కడప జిల్లాలోని పులివెందుల తాలూకాలోని బోనాల గ్రామంలో 1926వ సంవత్సరంలో వై.సి.వి.రెడ్డి జన్మించారు. ఈయనకు కడపజిల్లా సిపిఐ నాయకులైన ఎద్దుల ఈశ్వర్ రెడ్డి, నర్రెడ్డి శివరామిరెడ్డి,గజ్జెల మల్లారెడ్డితోనూ, రారా, సొదుం
జయరాం, కేతు విశ్వనాథరెడ్డి వంటి సాహితీ మిత్రులతోనూ పరిచయం ఏర్పడంవల్ల ఈయన మార్కిస్ట్ సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఆయన  మార్కిస్టు దృక్పథం తో అనేక రచనలు చేశారు.
           తాను రాసిన కథల్ని 1982లో “గట్టిగింజలు' పేరుతో
కథా సంకలనాన్ని తీసుకొచ్చారు. ఇందులో మొత్తం 21 కథలున్నాయి. రైతుకూలీలు ఒక సంఘటిత శక్తిగా రూపుదిద్దుకుంటేనే వారి సమస్యలకు పరిష్కారందొరుకు తుందన్న విషయాన్ని ఈ కథల ద్వారా తెలిపారాయన. 1982లో 'సింధూరరేఖ' అనే పద్యకావ్యాన్ని కూడా ప్రచురించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలోని లోటుపాట్లను గురించి వైసివి రెడ్డి గారు ఇందులో చర్చించారు.  వ్యవస్థ మారాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
            వైసివి రెడ్డి మొదట ప్రాచీన సంప్రదాయ పద్ధతిలో రచనలు చేసినా, తర్వాత కాలంలో భావకవిగానూ, అభ్యుదయ కవిగానూ, రచయితగానూ తన రచనలను వెలువరించారు. 1972 నుండి మొదలుకొని, చివరి వరకూ
ఆయన అరసం జిల్లా అధ్యక్షులుగా ఎంతో కృషిచేశారు. 1989 అక్టోబరు 8న తేదీన కడప మున్సిపల్ హైస్కూల్లో జరిగిన అరసం సభలో పాల్గొని, మధ్యాహ్న సమయం భోజనానంతరం ఆయన గుండెపోటు వచ్చి తనువు చాలించారు. ఎంతో అపూర్వమైన వ్యక్తిత్వం గలవారీయన!


కథకుడుగా వై.సి.వి తన చుట్టూ ఉన్న సామాజిక జీవితాన్ని అవగాహన చేసుకున్న విధానాన్ని, జీవిత సంఘర్షణలోని వాస్తవాన్ని, రచయిత వాచ్యం చేసే అభిప్రాయాలతో పాటు సమకాలీన సంఘర్షణలతో అతనికి గల సంబంధాలు ఈయన కధల్లో ఆవిష్కరించబడ్డాయి.

                  సమాజంలో వివిధ వక్తులతో కలసి జీవించే క్రమం నుండే రచయిత మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను వ్యక్తం చేయడానికి తాను కోరుతున్న సమాజాన్ని మార్చే సాధనంగా సాహిత్య సృజన చేస్తాడు. రచయిత తాను మారుతూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చాలనుకోవడంలో రెండు రకాల ఘర్షణాలకు లోనవుతాడు.
                 వై.సి.వి.లో భౌతిక అంతహ్ సంఘర్షణ ఈ రెండు సంఘర్షణల కలయికే జీవితం. ఇవి సాహిత్యంలోనూ అనివార్యంగా వుండటమే జీవిత వాస్తవం . ఈ  వాస్తవాన్ని చిత్రీకరించడంలో అటు జీవిత వాస్తవికతకు వెనుక గల శక్తులను అన్యాయం అక్రమం దోపిడి,. సుఖ దుఃఖాలకు గల కారణాలను విశ్లేషించడమే వై.సి.వి కథల దృక్పథం. తాను జీవిస్తున్న పరిస్థితులకంటే మంచి పరిస్థితులు రావాలని తపన పడుతూ వాటికోసం సంఘర్షిస్తుంటాడు.
                అభ్యుదయరచయితలు తమకు వామపక్షదృక్పథముందని ఏ సంధర్భంలోనూ చెప్పలేదు. పైగా వర్గ దృక్పథం రాజకీయాలకే పరిమితమైందని భావించేవారు. వై.సి.వి కథలు రాసే సమయంలో ’కమ్యునిస్టు’ అనే పదం ఒక అనరాని వినరాని మాటగా తయారైంది. అది కథా రచయితలకు సంబంధించని అంశంగా తప్పుకొని పోయేవాళ్ళు. ఈ పరిస్థితికి భిన్నంగా తన వర్గ దృక్పథాన్ని నిర్ధ్వందంగా , నిర్భయంగా , దృఢంగా, ఆత్మవిశ్వాసం తోణికిసలాడే కంఠస్వరంతో ప్రకటించడాన్ని “గట్టిగింజలు” కథలన్నిట్లోనూ కనబడుతుంది.
             అభ్యుదయ దృక్పథ ప్రాధాన్యత, [ఉమ్మడి] కమ్యునిస్టు పార్టీ ఉద్యమ సాహిత్య లక్షణం. శాస్త్రీయతను, విశాలత్వాన్ని, నిజాయితీని ప్రకటించడం తమ రచనా దృక్పథంగా మలుచుకున్నారు. అలాగే ఈ దృక్పథాన్ని సమున్నతంగా నిలపాలనే ఉద్దేశం ఈయన కథల్లో స్పష్టంగా కనిపించే లక్షణం.
              కడపజిల్లాలో కమ్యునిస్టు పార్టీ ఉమ్మడిగా ఉన్నప్పటినుండి పార్టీ కార్యక్రమాలు మొట్టమొదట వ్యవసాయ కూలీల సంఘాలను ఏర్పాటు చేయాలనే  అజెండాతో మొదలైంది. కృష్ణాజిల్లా నుండి వచ్చిన వై.వి. కృష్ణారావు కడపజిల్లా ఉద్యమ నిర్మాణ బాద్యులుగా వచ్చారు. వ్యవసాయకూలి సంఘాల ఏర్పాటు చేయడంలో నాయకులు మళ్ళీ పెద్ద రైతుల్నీ ఆశ్రయించాల్సిరావడానికి ప్రదాన కారణం. కడపజిల్లాలో వందల ఎకరాలుగల ఎన్.శివరామిరెడ్డి, జె.వెంకటరామిరెడ్డి, ఈశ్వరరెడ్డి, వై.సి.వి.రెడ్డి, నంద్యాల నాగిరెడ్డి, ఎన్.ఈశ్వరరెడ్డి మొదలగు పెద్దరెడ్ల నాయకత్వమే కమ్యునిస్టు పార్టీ నాయకత్వం కావడం యాదృచ్ఛికం కాదు. అందుకే, అవి రైతు సంఘలుగానే కొనసాగాయి. ఈ సంఘంలోని వ్యవసాయ కూలీలు వీళ్ళ ఆధిపత్యంలోనూ ఆద్వర్యం వహించిన నాయకత్వంలోనే కొనసాగారు.
             వై,సి.వి. కథల వైవిధ్యమంతా ఆయన తీసుకున్న వస్తువిస్తృతివలన ఏర్పడింది. ఇలాంటి వస్తు స్వీకారానికి తోడు వామపక్ష రాజకీయ అవగాహన, రైతుకూలీ సంఘాల పోరాట అజెండా వల్ల దృక్పథం విషయంలో ఎలాంటి శషబిషలకు అవకాశం లేక పోవటం వలన ఈయన కథలు చాలా స్పష్టంగా, సరళంగా, సూటిగా వుంటాయి. పాఠకులకు ఎలాంటి క్లిష్టత వుండదు. అరటిపండు ఒలచి చేతిలో పెట్టినట్లుగా పాఠకుడు కథను అనుసరించగలడు.
              వై.సి.వి కథా దృక్పథం వాస్తవికత. అట్టడుగు ప్రజా జీవితాన్ని కార్యకరణ సంబంధాలతో యధార్థంగా చిత్రించారు. దాంతో పాఠకులకు ఆయా వర్గాల జీవితాలను వస్తుగతంగా, చైతన్యశీలంగా పాఠకులకు ఈయన కథావస్తువే దర్శింపజేస్తుంది. ఈయన కథల్లోని హేతుబద్ధతతో వాళ్ళ ఆలోచనలకు పురుకోల్పుతాడు. పాఠకుడు అతి సన్నిహితంగా చేరదీసి, విషయాలను ఎరుక పరచడంలోనూ, విడమర్చి వివరించడంలోనూ వరకే తన కథలను పరిమితం చేసుకొంటారు.
           ఇలా వస్తువు,  దృక్పథాలను మేళవించి దాన్ని వ్యక్తీకరించడంలో గల నైపుణ్యం ఆయన వ్యక్తిత్వ సంస్కారంలో నుంచి అలవడిన వస్తు శిల్ప సమ్మేళనంలో అలవడింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, తన దృక్పథాన్ని వస్తువుగా మలచాడు. అందుకే అతనిది కొలతలకు లొంగని ప్రత్యేకమైన కథాంశం.
          సమాజ మార్పుకు అవసరమైన ప్రజాకార్యాచరణ లక్ష్యంతో వస్తువును మలచడంలో వై.సి.వి వ్యవసాయ కూలీల సంఘం ఆచరణ, నిబద్ధతలు ఉద్యనోన్ముఖ కథా సృజన వైపు ఆయనను నడిపించాయి.    
-శ్రీదేవి. కె.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s