ఎద్దుల ఈశ్వర రెడ్డి

పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు త‌ప్ప అనే కార్ల్ మార్క్స్ స్ఫూర్తిదాయ‌క పిలుపు కోట్లాది ప్ర‌జ‌ల బానిస బ‌తుకుల విముక్తికి దారి తీసింది. మార్క్స్ ఇచ్చిన పిలుపునందు కుని ప్ర‌పంచ వ్యాప్తంగా అణ‌చివేత‌కు గురి అవుతున్న కార్మిక‌, క‌ర్ష‌క లోకం పిడికిలెత్తి క‌ద‌న రంగంలోకి దూకింది. చావోబ‌తుకో తేల్చుకునేందుకు వీరోచిత పోరాటాలకు ప్రేర‌ణ‌గా నిలిచారు మార్క్స్‌.

నిస్వార్థప్రజాసేవ,నిరాడంబరత, త్యాగశీలత ఎద్దుల ఈశ్వర‌రెడ్డి జీవితాన్ని తిరిగేస్తే క‌నిపించే గుణాలు. సంపన్న కుటుంబంలో జ‌న్మించినా కష్టజీవుల పక్షపాతిగా, మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడిగా, బ్రహ్మచర్య జీవితాన్ని పాటించి ప్రజా సేవ‌లో గ‌డిపిన మ‌హోన్నత వ్యక్తి ఎద్దుల ఈశ్వర‌రెడ్డి.

రైతాంగ సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యల పట్ల అంకిత భావంతో పని చేసిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహామనిషి ఈశ్వరరెడ్డి.

ఎద్దుల ఈశ్వరరెడ్డి 1915లో కడపజిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్ద పసపల గ్రామంలో ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. 600 ఎకరాల పొలము, 6 పెద్ద మిద్దెలు, 6 కాండ్ల ఎద్దులతో నిత్యం కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టినా, తన వర్గ స్వభావాన్ని వదులుకొని కడ వరకు కష్టజీవుల పక్షపాతిగా, మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడిగా, బ్రహ్మచర్య జీవితాన్ని నిష్కళంకంగా కొనసాగించారు.

ఈశ్వరరెడ్డి 1936వ సంవత్సరంలో డిగ్రీ పూర్తిచేశారు. గ్రామంలో విద్యాధిక యువకులతో కలిసి బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా, అలాగే గ్రామాల్లో ఉన్న భూస్వామ్య పెత్తందారీ శక్తులకు వ్యతిరేకంగా పోరు సలపడానికి ”మిత్రమండలి” ఏర్పాటు చేసి, తద్వారా తన రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు.

1938 లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
కాంగ్రెస్ మితవాద విధానాలతో విరక్తి చెంది రమణ మహర్షి బోధనల పట్ల మొగ్గుచూపి, రాజకీయాలకు దూరమైయ్యారు. ఆ సమయంలో ‘ ఇటువల పాడు’ కమ్యూనిస్టు రాజకీయ పాఠశాల ప్రేరణతో సమరయోధులు టేకూరు సుబ్బారావు ప్రోద్బలంతో కమ్యూనిస్టు రాజకీయాలవైపు ఆకర్షితులైనారు.

భారతదేశంలో ‘క్విట్‌ ఇండియా ఉద్యమం’ ఉరకలు వేస్తున్న తరుణం. కమ్యూనిస్టు యోధులపై నిర్బంధాలు, నిషేధాలు కొనసాగుతున్న సమయం. తెలంగాణా సాయుధ పోరాట విజృంభణకు బాసటగా సీమ జిల్లాల్లో ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న రోజుల్లో ఈశ్వరరెడ్డి రాజకీయరంగ ప్రవేశం చేశారు.

1942 లో పార్టీపై నిషేధం ఎత్తివేసిన తర్వాత బహిరంగంగా పనిచేయడానికి దొరికిన అవకాశంతో జిల్లా అంతటా రైతులను సమీకరించడం, పార్టీ నాయకులు సంగమేశ్వరరెడ్డి, పొన్నతోట వెంకటరెడ్డి, కె.వి.నాగిరెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, పంజెం నర్సింహారెడ్డి, నంద్యాల వరదారెడ్డి తదితరులతో సాన్నిహిత్యం, సమన్వయం పెంచుకోవడం,రాజకీయ శిక్షణాశిబిరాలనునిర్వహించడంలో నిమగమైనారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భారత జాతీయ కాంగ్రెసు సభ్యునిగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని 4 నెలలు కారాగార శిక్షను అనుభవించారు. 1942 నుండి భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి రైతుల సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ స్పూర్తి ఎద్దుల ఈశ్వరరెడ్డి .
తన 50ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా దర్శనమిస్తుంది.

ఈశ్వరరెడ్డి హరిజనుల, బలహీన వర్గాల ప్రయోజనాల పరిరక్షణ కొరకు, హక్కుల సాధనకొరకు అహర్నిశలు కృషి చేశారు. రామనపల్లెలో భూస్వాములు హరిజనుల గుడిసెలు కాల్చి వారిని గ్రామ బహిష్కరణ చేస్తే, ఆ పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా ఈశ్వరరెడ్డి గట్టిగా నిలబడ్డారు. హరిజనులను తిరిగి గ్రామంలో ప్రవేశింపచేసి, వారిలో ఆత్మస్థైర్యం, సంఘ నిర్మాణాన్ని ప్రోది చేయుటలో చిరస్మరణీయమైన కృషి చేశారు.

ప్రధానంగా ఈశ్వరరెడ్డి పార్టీ నిధుల సమీకరణ, రాజకీయ శిక్షణ శిబిరాల నిర్వహణ, పార్టీ ఆఫీసుల నిర్వహణ, విశాలాంధ్ర ఇతర పార్టీ పత్రికలకు చందాదారులను చేర్పించుటలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు.

1954 ఆగస్టు 1-9 తేదీలలో హైదరాబాద్‌లో జరిగిన ప్రథమ తెలంగాణ కమ్యూనిస్టు మహాసభ అట్టి చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించింది. తెలంగాణ పార్టీ పుట్టిన 14 సంవత్సరాలకు జరిగిన ప్రప్రథమ మహాసభ. నిర్మాణరీత్యా సమైక్యపరిచి, పటిష్ట మొనరించుకోవడానికి అవసరమైన రాజకీయ, నిర్మాణ నివేదికలను తీర్మానాలను ఆమోదించిన సభగా ఈ మహాసభ చరిత్రలో నిలిచి ఉంది. ఈ సభ కు
ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శి కామ్రేడ్‌ మద్దుకూరి చంద్రశేఖర రావు, పాలిట్‌బ్యూరో సభ్యులు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, పార్లమెంటు కమ్యూనిస్టు సభ్యులు కామ్రేడ్‌ వై.ఈశ్వరరెడ్డి తదితరలు సభకు హాజరయ్యారు.

యువకులుపార్టీలో పనిచేయానికి ప్రోత్సహించడమే కాక, వారి ఆర్థిక అవసరాలను తాను వ్యక్తిగతంగా సమకూర్చేవారు. అన్నింటికి మించి ఈశ్వరరెడ్డి నిత్య విద్యార్థి. విపరీతంగా చదివే అలవాటుతో పాటు అనేక రకాల క్లాసిక్స్‌, లిటరేచర్‌, సిద్ధాంత గ్రంథాలను సేకరించి ‘హోచిమిన్‌ భవన్‌’లో ఉన్న పార్టీ లైబ్రరీ (ప్రస్తుతం రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా) లైబ్రరీగా రూపాంతరం చెందింది)కి సమకూర్చి పెట్టారు.

కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి మొదటి ఎన్నికల్లో 1952 లో ఎద్దుల ఈశ్వరరెడ్డి (సీపీఐ)… పెంచికల బసిరెడ్డి (కాంగ్రెస్‌)ని ఓడించారు. 2వ లోకసభళ ఎన్నికల్లో ఈశ్వరరెడ్డిపై ఊటుకూరు రామిరెడ్డి (కాంగ్రెస్‌) గెలుపొందారు.

మళ్లీ 1962 లో జరిగిన3వ, 1967 లో జరిగిన4వ,1971 లో జరిగిన 5వ లోకసభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు సి.పి.ఐ నుంచి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించించారు.
మొత్తం 4సార్లు కడప లోకసభ సభ్యులు గా రెండు దశాబ్దాలు పాటు పనిచేశారు.

యెద్దుల ఈశ్వర రెడ్డి ప్రజల మనిషి. సైకిల్ మీద తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని పార్లమెంటు లో చర్చించిన తర్వాత మరలా ఆ సమస్యల తాజా స్థితిని ప్రజలకు వివరించేవారు. ఆ జిల్లాలో గనుల ఖని కందుల ఓబుల రెడ్డి ఆయనకు పోటీగా నిలబడి మొదటి సారిగా ఓటుకు పది రూపాయలు పంచారు. “ఓటేచ్చే లెక్కిచ్చారాబ్బీ” అని ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.

ఎద్దుల ఈశ్వర్ రెడ్డి నిరాడంబరత ఏ స్థాయిలో ఉండేదంటే పార్టీ ప్రచారానికి పోయి రాత్రి పొద్దుపోయి వచ్చేసరికి ఆయన బెడ్డుపై ఆపీస్ బాయ్ పడుకోనుంటే, అతన్ని లేపొద్దని చెప్పి ఆపీస్ లో ఉన్న దుప్పట్లు మిగతా కార్యకర్త కు ఇచ్చి చివరకు తనకు ఏమీ లేకుంటే భుజం పైనుండే టర్కీ టవల్ తీసి కింద పరిచి పడుకున్నాడట. అది చూసి మిగతా వాళ్లకు నోట మాట రాలేదట. అప్పుడాయన కడప లోకసభ సభ్యులు.

1958-1962 వరకు కడప, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యులు గా కొనసాగారు.

పార్లమెంటు సభ్యులుగా వ్యక్తిగత క్రమశిక్షణతో సమావేశాల్లో సమయానికి ఖచ్చితంగా పాల్గొనడం, సమస్యలను ప్రస్తావించడం వగైరాలతో నెహ్రూ ప్రశంసలకు పాత్రుడైనాడు.

కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం, మైలవరం రిజర్వాయర్‌ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లాకేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈశ్వరరెడ్డి కృషిని జిల్లా ప్రజలు ఎప్పటికీ మరువలేరు. పార్లమెంటు డిబేట్స్‌ను గ్రంథస్తం చేయించి, జిల్లా గ్రంథాలయానికి సమర్పించి, భావితరాలకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కృషి చేశారు.

”కమ్యూనిస్టులకు, కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నంగా వేరే ఏ ఇతర ప్రయోజనాలు ఉండవు. ఉండకూడదు”. అన్న మార్క్సిస్టు తాత్విక చింతనను అణువణువునా వంట పట్టించుకున్న వ్యక్తి ఎద్దుల ఈశ్వరరెడ్డి. ఈయన పార్టీ కే అంకితమై పెళ్లి చేసుకోలేదు.

రచయితలు, కవులు, కళాకారులను గౌరవించడం, వారికి కావాల్సిన సౌకర్యాలు, వనరులు కల్పించడం ఈశ్వరరెడ్డికి మంచి అలవాటుగా ఉండేది. కమ్మూ-శ్యామల కళాకారుల బృందాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.

రా.రా., గజ్జెల మల్లారెడ్డి, వైసివి రెడ్డి, సొదుం సోదరులు, రామప్పనాయుడు, కేతు విశ్వనాథరెడ్డి, శివారెడ్డి, లచ్చప్ప, ఆర్‌విఆర్‌ లాంటి అభ్యుదయ కవులతోపాటు ప్రాచీన,ప్రబంధసాహిత్యాలతో సంబంధమున్న రచయితలను కూడా ప్రోత్సహించేవారు.

ఎవరినైనా ‘ఒరేయి’ అని సంబోధించే పుట్టపర్తి నారాయణాచార్యులు ఈశ్వరరెడ్డిని ‘అన్నా’ అని పిలవడం చూస్తే, అన్న వ్యక్తిత్వం ఏంటో అర్థమౌతుంది.

కడప కేంద్రంగా రాజకీయ పత్రిక ‘సవ్యసాచి’, సాహితీ త్రైమాసిక పత్రిక ‘సంవేదన’ అనే నిప్పురవ్వల వంటి పత్రికలు వెలువడటం, వాటికి రాష్ట్రస్థాయిలో గొప్ప కీర్తి ప్రతిష్టలు సంతరించుకొనటం వెనుక ఈశ్వరరెడ్డి అండదండలు, ప్రోత్సాహం మెండుగాఉన్నాయనటంలో అతిశయోక్తి లేదు.

1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులో మరణించారు. ఈశ్వర్‌రెడ్డి పేరుమీద జిల్లా పార్టీ మెమోరియల్‌ ట్రస్టును ఏర్పాటు చేసింది.

ఈశ్వరరెడ్డి నిస్వార్థ ప్రజాసేవ, నిరాడంబరత, త్యాగనిరతిని గుర్తించి, మాజీ ముఖ్యమంత్రి డా||వైయస్‌.రాజశేఖరరెడ్డి గాలేరు-నగరి( గండికోట) ప్రాజెక్టుకు ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి ప్రాజెక్టుగా నామకరణ చేశారు. జమ్మలమడుగులోఈశ్వరరెడ్డి విగ్రహాన్ని ప్రతిస్టించారు.దీనిని డాక్టర్ వై.యస్‌.రాజశేఖరరెడ్డి ఆవిష్కరించారు.

‘అన్న’గా కడప జిల్లా ప్రజల చేత ఆప్యాయంగా పిలిపించుకోబడిన‌
వై. ఈశ్వరరెడ్డి కమ్యూనిస్టు నైతిక విలువలకు, త్యాగానికి, నిస్వార్థ‌ ప్రజాజీవితానికి, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి.

సేకరణ;– చందమూరి నరసింహా రెడ్డి. ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

చందమూరి నరసింహా రెడ్డి.   

1 comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s