బారిస్టర్ సైన్స్ దృష్టి
******************
         ప్రత్యేక ఉపోధ్గాతం  అవసరం లేని వ్యక్తిగా,సుదీర్ఘకాలం  పలుపుస్తకాలు,  వ్యాసాలు,కాలమ్స్ రాస్తూ,పాపులర్ సైన్స్ రచయితగా, మీడియావిశ్లేషకులుగా,సాహితీ విమర్శకులుగా,ఆకాశవాణి ప్రయోక్తగా సుపరిచితులైన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు నిత్య సాధకులు. మరుగున పడ్డ అనేక అంశాలను వెలికి తీసి,వాటి వైశిష్ట్యాన్ని నలుగురికి చేరవేయాలన్న తపనతో నిరంతరం  చదువుతూ,శోధిస్తూ, వ్రాస్తూ ఉంటారు..
            సైన్స్ పట్ల మక్కువ జర్నలిజం వల్ల అబ్బిన విశ్లేషణ, అన్వేషణ వెరసి అందరూ సామాన్యంగా చూసే అంశాలు ఆయన దృష్టికోణం లో చాలా భిన్నంగా గోచరిస్తాయి.
అనేక రంగాలలో అధ్యయనం చేసిన నాగసూరి గారు అంతర్లీనంగా ప్రభావితులై గాంధీజీకి సంబంధించిన అనేక అంశాలపై  తరుచుగా స్పందిస్తూనే ఉన్నారు.గత సంవత్సరమే “మహా స్వప్నం మహాత్మాగాంధీ”
పుస్తకాన్ని వెలువరించడం గొప్ప విశేషం.
         కొత్తతరానికి గాంధీ భావనలు,ఆలోచనలు ,ఆచరణ ఎంతలా అవసరమో తెలిపే దశ లో 2019 జనవరి నుండి మొదలైన అధ్యయన ఫలితం,సైన్స్ గురించి గాంధీ గారి ఆలోచన ఏంటన్న కోణంలో వెలువరించినదే “అసలైన విప్లవవాది సిసలైన సిద్ధాంతకర్త ” వ్యాస సంపుటి.చూడ చక్కని అరుదైన బారిస్టర్  ముఖచిత్రం తో..(నేటి తరం పిల్లలకు తెలియని ఆ యువనాయకుడు) 112 పేజీలతో 16 వ్యాసాలతో అపురూపమైన  చిత్రాలతో ,అంతే అరుదైన విషయ సేకరణతో రచయిత అద్భుతంగా పొందుపరిచిన ఈ వ్యాససంపుటిని  అందమైన పుస్తకంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, వినోభా నగర్ డెవలప్మెంట్ సొసైటీ వారు గత జులై 2020 లో ప్రచురించడము ఎంతైనా హర్షణీయం.అంతే కాక ఇకముందు గాంధీ గారిపై ఏ పరిశోధనా గ్రంధాన్ని నాగసూరి గారు వ్రాసినా తామేముద్రిస్తామని ముందుకు రావడం రచయిత నిబద్ధత ,స్పష్టత పట్ల వారికున్న గొప్ప నమ్మకమే కాకుండా వారి అక్షరానికి దక్కిన సముచిత గౌరవంగా భావించవచ్చు.


                  వివిధ పత్రికలలో ప్రచురించిన వ్యాసాలు ఇవి. గాంధీ&టెక్నాలజీ,ఆర్థికకోణం,పర్యావరణం,ఆరోగ్యం,సైన్స్ ఆఫ్ బ్రాహ్మచర్య, గాంధీయన్ ఇంజనీరింగ్,సేవ అన్నభావనకు విశిష్ట అర్ధాన్ని చూపిన సదాశయం,కస్తూరిబాతో అపురూపంగా సాగిన దాంపత్యం,గాంధీ దృష్టిలో టెక్నాలజీ,పత్రికల స్వీయనిర్వహణ, పనిపట్ల గౌరవం,నిబద్ధత, అవగాహన,క్రమశిక్షణ,సమయపాలన,నేర్చుకోవాలన్న తపన,స్వయం సేవ లాంటి అనేక భావనలతో ఆకట్టుకున్న వ్యాసాలు పాఠకులకు గాంధీజీని మరో కోణంలో దర్శింపచేస్తాయనడంలో సందేహం లేదు..
సులభ శైలిలో సరళంగా అర్ధమయ్యే రీతిలో ఉన్న ఈ పుస్తకం యువత తప్పక చదవాల్సినది.
               గాంధీ అనగానే బట్టతల, బోసినవ్వు,చేతిలో కర్ర,కళ్ళజోడు గుర్తుచేసుకునే తీరుకు భిన్నంగా అనేక విధాలుగా అనేక సందర్భాలలో చాలా ప్రభావ వంతమైన నిర్ణయాలు తీసుకుంటూ, కఠోర స్థితులను తట్టుకుని ఎదిగిన వ్యక్తిత్వం కనిపిస్తుంది.
              అనేక మంది దృష్టిలో గాంధీజీ సాంకేతికతను వ్యతిరేకించారన్న భావన,అవగాహనాలోపం ఈ పుస్తకం చదివితే తేట తెల్లం అవుతుంది. గాంధీజీకి శాస్త్రవిజ్ఞానం పట్ల ఉన్న సదభిప్రాయాలకు నిరూపణలు  తెలిపే ఎన్నో వ్యాసాలు విజయవంతంగా మనముందుంచారు.
       గాంధీజీ యాంత్రీకరణను నిరాకరించలేదని,యంత్రాలు మనిషిని సోమరులుగా మార్చకూడదన్నది  గొప్ప ఆశయమని, లక్ష్యాలు  కేంద్రీకృతంగా,ఏకరీతిగా ఉండి అమలు వికేంద్రీకరించబడాలని కోరుకున్నట్టు మనకు ఈ వ్యాసాల వల్ల అవగతమౌతుంది.
          తరాలనుండి వస్తున్న భారతీయ సిద్ధాంతాలనుండి  అహింసా భావనలకు ఆధారాలైన  శాస్త్రాలను విలక్షణ దృష్టితో చూడడం గాంధీ గారి అసలైన సిద్ధాంతంగా మనకు రచయిత చూపిన గాంధీ  ఆలోచనాపరుడు,మరియు ఆధునికుడు కూడా..
దేవుడి ప్రస్తావన లేని సత్యాగ్రహిగా గాంధీని
కోరుకున్న లోహియా గమ్యం మాత్రమే కాదు గమనం కూడా ఉన్నతంగా ఉండాలన్న గాంధీ వైఖరి ఆయన్ని అమితంగా ఆకర్షించడంతో బాటు గాంధీజీని ‘మానస పిత’ గా పరిగణించడం అన్నది గాంధీజీ ఆలోచనలకు
కొత్త అర్ధాన్ని,జనజీవాలను అందించిన దార్శనికుడుగా గాంధీ లోహియాల మైత్రి ని ఆలోచింపజేసేదిగా కొనసాగింది ఈ వ్యాసం.
           కస్తూర్భా పూర్తిగా గాంధీజీకి విధేయగా కన్పిస్తున్నప్పటికీ ఆమె చక్కటి వ్యక్తిత్వం కలదిగా, గాంధీ ఆలోచనలను గౌరవిస్తూనే,ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగించే పనులను చేయడానికి  ధైర్యంగా నిరాకరిస్తూ
ఆమె అనుసరించిన అహింసా సిద్ధాంతం పట్ల
గాంధీజీ స్పందిస్తూ ఆమెను తన ‘అహింసకు గురువుగా’ ఆత్మకథలో పేర్కొనడం పాఠకులకు విస్మయం కలిగించే విషయం.
                  సాంకేతిక విజ్ఞానం,ప్రగతి సగటు మనిషికి తోడ్పడేదిగా ఉండాలని  చరకా నైపుణ్యం పెరగాలని భావించి  దశాబ్దం పాటు
ప్రపంచ స్థాయి పోటీలు పెట్టి నగదు బహుమతులు ఇచ్చారంటే, ఆయన సాంకేతిక అభివృద్ధిని ఎంతగా కాంక్షించారో అర్ధమౌతుంది. సాంకేతిక విజ్ఞానం స్థానిక భాషల్లో భోధించబడాలని, అవి సగటు మనిషి అభివృద్ధికి సోపానాలు కావాలని ,పాశ్చాత్య
ప్రపంచపు విజ్ఞాన ధోరణికి విరుగుడుగా ప్రత్యామ్నాయ సైన్సుకు ఉండాల్సిన తాత్విక వాదాన్ని ప్రతిపాదించారని రచయిత మనకు అసలైన సిద్ధాంత కర్తగా గాంధీజి ఆలోచనల
విస్తృత పరిధిని దర్శింపచేశారు.
               ఇంకాస్త ముందుకెళ్లి గాంధేయ సాంకేతిక విజ్ఞానం,గాంధీయన్ ఇంజనీరింగ్
“మోర్ ఫ్రమ్ లెస్ ఫర్ మోర్ “అనే ప్రసంగం ,ప్రదర్శన ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు ఆర్.ఎ. మహేల్కర్,సి. కె .ప్రహ్లాద్ గార్లు చేశారని తెల్పడం ఆశ్చర్యాన్ని,ఆనందాన్ని నింపడం మరో ప్రత్యేకత.
                         గాంధీజీ భావనలో సైన్స్ విస్తృతి ఏమిటో తెలిపే అనేక సందర్భాలను ఈ పుస్తకం మనకు సవివరంగా తెలియజేస్తుంది.అందుకొఱకు రచయిత చేసిన సుదీర్ఘ పరిశీలన,పరిశోధన అపూర్వమైనదని పాఠకులకు తేటతెల్లమౌతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.వీరి కలం నుండి మరెన్నో సామాజిక ప్రయోజనాలకు ఊతమిచ్చే రచనలు, భాషను బ్రతికించుకునే రీతిలోస్పష్టమైన దిశానిర్దేశం చేసే రచనలు వెలువడాలని ఆశిద్దాం.

   పుస్తకప్రతుల కొరకు                        
*******************

1.  నవోదయా బుక్ హౌస్,
  ఆపొజిట్ మెట్రో పిల్లర్ 14,
  కాచిగూడ క్రాస్ రోడ్స్,
  హైదరాబాద్.500027
  ఫోన్:040-24652387
2.G.Malyaadri,
Vignanam pracharam aku
162,vijaya lakshmi nagar,
Nellore-524004.A.P
Mobile:9440503061.
ని సంప్రదించగలరు.
                       పుస్తక సమీక్షకులు:
                      అవధానం అమృతవల్లి
                      9052912120
                      ఉపాధ్యాయిని
                       ప్రొద్దుటూరు.

అవధానం అమృతవల్లి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s