
అధ్యయనానికి ఆనవాలుగా ఉండే చూపు, బక్కపలుచని విగ్రహం, ఒద్దికైన వేగం, వినయంతో కూడిన మాట. సఫారీ డ్రస్సూ ఇదీ గుంటూరు రఘురాం గారు అనగానే గుర్తుకు వచ్చే మూర్తి చిత్రం! ఇంటిపేరు గుంటూరు అయినా వారి స్వస్థలం అనంతపురం జిల్లా పి.సిద్ధారాంపురం. అంతటి మారుమూల పల్లె వాసి పంజాబులోని బ్రాంహీ మహావిద్యాలయం నుంచి విద్యా వాచస్పతి డిగ్రీ మాత్రమే కాక పంజాబు విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతం, హిందీ భాషల్లో డిగ్రీ పొందడం విశేషం. మూడు దశాబ్దాల క్రితం ఉద్యోగ బాధ్యతలలో భాగంగా వారి నేతృత్వంలో ఢిల్లీలో కొంత కాలం పనిచేశాను. వారి జన్మదినం వస్తోందని కొన్ని విషయాలు పంచుకోవాలనిపిస్తోంది! అంతటి రివట లాంటి వ్యక్తి ఆకాశవాణిలో ఎదుర్కొన్న సంఘటనలు ఎలాంటివి? 1969లో ప్రళయం లాంటి ఉప్పెన; 1972లో ఉప్పెనలాంటి విభజనోద్యమ సమయాల్లో ఆయన విజయవాడ ఆకాశవాణి ఉద్యోగిగా పనిచేశారు. ఈ రెండింటికి మించిన పరాకాష్ఠగా 1981-‘84 మధ్యకాలంలో చంఢిఘర్ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా ఆపరేషన్ బ్లూస్టార్ ఉత్పాతాన్ని ఎదుర్కొన్నారు. ఆయన తక్కువగా మాట్లాడినా, ఆయనతో నా పరిచయం కొద్ది మాత్రమే అయినా – వారి ముద్రలు నాకు సుపరిచితం. పంజాబులో చేసిన సేవలకు పద్మశ్రీ తృటిలో తప్పిపోయినా ఆకాశవాణి ఆర్కైవ్స్ కు దక్షిణాఫ్రికాలో గాంధీ చేసిన ప్రసంగాలు, అలాగే నేతాజీ సుభాస్ చంద్రబోస్ ప్రసంగాలు, ఇంకా వివేకానంద చికాగోపన్యాసాలు, ఎంతోమంది సంగీత విద్వాంసుల గురువులు… ఇలా చాలా భద్రపరిచారు.
గుంటూరు సుబ్బారాయుడు, లక్ష్మీనరసమ్మ దంపతులకు 1935 ఫిబ్రవరి 14న జన్మించారు. తండ్రి వ్యవసాయ కుటుంబం నుంచి ఎదిగివచ్చిన గ్రామీణ నాయకుడు. ఆయనకు తెలిసిన మిత్రుడు యల్లంరాజు నారాయణ భట్టు సంస్కృతం, హిందీ నేర్పించారు అగ్రహారంలో. తన మూడవ, నాల్గవ కుమారులను చదువుకు పంపడమే పెద్ద మలుపు, స్వామీ దయానంద సరస్వతి అవలంబకులు అనంతపురం వచ్చినపుడు పన్నెండు, పదమూడు సంవత్సరాల కుర్రాళ్ళు గురువుగారికి హిందీ అనువాదంలో తోడ్పడి సంభాషణ సవ్యంగా జరగడానికి తోడ్పడ్డారట. దాంతో ఆ పిల్లలు ఇద్దరిని తాము తీసుకువెళ్ళి చదివిస్తామని సుబ్బారాయుడు – లక్ష్మీనరసమ్మ దంపతులను కోరారు. మరింత ప్రయోజకులవుతారని, సమాజానికి తోడ్పడతారని తమకు ఇష్టం పూర్తిగా లేకపోయినా వెంకటస్వామి, రఘురాంలను ఉత్తర భారతం వైపు పంపారు. అలా వెళ్ళినవారు ఆరేడేళ్ళకు గానీ తిరిగి రాలేదు. రఘురాం గారి సంస్కృతం, హిందీ ప్రావీణ్యానికి ఇదీ నేపథ్యం.

1958లో ఆకాశవాణిలో ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్ గా హైదరాబాదులో చేరారు. వీరికి హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు రావడంతో పోర్టుగీసు హస్తాల నుంచి బయటపడిన గోవా రేడియోకు 1961లో రఘురాం సేవలు అవసరమయ్యాయి. 1963 ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పదోన్నతి జరిగి విజయవాడ ఆకాశవాణిలో చేరారు. అప్పట్లో ప్రోడ్యూసర్, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ కలసి ఒక విభాగం నిర్వహించేవారు. అలా ప్రఖ్యాత రచయిత జి.వి. కృష్ణారావుతో కలసి పదేళ్ళపాటు పనిచేసే అవకాశం రఘురాం గారికి లభించింది. అలా వ్యవసాయ నేపథ్యంతో రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి తొలిసారి విజయవాడ కేంద్రం స్పోకెన్ వర్డ్స్ విభాగం ఒక దశాబ్దం పాటు నిర్వహించారు. ఆ సమయంలో బందా కనకలింగేశ్వరరావు, ప్రయాగ నరసింహశాస్త్రి, బుచ్చిబాబు, ఓలేటి వేంకటేశ్వర్లు, జలసూత్రం రుక్మిణి శాస్త్రి, ఆమంచర్ల గోపాలరావు, కందుకూరి రామభద్రరావు, ఏడిద కామేశ్వరరావు, వింజమూరి శివరామారావు, యండమూరి సత్యనారాయణ, రాచకొండ నరసింహమూర్తి, తెన్నేటి హేమలత, ఉషశ్రీ, బాలాంత్రపు రజనీకాంతరావు, పాలగుమ్మి విశ్వనాథం, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, జి.వి.కృష్ణారావు వంటివారు రఘురాం సహోద్యోగులు. హడావుడి లేకుండాఅభ్యుదయ వాసనలతో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు రూపొందించినవారు రఘురాం. చలం కలం వెలుగులు, నేనెందుకు వ్రాస్తున్నాను, జీవితం నేర్పిన పాఠాలు వంటి కార్యక్రమాలు రఘురాం – జి.వి.కృష్ణారావు ద్వయం కృషియే!
2002 సంవత్సరం తొలి మూడు నెలల్లో జి.వి.కృష్ణారావు గురించి విజయవాడ ఆకాశవాణిలో కొన్ని కార్యక్రమాలు మేము రూపొందించాం. వీటిలో ఒక ప్రసంగంలో రఘురాం కొన్ని ఆసక్తికరమైన విషయాలు పేర్కొన్నారు. ఆకాశవాణి నిర్వహించే కవిసమ్మేళనాలు, సంగీత, నాటక ఉత్సవాలకు జనం విరగబడి వచ్చేవారు. ఉగాది కవిసమ్మేళనం కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చేవారికి చెరుకురసం, వేపపూవు పచ్చడి అందరికీ అందించేవారు. కవిసమ్మేళనంలో చదివిన కవితలను ఆయా పత్రికలు ఎంపిక చేసుకుని పండుగరోజు ప్రత్యేక అనుబంధాలతో ప్రచురించేవారు. విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన చాలా కవితలు దేవరకొండ బాలగంగాధర తిలక్ తన ‘అమృతం కురిసిన రాత్రి’ లో రూపొందించారు. జీవితం నేర్పిన పాఠాలు శీర్షికలో గోరా తన ప్రసంగంలో కుండబద్దలు కొట్టినట్టు కుటుంబ విషయాలు చెప్పారు. శ్రోతలు ఎలా తీసుకుంటారో అని రెండు రోజులు పాటు తర్జన భర్జన పడి – ఉన్నది ఉన్నట్టు ప్రసారం చేశారు. శ్రోతల నుంచి విమర్శిస్తూ ఒక ఉత్తరం రాకపోగా వందలాది సంఖ్యలో అభినందనల ఉత్తరాలు రావడం సొగసైన ముగింపు.
ఇక పంజాబు సంక్షోభ సమయంలో మరో శక్తివంతమైన మీడియా సాధనం లేని కాలంలో చంఢీఘర్ స్టేషన్ డైరెక్టర్ గా ఆయన ఉద్యోగం చేయడం నడిసంద్రంలో కత్తుల వంతెన మీద పులిస్వారి మాత్రమే! 1993లో పదవీ విరమణ తర్వాత హైదరాబాదులో స్థిరపడి 2006 జనవరి 18న గుంటూరు రఘురాం కనుమూశారు.
ఒకే జిల్లా వాసులు కావడం; గోవాలో, విజయవడలో ఒకే స్థాయి ఉద్యోగాలు కొంత కాలవ్యవధిలో పనిచేయడం వారికీ నాకూ ఉన్న పోలికలు. వైజ్ఞానిక దృక్పథం, తార్కిక విశ్లేషణ, మానవీయ విలువల పరిరక్షణ, కుల-మత మౌఢ్యాలకు అతీతంగా కొత్త దృక్పథం, ఆశావాదం, భవిష్యద్దర్శనం – అనేవి వారు చెప్పిన పాటించిన ఆదర్శాలు నేటి మీడియాకు స్వీకరిస్తే పనికొచ్చే కొలబద్దలే!
రచన :-డా. నాగసూరి వేణుగోపాల్
9440732392
