
యుద్ధ వీరుడు మహావీరచక్ర పురస్కార గ్రహీత కు నేడు సన్మానం సందర్భంగా…..
ఇండో-పాక్ యుద్ధం (1971)లో భారత్ విజయానికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఓ యుద్ద వీరునికి సన్మానం చేయడం ఆనందదాయకం.
ఇండో-పాక్ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన యుద్ధవీరుడు, ఆంధ్రప్రదేశ్ వాసి కావడం గర్వకారణం. తిరుపతికి చెందిన చిత్తూరు వేణుగోపాల్‌కు అరుదైన గౌరవం నేడు తిరుపతి లోని ఆయన స్వగృహం లో అందించనున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గురువారం (18-2-2021) రోజు ఘనంగా సన్మానించనున్నారు.
భారతదేశ యుద్ధ విజయాలలో అత్యంత చిరస్మరణీయమైంది 1971 ఇండో- పాక్ యుద్ధ విజయం(బాంగ్లాదేశ్ విమోచన యుద్ధం ). ఆ యుద్దంలో భారత సైన్యం ఇటు తూర్పున తూర్పు పాకిస్తాన్ తో అటు పశ్చిమాన పశ్చిమ పాకిస్తాన్ సైన్యంతో ఏక కాలంలో తలపడాల్సి వచ్చింది. భారత దేశం త్రివిధ దళాలతో పాకిస్తాన్ ఓటమి లక్ష్యంగా 1971 డిసెంబర్ లో ‘ఆపరేషన్ కాక్టస్ లిల్లీ’ మొదలుపెట్టింది. ఆపరేషన్ కాక్టస్ లిల్లీలో ప్రముఖ పాత్ర వహించి 1971 యుద్ధ సమయంలో తను చూపిన తెగువకు గుర్తింపుగా మేజర్ జనరల్ చిత్తూరు వేణుగోపాల్ ‘మహావీర చక్ర’ పురస్కారం అందుకున్నారు .ఈ పురస్కారం లబించినప్పుడు ఆయన లెఫ్టినెంట్ కల్నల్ .
చిత్తూరు వేణుగోపాల్ గారు చిత్తూరు జిల్లా తిరుపతి వాసి.
వేణుగోపాల్ 1927 నవంబరు 14న జన్మించారు.1950లో ఆర్మీలో చేరారు.

గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ కమాండింగ్ అధికారిగా వీరి నేతృత్వంలో డిసెంబర్ 4, 1971వ సంవత్సరంలో పాకిస్థాన్ తో యుద్ధం చేశారు.
గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ భారత దేశ తూర్పు సరిహద్దులో పాకిస్తాన్ సైన్యంతో తలపడింది. తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బాంగ్లాదేశ్) లోని సరిహద్దు ప్రాంతాలైన ఉథాలి, దర్శన ప్రాంతాలలో కట్టుదిట్టమైన శత్రు స్థావరాలను వేణుగోపాల్ గారి నేతృత్వంలో గూర్ఖా రైఫిల్స్ బెటాలియన్ స్వాధీనం చేసుకొంది. చిత్తూరు వేణుగోపాల్ నాయకత్వం లో శత్రుసైన్యాల మీద దాడి కొనసాగించారు. రెండు బలమైన స్థావరాలు స్వాధీనంతో వీరు ఆగలేదు, పారిపోతున్న శత్రు సైనికులు తిరిగి బలం పుంజుకోకుండా, అదనపు బలగాలు వారికి సహాయం రాలేని విధంగా మూడు రోజులు దాడి కొనసాగించారు. అనంతరం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని జెండియా ప్రాంతాన్ని కూడ స్వాధీనం చేసుకున్నారు .
ఈ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, తన బెటాలియన్ ను ముందుండి నడిపించి శత్రు స్థావరాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడినందుకు వేణుగోపాల్ కు దేశంలో అత్యుత్తమ సైనిక పురస్కారమైన మహావీర చక్ర పురస్కారం లభించింది.1983లో మేజర్ జనరల్‌గా రిటైరైయ్యారు. అజన్మ బ్రహ్మచారి. ప్రస్తుతం ఈయన తిరుపతి లోని చెన్నారెడ్డి కాలనీలోని ఆయన స్వగృహం వైట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు.ప్రస్తుతం వీరి వయస్సు 95 సంవత్సరాలు.

ఇండో-పాక్ యుద్ధంలో లభించిన భారత్ విజయానికి యాభై ఏళ్లు పూర్తిచేసుకొన్న సందర్భంగా స్వర్నిమ్ విజయ్ వర్ష్ పేరిట కేంద్ర హోంశాఖ విజయోత్సవాలు నిర్వహిస్తున సందర్భంలో
భాగంగా చిత్తూరు వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఘనంగా సన్మానిస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 16న ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద విక్టరీ జ్యోతి వెలిగించారు. దేశమంతా తిరిగే ఈ విక్టరీ ఫ్లేమ్(విజయ జ్యోతి) 2021ఫిబ్రవరి 17న తిరుపతికి చేరుకొంది . ఈ విక్టరీ ఫ్లేమ్‌ను ఏఓసీ సెంటర్ కమాండెంట్ బ్రిగేడియర్ జేజేఎస్ భిందర్ సైనిక గౌరవాలతో అందుకొన్నారు. 18న(నేడు) తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న మెగా ఈవెంట్‌కు సీఎం జగన్ మోహన రెడ్డి హాజరౌతారు. ఈ సందర్భంగా మహావీర చక్ర, పరమ విశిష్ట సేవా మెడల్ గ్రహీత వేణుగోపాల్‌ను ఆయన ఇంటివద్దే సన్మాన చేయనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేశారు. వైట్ హౌస్ లో ఒక మొక్కను నాటి, విక్టరీ ఫ్లేమ్‌ను అందుకుంటారు. ఈ సంధర్భంగా ఇండో-పాక్ యుద్ద వీరుడు చిత్తూరు వేణుగోపాల్ గారికి దేశ ప్రజల తరపన అభినందనలు తెలియజేస్తున్నాం.
రచయిత:-చందమూరి నరసింహా రెడ్డి . ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.
