శుకసప్తతి అంటే చిలుక చెప్పిన 70 కథలు కావచ్చు లేదా చిలుక డెబ్బై
రాత్రుల్లో చెప్పిన కథలూ కావచ్చు. అయితే పాలవేకరి కదిరీపతి రాసిన శుకసప్తతి
పద్యకావ్యంలో 70 కథలు లేవు, 70 రాత్రుల్లోనూ చెప్పలేదు. అయితే ఇందులోని
కథలు 70 రోజులు చెప్పినట్లు కావ్యం చివర తెలుస్తూ వుంది. అంటే కొన్ని కథలు
లభించలేదని గ్రహించాలి.శుకసప్తతి కథ ఏంటంటే .... భర్త ఇంట్లో లేనప్పుడు భార్య ఒక మధ్యవర్తి(దూతిక) ప్రలోభంతో పరపురుషున్ని కలవడానికి ప్రయత్నిస్తూ వుంటుంది. ఆ
ఇంట్లో ఉన్న పెంపుడు చిలుక ఆమెనాపి 'ఈ కథ వినిపో' అంటూ రోజూ ఒక కథ చెబుతూ 70 రాత్రులు గడిపేస్తుంది. ఇంతలో భర్త రావడం వల్ల ఆమెకు ఆ ఆలోచన పోతుంది. ఇద్దరూ సుఖంగా సంసారం చేస్తారు. ఇదే శుకసప్తతిలోని ప్రధానకథ. అయితే దీనికి కావ్యంలో ప్రాధాన్యతలేదు. రాత్రిళ్లు చెప్పిన చిన్న చిన్న కథలకే ప్రాధాన్యం. అవి ఎక్కువగా శృంగార కథలే. వీటిలో కొన్నింటిని పిళ్లా
కుమారస్వామి(విజయ్) ఈ పుస్తకంలో చెబుతున్నారు.ముద్రిత, అముద్రిత వచన శుకసప్తతులు దాదాపు పది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సిని కృష్ణా డిపో వాళ్లు, వావిళ్ళ వాళ్లు ప్రచురించిన గద్యశుక సప్తతి కావ్యాలు నేను చూడడం జరిగింది. వీటిల్లో కూడా కదిరీపతి రాసిన శుకసప్తతి లాంటి జారశృంగార కథలే ఉన్నాయి. అయితే ఆ కథలు వేరు (భిన్నం).
ఇలాంటి జార శృంగార కథల్ని ఎవరు కల్పించినా శుకసప్తతి పేరుతో ప్రకటించడం
అలవాటుగా ఉన్నట్లుంది.వచన కావ్యాలెన్ని ఉన్నా తెలుగులో పద్యకావ్యం ఉన్నది ఒక్కటే. అదే పాలవేకరి కదిరీపతి శుకసప్తతి.
కదిరీపతి కావ్యంలోని చిన్న కథల్లో ఎక్కువ భాగం 'రంకాడి బొంకాడిన' స్త్రీ కథలే. స్త్రీ తన భర్తను మోసం చేసి పరపురుషునితో కలవడం, ఆ గుట్టు బయటపడే సందర్భంలో ఆమె బెదరక తన సమయస్ఫూర్తితో రట్టుగాకుండా
బయటపడడం దాదాపు అన్ని శృంగార కథల్లో ఉన్న సాధరణ విషయం. అయితే
ఈ విషయాన్ని చెప్పడంలో కవి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఈ వైవిధ్యం కథానిర్మాణంలో, పాత్రచిత్రణాది విషయాల్లో కనిపిస్తుంది. ఈ కథల్లోని (నాయికానాయకులు) స్త్రీ, పురుషులు అన్ని వర్ణాలకు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్లు ఉన్నారు. వాళ్ల సంబంధాలు కూడా వైవిధ్యంగానే ఉంటాయి. అందుకే పాఠకుడు ఈ కథల పట్ల అమితంగా ఆకర్షింపబడతాడు.
ప్రాచీన కాలం నుండి నేటి వరకు కథలు మనకు వినోదాన్ని కల్గిస్తూ ఉన్నాయి. కథకు వక్త, శ్రోత ఉంటాడు. వక్త కథను చెప్పడంలో నవ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే శ్రోత నవ్యతా ప్రియుడు వైవిధ్యాన్ని ఆశిస్తాడు. ఈ విషయం గ్రహించిన కుమారస్వామి ఈ కథలనే ఆధునిక కథారీతులకు అనుగుణంగా
చెబుతున్నారు. ఆ క్రమంలో ఆ కథల్లోని కొన్ని పాత్రల పేర్లు, సన్నివేశాలు మార్చారు.
బహుశా ప్రముఖ రచయిత జయంతి పాపారావు ప్రభావం కూడా కొంత వరకు
ఉండొచ్చు.శుకసప్తతి కథలు పాఠకులని కట్టిపడేస్తాయి. అందుకు ఆయా కథలలోని
ఉత్కంఠత,జారిణుల మాటకారితనం ముఖ్యకారణాలు. పరపురుషుడిని మరిగిన
స్త్రీ వానితో రమిస్తుందా లేదా, వాళ్ల కలయికను భర్త చూస్తే ఆ గండం నుండి
బయటపడుతుందా ? లేదా ? ఇలాంటి ఉత్కంఠ భరిత సన్నివేశాలు,జారిణీ
స్త్రీల మాటకారితనము ఈ కథలకు ఆయువుపట్టు. ఈ అనుభూతి పద్యకావంలో
సామాన్యులకు రాదు. అందుకే కుమారస్వామి సరళ వ్యవహారిక భాషలో ఈ కథలను చెప్పి ఆయా సందర్భాలలో సామాన్య పాఠకులని కూడా గంతులు వేయిస్తున్నారు. మరొక్క విషయం పద్యకావ్యంలో కథలకు శీర్షికలే లేవు. అయితే కుమారస్వామి వ్రాసిన కథలలో 'మొగుడు మధ్యలో వస్తే', 'ఇద్దరు భార్యల
మధ్యల దరువు' లాంటి శీర్షికలు పెట్టి చదవడానికి మనల్ని ఉసిగొలుపుతారు.
సామాన్య పాఠక లోకానికి ఈ కథల్ని అందించడానికి రచయిత చేసిన కృషి
ఎంతో అభినందనీయం. ఈ కథల్ని చదివితే నాటి నుండి నేటి వరకు ఈ కథలలోని
స్త్రీ, పురుషులు మనకు కనిపిస్తూ ఉంటారు. అంతేకాక సాహిత్యంపై అభిలాషలేని
సాధారణ పాఠకులు కూడా ఈ కథల్ని చదివితే వాళ్లు కూడా సాహిత్యంపై మక్కువ
పెంచుకోవడానికి అవకాశం ఉంది.
__సి.వెంకటరామిరెడ్డి,    
Rtd,తెలుగు ఉపన్యాసకులు, అనంతపురం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s