సర్దేశాయి తిరుమలరావు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు జొహరాపురం లో జన్మించారు ఈయన మాతృభాష కన్నడం ఉన్నత విద్య కోసం అనంతపురం వచ్చి దత్తమండలం కళాశాలలో బీఎస్సీ చదివారు రాజస్థాన్లోని బిర్లా కళాశాలలో ఎమ్మెస్సీ రసాయన శాస్త్రం చదివి అక్కడే సాయిబాబా జాతీయ కళాశాలలో ఒక ఏడాది ఉపాధ్యాయుడిగా
పనిచేశారు. అనంతపురంలోనే ఉన్న తైలసాంకేతిక పరిశోధన
సంస్థలో 1954లో జూనియర్ కెమిస్ట్ గా చేరారు. క్రమక్రమంగా
ఎదిగి ఆ సంస్థకే సంచాలకులయ్యారు. 1986లో పదవీ
విరమణ చేసి 1990లో మరణించారు.
1965 ప్రాంతం నుంచి భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలలో ఆయన వ్యాసాలు, లేఖలు నిరంతరం వచ్చేవి. ఆయన తనకు ఇష్టమైన మూడు గ్రంథాలున్నాయని అవి గురజాడ కన్యాశుల్కం, ఉన్నవ మాలపల్లి, గడియారం శివభారతం అని చెప్పేవారు. మొదటి రెండింటి మీద రెండు విమర్శ గ్రంథాలు వ్రాశారు. కానీ మూడవ గ్రంథం మీద అధ్యయనం చేస్తూనే మరణించారు.
సర్దేశాయిని మంచి తులనాత్మక సాహిత్య విమర్శకుడుగా
పేర్కొనాలి. కన్యాశుల్క నాటకకళనుగాని, శివభారత
దర్శనాన్నిగానీ ఇతర వ్యాసాలు కానీ చదివితే మనకు పరిచయ
మయ్యేది ఒక్క గురజాడ, ఒక్క గడియారం మాత్రమే కాదు.
అసంఖ్యాకంగా ఇతర భారతీయ, విదేశీ రచయితలు, రచనలు
మనకు పరిచయం అవుతారు.
సర్దేశాయి 'సాహిత్యమంటే ఏమిటి? కవిత్వం వల్ల
ప్రయోజనం ఏమిటి? 'అనే ప్రశ్నలకు సృజనాత్మక జవాబు
చెబుతూ కవిత్వం ఒక స్ప్రింగ్ బోర్డ్ అని, 'నడునడుముందుకు
నడు' అనే ఐతరేయ బ్రాహ్మణ మంత్రం కవిత్వం అని, మార్క్స్,
ఏంగెల్స్ ప్రచురించిన మానిఫెస్టోలోని కడపటి వాక్యం కవిత్వం
అని, గాంధీ గర్జన 'క్విట్ ఇండియా' కవిత్వం అని వాదించారు.
కవిత్వం మనిషిని స్వావలంబునిగా లోక శ్రేయోక్రియాపరునిగా
ప్రేరేపించే ఉత్తమ భావమని నిర్వచించారు. సర్దేశాయికి
భారతీయ అలంకార శాస్త్రాలమీద ఉన్న గౌరవం కొద్దిపాటిదే.
సాహిత్యంలో అలంకార వాదాలు దేహాభిమానం నుంచి
వచ్చాయని రస, పాక సిద్ధాంతాలు వంట ఇంటినుంచి
వచ్చాయని చమత్కార వాదం సర్కస్ నుంచి మ్యాజిక్ నుంచి
వచ్చాయని, వక్రోక్తి, ధ్వని వాదాలు పగటి వేషగాళ్ళ తత్త్వాలని,
ఔచిత్యవాదం డ్రిల్ మాస్టర్ ప్రవృత్తి లేదా అత్తపోరు వంటిదని
తరమణీయకత, సౌందర్య, శయ్యావాదాలు భోగలాలసత నుంచి వచ్చాయని సర్దేశాయి అభిప్రాయం. ఆలంకారిక సిద్ధాంతాలను ఎంతగా తిరస్కరించినా ధ్వని సిద్ధాంతం మీద ఆయనకొక గౌరవం ఉంది.
కావ్యాన్ని పరిశీలించే పద్ధతులు మూడున్నాయని సర్దేశాయి పేర్కొన్నారు. అవి 1. లక్ష్యాను సరణ పద్ధతి. 2. లక్షణానుసరణ పద్ధతి. 3. కవిమార్గానుసరణ పద్ధతి. వీటిలో మొదటిది అంతగా ప్రమాదకారి కాదని రెండవది పెద్దగా అనుసరణీయం కాదని మూడవది శ్రేష్టమైనదని సర్దేశాయి అభిప్రాయం.
ప్రకృతిలో ఉన్నది ఉన్నట్లు చిత్రించడం కవిపనికాదని అది
ఫోటోగ్రాఫర్ ది అని ఉన్నదానిని సృజనాత్మకంగా చెప్పటమే
కవి పని అని సర్దేశాయి భావన. కావ్యంలో నాటకీయతను
దర్శించడం నాటకంలో కవిత్వాన్ని దర్శించడం సర్దేశాయికి
ఇష్టమైన శిల్పం. అందరు రచయితల్లో కావ్య విశేషాలన్నీ
లభించవని ఒక్కొక్క కవిలో ఒక్కొక్క విశేషం ప్రధానంగా
ఉంటుందని ఈయన అభిప్రాయం. అందుకే తిక్కన, పింగళి
సూరన, గౌరన నాటక కవులని తిక్కన, తెనాలి రామకృష్ణుడు
పాత్రోన్మీలనశక్తి గల కవులని సూరన, గౌరనలు పాత్ర
సృజనాశక్తిలో అద్వితీయులని కీర్తించారు.
కన్యాశుల్క నాటకంలో నాయికానాయకులెవరని జరిగిన
చర్చలో ఆలంకార శాస్త్రాల ప్రకారమైతే ఆనాటకంలో నాయికా
నాయకులు కనిపించరన్నారు. అది నాయికానాయకులులేని,
ప్రధాన లేక ప్రాతినిధ్య పాత్రలున్న నాటకమని తేల్చారు.
కన్యాశుల్క నాటకంలో ఒక భావానికి ఒక పాత్రను సృష్టించే
సంప్రదాయానికి భిన్నంగా, గురజాడ సామూహిక పాత్ర చిత్రణ
చేశారని ఒక కొత్త విషయాన్ని చెప్పారు సర్దేశాయి. ముగ్గురు
వితంతువులు, ముగ్గురు న్యాయవాదులు, ఇద్దరు అవధానులు
దీనిని సామూహిక పాత్రీకరణ లేదా పాత్ర సామూహీకరణ
అన్నారు. కన్యాశుల్క నాటకాన్ని నాటకమా, ప్రహసనమా అని
చూడడం హ్రస్వదృష్టి అన్నారు. మధురవాణి పాత్ర పరి
ణామాన్ని పరిశీలించిన తీరు ఒక ఇతిహాస రచనతో పాత్ర
చిత్రణను పరిశీలించడానికి నమూనాగా ఉంది. గిరీశం మంచి
వాడా చెడ్డవాడా అని పండితులు వాదించుకుంటూ ఉంటే,
అతడు దేవాలయం మీద బూతుబొమ్మ అని అన్నారు
సర్దేశాయి.
సర్దేశాయి సారంగధర చరిత్రను అరిస్టాటిల్ చెప్పిన గ్రీకు
ట్రాజడీగా గుర్తించారు. సారంగధరుడు అరిస్టాటిల్ ప్రకారం
ట్రాజిక్ హీరో అని చెప్పారు. కాళిదాసు మేఘసందేశాన్ని
అందరూ ఒక కావ్యంగానే చూడగా సర్దేశాయి కాళిదాసు
మేఘం ప్రయాణించిన మార్గాన్ని గుర్తించే ప్రయత్నం చేసి
ఒక భౌగోళిక కావ్యంగా పేర్కొన్నారు. "మేఘసందేశంలోని మేఘుని మార్గం" అనే వ్యాసంలో విశ్వసాహిత్యాన్ని విశేషంగా అధ్యయనం చేసిన సర్దేశాయి విశ్వసాహిత్యంలో ప్రాగ్ రూపాలు అనే వ్యాసం రాశారు.
తెలుగులో చాలా అరుదుగా కనిపించే ఆర్కిటైపల్ విమర్శధోరణికి ఈ వ్యాసం ఒక నమూనా, సవన బేబెల్ గోపురం" అనే వ్యాసంలో తెలుగు, కన్నడ భాషా సాహిత్యాల సాన్నిహిత్య ధోరణులను సర్దేశాయి అనేక రకాలుగా విభజించారు.
వర్తమాన సాహిత్యంలో వర్తమాన సమాజంలో ప్రస్తావనకు వచ్చే అనేకాంశాలను మన ప్రాచీన సాహిత్యంలో వెతికి చర్చించడం సర్దేశాయికి ఒక అలవాటు. శ్రీశ్రీ పుడమి తల్లికి పురిటినొప్పులు అనే మాటను తీసుకొని భూమిని తల్లిగా భావించే అలవాటు మనిషి భూమిమీద అవతరించినప్పటి నుంచి ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఋగ్వేదం మొదలుకొని
అనేక ఉదాహరణలు ఇచ్చారు.
రాజస్థాన్ లోని సికార్ జిల్లా దేవరాల గ్రామంలో జరిగిన రూప్ కన్వర్ సతీసహగమనం ఆధారంగా పరిశోధన చేసి వేదాలలో సతీసహగమనం లేదని పురాణేతిహాసాల కాలంలోనే ఈ ఆచారం ప్రబలిందని తేల్చిచెప్పారు. నేటి మంత్రులకు, ఒకనాటి మంత్రులకు మధ్య సంపదలు, సౌకర్యాలను గురించిన తేదాలను చర్చిస్తూ మంత్రులు నాడు, నేడు అనే వ్యాసం రాశారు. చాణక్యునినిరాడంబర జీవన విధానాన్ని నేటి మంత్రుల సుఖలాలస భరితమైన జీవనాన్ని ఈ వ్యాసంలో పోల్చిచెప్పారు.
ఎయిడ్స్ వ్యాధి గుర్తింపబడిన తొలిరోజులలో సర్దేశాయి పురాణాలలోఎయిడ్స్ కేసులు అనే వ్యాసం రాశారు. మహాభారతంలోని విచిత్ర వీరుడు, పాండురాజు రఘువంశంలోని అగ్నివర్ణుడు ఈ ముగ్గురూ ఎయిడ్స్ వ్యాధితోనే మరణించారని ఎయిడ్స్ అనే పేరు ఇవాళ వచ్చినా దీని లక్షణాలు ప్రాచీన కాలంలోనే భారతదేశంలో ఉన్నాయని చెప్పారు.
సర్దేశాయి తిరుమలరావు ఎన్నో వ్యాసాలు ప్రతి విమర్శలు రాశారు. వాటిలో కొన్ని విమర్శ ప్రతివిమర్శ అన్న సంపుటిలో ఉన్నాయి. దీన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. ఈ వ్యాసాల వల్ల సర్దేశాయి సమకాలీన సాహిత్య వ్యాసాలను ఎంతగా గమనించేవారో తెలుస్తుంది.
మాలపల్లి నవల తన కిష్టమైన మూడు గ్రంథాలలో ఒకట
ని పేర్కొన్న సర్దేశాయి దాని మీద ప్రత్యేకంగా గ్రంథం
రాయలేదు.కానీ కొత్తపల్లి వీరభద్రరావు తెలుగు సాహిత్యంపై
ఇంగ్లీషు ప్రభావం అనే సిద్ధాంత గ్రంథంలో మాలపల్లి నవల
రెండవ భాగం మీద ఇంగ్లీష్ నవల "ఈస్టలిన్" ప్రభావం
ఉందని అభిప్రాయపడగా దానిని ఖండిస్తూ మాలపల్లిపై
ఈస్టలిన్ ప్రభావం కలదా అనే పెద్దవ్యాసం రాశారు.
ఈ రెండు రచనల మధ్య సామ్యాలకన్నా భేదాలే అధికంగా
ఉన్నాయని రుజువుచేస్తూ కొత్తపల్లి అభిప్రాయాన్ని
తిరస్కరించారు.ఇంకా ఎన్నో వ్యాసాలలో సర్దేశాయి తనదైన అధ్యయనంతో వాక్పటిమతో వాదపాటవంతో తెలుగు సాహిత్య విమర్శను సుసంపన్నం చేశారు.
_రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
(సేకరణ పిళ్లా విజయ్)