Kinnera sridevi

రాయలసీమ వెయ్యేళ్ళ సాహిత్య చరిత్రలో కథాసాహిత్య చరిత్ర 1918 లో ప్రారంభమైతే, రాయలసీమ స్త్రీ రచయితల కథా ప్రస్థానం 1927 నుండి మొదలైంది.నిజానికి 1926 లో కస్తూరి వెంకట సుబ్బమ్మ (అనంతపురం) 'కథామంజరి ' పేరుతో పౌరాణిక వస్తువుతో ' బలిచక్రవర్తి చరిత్రం ', ' భీష్మోదయం ', ' గరుడ చరిత్రం ' కథలు
రాశారు. కానీ ఇవి ఆధునిక జీవితాన్ని చిత్రించిన కథలు కాకపోవడం వలన కథానిక ప్రక్రియగా అంగీకరించవలసిన పని లేదు. 1927 సంవత్సరంలో చిత్తూరు జిల్లా నుండి
మామిడి రుక్మిణమ్మ, కడపజిల్లా ప్రొద్దుటూరు నుండి కథలు రాసిన పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ ఆనాటి సమకాలీన సామాజిక సమస్యలను వస్తువుగా స్వీకరించి ' సీతాబాయి,
సుందరి, అత్తగారు రేడియో తెలుసుకొంటిరా ' అనే కథలను ' భారత కథానిధి ', ' సాధన ',' భారత జ్యోతి ' పత్రికలలో ప్రచురించారు. ఆధునిక జీవితాన్ని ప్రతిబింబించేట్లుగా వరకట్న
సమస్యను, ప్రేమ వివాహాలను తమ కథల్లో చిత్రించారు. కొంతమంది రాయలసీమ తొలి స్త్రీ రచయితలు ఆధ్మాత్మిక జీవిత నేపథ్యంలోంచి భక్తి ప్రధానమైన ఇతివృత్తాలనే
కథావస్తువుగా చేసుకున్నారు. పురాణ కథా వస్తుసముదాయం నుండి ఆధునిక జీవితంలోకి పర్యవసించే క్రమం రాయలసీమ కథా రచయిత్రుల రచనల్లో గమనించవచ్చు. ముఖ్యంగా
“సీతాబాయి ' రచయిత పూండి చెల్లమ్మ స్త్రీల మానసిక స్థైర్యానికి, ఆచరణకు ప్రతిఫలనరూపంగా కథారచన చేయగలిగారు. ఆమెను ప్రత్యేకంగా అభినందించాలి.
రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంత కథలకు దీటుగా వెలువడుతూ వచ్చింది. 1918 ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించిన
రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని శక్తివంతంచేసే కృషిలో భాగమయ్యారు. ఈ ఆరు దశాబ్దాల కృషిలో సింహభాగం పురుషులదే అయినప్పటికీ, స్త్రీల పాత్రను నిరాకరించటానికి వీల్లేదు. ఎందుకంటే రాయలసీమ, జిల్లాలలో పదులకొద్దీ వున్న స్త్రీ రచయితలు గణనీయమైన సంఖ్యలోనే కథారచన చేశారు. ఈప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళేగాక ఈ ప్రాంతానికి ఉద్యోగరీత్యా వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి వైయక్తిక, సామూహిక కృషి ఫలితంగాసీమ సాహిత్యంలోని స్త్రీల కథా సాహిత్యం పరిగణింప దగిన స్థాయిలోనే రూపొందింది.
నిజానికి రాయలసీమలో రచయితలు గతమూడు దశాబ్దాల నుండే ఎక్కువగా రాయటం కనిపిస్తుంది. వీరి రచనలలో పురుష రచయితలు తీసుకున్న వస్తువులతో పాటు, వాళ్ళకు సాధ్యపడని, స్త్రీలు మాత్రమే రాయగలిగిన, విశ్లేషించ గలిగిన అంశాలు కూడా ప్రతిఫలించాయి.

రచనల ప్రమాణాన్ని (quality) కేంద్రం చేసుకొని విశ్లేషించటం మామూలుగా అవసరమే అయినప్పటికీ, స్త్రీల విషయంలో ఈ సూత్రానికి కొంత మినహాయింపు అవసరం. ఎందుకంటే, స్త్రీలు శతాబ్దాలుగా రచనా రంగం నుంచి అప్రకటిత నిషేధాల ద్వారా దూరం చేయబడ్డారు. ఆధునిక యుగంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిందనడానికి ఆస్కారమేమీ లేదు. అటువంటి వాతావరణంలో, భూస్వామ్య సంస్కృతి కలిగిన రాయలసీమ లో అసలు స్త్రీలు రచన చేయటమే విశేషం. అందువలన వీరి రచనలను రేఖా మాత్రంగానైనా స్పృశించడం అవసరం ఉంది.
రాయలసీమ సాహిత్య చరిత్రను పరిశీలించి
నపుడు లేక ఆ చరిత్రను గ్రంథస్థం చేసే సంకలనాలను విశ్లేషించినపుడు, ఈ విషయంలో స్త్రీలు ఎంత విస్మరణకు గురయినారో చాలా స్పష్టంగా అవగతమవుతుంది. చరిత్ర లోతుల్లో కెళ్ళకుండానే ఇటీవలి కాలంలో వెలువడిన సంకలనాలలోనూ స్త్రీలు విస్మరింపబడినారు.ఉదాహరణకు 2004 సంవత్సరంలో నూకా రాంప్రసాద్ రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన " సీమ కక్ష్యల కథలు" లో కూడా కేవలం ఒక స్త్రీ రచయిత మాత్రమే కనిపిస్తుంది.నిజానికి అప్పటికే ఐదారుగురు పైగా శక్తివంతంగా రాయగలిగిన స్త్రీ రచయితలు వున్నారు.ఆ సంకలనం ప్రధానంగా ఫ్యాక్షన్ సంబంధిత ఇతివృత్తాలకు కేటాయింపబడింది. ఆ వస్తువును పురుష రచయితలే కాక స్త్రీలు కూడా స్వీకరించారు. ఉదాహరణకు ఆర్.శశికళ రాసిన “కలుపు మొక్కలు” అనే కథ. ఫ్యాక్షనిజం పిల్లల ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో సోదాహరణంగా నిరూపించిన కథ. ఆ కథకు పై సంకలనంలో
చోటు దొరకలేదు.
2006 సంవత్సరంలో ప్రచురించబడిన “రాయల సీమలో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ " చేసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య లాంటి సామాజిక విమర్శకుని దృష్టికి కూడా అందలేదు. సీమ సాహిత్యానికి స్త్రీలు చేసిన కృషి గురించి ఆయన విశ్లేషించలేదు. స్త్రీలను విస్మరించిన ఈ క్రమం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని అనుకోవటం అమాయకత్వమే అవుతుంది.
దాదాపు ముప్ఫై మంది మహిళా రచయితలు రాయలసీమ ప్రాంతంలో వున్నప్పటికీ వాళ్ళందరి రచనలు అందుబాటులో లేవు. అందువలన కొంతమంది రచనలను మాత్రమే పరిశీలించటం జరిగింది.
రాయలసీమ కరువు వలన రాయలసీమ స్త్రీలు ఎలాంటి కొత్త సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చిందో తెలియజేసే అనేక కథలు ఇక్కడి మహిళా రచయితలు రాశారు.రాయలసీమ స్త్రీలు మిగిలిన ప్రాంతాల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొంటూనే రాయలసీమ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకంగా ఉన్న సమస్యలను అదనంగా ఎదుర్కొంటున్నారు. ఈ అదనపు సమస్యలను ఆర్. శశికళ తన “డ్రాపవుట్ " లో శక్తివంతంగా ప్రతిఫలింపజేశారు. “డ్రాపవుట్ " అంటే " స్కూల్ డ్రాపవుట్ " అన్న అర్ధమే వస్తుంది. ఆడపిల్లల జీవితం చదువుకోవడంలోనే వారికి రక్షణ, పోషణ దొరుకుతుందన్న వాస్తవాన్ని ఈ కథలో తెలియజెప్పడమే కాక చదువు మానేసిన ఆడపిల్లలు చదువు నుండే కాక అసలు వాళ్ళ జీవితం నుండే" డ్రాపవుట్ " అవుతారన్న అర్థంలో అమ్మాయిల చదువును సమర్థిస్తూ రాసిన కథగా కూడా చెప్పవచ్చు.“డ్రాపవుట్" కథతోపాటు “అనంతగాయం " అనే కథలో కూడా ఎయిడ్స్ వ్యాధి వలన కుప్పకూలిపోతున్న జీవితాలను సామాజిక, ప్రభుత్వ సంస్థల ఆసరాతో అర్థవంతంగా,ఆశావహంగా నడిపించుకునే అవకాశం వుందన్న ఊరడింపును అందించే ప్రయత్నం చేశారు. రాజ్యహింస పట్ల చాలా స్పష్టమైన వైఖరితో" అంతా ప్రశాంతం " కథలో ప్రభుత్వయంత్రాంగానికున్న ద్వంద్వ వైఖరిని స్పష్టంగా చెప్పిన రచయిత, ' అనంతగాయం ' కథలో ప్రభుత్వ సంస్థలు, సామాజిక సంస్థలు అందించే సహాయ కార్యక్రమాలను సమర్థించటం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది.
జి. నిర్మలా రాణి" గాజుకళ్ళు ' పేరుతో 2003 లో కథా సంకలనాన్ని ప్రచురించారు. పదేళ్ళనుండి కథలు రాస్తున్నారు. రాయలసీమ నుండి కథలు రాస్తున్న సీనియర్ రచయితగా ఈమెను చెప్పవచ్చు. ఈమె రాసిన అన్ని కథలూ స్త్రీలకు సంబంధించినవే. ' కాటేసిన కరువు ' కథ అనంతపురం జిల్లాలో వరుస కరువులతో వ్యవసాయ రంగంలో వచ్చిన సంక్షోభాలను, దాని పర్యవసానాలను, తత్ఫలితంగా, గ్రామీణ స్త్రీల స్థితిగతుల్లో వచ్చిన పరిణామాన్ని ఆవిష్కరించింది. నిర్మలారాణి కరువు నేపథ్యంలోనే కాక స్త్రీ పురుష సంబంధాల్లోని అసమానతలను 'వికసించిన అంతరంగం' 'ఎంతెంత దూరం, రిగ్రెట్స్, బొమ్మల పెళ్లి ,మండే అంతరంగం, కొత్త స్పర్శ ,మామూలు కథ కాదు, మలుపు కథల్లో ప్రతిఫలింప చేశారు. మానవత్వం కథ పేదవారికి పేదవారే ఆసరా కాగలరన్న వాస్తవాన్ని చెప్పిన కథ.వికసించిన అంతరంగం కథలో నిర్మలారాణి ఉద్యోగం చేసి ఆడవారి అవసరాన్ని వివరిస్తూ వంట పనిలో ఇంటిపనిలో మగవారుకూడా ఆడవారితోపాటు పాలు పంచుకోవడంలో తన భర్తపట్ల తన అత్త, ఆడపడచుల ప్రవర్తనకు - తన తమ్ముడి భార్యపట్ల - తన ప్రవర్తనకు ఏ మాత్రం తేడా కనిపించక పోవటంతో తన తప్పు తాను తెలుసుకోగలుగుతుంది. ఆడవాళ్ళు తమ దాకా వస్తే, ప్రవర్తించే తీరులో ఉన్న బేధాన్ని, కుటుంబ జీవితంలోని సంక్లిష్టత పాఠకులకు ఈ కథలో అవగత మౌతుంది. స్త్రీపురుషుల మధ్య సమానంగా శ్రమ విభజన జరగాలన్న డిమాండు కూడా ఈమె కథల్లో వ్యక్తమౌతుంది.
జయలక్ష్మి రాజు కర్నూలు జిల్లాలో పుట్టి అనంతపురంలో వుంటున్నారు. ఈమె రాసిన “పొగబండినేస్తం" సంకలనంలో కథలు, మినీకథలు స్కెచ్ లు మొత్తం 26 ఉన్నాయి. దాదాపు అన్ని కథలు కూడా ఆరోగ్యకరమైన హాస్యాన్ని గుప్పిస్తూ కాలక్షేపం కోసం రాశారనిపిస్తుంది. ఈమె ఎంత సరదా కథలు రాసినా ఈ సంకలనంలో 'పిచ్చితల్లి', 'ఇది కథకాదు' అన్న సీరియస్ కథలు కూడా వున్నాయి. "ఇది కథకాదు" కథ రాయలసీమ కరువును ప్రధాన ఇతివృత్తంగా తీసుకొన్న కథ. కరువువలన కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంలోని స్త్రీలు అవమానాలకు, అత్యాచారాలకు ఎలా గురికావలసి వస్తుందో ఈ కథలో చెప్పారు. అయితే రాయగలిగే సామర్థ్యం వుండి కూడా సమాజంలో ఉన్న సీరియస్ సమస్యలను పట్టించుకోక పోవడం ఆశ్చర్యం! ఈమె స్త్రీల సమస్యల పట్ల తాత్విక దృక్పథంతో రాయాల్సిన అవసరం వుంది.
కుడాల లక్ష్మి అనంతపురంలో వుంటున్నారు. ఈమె రాసిన ' నిరీక్షణ ', ' నిర్ణయం ',' అద్దం ' కథల్లో మానవ సంబంధాలు వుండాల్సిన తీరును గురించి ప్రతిపాదన చేశారు.ఈమె కథలు మనుషులు ఎలా వుండాలో, ఎలా వుండకూడదో తెలియజేస్తాయి. మధ్యతరగతి స్త్రీలు చాలీచాలని ఆదాయంతో సంసారాలను నడిపేతీరు, ఇరుగుపొరుగు స్త్రీలతో స్నేహం,కలుపుగోలు తనంతో ఒకరికి ఒకరు ఆసరాగా నిలబడే వైనం, సఖ్యత, దాంపత్యంలో అన్యోన్యత ఈమె కథావస్తువులు. కుటుంబ జీవితంలోని ఒడిదుడుకులను positive approach తో చూస్తుంది. పరిష్కరించుకునే క్రమం లక్ష్మి కుడాల కథల్లో అద్దం పడతాయి. మనుషుల్లోని మంచిని మాత్రమే ఆవిష్కరించడం లక్ష్మి కథల్లోని మంచి లక్షణం.
డా॥కొలకులూరి మధుజ్యోతి ఇటీవల కాలంలో కథలు రాస్తున్నారు. నాస్టాల్టిక్ గా కథను చిత్రించటం ఈమె రాసిన మూడు కథల్లోనూ ప్రతిబింబిస్తుంది. “అమ్మమ్మ అప్పగింత " కథ ఎపుడో చనిపోయిన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ అప్పగింతల రూపంలో కథకురాలు అమ్మపట్ల తనకున్న ప్రేమను, అవగాహనను, బాల్యంలో ఆమె తల్లి కురిపించిన ప్రేమను, తన తండ్రికి తనతల్లి పట్ల గల వాత్సల్యాన్ని ఆవిష్కరిస్తే, రెండో కథలో తన కొడుకుపట్ల తనకుగల మాతృవాత్సల్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ రెండు రకాల ఎక్స్ ప్రెషన్స్ లో ఉన్న తేడా చాలా సున్నితమైంది.

ఆర్. వసుంధరాదేవి చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతంలో స్థిరపడ్డారు. తెలుగులో తాత్విక స్పర్శతో కథలు రాసిన రచయితలు చాలా తక్కువ. నిజానికి తాత్విక స్పర్శ ఎక్కువ సందర్భాల్లో పఠనీయతని దెబ్బతీయటం జరుగుతుంది. రచయితకుఎంతోసహనం, సంయమనం వుంటే తప్ప ఆ స్థితినుంచి కథనుకాపాడుకోగలగటం సాధ్యంకాదు. వసుంధరాదేవి కథల్లో ఈ సంయమనం చాలా ఎక్కువగానే వుంది.అందువలనే ఆమె తాత్విక కథలు సిద్ధాంత చర్చల్లా కాకుండా కథలుగానే మిగిలాయి.అస్తిత్వ వాద కథల్లో పాత్రలు తమ చుట్టూ వున్న, తమను నిరంతరం నిర్దేశిస్తున్న సమాజ భారాన్ని భరించలేని స్థితిలో ఆవేదన చెందుతాయి. ఆ ఆవేదనను ఈ కథలోని సంభాషణలు వ్యక్తం చేస్తాయి.

యం.కె. దేవకి అధ్యాపక పరిశోధన బాధ్యతల్లో వుంటూనే, ' మంటల ఒడిలో ',ముళ్ళదోవ ' అన్న రెండు కథా సంకలనాలను ప్రచురించారు. గ్రామీణ, మధ్యతరగతి జీవితంలోని మోసపూరిత విలువల్ని ఎండగడుతూ, మానవత్వాన్ని, ప్రతిపాదించడం ఈమె కథల మౌలిక స్వభావం. ఈమె దృష్టిలో సమాజం అంటే మంచితనం మాత్రమే కలిగిన మనుషుల సమూహం. అందుకే దేవకి మనిషిని కేంద్రంగా చేసుకొని రచనలు చేయడం కనిపిస్తుంది. మనిషిలోని మంచి చెడ్డలకు, సుఖ దుఖాలకు మనిషినే బాధ్యులను చేయడం కనిపిస్తుంది. సమాజంలోని వర్గస్వభావం కథల్లో కనబడదు. ఆదర్శీకరించబడిన మానవత్వం ఈమె కథల్లో కనబడుతుంది. మనుషుల్లో వుండే ఔదార్యగుణమే ఈ సమాజాన్ని నడిపిస్తుందని రచయిత నమ్మకం. రచయిత అధ్యాపకురాలవటం మూలాన ప్రతిదాన్ని విడమరచి చెప్పటం చాలా కథల్లో కనబడుతుంది. ఉదాహరణకు ' పెరుమాళ్ళకెరుక ' అనే కథలో హాస్పిటల్ లో చేరిన స్నేహలత వంటమనిషిని చంపడానికి వెళ్ళిన పుడు,స్నేహలత వాళ్ళింట్లో గుడ్డలు ఇస్త్రీ చేసే ఓబులమ్మ ఆమె వంటమనిషి కాదని ఆమె స్నేహలత అత్తని తెలియజేయడం తోనే కథను ముగించినట్లయితే, కథలో పటుత్వం సన్నగిల్లేది కాదు. కానీ కాలనీ వాసులంతా కలసి ఆ విషయం పైన తమకు కలిగిన విస్మయాన్ని ,దానిపైన వ్యాఖ్యానాలను అన్నీ చేర్చడం వలన కథనం పేలవంగా తయారయింది.

యం.ఆర్.అరుణకుమారిచిత్తూరుజిల్లాలోఉపాధ్యా యురాలిగా పనిచేస్తున్నారు.ఈమె రెండు కథా సంకలనాలను వెలువరించారు. ఈమె కథల్లోని స్త్రీ పాత్రలు చాలా అభ్యుదయంగా ఆలోచిస్తాయి. ప్రేమ పెళ్ళి పట్ల అరుణకుమారికి వున్న స్పష్టమైన అవగాహన ఫలితంగానే ఈమె కథల్లోని స్త్రీ పాత్రలు అంత వ్యక్తిత్వంతో వ్యవహరించగలుగుతాయి. " అడవిపూలు" కథలోని కాళి పాత్ర కూడా పాతతరానికి చెందిన యువతైనా తనకు జరిగిన మోసాన్ని ఎదిరించే చైతన్యం ఆమెకు లేక మౌనంగా వుంటుందేకానీ, నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినపుడు, నమ్మించి మోసంచేసి పారిపోయిన వాణ్ణి స్వీకరించడానికి సిద్ధపడక తానే స్వచ్ఛందంగా శేఖరాన్ని తిరస్కరిస్తుంది. అరుణ తన అన్ని కథల్లో కూడా ముగింపు విషయంలో పాఠకులు ఊహించలేని కొసమెరుపులతో, స్త్రీ పాత్రలను ఉన్నతీకరిస్తారు. ఈ విషయాలను పరిశీలనలోకి తీసికొన్నపుడు, ఈమె పితృస్వామ్య వ్యవస్థ స్వరూప స్వభావాలను మరింత లోతుగా అధ్యయనం చేసినట్లయితే, భవిష్యత్తులో మంచి స్త్రీవాద రచయిత అవగలరనిపిస్తుంది.
డా॥కొలకులూరి మధుజ్యోతి ఇటీవల కాలంలో కథలు రాస్తున్నారు. నాస్టాల్టిక్ గా కథను చిత్రించటం ఈమె రాసిన మూడు కథల్లోనూ ప్రతిబింబిస్తుంది. “అమ్మమ్మ అప్పగింత"
కథ ఎపుడో చనిపోయిన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ అప్పగింతల రూపంలో కథకురాలు అమ్మపట్ల తనకున్న ప్రేమను, అవగాహనను, బాల్యంలో ఆమె తల్లి కురిపించిన ప్రేమను, తన తండ్రికి తనతల్లి పట్ల గల వాత్సల్యాన్ని ఆవిష్కరిస్తే, రెండో కథలో తన కొడుకుపట్ల తనకుగల మాతృవాత్సల్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ రెండు రకాల ఎక్స్ ప్రెషన్స్ లో ఉన్న తేడా చాలా సున్నితమైంది.

రాయలసీమలోని ఈ మహిళా రచయితల
మధ్య కొన్ని అంతరాలు, ప్రత్యేకతలు వున్నప్పటికీ, స్థూలంగా ఈ ప్రాంత మహిళా రచయిత లందరూ ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక సమస్యలను సంక్షోభాలను సాహితీ కరించారు. వీళ్ళ రచనల్లో సార్వత్రిక లక్షణాలు కొన్ని ఉన్నప్పటికీ, ఈ ప్రాంత సాహిత్యం ప్రధానంగా అత్యంత ప్రాంతీయ ముద్రతో ఉందని తెలుస్తుంది.
స్త్రీల రచనల్లో ప్రధానంగా కరువు, స్త్రీలరవాణా
(traficking), ఎయిడ్స్ (aids), బాల్యవివాహాలు, వలసలు, వేశ్యావృత్తి, కరువుదాడులు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యవసాయదారులు కూలీలుగా మారిపోయిన వైనం, మానవత్వం విచ్ఛిన్నమౌతున్న క్రమం, కుటుంబ సంబంధాలు అందులో ఉన్న సమస్యలు, మధ్యతరగతి జీవితంలోని ఒడిదుడుకులు, లైంగిక వేధింపులు వ్యాపారంగా పరిణమించిన విద్యావ్యవస్థ, తత్ఫలితంగా ఉత్పన్నమైన సమస్యలు వాటి పర్యవసానంగా జరుగుతున్న ఆత్మహత్యలు, గిరిజన, ముస్లింస్త్రీల సమస్యలు, ఆదర్శీకరించబడిన మానవీయ విలువలు, ఆధునిక సంస్కార సంపర్కం ఫలితంగా రూపుదిద్దుకుంటున్న కొత్త విలువలు,
స్త్రీల జీవితాలపై వాటి ప్రభావాలు, సంప్రదాయ విలువల పై దాడిచేస్తూ ప్రత్యామ్నాయ విలువలు రూపుదిద్దుకునేందుకు ముందుకు వస్తున్న నూతన ప్రతిపాదనలు, జీవన శైలులు
వంటి అంశాలు రాయలసీమ స్త్రీల కథల్లో మౌలికమైన అంశాలుగా చిత్రీకరించబడినాయి.

ఇకముందు కూడా రాయలసీమ స్త్రీ రచయితలుఈ క్రమాన్ని కొనసాగిస్తారని మనకనిపిస్తుంది. అయితే, వీరంతా మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంది. తద్వారా వాళ్ళ రచనా వికాసానికి దాని ఫలితంగా మొత్తం రాయలసీమ సాహిత్య వికాసానికి దోహదం కాగలరు.
___కిన్నెర శ్రీదేవి
      ‌‌                       (సేకరణ: పిళ్లా కుమారస్వామి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s