గల్లా చలపతి 15.7.1948న వెంకటమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య కడప జిల్లా రైల్వే కోడూరులో చదివారు. నెల్లూరులో డిగ్రీ, తిరుపతిలో పి.జి. చేశారు. గల్లా చలపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలోని తెలుగు శాఖలో ఇరవైఎనిమిది సంవత్సరాలు లెక్చరరుగా, అసోసియేట్ ప్రొఫెసరుగా, ప్రొఫెసరుగా, శాఖాధ్యక్షులుగా, పి.జి. పాఠ్యప్రణాళికా సంఘ అధ్యక్షులుగా పనిచేసి ఆచార్యులుగా పదవీ విరమణ చేశారు. సంస్కృతం లోను, చరిత్రలోను కూడా వీరు ఎం.ఏ. డిగ్రీలు పొందారు. 'ఎపిగ్రఫీ'లో (శాసన శాస్త్రం)లో విశేషంగా కృషి చేశారు. విద్యార్థులకు కొన్ని సంవత్సరాల పాటు ఎపిగ్రఫీ బోధించారు. కొన్ని శాసనాలను సంపాదించి పరిష్కరించి ప్రకటించారు. ఇప్పటివరకు వీరు ప్రచురించిన గ్రంథాలు 15. వీటితోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి పోతన భాగవతం ఏకాదశ, ద్వాదశ స్కంధాలను పూర్తిగా, తృతీయ స్కంధంలో కొంత భాగానికి వ్యాఖ్యానం రాశారు.50కి పైగా పరిశోధన పత్రాలు వుంటాయి.
ప్రచురింపబడిన వీరి గ్రంథాలు-1. కవికర్ణ రసాయనం విశిష్టాద్వైత సమన్వయం (సిద్ధాంత గ్రంథం), 2. ప్రేమ- తాత్త్విక పరిశీలన(సృజనాత్మక విమర్శ), 3. సారంగపాణి పదాలు
(పరిష్కరణ), 4. శ్రీవివేకానంద సాహిత్య సర్వస్వం
(అనువాదం). 5. కరపత్రాలు- చరిత్ర శకలాలు(పరిశోధన),
6. తరతరాల తెలుగు వారి మతాచారవిశేషాలు (సంస్కృతి), 7. వ్యాసభండారం (విమర్శవ్యాసాలు), 8. మహాభారతేతివృత్త సినిమాలపై జానపద సాహిత్య ప్రభావం (పరిశోధన), 9. సాహిత్యసురభి (సంపాదకత్వం), 10. పద సాహిత్య వైభవం
(విమర్శ), 11. వింశతి (విమర్శ వ్యాసాలు).12. అన్నమాచార్య చరిత్ర-వ్యాఖ్యానం (విమర్శ), 13.సారంగపాణి పదాలు (విస్తృత ప్రతి). 14. దక్షిణ దేశీయ పదసాహిత్యం 15.తిరు మలప్ప పై ఇప్పటి కవులు,
‌‌ వ్యాసభండారం వీరి మొదటి విమర్శనాత్మక వ్యాస
సంపుటి. ఇందులో మొత్తం పద్నాలుగా - వ్యాసాలున్నాయి.
వీటిల్లో కూడా చారిత్రక, సాంస్కృతిక, పద సాహిత్య జానపద
ఆధునిక కవిత్వ సంబంద వ్యాసాలున్నాయి. ఒకటి మాత్రం
నిఘంటువులకు సంబంధించింది. చలపతిలోని బహుమునీత
ఈ వ్యాసభండారంలో కనిపిస్తుంది. ఆధునిక కవుల్లో కొన్ని
భ్రమలున్నాయి. గొప్ప కవులు కావడానికి, ప్రాచీన కావ్యాలు
చదవడానికి ఏమాత్రం సంబంధం లేదని చాలామంది
అనుకుంటారు. పాతకావ్యాల భాష, ఛందస్సు అందుకోవడానికి
చాలా శ్రమపడాల్సి వస్తుంది. వ్యాకరణాన్ని అధ్యయనం
చెయ్యాల్సి ఉంటుంది. తమ అనుభూతుల్ని స్వేచ్చగా
వ్యక్తీకరించడానికి అవన్నీ ప్రతిబంధకాలని వాళ్ళ ప్రగాఢ
విశ్వాసం. పర్యవసానంగా మన వారసత్వం గురించి మనం
తెలుసుకోలేని స్థితికి చేరుకున్నాం. ప్రాచీన కావ్యాలు ముడి
నరుకులాంటివి. సంయమనం, అధ్యయనం లేకుంటే తెలుగు
కవిత్వం సార్వకాలికతను కోల్పోతుందన్న యథార్థాన్ని ప్రతి
వ్యాసమూ నొక్కి వక్కానిస్తోంది.
అన్నమాచార్యుల సంకీర్తనా వైభవాన్ని చక్కగా మదింపు
చేసిన విమర్శ గ్రంధం పదసాహిత్య వైభవం.దాదాపు
నాలుగు దశాబ్దాలుగా సాహితీరంగంలో విశేష కృషి చేసిన
వీరి అనుభవం ప్రతి వ్యాసంలోనూ కనిపిస్తుంది. ఏదైనా ఒక
అంశాన్ని కూలంకషంగా చర్చించడం ఒక విశేషమైతే,
అక్కడితో ఆగకుండా మౌలికమైన ప్రతిపాదనలను చేయడం
మరో విశేషం. ఒక విషయాన్ని పూర్తిస్థాయిలో పరిశోధించా
లంటే విమర్శకుడికి ఎన్ని చూపులుండాలో తెలియచేసిన
వ్యాసాలివి. తాళ్ళపాక కవుల సాహిత్యపు విలువలు,ఆ
కాలంలో వారి ప్రత్యేకత ఈ గ్రంథంలో కనిపిస్తున్నాయి.
వింశతి వీరి మరొక పరిశోధనాత్మక వ్యాససంపుటి. ఈ
గ్రంధం ఏదో ఒక సాహిత్య ప్రక్రియకో, ఒక కవికో, ఒక
కావ్యానికి పరిమితమైంది కాదు. బహముఖీనమైన, వైవిధ్య
భరితమైన పరిశోధనా ప్రాధాన్యం గల వ్యాసాలున్న గ్రంథమిది.
ఇందులోని ఇరవై వ్యాసాలు ప్రసంగవశాత్తు శోధించి
సాధించినవే. వీరి నిశిత పరిశీలన, నూతనాంశ వ్యక్తీకరణ,
విశ్లేషణ విమర్శకులకు, పరిశోధకులకు మార్గనిర్దేశం
చేస్తాయి. చలపతి సృజనాత్మక పరిశోధనను లోకానికి
వెల్లడించి వారిని లలిత సాహిత్య విమర్శకుడుగా నిలబెట్టిన
గ్రంధం ప్రేమ తాత్విక పరిశీలన.ఆలోచన కోసమే కళనుగానీ
కవితనుగానీ ఆలంబనగా ఎన్నుకోనే ప్రవృత్తి వారిది. ఆలోచనను కూడా లయాత్మకంగా వ్యక్తీకరించడం ఈ విమర్శ
గ్రంథంలో కనిపిస్తుంది.
‌‌ విమర్శకునిగా చలపతి ఒక విలక్షణ మార్గంలో నడిచాడు. ఏమిటా ప్రత్యేకత అంటే, ఒక పద్య రచన చేసిన కవిలో గాని, సృజనాత్మక వచన రచయితలో గాని, ఆ రచనలో ఆ రచయిత వ్యక్తిత్వముద్ర ఏమిటి? అతనిలోసంఘర్షించే ఆధ్యాత్మిక, అనుభావిక స్పందనలేమిటి? అనిఅన్వేషించడం. ఈ లక్షణం అటు సంప్రదాయ ఆలంకారికమార్గంలో గానీ, ఇటు ఆధునిక విమర్శలోగానీ లేదు.
కట్టమంచి, పింగళి, రాళ్ళపల్లి వంటి విమర్శకులు స్పృశించిన విమర్శ ధోరణిని చలపతి స్వకీయ ప్రజ్ఞతో సుసంపన్నం చేశాడు. ఆయన వ్యాసాలన్నీ ఇందుకు తిరుగులేని సాక్ష్యాలే. అంటే, ముందే తానొక విమర్శ మార్గాన్ని సిద్ధాంతపరంగా కొలబద్దగానో, చేతిబెత్తంగానో ధరించి "మార్కులు', 'గ్రేడింగులూ' వేయడం కాకుండా - ఒక వ్యక్తి చేసిన రచనలనే ప్రాతిపదికగా చేసి, అతని అంతరంగపు ముడుల్ని విప్పి చెప్పే ప్రయత్నం చేశాడు చలపతి.
స్పష్టమైన తాత్త్విక భూమిక ఈయన వ్యాసాల విమర్శక
కుదురు. చలపతి సాహిత్య విమర్శలో కావ్యజ్ఞత, లోకజ్ఞత,
శాస్త్రజ్ఞత ప్రధానంగా కనిపిస్తాయి. నిష్పక్షపాత దృక్పథంలో
కూడ కొంత ఊగిసలాట ఉంటుంది గాని సత్యదృక్పథంలో
ఊగిసలాటకు, వక్రభాష్యానికి, ద్వెధీభావానికి తావేలేదు. ఈ
సత్యదృష్టి మాత్రం చలపతికి భారతీయ సనాతన ఆర్ష ధర్మ
దర్శనం వల్లే కలిగింది.
గల్లా చలపతి విమర్శ స్వరూపం మూడు రకాలుగా
గోచరిస్తుంది. 1. ఆకృతి 2. ఆలోచన 3. అనుభవం.

 __ రమాంజని
            (సేకరణ:పిళ్లాకుమారస్వామి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s