టనిష్టూరాలు ఎదురైనా సాధన ద్వారా నిజాలను బయటపెట్టేవారని ఐదుకల్లు సదాశివన్ పేర్కొన్నారు.
ఇతని రచనా సామర్థ్యానికి వదరుబోతు వ్యాసాలు మచ్చుతునకలు. కల్లుపెంట అనే నాటకం వ్రాశాడు. ‘విశ్వవినుత నామ వినుము రామ’ అనే మకుటంతో 40 పద్యాలు వ్రాశాడు.
“రామయ్య పదాలు” పేరుతో ఆటవెలది పద్యాలను రామాచార్యులు రాసి పరిచయం చేశారు.
పప్పూరు రామాచార్యులు కల్లూరు సుబ్బారావు కలిసి గ్రామగ్రామాలకూ తిరిగి ప్రజలలో స్వాతంత్ర్య సమూపార్జనాకాంక్షను రేకెత్తించాడు. మద్యపాననిషేధము, ఖద్దరు వస్త్రధారణ, హరిజనోద్ధరణ, గ్రామ పరిశుభ్రత మొదలైన కార్యక్రమాలను చేపట్టాడు. గ్రంథాలయోద్యమం లో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా స్వాతంత్ర్యోదమ రూపశిల్పి పప్పూరు రామాచార్యులు 1921లో గాంధీజీని తాడిపత్రిలో కలుసుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1923లో పినాకినీ పత్రికను, 1926లో ‘సాధన’ అనే పేరుతో మరో పత్రికను నడిపాడు. జాతీయోద్యమం జరుగుతున్న సందర్భంలో మద్యనిషేధం ప్రచారం కోసం ‘కల్లు పెంట’ నాటకాన్ని రచించాడు
చెట్లుమీద కోట్లు చిగురాకు పువ్వులు ఒకటి తొడనొకటి యెరసె కొనవు నీతిపరుల బ్రతుకు రీతి నిట్లుండురా విశ్వ విరుత నామ వినుము రామ
అంటూ, ఆ నాడు నీతిమంతులుగా ఉండిన వారి హృదయ సంస్కారాన్ని తన పద్యంలో వివరించాడు.
1921లో తాడిపత్రిలోగాంధీ పాటు ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని పప్పూరు జైలుశిక్షను అనుభవించాడు. 1928 నవంబరులో నంద్యాలలో జరిగిన ఆంధ్రమహాసభలలో పాల్గొని దత్తమండలాలకు బదులు రాయలసీమ అని వ్యవహరించాలని ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింప జేశాడు. 1932లో ఒక సంవత్సరం పాటు సహాయనిరాకరణోద్యమంలో భాగంగా జైలుశిక్షను అనుభవించాడు.
1937 నవంబర్ 17న శ్రీబాగ్ ఒడంబడికలో క్రియాశీలక పాత్రవహించాడు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించే ఉద్దేశంతో కుదిరిన ఒప్పందమే శ్రీబాగ్ ఒడంబడిక. 1937లో జరిగిన ఈ ఒప్పందం వీరిమధ్య సదవగాహనను పెంపొందించి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.
భోగరాజుపట్టాభిసీతారామయ్య,గాడిచర్ల హరిసర్వోత్తమ రావు,హాలహర్విసీతారామ రెడ్డి,కడపకోటిరెడ్డి,కొండావెంకటప్పయ్య,టి.ఎన్.రామకృష్ణారెడ్డి,మహబూబ్ ఆలీ బేగ్,
దేశిరాజు హనుమంతరావు,
కల్లూరు సుబ్బారావు,
దేశపాండ్య సుబ్బారావు,
వరదాచారి,పప్పూరిరామాచారి,సుబ్బరామిరెడ్డి,
ముళ్ళపూడి పల్లంరాజు తదితరు సంఘసభ్యులంతా 1937 నవంబర్ 16న మద్రాసులో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లో సమావేశమై, ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఇంటి పేరుమీదనే ఈ చారిత్రాత్మక ఒప్పందానికి శ్రీబాగ్ ఒడంబడిక అని పేరు వచ్చింది.

1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈయన అరెస్టయ్యి తంజావూరు, వేలూరు జైళ్ళలో రెండేళ్ళు జైలుశిక్ష అనుభవించాడు. ఆ సమయంలో తనకున్న సహజ పౌరాణికప్రవచనాలతో తోటి డిటెన్యూలకు భారత, కాళిదాస కావ్యములలోని రమ్యభావాలను వినిపిస్తూ,కాలక్షేపం చేసేవాడు.
ఇతని ప్రవచనాపాండిత్యానికి రాజకీయఖైదీలు సంతోషించి జైలులోనే ఇతనికి పండిత సత్కారాలను నెరవేర్చేవారు. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా ఇతడు పురాణ కాలక్షేపాన్ని కొనసాగించాడు. బళ్ళారిలో ఇతడు చేసిన పురాణ పఠనాన్ని విని బళ్ళారి రాఘవ ఇతడిని బంగారుపతకంతో సత్కరించాడు.
పప్పూరు రామాచార్యులు మంచి హస్య చతురుడు.
ఓసారి బళ్లారి రాఘవ సంతాపసభ జరుగుతోంది. రాఘవ ‘ఆర్ట్’ గురించి కల్లూరు సుబ్బారావు ప్రవాహంలా చెప్పసాగారు. ఓ గంట దాటింది. శ్రోతలందరూ నకనకలాడుతున్నారు. రామాచార్యులు లేచి ‘‘అయ్యా! మనకు ఇప్పుడు కావాల్సింది ఆర్ట్. ఏ అంటే అన్నం, ఆర్ అంటే రసం, టీ అంటే తైరు’’ అన్నారు. (‘తైరు’- పెరుగు) ఈ మాట వింటూనే కల్లూరు సుబ్బారావు ఉపన్యాసం ముగించారు. అందరు భోజనశాలకు దారితీశారు.
అనంతపురం జిల్లాలో గ్రంథాలయోద్యమం తో పాటు సాహిత్యసాంన్కృతికరంగంలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో పప్పూరురామాచార్యులు ఒకరు. వ్యక్తిత్వ వికాసానికి గ్రంథపఠన ఆవశ్యకతను తొలుతనే గుర్తించారు. గ్రంథాలయాలు లేని రోజుల్లో రామాచార్యులు స్వయంగా పుస్తకాలు సేకరించి చిన్న పుస్తక భాండాగారం నెలకొల్పి కొంతకాలం నిర్వహించారు.
అనంతపురంచుట్టుప్రక్కలున్న తాలూకా,గ్రామస్థాయిగ్రంథాలయాలకు సైతం చేర్చేవారు.
1952లో అనంతపురం జిల్లా గ్రంథాలయసంస్థఏర్పడినప్పడు తొలిఅధ్యక్షులుగా పనిచేసే అవకాశం కల్గింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సరైన భవనం దొరకలేదు. తన ఇంటిలోని మూడు గదులను గ్రంథాలయ అవసరాలకు ఇచ్చివేశారు. సొంత పత్రిక శ్రీసాధనను జిల్లాలోని గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణి చేశారు. వీరు జిల్లాలోని గ్రంథాలయాలకు చేసిన కృషి మరువరానిది. అనంతవురం జిల్లా కేంద్ర గ్రంథాలయానికి భవనం కావల్సి వచ్చింది. స్థానిక మ్యూజియం వారిని ఒప్పించి ఆ భవనాన్ని గ్రంథాలయ సంస్థకు విక్రయింపచేశారు. రాయలసీమలోని అన్ని జిల్లాలో కంటే ముందుగా అనంతపురంలో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి సొంత భవనం సమకూర్చుకుంది. ముందుచూపుతో కేంద్ర గ్రంథాలయ భవన సమీపంలో దాతలతో 30వేలకు పైగా నిధిని, 50 సెంట్ల స్థలాన్ని సేకరించి మహిళా, బాలల గ్రంథాలయాలను ఏర్పరచారు. వీటి ప్రారంభోత్సవానికి గాడిచర్ల హరిసర్వోత్తమరావు విచ్చేయడం విశేషం. జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన ప్రాంగణంలో 1969లో ఆరుబైలు రంగస్థలం భువనవిజయం మంటపనిర్మాణంలో కీలకపాత్రవహించారు. ఇలా అన్ని సదుపాయాలు చేకూరడంతో 1969లో ఈ జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథా లయోద్యమ ప్రముఖులు డా.ఎస్.ఆర్.రంగనాథన్ ప్రశంసలకు పాత్రమైనది. జిల్లా గ్రంథాలయ సంస్థ రావూచార్యులను ఘనంగా సన్మానించింది. 1970లో ఆయన ఛాయాచిత్రాన్ని గ్రంథాలయంలో ఆవిష్కరించారు.
1947నుండి 1952 వరకు అనంతపురం పట్టణ మున్సిపల్ ఛైర్మన్ గా వ్యవహరించాడు. .
అనంతపురం పట్టణ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పడు ఆ మునిసిపాలిటి ఆదాయం పెరిగి 3వ గ్రేడ్ నుండి 2వ గ్రేడ్ స్థాయికి చేరుకుంది. ఇందులో గ్రంథాలయాలకు గ్రంథాలయ పన్నులు సక్రమంగా చెల్లించి నూతనంగా గ్రంథాలయాలను నెలకొల్పి కొత్త పుస్తకాలను సమకూర్చారు. అనంతపురం మునిసిపాలిటీలో నిరంతర విద్యా విజ్ఞాన భాండా గారాన్ని నెలకొల్పడం అనేది ప్రశంసనీయమైన నిర్ణయమని మద్రాస్ మెయిల్ అనే పత్రిక 4.11.1950 తేదీన సంపాదకీయంలో పేర్కొంది. ఆ సంపాదకీయం చదివిన నాటి జిల్లా కలెక్టర్ జేమ్స్ రామాచార్యులను ప్రత్యేకంగా అభినందించారు.
*1952 నుండి 1955 వరకు *జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్* గా బాధ్యతలు నిర్వర్తించాడు
కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ గా 1946నుండి1956 వరకు పనిచేశాడు. 1955 నుండి1962 వరకు ధర్మవరం నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా కొనసాగారు.
దక్షిణభారత హిందీ ప్రచారసభ వారి స్రవంతి పత్రిక సంపాదకవర్గంలో సభ్యుడిగా ఉన్నాడు. అక్షర ప్రస్థానం సాగించిన కలంయోధుడు పప్పూరు రామాచార్యులు 1972 మార్చి21 వతేదీ తన 76వ యేట మరణించాడు.
✍️సేకరణ:–చందమూరి నరసింహా రెడ్డి
ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత
