త్రిపురనేని మధుసూదనరావు 1938 లో జన్మించారు 1959-61 సంవత్సరాలలో విశాఖపట్నంలో ఎమ్మే తెలుగు ఆనర్స్ చదివారు.ఉద్యోగరీత్యా తిరుపతికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు.
సమర్థుడైన అధ్యాపకుడుగా పేరు వచ్చింది. ఆధ్యాత్మిక,
సంప్రదాయాలు, ఆచారాలు పరచుకున్న తిరుపతిలో
ఆయన హేతువాదం, నాస్తిక వాదం బీజాలు నాటారు.
1971లో గుంటూరులో విప్లవ రచయితల సంఘం
(విరసం) మహాసభల్లో విరసం సభ్యునిగా చేరి 1972 నుంచి
1990 వరకు వరసం కార్యవర్గ సభ్యునిగా, 1974లో,
1980లో కార్యదర్శిగా ఉన్నారు. 1990 తర్వాత అనారోగ్యం,
వ్యక్తిగత కణాల వల్ల విరసంలో క్రియాశీలంగా పనిచేయలేక
పోయాడు. కొన్ని అభిప్రాయ భేదాలవల్ల విరసానికి దూరమై
నారు. ఒక దశాబ్ది అనంతరం 2004లో కావలిలో జరిగిన
విరసం సభలకు లేఖ రాస్తూ తనకు విరసం సభ్యత్వం మళ్లీ
ఇవ్వమని, విరసం ఎర్రజెండా కిందనే మరణించదలచు
కున్నానని కోరాడు. విరసం ఆయన కోరికను మన్నించింది.
2004 అక్టోబర్ 7వ తేదీ రాత్రి తిరుపతిలో అనారోగ్యం వల్ల
మధుసూదనరావు మరణించాడు.
నక్సల్బరీ శ్రీకాకుళం పోరాటాల తర్వాత రాజకీయాలలో
ప్రజా ఉద్యమాలతో ఆయనకు సంబందాలు ఏర్పడ్డాయి. ఈ
కాలంలో ఆయనపై పడ్డ కేసులు, వాటిపై ఆయన వాదనలు,
ప్రకటనలు సామాన్యమైనవికావు. సాహిత్య రాజకీయ సిద్ధాంత
పత్రాలవంటివి. సుదీర్ఘమైనవి. వివరణలతో విశ్లేషణలతో
ఉదాహరణలతో నిండినవి. సాహిత్యానికీ, రాజకీయరంగానికి ఉండే అవినాభావ సంబంధాన్ని విశ్లేషించాడు.
సమాజానికి సాహిత్యానికి ఉండే సంబంధాన్ని సామాజిక
చరిత్ర పరిణామాన్ని విశ్లేషిస్తూ అన్వయించాడు. "సాహిత్యం
కుట్రకాదు- రచయితలు కుట్రదారులు కారు" అనే ప్రకటనలో
తెలుగు సాహిత్యం ప్రారంభదశనుంచి నేటిదాకా వచ్చిన ఎన్నో
కావ్యాన్ని కవితల్ని లక్షణగ్రంధాలతో సహా ఉదహరిస్తూ
వర్గదృక్పథంతో విశ్లేషించాడు.
మధుసూదనరావు సాహిత్యమంటే సాయుధచైతన్యం అని చెప్పిన విప్లవ విమర్శకుడు. సాహిత్యంలో భూస్వామ్య
సామ్రాజ్యవాద భావజాలాన్ని విశ్లేషించి, విమర్శించి కార్మిక
వర్గతాత్త్విక ఆయుధమైన మార్క్సిజాన్ని స్థాపించిన సాహిత్య
యోధుడు. సాహిత్య విమర్శలో రాజకీయాల్లో వాదవివాదాలు
అంటే ఆయనకు ఇష్టం. ఆయన విమర్శ వ్యాసాలు, ఉప
న్యాసాలు ఎక్కువ భాగం ఈ వాద ప్రతివాదాలకు సంబంధించి
నవే. ఈ వ్యాసాల్లో సాహిత్య సిద్ధాంత వివేచన ఉంటుంది. ఒక
రచయితను తమ సిద్ధాంతం ప్రకారం విశ్లేషించి అన్వయించిన
సాహిత్య విమర్శ ఆయన చాలా తక్కువే చేశాడు.
సాహిత్యంలో విమర్శనాత్మక వాస్తవికత, సామాజిక వాస్తవికత, సామాజిక చైతన్యం, సామ్యవాద వాస్తవికత గురించి, విప్లవ సాహిత్యం,విప్లవ వాస్తవికత, విప్లవ చైతన్యం గురించి వివరణలు విశ్లేషణలు ఆయన విమర్శ వ్యాసాల్లో ఉపన్యాసాల్లో ఉంటాయి.
"సాహిత్యంలో వర్గ పోరాటాన్ని కొనసాగించాల్సి రావడం,రివిజనిజానికి వ్యతిరేకంగా ప్యూడల్ విలువలకి వ్యతిరేకంగా,వర్గపోరాటానికి సాధనంగా సాహిత్య విమర్శ ఉండాలనే ప్రేరణతో సాహిత్య విమర్శా రంగాన్ని ఎన్ను కొన్నా నన్నారు సాహిత్యంలో వస్తు శిల్పాలు" అనే
పుస్తక ప్రారంభంలో.
ఆర్ యస్.సుదర్శనం,జి.వి.సుబ్రహ్మణ్యం,వల్లభాచారి,
వెల్చేరు నారాయణరావు, గుంటూరు శేషేంద్రశర్మ,
సి.నారాయణరెడ్డి మొదలైన రచయితల విమర్శకుల రచనల్ని,
విమర్శనల్ని సిద్ధాంత గ్రంథాల్ని విమర్శించి, ఖండించి
విమర్శకుల విమర్శకుడు అనిపించుకున్నాడు.
గతి తార్కిక భౌతిక మానవతావాదం, గతి తార్కిక సాహిత్య భౌతికవాదం అన్న భావనలను ప్రతిపాదించాడు.
'గతితార్కిక భౌతిక మానవతావాదం' అన్న వ్యాసంలో చరిత్రను పరిశీలిస్తే ప్రపంచమంతటా ఉన్న మానవత, మానవతా దృష్టి వేరు, మానవతావాదం వేరని అన్నారు. మనుషులకంటే ధర్మం ముఖ్యం అనే ఛాందస వాదులూ
లేకపోలేదన్నారు. "సమాజంలో అధిక సంఖ్యాకులు ఎందుకని
నిరుపేదలుగ అజ్ఞానులుగ రోగ పీడితులుగా ఉన్నారు? ఈ
ప్రశ్నకి సమాధానం చెప్పే సామాజిక మానవతావాదమే
శాస్త్రీయ మానవతా వాదం-మార్క్సిస్టు మానవతావాదం"
(కవిత్వం - చైతన్యం" "గతితార్కిక భౌతిక మానవతావాదం
వ్యాసం, పుట 125) అని పేర్కొన్నారు.మార్క్స్ ప్రాకృతిక మానవతా వాదం మీద శాస్త్రీయమైన సామాజిక సామూహిక మానవతావాదాన్ని అభివృద్ధి చేశాడు. "చారిత్రకంగా సామాజికంగా ప్రాకృతికంగా సృజనాత్మకంగా మనిషికి ప్రకృతికీ, మనిషికి సమాజానికీ, మనిషికి చైతన్యానికి గతితార్కిక సంబంధాన్ని విశ్లేషించి సామాజిక మానవతావాదాన్ని మార్క్స్ ప్రతిపాదించాడు. ఇదే గతితార్కిక మానవతావాదం" (అదే వ్యాసం పుట. 144)అని వివరించారు.
'గతి తార్కిక సాహిత్య భౌతికవాదం' అనే మరొక మౌలికమైన ప్రతిపాదనను మధుసూదనరావు ఎంతో ఏకాగ్రతతో తీర్చిదిద్దాడు. ఇది 1979 విరసం సభలనాటి నుంచి చర్చలోకి వచ్చింది. ఈప్రతిపాదన ఎందరి దృష్టినో ఆకర్షించింది. కొందరు ఖండించారు. ఏటుకూరి బలరామమూర్తి, కొండపల్లి సీతారామయ్య ఖండించిన వారిలో ఉన్నారు. తనపైన వచ్చిన విమర్శలకు మధుసూదనరావు ప్రతివిమర్శ రాశాడు. ఈ ప్రతిపాదన గురించి శ్రీశ్రీ ఇలా అన్నాడు. "ఇందులో ఆక్షేపించవలసిందేమీలేదు.పైగా ఈ వాదం ఒక నూతన సిద్ధాంతం కూడా కాదు. మధుసూదనరావు చేస్తున్నదంతా మార్క్సిస్టు గతితార్ని భౌతికవాదాన్ని మన సాహిత్యాని కన్వయించే ప్రయత్నం మాత్రమే" (ఆంధ్రజ్యోతి వారపత్రిక 9-4-1982)
'జాతీయోద్యమ కవిత్వం' అనే వ్యాసంలో ఆధునిక కవిత్వ చరిత్ర రాసిన వాళ్ళెవరూ జాతీయోద్యమ కవిత్వానికి సముచిత స్థానం ఇవ్వలేదు. సంప్రదాయానికి పూర్తిగా భిన్నంగా, సంప్రదాయాన్ని పూర్తిగా వదిలేసి ఆధునిక కవిత్వం ఉండదనీ, లేదని నిరూపించడం సి. నారాయణరెడ్డి సిద్ధాంత గ్రంథం ప్రధాన ఉద్దేశమని మధుసూదనరావు అన్నాడు.
"ఆధునిక కవిత్వంలో మొదటి మూడు నాలుగు దశాబ్దాల
చరిత్ర భావకవిత్వ చరిత్ర అనీ, భావకవిత్వంలో దేశభక్తి
కవిత్వం ఒక భాగమని సి. నారాయణ రెడ్డి సిద్ధాంతం చేశారు.
(అదే వ్యాసం, పుట 139) కాని ఆయన భావకవిత్వానికి
చెప్పిన నిర్వచనాలూ లక్షణాలూ జాతీయోద్యమ కవిత్వానికి
అన్వయించవు.భావ కవిత్వం ప్రధాన లక్షణం అంతర్ముఖత్వం" కానీ జాతీయోద్యమ కవిత్వ ప్రధాన లక్షణం బహిర్ముఖం. అలాంటప్పుడు భావకవిత్వంలో జాతీయోద్యమ
కవిత్వం భాగం ఎలా అవుతుంది? అని విమర్శించాడు.
త్రిపురనేని.
వెల్చేరు నారాయణరావు, కవితా విప్లవాల స్వరూపాన్ని
గురించి సమీక్షిస్తూ భావకవిత్వం తీసుకొచ్చింది. భావ
విప్లవమా? జాతీయోద్యమ కవిత్వం తీసుకొచ్చింది. భావ ముసుగులోని విప్లవమా? భావవిప్లవం అంటే కేవలం భావాలలో విప్లవం, వాస్తవంగా విప్లవం కాదు అని వెల్చేరు అభిప్రాయమనుకుంటాను అని మధుసూదనరావు విశ్లేషించారు.
ఇంగ్లీషువాళ్ళు ప్రవేశపెట్టిన విద్యావిధానం, ఇంగ్లీషు
సాహిత్యాన్ని చదివి మన విద్యార్థులు, యువత ఈ భావ
కవిత్వాన్ని రాశారు. జాతీయభావాల్ని సామ్రాజ్యవాద వ్యతి
రేకతనూ బోధించవలసిన సమయంలో వీళ్ళు భావకవిత్వం
రాశారు అని త్రిపురనేని అభిప్రాయపడ్డాడు.
ఆధునిక కవిత్వానికి యుగకర్తగా గురజాడను భావించాలి. రాయప్రోలును యుగకర్తగా స్వీకరించడం ఏవిధంగానూ సమర్థనీయంకాదు అని త్రిపురనేని విశ్లేషించి తీర్మానించాడు.(అదే వ్యాసం - జాతీయోద్యమ కవిత్వం - పుటలు 14-43)ఈ సందర్భంగా తెలుగు సాహిత్య యుగ విభజన విషయంలో కూడా త్రిపురనేని అభిప్రాయాలు "సాహిత్య చరిత్ర పురోగమనాన్ని బట్టి యుగవిభజన ఉండాలి. సాహిత్య చరిత్రలో పురోగమన సూత్రాన్ని ఆవిష్కరించే విధంగా యుగవిభజన ఉండాలి. ముందు యుగవిభజన చేసుకొని తర్వాత చరిత్ర రాయకూడదు. సాహిత్యచరిత్రను సామాజిక చరిత్రలో భాగంగా ముందు అధ్యయనం చేసి పురోగమనానికి అనుగుణంగా యుగవిభజన చెయ్యాలి అంటారు. (సాహిత్యంలో వస్తుశిల్పాలు గ్రంథం)
‌‌ 1.మౌఖిక సాహిత్యం 2. లిఖిత సాహిత్యం 3. అనువాదసాహిత్యం 4.భక్తి సాహిత్యం 5.ప్రబంధ సాహిత్యం
6. దక్షిణాంధ్ర సాహిత్యం 7. ప్రాచీన సాహిత్యంలో ప్రక్రియలు
8. ఆధునిక సాహిత్యం 9.ప్రజాసాహిత్యం 10.ఆధునిక
సాహిత్యంలో ప్రక్రియలు గా విభజన చేసి తెలుగుసాహిత్యం మత భావజలం నుంచి విముక్తి పొందిన క్రమాన్ని,చారిత్రక క్రమాన్ని నిరూపించవచ్చునని, తెలుగు సాహిత్య భవిష్యత్తుని శాస్త్రీయంగా ఊహించవచ్చుని చెపుతాడు త్రిపురనేని.
సాహిత్య ప్రయోజనాన్ని గురించి త్రిపురనేని "సాహిత్యప్రయోజనం - సంప్రదాయశాస్త్రీయ దృక్పథాలు" , "సాహిత్యంలో వస్తుశిల్పాలు" అనే వ్యాసాలలో ఇలా చెపుతాడు. "ఆత్మకోసం సాహిత్యం రాజుకోసం సాహిత్యం,
ఆనందం కోసం సాహిత్యం అనేది సాంప్రదాయిక దృక్పథం.
సాహిత్యం కోసం సాహిత్యం, అందం ఆనందం కోసం
సాహిత్యం, సౌందర్యం కోసం సాహిత్యమనేది ఆధునికత
ముసుగులోని సాంప్రదాయిక దృక్పథం. కళ ప్రజల కోసం.
ప్రజల విప్లవ పోరాటాల్లో సాహిత్యం ప్రజల ఆయుధం.
సాహిత్యాన్ని సాహిత్య చరిత్ర నుంచి మానవత నుంచి
విడదీయటం సాహిత్య ద్రోహం..... మానవతా మహితమైన వర్గ
రహిత సమాజధ్యేయం కోసం సాహిత్యం బద్దం కావాలి" అని
తీర్మానిస్తాడు త్రిపురనేని.విప్లవించే ప్రజల చేతుల్లో జెండాగా
ఎగరాలి సాహిత్యం" అనేది ఆయన అంతిమ తీర్పు.
'వస్తువు శిల్పం' గురించి రాస్తూ "అధిక సంఖ్యాక
ప్రజల్లోకి సాహిత్యాన్ని తీసుకుపోవటాన్ని దృష్టిలో పెట్టుకొని,
శిల్పప్రాముఖ్యాన్ని పరిమితం చేయాలి. ప్రజాప్రక్రియలను,
ప్రజల నుడికారాన్ని చేపట్టి, ప్రజలకోసం ప్రజాసమస్యల్నే
వస్తువుగ నిర్మించాలి" వస్తువులో కరిగిపోయేదిగా ఉండే
శిల్పాన్ని మనం చేపట్టాలంటాడు మధుసూదనరావు .
సాహిత్యం సార్వకాలికం సార్వత్రికం లేక సార్వజనీనం
అనే వాదాల్ని విశ్లేషించి ఖండించాడు.
సాహిత్యం స్వతంత్ర ప్రతిపత్తి గల రంగం అనేది భ్రమ. సాహిత్యం స్పష్టంగా కాలబద్ధం. సమాజ బద్దం. సాహిత్యానికి జన్మభూమి సమాజం, సమాజానికి సంబంధం లేకపోత సాహిత్యానికి ఉనికిలేదు. కనుక సాహిత్య చరిత్రని సామాజిక చరిత్రలో భాగంగానే అధ్యయనం చేయాలి. సాహిత్యం సార్వకాలికం, సార్వజనీనం అయితే దానికి చరిత్ర ఉండదు. సార్వకాలిక,సార్వజనీనత గల చరిత్రను నిర్మించడం సాధ్యం కాదు.
జి.వి. సుబ్రహ్మణ్యం సాహిత్యంలో నవ్యసంప్రదాయం అనే ప్రతిపాదన చేసి, దానికి ప్రతినిధిగా
విశ్వనాథను నిరూపించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఖండిస్తూ
విశ్వనాథ సాహిత్యాన్ని విమర్శించారు. దానిపైన వల్లభాచార్య
ప్రతి విమర్శవచ్చింది. దీనిపైన కూడా త్రిపురనేని మరల విమర్శ చేశారు. వీటిని 'విశ్వనాథ తిరోగమన సాహిత్యం'పేరుతో త్రిపురనేని ఒక వ్యాస సంపుటిగా తీసుకొచ్చారు.
విశ్వనాథ స్వయంగా ఎన్నోసార్లు" నేను అవిచ్చిన్న సంప్రదాయవాదిని" అని చెప్పుకున్నాడు. ఈ విషయం పట్టించు
కోకుండా ఆయన నన్ను సంప్రదాయవాది అని నిరూపించ
టానికి ప్రయత్నించడంలో అర్ధం ఏముంది? అసలు "నవ్య అనే
మాట విశ్వనాధకు అతకదు. ఆయన సంప్రదాయం మనువు
సంప్రదాయం, కాదంట్ గోల్వాల్కర్ సంప్రదాయమనీ త్రిపురనేని
ఆయన సాహిత్యం ఆధారంగానే నిరూపించాడు. భారతీయ
సంస్కృతి అంటే చాతుర్వర్ణ వ్యవస్థ బ్రాహ్మణాధిక్యత,
రాజులందరూ సూర్యచంద్రుల నుంచి ఊడిపడ్డవారు. కనుక
కావున వ్యవస్థ శాశ్వతంగా ఉండాలి. స్వాతంత్ర్యము పజా
స్వామ్మమూ మనకెందుకు? చీమకూ దోమకూ స్వతంత్రమేనా?
పంచములకు దేవాలయ ప్రవేశమా? దేవుడు మైలపడిపోవును.
దారిద్ర్యం, తక్కువ కులాల్లో జన్మించడం పూర్వ జన్మకృత
కర్మఫలము. ఆడవాళ్ళకు చదువులెందుకు ? పుట్టలో పాలు
పోసుకుంటూ, నోములు ప్రతాలు చేసుకుంటూ జన్మజన్మలకూ ఒక్కడే భర్త అంటూ పాతివ్రత్యం పాటిస్తూ బతకాలి.. ఈ
మొదలైన ముద్దులు పనిగట్టుకొని ప్రచారం చేసిన విశ్వనాథ
సాహిత్యం ఈ ఆధునిక యుగంలో ఎందుకూ కొరగాడు.
విశ్వనాధ సాహిత్యంలో పరిణామాలకు భారతదేశ సమకాలీన చరిత్రకు మధ్య ఉన్న సంబంధాన్ని తిపురనేని నిరూపించారు.
మార్క్స్ దృష్టిలో సాహిత్యం అనే పేరుతో ఆర్ ఎస్
సుదర్శనం 1979 జులై సృజన పత్రికలో వ్యాసం రాశాడు.ఆ
వ్యాసాన్ని విమర్శిస్తూ త్రిపురనేని 'మార్క్సిజం- సాహిత్యం' అనే వ్యాసం రాశారు. అదే తర్వాత పుస్తక రూపంలో వెలువడింది.
గుంటూరు శేషేంద్ర శర్మ భూస్వామ్య సాహిత్యాస్వాదన ను రసదృష్టిని మార్క్సిజంతో అంటు కట్టటానికి చేసిన
ప్రయత్నాల్ని ఖండించాడు త్రిపురనేని,
త్రిపురనేని "మనుధర్మం నశించాలి మార్క్సిజం
వర్ధిల్లాలి " అనే పేరుతో రాసిన వ్యాసం కూడా వాద వివాదాలకు
చెందింది. ఇది దళిత వాద చర్చ. అప్పట్లో (1993) స్త్రీవాద
వివాదాల్లో కూడా పాల్గొన్నాడు త్రిపురనేని, ఈ విషయాల మీద
కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు.కొన్ని పుస్తకాలకు ముందు మాటలు రాసాడు. దళిత మేధావులు కొందరు త్రిపురనేనిపై దండెత్తారు కూడ.
త్రిపురనేని మధుసూదనరావు విప్లవోద్యమ విమర్శకుడు.
విప్లవసాహిత్య విమర్శకుడు. సామాజిక విప్లవం అతని లక్ష్యం.
సామ్యవాద ప్రపంచం గమ్యం. ఇందుకు దోహదం చేసే
సాహిత్యాన్ని ప్రోత్సహించడం, తద్భిభిన్నమైన దాన్ని ఎదుర్కో
వడం ఆయన ఆచరణగా కొనసాగింది.
__పి. సంజీవమ్మ
    (సేకరణ: పిళ్లా కుమారస్వామి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s