తిరుపతి వెంకట కవులు చెప్పినట్లు కవికి సామాజిక జీవితం బలంగా ఉంటే కవిత్వం మరింత శక్తివంతంగా అభివ్యక్తమవుతుంది. కవిత్వానికి కులం లేదు. మతం లేదు. ఉమాదేవికి సమాజం పట్ల ఎంతో ప్రేమ  ఉంది. సమాజంలో  ఉన్న పేదరికం తొలగిపోవాలని సమాజం పచ్చగా నిండుగా ఉండాలని ఆశిస్తోంది. అందువలన ఆమె కవిత్వంలో అనేక సామాజికాంశాలు కనిపిస్తాయి.కవితా పిట్టలులో బాల కార్మికులుగా మగ్గిపోతున్న బాల్యం గురించి, ఇళ్ల కాపలా దారుల  గురించి ,  కరువుతో వలస పోతున్న జనాల గురించి, పురుషాధిక్య సమాజంలో లో మహిళలు పడుతున్న పాట్ల పై వృద్ధాప్యం ,ఉగ్రవాదం ఇలా  మన సమాజం లో  మనల్ని కలచివేసే అనేక అంశాలు ఆమె తన కవిత్వం లోకి వచ్చి చేరాయు. కేవలం కవిత్వం రాయడమే కాకుండా ఈ సమాజానికి తన వంతు సాయంగా జాయినింగ్ హాండ్స్ పేరుతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంది వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైనా ప్రవృత్తి రీత్యా కవిత్వాన్ని రాస్తోంది. ఏదో తెలియని ఆవేశం కలిగినప్పుడో, బాధ కలిగినప్పుడో దాన్ని అభివ్యక్తీకరించడానికి కవిత్వాన్ని సాధనంగా చేసుకుంది. సాహితీవేత్తలను చూసినప్పుడు  వారి నుంచి స్ఫూర్తి పొంది వారిపై కవిత్వాన్ని కూడా రాస్తుంది. అదే సమయంలో కొంతమంది సాహిత్యం ముసుగు లో తమ వాంఛల కోసం మహిళలపై వల వేయడాన్ని నిరసిస్తూ కవిత్వాన్ని కూడా రాసింది. జీవితంలోని ఆర్ధ్రత ను అందిపుచ్చుకోవడమే కవిత్వ రహస్యం అంటాడు నందిని సిద్ధారెడ్డి. ఈ ఆర్థ్రతా గుణం కలిగిన ఉమాదేవి కలం నుంచి జాలువారిన కవిత్వమే ఈ కవితపిట్టలు. ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించడానికి, తాను చెప్పదలచుకున్న భావాన్ని సూటిగా నిక్కచ్చిగా ప్రతీకలతో ఉపమానంతో  పాఠకుని హృదయం లోకి చొచ్చుకునే విధంగా తన కవిత్వాన్ని ఆవిష్కరించింది. కవిత్వం మనిషి అంతరంగ ఆకాశాన్ని ఆవిష్కరించే అద్భుత ప్రయోగశాల అని అంటాడు ఎక్కలూరి శ్రీరాములు. దీన్ని వాస్తవం చేస్తూ ఉమాదేవి తన కవిత్వాన్ని సమాజం      ముందుంచారు.             ‘చెట్టు నా ఆదర్శం’ కవి ఇ స్మాయిల్ అన్నాడు. అదే బాటలో ఉమాదేవి కూడా చెట్టు ను ఆదర్శంగా తీసుకుంది. చెట్టు జీవకోటికి ప్రాణాధారంగా ఉంది. చెట్టు ను నరికేసినా, దాని కొమ్మలను కొట్టివేసినా తిరిగి చిగురులు వేసి మళ్లీ ప్రపంచానికి  ప్రాణవాయువు నందిస్తుంది. చెట్టు లాగే మనిషి కూడా ఎదురు దెబ్బలు తిన్నా జీవితంలో ఆశ కోల్పోకుండా నిరాశను స్వాగతించకుండా  ముందుకు సాగాలి. అలాంటి లక్షణాలను తన మది నిండా నింపుకొని జీవితాన్ని సాగిస్తున్న ఉమాదేవి తన అంతరంగాన్ని తన జీవిత లక్ష్యాన్ని పై కవితా చరణాల్లో వ్యక్తీకరిస్తూ ఇలా చెపుతుంది.”అసూయాద్వేషాల గ్రీష్మ తాపాలు మనసు నుదుటిని ముచ్చెమటలు పట్టిస్తున్నా సహనమనే శరదృతువును లోలోకి నిలువెల్లా ఆహ్వానిస్తూ చల్లని వెన్నెల దారుల వెంట అడుగేయాలని పరితపిస్తున్నా!”              తప్పు లెన్నువారు తండోపతండంబు అంటూ వేమన ఏనాడో తన తప్పుల్ని పట్టించుకోకుండా ఇతరుల తప్పులను విమర్శించే వారిని గమనించి  ఈ పద్యాన్ని చెప్పాడు.బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా అని కూడా ఆయన చెప్పారు.సాధారణంగా ప్రతి వ్యక్తి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇతరులు విమర్శ చేసినప్పుడు తన్ను తాను పరిశీలించుకుని తప్పులుంటే మార్చుకోవాలి. కొందరు విమర్శలను పట్టించుకోకుండా తమ తప్పులను అలాగే కొనసాగిస్తారు. ఉమాదేవి అలా కాదు .ఎవరైనా విమర్శిస్తే తన తప్పును చూసుకొని సరిదిద్దుకుంటుంది. అదే  కువిమర్శలు ఎదురైయితే వాటిని ఎదుర్కొంటుంది. దాన్ని ‘నా కొక విమర్శ చాలు’ అనే కవిత లో నాపై చెనుకులెంత  విజృంభిస్తేలోన వాక్యాల గాఢత త్రాచుల్లా బుసలుకొడుతూ తెగిడే నోళ్లను మూయిస్తాయి’ అని ఘాటుగా సమాధానం ఇచ్చింది.మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నా, పురుషాధిక్య సమాజం కారణంగా ఆమె దుఃఖ సముద్రాలను ఈదుతోందని ఆవేదన వ్యక్తంచేశారు ‘మహిళ’ అనే కవితలో.              ‘ఎన్ని తరాలు గడుస్తున్నా, నీ బతుకు ప్రయాణంలో అన్ని మజిలీలే, గమ్యం లేదు’అంటూ బరువు బాధ్యతల సంకెళ్ళలో బంధీ యైన బంధం గురించి చెప్పింది. ఒక మహాశ్వేతాదేవి లాగా మేధా పట్కర్ లాగా ఇందిరాగాంధీ లాగా అంగ సాన్ సూకీ లాగా మహిళలు ధైర్యంగా ముందుకు వెళ్లాలని, స్త్రీ పురుష సమానత్వం సమాజంలో రావాలని రచయిత్రి  ఆకాంక్షించారు.అప్పుల్లోకి చిక్కిన రైతులను పాడెక్కిస్తూ గ్రాసం లేక బొమికలు తేలిన పశువులను కబేళాలకు సాగనంపినప్పుడే మా పల్లె పటం ఎప్పుడో చినిగిపోయింది అంటూ  కేవలం రాయలసీమ వ్యదార్థ జీవన యధార్థ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ రచయిత్రి ‘కవితలెన్నో ధారపోస్తాను చైతన్య దీపికలెన్నో ఆలోచిస్తానని దగాపడిన సీమ బిడ్డ నై ప్రమాణం చేసి చెబుతున్నాను’  అని అంటుంది.           సమాజంలో బాలకార్మిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న సమాజానికి మాయని మచ్చగా నిలచింది. సమాజంలో నిరుద్యోగ సమస్య ఉన్నంతకాలం బాలకార్మిక వ్యవస్థ నిలిచి ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గాలలో బాలకార్మిక వ్యవస్థ ఒకటి. బాల కార్మికుని ఆదిశేషునిగా వర్ణిస్తూ ‘వాడు నడిచొస్తుంటే భూగోళాన్ని  మోస్తున్న ఆదిశేషుని లాగా కనిపిస్తున్నాడు.’అనంటుంది ఆదిశేషుడు అనే కవితలో ఉమాదేవి. అలాగే  మహర్షి కవితలో కొలిమి పనిలో బుగ్గవుతున్న బాల్యం శ్రామిక వేదాన్ని పలికే మహర్షులా దర్శనమిస్తోందని చెప్తుంది. సమాజం మారాలని  ఆమె కోరుతూ ఉంది .సమాజం విసిరే  సవాళ్ళని అవకాశాలు గా మార్చుకుంటూ ముందుకు సాగాలంటుంది. ఈ విషయాన్ని చెపుతూనే అంతరంగపు అడుగులు ఉన్న నలగ కుండాకుండా కవితా నాట్యం రక్తికట్టదు కదా అని అంటుంది. అదే సందర్భంగానే తన పోరాటాన్ని ఆపకుండా కలం ధనుస్సును ఎక్కుపెట్టి మస్తిష్క తూణీరంలోంచి అక్షర బాణాలను విలువలు లేని సమాజం పైకి స్పందించడానికి సిద్ధపడుతుంది. అంతే ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి నాలో ఆత్మ విశ్వాసం కిరణాలు ఈ కట్టుబాట్లు గోడలను తుంచేస్తాయని ఏదో ఒక రోజు ఈ ప్రపంచం నా చుట్టూ తిరుగుతుందని బలంగా ఆకాంక్షిస్తుంది.            సమాజంలో ఉన్న సాహితీమూర్తులు వచ్చినప్పుడు ఆమె హృదయం ఉప్పొంగిపోతుంది.వెంటనే వారి పై కవితలు రాస్తుంది అలా అనంతపురం జిల్లాలో దళిత అవధానిగా పేరుమీద ఆశావాది ప్రకాష్రావు గురించి ప్రముఖ కవి రాధేయ గురించి కవిత్వీకరించింది. అలాగే ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడుతున్న సంస్థ ఆర్ డి టి అధినేత విశేష సేవా కార్యక్రమాలను కవిత్వీకరించింది అంతేగాక కవులపై అపార విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ పేదల పక్షాన నిలబడటానికి కవుల కలం నిరసన గళమై ప్రజాస్వామ్యాన్ని నిలదీస్తుంది విప్లవ యుగానికి తెరతీస్తుంది అన్న  సందేశాన్ని ఈ కావ్యం ద్వారా ఒక భరోసాను ఇస్తుంది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s