
సమకాలీన సమస్యలకు స్పందించిన రచయిత, నటుడు, సంపాదకుడుఎమ్.ఆర్. చంద్ర రాజకీయాల్లో రాటుదేలి, రాష్ట్రపతిగా రాణించిన నీలం సంజీవరెడ్డి ఆ పత్రికను ఆంధ్రాబ్లిట్జ్ అని కొనియాడారు. ఆయన చిత్రాన్ని చూస్తే ఎస్.వి.రంగారావో లేదా ప్రభాకరరెడ్డో గుర్తుకు వచ్చే ఠీవి, దర్పం కనబడుతుంది.
ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మ, “… మృత్తికలో అణువణువులోనూ అతని గొంతు గానం చేస్తూ ఉంటుంది. ప్రతివృక్షంలో ప్రతి పుష్పంలో, ప్రతిఫలంలో, ప్రతికలంలో, ఆయన స్వరాలు స్పందిస్తుంటాయి. పశుపక్షిగిరి నిర్జరులు ఆయన్ని పిలుస్తుంటాయి. ఆయనకు జన్మ ఇచ్చిన మృత్తిక ఝళిపించిన ఖడ్గాలు పారిన రక్తధారలు, పాడిన పాటలు, కుసుమించిన కావ్యాలు, శిల్పాలు ధరించి శిరస్సులెత్తిన గోపురాలు, దాని భావావేశం నానారూపులెత్తిన సంగీతనాట్య అభినయాతిరసాత్మక ఖండికలు, అన్నీ… ” అని గుంటూరు శేషేంద్రశర్మ వ్యాఖ్యానిస్తారు.
ఇంతవరకూ మనం ప్రస్తావించింది ఎమ్.ఆర్. చంద్ర గురించి!
సామాజిక స్పృహ, తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా తన రచనా వ్యాసంగాన్ని సాగించిన అభ్యుదయ వాది యం.ఆర్. చంద్ర (11 సెప్టెంబర్, 1928 – 19 ఫిబ్రవరి, 1999). సమత, మమత, మానవతలతోనే సమసమాజం నిర్మితమవుతుందని నమ్మి ఆచరించిన సంఘసేవకుడు, సంపాదకుడు. అవినీతి, అక్రమాలు, అణచివేతల పై తన కవితాస్త్రాల్ని సంధించిన ధైర్యవంతుడు. చైనా దురాక్రమణ సమయంలో వీరు రచించిన రుధిరధారలు నాటిక తెలుగు, కన్నడ, తమిళ ప్రాంతాలలో వెయ్యిసార్లకు పైగా ప్రదర్శించబడి చర్చకు కారణమయింది.
జమీందారు వంశంలో పుట్టినా.. చిన్నతనం నుండీ సాహిత్యాభిలాష పెంచుకొన్నారు. స్వయంకృషితోనే వ్యక్తిగత, రచనా జీవితాన్ని ప్రారంభించారు కాబట్టే జనాల కష్టాలను, కడగండ్లను ఓ వేపు తన రచనల్లో దృశ్యమానం చేస్తూ, మరోవేపు సాంఘిక, సేవాకార్యక్రమాల్లో పాల్గొనేవారు. కులాలు, మతాల కతీతంగా ఎంతోమందిని చేరదీసి, సాకి, చదువు, ఉపాధి కల్పించారు.
1960లో చిత్తూరు నుండి “పల్లెసీమ” వారపత్రిక ప్రారంభించి-సమాజంలోని కుళ్ళు కుతంత్రాలు, అధికారుల అవినీతి, లంచగొండితనాలు, నాయకుల బంధుప్రీతి, దౌర్జన్యాలను ఎత్తిచూపుతూ, ఎండగడుతూ 39 ఏళ్ళపాటూ దిగ్విజయంగా నడిపారు. బి.జెడ్. ఉన్నతపాఠశాలకు ప్రభుత్వ వనరులు సాధించారు. పాఠశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా బంగారుపాళ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాల వ్యవస్ధాపక కార్యదర్శిగా విద్యాభివృద్ధికి కృషి చేశారు. చిత్తూరు జిల్లా చిన్న పత్రికల సంఘం వ్యవస్ధాపక అధ్యక్షులుగా పత్రికారంగానికి సేవలందించారు. చంద్రగారి కృషి ఫలితంగానే జర్నలిస్టులకు ఇంటిస్థలాలు లభించాయి. చిత్తూరు తాలూకా రచయితల సంఘం వ్యవస్ధాపక అధ్యక్షులుగా, చిత్తూరు జిల్లా రచయితల సంఘం వ్యవస్ధాపకులుగా అనేక కవి సమ్మేళనాలు, సదస్సులు జరిపారు. ఎమ్.ఆర్. చంద్ర – 6 గేయసంపుటాలు, 5నాటకాలు, 4 నవలలు వెలువరించి ప్రఖ్యాతి గాంచారు.
రచన:-డా. నాగసూరి వేణుగోపాల్
9440732392
