పైడి లక్ష్మయ్య ఏప్రిల్ 26, 1904 తేదీన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో పేరూరి అచ్చంపల్లి గ్రామంలో ముసలప్ప, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య ముగించి అనంతపురంలోని దత్తమండల కళాశాలలో 1932లో తెలుగు ప్రధానాంశంగా బి.ఏ. డిగ్రీ పొందారు. మద్రాసులో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1937లో న్యాయవాదవృత్తిని స్వీకరించాడు.
వీరు స్థానిక పరిపాలనా రంగంలో ప్రజా ప్రతినిధిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.1942 నుండి 1947వరకు అనంతపురం జిల్లా బోర్డు అధ్యక్షులుగా వుండి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. 1952 సంవత్సరంలో అనంతపురం లోకసభ నియోజకవర్గం నుండి మొదటి లోక్సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. పార్లమెంటులో వివిధ విషయాలపై చర్చలలో పాల్గొని నిర్మాణాత్మకమైన సూచనలు చేసి ఉత్తమ రాజకీయవేత్తగా పేరుపొందారు.1956లో రష్యా దేశంలో పర్యటించి భారతదేశంలో వ్యవసాభివృద్ధికి కొన్ని సూచనలు ఇచ్చారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యులుగా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యులుగా వుండి ఉన్నత విద్యావ్యాప్తికి తమవంతు కృషి చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1957లో వీరిని హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖకు కమీషనరుగా నియమించారు. ఆ కాలంలో వివిధ దేవాలయాల పునరుద్ధరణకు కృషిచేశారు. ముఖ్యంగా శ్రీశైలంలో ఆలయ, మండపాదుల పునర్నిర్మాణానికి ఎంతో కృషిచేశారు. శ్రీశైల దేవస్థాన పాలకమండలి అధ్యక్షులుగా కూడా కొంతకాలం పనిచేశారు. అనంతపురం జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. వీరుమార్కండేయ విజయం,మహాత్మ, కబీర్, సంసార నౌక,సాయి లీలలు హేమారెడ్డి మల్లమ్మ లేక శ్రీశైలమల్లికార్జున మహాత్మ్యము,శ్రీశైలీయము, శ్రీరామాశ్వమేధము,లుబ్ధాగ్రేసర తారాశశాంక, శ్రీ సోమనాథ శతకము, నా జ్ఞాపకాలు - వ్యాపకాలు, మొదలైన వాటిని రచించారు.
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వీరికి కళా ప్రపూర్ణ గౌరవం ఇచ్చి సత్కరించింది. కవిచకోరచంద్రోదయ అనే బిరుదును శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ప్రదానం చేశారు. వీరు ఏప్రిల్ 28, 1987లో పరమపదించారు.