_పిళ్లా కుమారస్వామి 9490122229

‌‌
‌ నాచనసోమన కడపజిల్లా కమలాపురం తాలూకాలోని తుడుమలదిన్నె లో జన్మించారు. ఆయన ఉత్తరహరివంశమనే ప్రబంధకావ్యాన్ని రచించారు. ఇది జనాదరణ పొందిన కావ్యం.
నాచన సోమన 14వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత పొందిన కవులలో ఒకరు. విజయనగర సామ్రాజ్య పరిపాలకుడైన వీర బుక్కరాయలు నాచన సోమనకు పోషకునిగా వ్యవహరించారు. బుక్కరాయల నుండి ' పెంచకల దిన్నె' అగ్రహారాన్ని బహుమానంగా పొందాడు. అది పూర్వపు జమ్మలమడుగు తాలూకాలో వుండేది.
నాచనసోమన సాహిత్యంలో  తిక్కన యుగానికి చెందిన కవి. సోమన కాలాన్ని గురించి పరిశోధకుల్లో వాదోపవాదాలు జరిగాయి. విజయనగర చక్రవర్తి  బుక్కరాయలు నాచన సోమనకు చేసిన దానశాసనం క్రీ.శ.1344 నాటిదని పరిశోధకులు నిర్ధారించడంతో నాచన సోమన కాలం 1300 నుంచి 1380ల మధ్యదని అంచనా వేస్తున్నారు.

ఉత్తర హరివంశాన్ని లోకోత్తరంగా రాసిన నాచన సోమునికి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానముంది. నాచన సోమన వసంత విలాసం, హరివిలాసం, హరవిలాసం, ఆదిపురాణం కావ్యాలను కూడా రాశాడని పండితులు భావించారు. ఉత్తర హరివంశం తప్ప మిగతావన్నీ అలభ్యాలు. కొందరు లాక్షణికులు, సంకలనకర్తలు తమ గ్రంథాల్లో ఉటంకించిన పద్యాలను ఆధారం చేసుకుని ఈ కావ్యాలను నాచన సోముడు రాశాడని చెప్పారు. అతని పాండితీ ప్రకర్షకు ఉత్తర హరివంశమే సజీవ సాక్ష్యం. నాచన సోమన ఉత్తర హరివంశంలో కొత్త విషయాలు ఎన్నో ఉన్నాయి. సోమన తిక్కనను గురువుగా భావించి అతనిలాగే కవిత్వాన్ని కొత్త పుంతలుతొక్కించి కొత్తదనాన్ని కోరుకున్నాడు. సజీవమైన జాతీయాలను, వ్యావహారిక పదాలను విరివిగా వాడాడు. కావ్యంలోని పురాణ పురుష పాత్రలను తన కాలంనాటి మనుషులుగా సృష్టించాడు. కావ్యంలో సమకాలీన దృశ్యాలను వర్ణించాడు. అనేక విషయాల్లో తరువాతి కవులకు మార్గదర్శకుడైనాడు. తెలుగు సాహిత్య చరిత్రలో పేరెన్నికగన్న చాలామంది పండితులు నాచన సోమన గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడారు. ఇంత గొప్పగా సంవిధాన నిర్వహణం చేసిన కవి మరొకడు లేడని, ‘ఒకే ఒక్కడు’ నాచన సోమనని తేల్చారు.
అటువంటి నాచన సోమన గురించి శాసనాలు మరికొన్ని వివరాలు అందిస్తున్నాయి. ఇతనికి సంబంధించి మొత్తం నాలుగు శాసనాలు లభించాయి. అందులో రెండు శాసనాలు కర్ణాటకలో, రెండు కడప జిల్లాలో లభించాయి. కర్ణాటకలో లభించిన శాసనాల్లోని తేదీలు పండితుల్లో కొంత గందరగోళానికి గురిచేశాయి. ఈ శాసనాల ఆధారంగా నాచన సోమన పిన్నవయసులోనే కావ్యాలురాశాడని, చాలా సంవత్సరాలు జీవించాడని భావించవచ్చు. కర్ణాటకలో లభించిన రెండు తామ్ర శాసనాలు కోలారు జిల్లాలో లభించాయి. ఈ రెండు శాసనాలు విజయనగర సంగమ వంశానికి చెందిన మొదటి బుక్కరాయలు (క్రీ.శ.1344-1377)కు చెందినవి. గుత్తి రాజ్యానికి చెందిన కోడూరు సీమలోని పెన్న మాగాణికి చెందిన పినాకినీ తీరంలోని బుక్కరాయపురమనే నామాంతరంగల పెంచికలదిన్నె అనే గ్రామాన్ని ఏకభోగ అగ్రహారంగా మొదట బుక్కరాయలు నాచన సోమునికి దానంగా ఇచ్చినట్లు ఈ శాసనాలు పేర్కొంటున్నాయి.ఈ శాసనం నాచన సోమనను ‘మహాకవి’యని, ‘సకలాగమవేది’యని, ‘అష్టాదశ పురాణాల సారం తెలిసిన వాడ’ని ‘అష్ట భాషల్లో కవిత్వంచెప్పే నేర్పుకలవాడ’ని ‘సకల భాషా భూషణుడ’ని, ‘సాహిత్య రసపోషకుడ’ని, ‘సంవిధాన చక్రవర్తి’యని, ‘నవీన గుణసనాధుడ’ని గొప్పగా వర్ణించింది.

తెలుగులో భారత, భాగవతాలకు ఉన్నంత ప్రజాదరణ గల మరో గ్రంధం హరివంశం. ఇందులో కేవలం కృష్ణునికీ, అతని వంశీకులకూ సంబంధించిన కొన్ని కథలు వివరించబడ్డాయి. తెలుగులో హరివంశ కావ్యాన్ని రచించిన వారు ఇద్దరు. ఒక్కరు ఎఱ్ఱాప్రగ్గడ. రెండవ కవి నాచన సోమన. భారతం సంస్కృతం నుంచి అనువాదమైతే, హరివంశం సంస్కృత హరివంశాన్ని అనుసరించి వ్రాసింది మాత్రమే. అది స్వతంత్ర రచన. ఎఱ్ఱన హరివంశాన్ని సంపూర్ణంగా, అంటే పూర్వోత్తర భాగాలుగా వ్రాస్తే, సోమన ఉత్తర భాగం మాత్రమే వ్రాశాడు. అందుకని దానికి ‘ఉత్తర హరివంశం’ అనే పేరు వాడుకయింది. ఎఱ్ఱన ఉత్తరభాగంలో ఉన్న రెండు మూడశ్వాసాల కథను సోమన విడిచివేశాడు. అలాగే, ఎఱ్ఱన వ్రాయని ఒక కథను తను వ్రాశాడు. హరివంశాన్ని భారతం యొక్క పరిశిష్ట భాగంగా భావిస్తారు. అందుకని భారతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, దీనికీ అంత ఉంది. బహుశా, ఆ ప్రాధాన్యతను గుర్తించే ఎఱ్ఱనా, సోమనా హరివంశాన్ని రచించి వుంటారు.

తెలుగు సాహిత్యంలో నాచన సోమన స్థానం ప్రత్యేకమైనది. ఈయన కవిత్రయం తరువాతి కాలం వాడు. శబ్ద రత్నాకర కర్త ఇతన్నీ, ఇతని గ్రంధాన్నీ పరిచయం చేస్తూ “అది మిక్కిలి ప్రౌఢము గానూ, భారతము కంటె ఎల్ల విధముల విశేషించినది గానూ కానంబడుచున్నది. ఇతనిని సర్వజ్ఞుడందురు. అట్లనుటకు సందేహింప బని లేదు” అని అంటాడు. పరవస్తు చిన్నయ సూరి ఐతే “ఘను నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్” అన్నాడు. యుద్ధ వర్ణనలోనూ, రాయబారాలు నిర్వహించిన పట్టుల లోనూ, నాచన సోమన తిక్కన ప్రజ్ఞను పుడికి పుచ్చుకున్నాడని కొందరు పెద్దలు భావించారు.

సోమనకు తిక్కనపై మక్కువ ఎక్కువ. దీనికి నిదర్శనం ఆశ్వాసాంతగద్యమొక నిదర్శనం. తిక్కన మీద ఎనలేని గౌరవంవల్లే ఈయన ఆయన పేరుప్రక్కన తన పేరుండదగిందనీ భారతానంతరం తన హరివంశం చదువదగిందనీ సోమన సూచించాడు. అంతేగాక తిక్కన ఉత్తర రామాయణాన్ని రచిస్తే, ఈయన ఉత్తర హరివంశాన్ని వ్రాశాడు. ఆయన హరిహర నాథుని ఆరాధిస్తే, తాను కూడా ఆ స్వామినే ఆరాధించాడు. సోమన తిక్కన పద్ధతులతో తన కావ్యక్షేత్రంలో స్వేచ్చా విహారం చేశాడు.

‌ అవతారికలో మాత్రమే కావ్య సిద్ధాంతాన్ని చెప్పుకునే సంప్రదాయం ఉంది.దానికి భిన్నంగా నాచనసోమన ఆశ్వాసాంత గద్యల్లో తన కావ్యదృక్పథాన్ని చెప్పాడు.
కావ్య, సాహిత్య శబ్దాలు పర్యాయ
పదాలు. సాహిత్య రసపోషణ' అన్నమాట ద్వారా నాచనసోమన రసపోషణ, సాహిత్యపోషణ అన్న రెండంశాలను
చెప్పాడని విశ్వనాథ సత్యనారాయణ భావించారు.
‌‌తిక్కన 'కావ్యరసం' అన్న మాటను ఉపయోగిస్తే సోమన సాహిత్యరస మన్నాడని కొందరు భావించినా 'పోషణ'అన్నమాట సాహిత్య, రస పదాలను సమన్వయించడంతో
ఇదొక విమర్శ మార్గం అని కొందరువిమర్శకులు భావించారు.
సాహిత్యపోషణ, రసపోషణ అన్నదృష్టితో కోవెల సంపత్కుమారాచార్య విశ్వనాథుని వాక్యం రసాత్మకం కావ్యం,జగన్నాథుని 'రమణీయార్థ ప్రతిపాదన శబ్దకావ్యం'అన్న
నిర్వచనాలకు ముందే భావనాత్మక రచన, రసాత్మక రచన అన్న తేడాను గుర్తించా డన్నారు.
సాహిత్య కళాపోషణ లో కథ వర్ణన, చిత్రణ,భావ, ఆత్మభావ ప్రకటనల నిర్వహణ ఉంటుంది. రసపోషణలో కావ్యమంతా 'రసాత్మకం'గా ఉండదు. రసాన్ని నిర్వహించ వలసిన సందర్భాన్ని గుర్తించి శబ్దార్థాలను రసవంతంగా నిర్వహించాలని ఆయన భావించారు. భావ ప్రధాన రచనలను, రస ప్రధాన రచనలను నాచనసోమన 'సాహిత్య రసపోషణ' అన్నారు.ఈ మాట ద్వారా ఆయన సంస్కృత ఆలంకారికుల కంటే ముందే దీనిని భావించాడని చెప్పవచ్చు.
సంవిధాన చక్రవర్తి అన్న విశేషణాన్ని తన కవితా లక్షణంగా చెప్పాడు. ఆయన 'కథా యోజన' నిర్వహణ విషయాన్ని కుంతకుడి లాగే ప్రతిపాదించాడు.
‌ కథలో వివిధఘట్టాలను, ఘట్టాలలో వివిధాంశాలను వాటి అర్థాన్ని ప్రసన్నం చేసే విధంగా కూర్చడం సంవిధానకం. కథను రుజు,చక్ర పద్ధతులలో నిర్వహించవచ్చు. కథను చక్ర పద్ధతిలో నిర్వహించి నాచన సోమన సంవిధాన చక్రవర్తి అయ్యాడు.
నన్నయ కథాకథనదృష్టి, తిక్కన నాటకీయకథనం కలగలుపుకునికుంతకుడు 'వక్రత'కు దగ్గరగా సంవిధాన చక్రాన్ని కథలోపాటించి, 'అపూర్వకథా సంవిధాన వైచిత్రి' కలిగిన పింగళిసూరనకు మార్గదర్శకు డయ్యాడు. నాచనసోమన 'సంవిధానచక్రం' కథా యోజనమన్న దృక్పథాన్ని ప్రతిపాదించాడు.
నవీన గుణ సనాథుడని చెప్పుకున్న నాచనసోమన దీని ద్వారా రచనాకళకు మార్గదర్శకుడయ్యాడని రాళ్ళపల్లి
అనంతకృష్ణశర్మ భావించారు. గుణము ' ఆలంకారిక పరిభాషకు సంబంధించింది.

కుంతకుడు దేశాన్ని బట్టి నీతులు చెప్పే పద్దతిని కాదని అందుకు భిన్నంగా సోమన రీతులు గుణాల ప్రతిపాదన చేశాడు. కుంతకుని మార్గం ఆలంకారిక మార్గంలో నవీనమైంది. దాన్ని అనుసరించడం ద్వారా నవీనగుణ సనాథుడయ్యాడని కోవెల సంపత్కుమా రాచార్య అభిప్రాయపడ్డారు. విశ్వేశ్వరుని చమత్కార ప్రస్థానం ఆలంకారిక మార్గంలో నవీనం కాబట్టి సోమన దాన్ననుసరించడం ద్వారా నవీన గుణ సనాథుడుగా తననుసంబోధించుకున్నాడని జి.వి.సుబ్రహ్మణ్యం భావించారు.
రచనా కళ, కుంతకుని రీతి, గుణమార్గం, విశ్వేశ్వరుని చమత్కార ప్రస్థానాల్లో నాచనసోమన విషయంలో ఏదిఅనుకూలమని భావించినా 'నవీనత్వం' ఉన్నదన్నది స్పష్టం. ఈ
నవీనత్వాన్ని తన కావ్య దృక్పథంగా నాచనసోమన రచనా నిర్వహణ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని సాహిత్యరసపోషణ,
సంవిధాన చక్రవర్తి, నవీనగుణసనాథ అన్న మాటలను ప్రయోగించాడని తెలుస్తుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s