జానమద్ది హనుమచ్ఛాస్త్రి

తెలుగు భాష ఉన్నంతకాలం జీవించి ఉండే సాహితీమూర్తి సాహితీ కల్పవృక్షం, పండితుడు , అనువాదకుడు ,పద్య, కవితా కథకునిగా వందలాది రచనలు చేసిన జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు ఓ సాహితీ దిగ్గజం. సాహిత్యంలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి తపస్విగా నిలిచారు.

ఆదర్శ జీవితాన్ని గడిపి తెలుగు భాషను మాతృభాషగా కొనసాగిస్తూ సాహిత్య రంగంలో అమరుడైయ్యారు.

సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొంది తన సుదీర్ఘ రచనాకాలంలో ఎందరో పాఠకుల్ని అభిమానులుగా చేసుకుని ప్రశంసలు, పలు సన్మానాలనూ అందుకున్న సాహితీమూర్తి. తెలుగు జాతి మణిపూస.

జానమద్ది హనుమచ్ఛాస్త్రి 1926 జూన్ 5 న అనంతపురం జిల్లా రాయదుర్గం లో జన్మించాడు. జానకమ్మ , సుబ్రహ్మణ్యశాస్త్రి వీరి తల్లిదండ్రులు.

రాయదుర్గం జిల్లా బోర్డు హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి చదివాడు. ప్రైవేటుగా బి.ఎ. ఉత్తీర్ణుడైనాడు.బి.ఇడి. కూడా పూర్తి చేశాడు. స్వయంకృషితో తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు.

1946లో బళ్ళారి లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం మొదలైంది. గాడిచర్ల స్ఫూర్తే జానమద్ది వారిని తెలుగు సేవకుణ్ణి చేసింది. వయోజన విద్యా వ్యాప్తి కోసం గాడిచర్ల బళ్ళారి జిల్లా ‘కుడ్‌లిగి’ ప్రాంతంలో పర్యటించారు. గాడిచర్ల తెలుగు ఉపన్యాసాలను కన్నడ భాషలో బళ్ళారి జిల్లావాసులకు అనువాదం చేసే వ్యక్తి అవసరమైంది.

ఆ కాలంలో జానమద్ది హనుమచ్ఛాస్త్రి బళ్ళారి జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్నారు. ఆ జిల్లా డీఈవో జానమద్ది పేరును సూచించారు.

జానమద్ది సమ్మతించి గాడిచర్ల తెలుగు ఉపన్యాసాలను చక్కగా కన్నడంలో అనువదిస్తూ ఆయన వెంట రేయింబవళ్ళు మూడు వారాల పాటు తిరిగారు. సరిగ్గా అప్పుడే జానమద్ది గాడిచర్ల స్ఫూర్తి పొందారు.

అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించడం, గాడిచర్ల సాయంతో జానమద్ది తెలుగు సీమకు, తర్వాత కడపకు బదిలీ మీద వచ్చారు.

స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్ గా, కళాశాలలో ఇంగ్లీష్ ఉపన్యాసకులుగా నాలుగు దశాబ్దాలు పనిచేశారు.

కడప లో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకుడు.ట్రస్టును నెలకొల్పి, దాని మొదటి కార్యదర్శి గా అహర్నిశలూ పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను శాస్త్రి సేకరించారు. బ్రౌన్ గ్రంథాలయం పుట్టుక గురించి క్లుప్తంగా

కడప పట్టణం యర్రముక్కపల్లి ప్రాంతంలో ఒకనాడు బ్రౌన్ మహాశయుడు నివసించే వారు. బ్రౌన్ తోట, బ్రౌన్ కాలేజ్ అక్కడ వుండేవి. ఆ బ్రౌన్ కాలేజీలో బ్రౌన్ 12 మంది పండితులను ఏర్పాటుచేసి తన జీతంలోంచి ఆ పండితులకు నెల జీతాలిచ్చి, తెలుగు కావ్యాలను ఉద్ధరింపజేశారు.

కానీ కాలగర్భంలో ఆ బ్రౌన్ కాలేజీ మొండిగోడల శిధిలాలయంగా మారింది.
ఆ చారిత్రక స్థలాన్ని మహా పరిశోధకుడు ఆరుద్ర దర్శించారు.

అక్కడ బ్రౌన్‌కు స్మారకంగా ఏదైనా కట్టడం నిర్మించమని జానమద్దిని ఆరుద్ర కోరారు. దీనితో శాస్త్రి ఆ స్థలం ఎవరి ఆధీనంలో ఉందో ఆరా తీశారు.ఆడిటర్ సంపత్‌ కుమార్ ఆ స్థలం యజమాని అని గ్రహించారు.

వెంటనే ఆయన్ను కలిసి తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఆయన సంతోషంగా బ్రౌన్ స్మారక భవన నిర్మాణం కోసం ఆ 20 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు.ఆ స్థలంలో బ్రౌన్ లైబ్రరీ నిర్మాణానికి హనుమచ్ఛాస్త్రి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.

సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఇప్పుడు యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాగంగా ఉన్నది. సీపీ బ్రౌన్ కోసం చేసిన దశాబ్దాల కృషి శాస్త్రిని అందరూ ‘బ్రౌన్ శాస్త్రి’ అని పిలిచేటట్లు చేసింది.

జానమద్ది కృషి కారణంగా బ్రౌన్ లైబ్రరీలో దాదాపు లక్ష గ్రంథాలు, 300 వరకు తాళపత్ర గ్రంథాలు, తెలుగు గ్రామాల స్థానిక చరిత్ర తెలిపే మెకంజీ కైఫీయత్తులు, బ్రౌన్ లేఖలు, రాతప్రతులు సమకూరాయి.

కడపజిల్లా రచయితల సంఘం 1973లో స్థాపించి 20ఏళ్లు కార్యదర్శిగా, అధ్యక్షులు గా జానమద్ది పనిచేశాడు. రాష్ట్రంలోని సుప్రసిద్ధ రచయితలను కడపజిల్లాకు పరిచయం చేసిన ఘనత ఇతనిదే. రచయితలను, విద్వాంసులను రప్పించి అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు.

ఆయన ఆరాధించిన వ్యక్తులతో కలసిపనిచేయడం ఆయన అదృష్టం. డా.బళ్ళారి రాఘవగారి పరిచయం ఆయనకు నటనలో అవకాశం కల్పించింది.

కరుణశ్రీ, బోయి భీమన్న, దాశరథి, పురిపండ అప్పలస్వామి,పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీ శ్రీ, బంగోరె, డా.బెజవాడ గోపాలరెడ్డి మొదలైన ప్రసిద్ధులైన సాహితీ మూర్తులతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారితో ఆయనకు మంచిస్నేహం ఉండేది.

కడపజిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా డా.మల్లెమాల వేణుగోపాల రెడ్డి గారి అధ్యక్షతలో డా.శాస్త్రిగారు కడప పట్టణం లోనే కాకుండా తాలూకాలలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

తెలుగు భాష వికాసం కోసం అహర్నిశలూ శ్రమించి, అహరహం వెచ్చించి, నిరంతరం తపించిన సాహితీ తపస్వి.

డాక్టర్‌ జానమద్ది ఆరుదశాబ్దాల తన సాహితీ ప్రస్థానంలో సహస్రాధిక వ్యాసాలను రాశారు. శతాధిక ప్రముఖుల జీవిత చరిత్రలను గ్రంథస్తం గావించారు. ఆయన రచన ప్రచురించని పత్రిక లేదనే ఖ్యాతి పొందారు.

తెలుగు, ఆంగ్ల, కన్నడ దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైన దాదాపుగా 2500 వ్యాసాలు వీరి నిరంతరం సాహితీ సేవకు ప్రతిబింబాలు.

రాయలసీమలోని కవుల జీవితాలను వెలికి తెచ్చిన మా సీమ కవులు, బళ్లారి రాఘవ చరిత్ర, కస్తూరి కన్నడ సాహితీ సౌరభం, సీపీ బ్రౌన్‌ చరిత్ర, కడప సంస్కృతి – దర్శనీయ స్థలాలు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం, కడప జిల్లా స్వాతంత్య్ర సమర యోధుల చరిత్ర, శంకరంబాడి సుందరాచారి, సంగీత మేరు శిఖరాలు ,

గణపతి – వినాయకుని గురించిన పరిశోధనాత్మక గ్రంథం మన దేవతలు, రసవద్ఘట్టాలు, దేవుని కడప, విదురుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.భీమరావ్ అంబేద్కర్,ఇలా.. నాలుగు పదులకు పైబడిన గ్రంథాలు అందించారు.

అంతేకాదు ఆకాశవాణి కేంద్రాల నుంచి అనేక అంశాలపై 150కి పైగా ప్రసంగాలు చేశారు. ఎన్నో విధాలుగా అవిశ్రాంతంగా సాహితీ సేవ గావించారు.

1964లో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్యకు, తాళ్లపాకలో గుడి కట్టించడానికి తాళ్లపాక గ్రామస్థులకు ప్రేరణనిచ్చి సఫలీకృతులయ్యారు.

ఈనాడు తాళ్లపాకలో ప్రసిద్ధి చెందిన అన్నమయ్య గుడికి ఆనాడు బీజం వేసింది జానమద్ది వారే. సర్వమత సౌభ్రాతృత్వంతో జీవితయాత్ర సాగించిన వీరు జాన్‌ అహ్మద్‌ శాస్త్రి గా పేరుగడించారు. కులమతాలకు అతీతంగా స్నేహపాత్రులయ్యారు.

నడిచే విజ్ఞాన సర్వస్వంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఎందరికో ఆదర్శప్రాయంగా, స్ఫూర్తిదాయకంగా ధన్య జీవుడయ్యారు హనుమచ్ఛాస్త్రి.

ప్రపంచంలోకి రావటం సహజం, వెళ్లిపోవటం సహజం, కానీ ఈ రాకపోకల మధ్య సమయంలో ఏదో ఒక మంచి కార్యం చేసి పది మందికి ఉపయోగపడేలా జీవితాన్ని మలచుకోవాలని చెప్పే వారు జానమద్ది.

జానమద్ది కి అనేక అవార్డులు లభించాయి.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
లోకనాయక్ ఫౌండేషన్ సాహితీపురస్కారం,
గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు,అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు,ధర్మవరం కళాజ్యోతి వారి సిరిసి ఆంజనేయులు అవార్డు,కడప సవేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు, మదనపల్లి భరతముని కళారత్న అవార్డు,తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం
బెంగళూరులో అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం
ఉడిపి పెజావరు పీఠాధిపతిచే ‘ధార్మికరత్న’ బిరుదు మొదలైన అనేక పురస్కారాలు ఇతనికి లభించాయి.

డా.శాస్త్రిగారి నిర్విరామ తెలుగు భాషా సాహిత్యసేవను గుర్తించి జ్ఞానపీఠ పురస్కార్‌ గ్రహీత డా.సి.నారాయణరెడ్డి గారు వారిని ‘బ్రౌన్‌శాస్త్రి’ బిరుదుతో సత్కరించారు. తనకెన్ని సత్కారాలు జరిగినా ఈ బిరుదు తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని జానమద్ది చెప్పుకున్నారు.

ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ – ‘సి.పి. బ్రౌన్’గా తెలుగు వారికి చిరస్మరణీయుడు. బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకు చేసిన సేవకు తెలుగువారిగా మనమెంత చేసినా అతని ఋణం తీర్చుకోలేమని, కీ.శే. డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు పదే పదే పేర్కొనేవారు.

తన జీవిత చరమాంకం వరకు బ్రౌన్ గ్రంథాలయం అభివృద్ధికై ఆరాటపడుతూ, భావితరాల వారికి బ్రౌన్ గ్రంథాలయం ‘‘వెలుగు స్తంభం’’గా నిలవాలని పరితపించేవారు.

సుదీర్ఘమైన సాహితీ, సాంస్కృతిక జీవితంగల తెలుగు జాతికి మణిపూస డా.జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు 2014 ఫిబ్రవరి 28 న స్వర్గస్థులైనారు.

జానమద్ది హనుమచ్ఛాస్త్రి గురించి మరింత సమాచారం.

✍️సేకరణ:-చందమూరి నరసింహారెడ్డి.

చందమూరి నరసింహారెడ్డి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s