చంద్రవదన మొహియార్ సమాధి

ప్రేమ!? అవ్యక్తాను,వ్యక్తమైన ఓ తీయని మధురాతి మధురమైన అనుభూతి. మాతృప్రేమ వెలకట్టలేనిది. పితృప్రేమ శంకించలేనిది. సోదర సోదరీ ప్రేమ అమేయమైనది. ఇలా ప్రేమ యెన్నో రకాలున్నప్పటికి అందులో అగ్రతాంబూలం మాత్రం ప్రేయసీ ప్రియుల ప్రేమనే? ఎందుకంటే ప్రేయసీ ప్రియుల ప్రేమ కేవలం వొకరినొకరు ప్రేమించుకున్నంత మాత్రాన సరిపోదు. వారి పెద్దలను కూడా వొప్పించగలగాలి. అంతే కాదు సమాజం కూడా ఆ ప్రేమను ఆమోదించాలి. ఎన్ని అడ్డంకులు యెదురైనప్పటికి మొక్కవోని ధైర్యంతో ప్రతికూల పరిస్థితులను సైతం యెదిరించి నిలచిన ప్రేమ కథలు చరిత్రలో కోకొల్లలు. వాటిలో రెండింటిని చెప్పగలరా?………..

ఊహూ గుర్తుకు రాలేదా? నల, దమయంతుల ప్రేమకథ, పృధ్వీరాజ్ చౌహాన్, రాణి సంయుక్తల ప్రేమ కథ మరియు సలీం అనార్కలీల ప్రేమకథ. ఈ కథలు మనం అంత తొందరగా మరచిపోవడానికి కారణం అవి విజయం సాధించిన ప్రేమ కథలు. సాధారణంగా మానవనైజం యేమిటంటే జీవితంలో సాధించిన విజయాల కంటే కూడా పొందిన వైఫల్యాలనే యెక్కువగా మననం చేసుకుంటూ వుంటారు. అందుకేనేమో చరిత్రలో రోమియో జూలియట్, లైలా మజ్నూ, దేవదాసు పార్వతి, టైటానికి ప్రేమ కథలే సుస్థిర స్థానాన్ని సంపాయించుకున్నాయి. ఇందులో దేవదాసు పార్వతి, టైటానిక్ ప్రేమ కథలు కాల్పనికం. రోమియో జూలియట్, లైలా మజ్నుల ప్రేమ కథలు చారిత్రాత్మకం. ఇలాంటి కథలు చాలా వున్నప్పటికీ జనబాహుళ్యంలో వున్నవి చాలా తక్కువ. చరిత్రనే మరచి పోయిన ఓ ప్రేమకథ మీకు తెలుసా? అదే చంద్రవదన మొహియార్ ల అమర ప్రేమగాథ?

16-17వ శతాబ్దం భారతదేశం దక్షిణాపథంలో విజయనగర రాజుల సుపరిపాలన కొనసాగుతున్న సమయంలో, అరబ్ రాజ్యానికి చెందిన ఆజానుబాహుడు, మంచి అందగాడు, సౌందర్య పిపాసి, సత్ ప్రవర్తన కలిగిన మొహియార్, ఇరవైయేండ్ల ప్రాయము లోనే తండ్రి ద్వారా వారసత్వంగా లభించిన వజ్రాల వ్యాపారాన్ని కొనసాగిస్తూ, భారతదేశం చేరుకొని యిక్కడి రమణీయతకు ముగ్దుడై దేశం లోని అన్ని రాజ్యాలను సందర్శిస్తూ చివరకు నేడు రాయలసీమ ప్రాంతంలో భాగమైన కదిరికి చేరుకొని, కదిరిలో శ్రీ ఖాద్రీ నరసింహస్వామి వారి దేవాలయం ముంగిట వున్న ఓ సత్రంలో బస చేసాడు. ఒకనాడు సూర్యోదయానికి పూర్వమే మొహియార్ మేల్కొని, తన ప్రార్థన ముగించుకొంటుండగా బయట కోలహలం వినిపించి తనున్న సత్రంలో నుండి బయటకు వచ్చాడు.

కాల్బలము, అశ్విక దళం, వంది మాగధులు, మంత్రులు, సేనాపతులు, సన్నిహితులు, రాణివాస స్త్రీలు వెంటరాగా అపర దేవేంద్రుని వలె వెలుగొందు పట్నం పాళెగాడు, శ్రీ నారసింహ క్షేత్ర సందర్శనార్థమై అంగరంగ వైభవంగా రాచఠీవిని వొలకబోస్తూ విచ్చేయడం చూచి అబ్బుర పడుతూ ఆ వుత్సవాన్ని తిలకిస్తున్న మొహియార్ చూపులు రాణి వాసపు స్త్రీల సమూహములో అద్భుతమైన సౌందర్య, రూప లావణ్యాలతో రాయంచవలె అలరారు కన్యను చూచి కన్నార్పకుండా ఆమెనే చూస్తూ వుండి పోయాడు. ఆ లలనామణి పట్నం పాళెగాని గారాలపట్టియని ఆమే పేరు చంద్రవదనయని, పేరుకు తగ్గ రూపవతియని, గుణవతియని ప్రక్కవారు మాట్లాడుకుంటుండగా మొహియార్ విన్నాడు. ఆ కన్య తన తండ్రితో కలసి నారసింహుని దర్శనార్థమై దేవాలయములోనికి వెళ్ళి కనుమరగు కాగానే మొహియార్ పంచప్రాణాలు ఒక్కసారిగా అతనిలో నుండి వేరయినట్లనిపించాయి. అక్కడి నుండి యెక్కడికీ కదలలేక శిలాప్రతిమ వలె అక్కడే నిలచుండిపోయాడు. దేవాలయంలో పూజాదికాలు ముగించుకొని చంద్రవదన తన తండ్రితో కలసి మొహియార్ కళ్ళెదురుగానే తమ పట్నం కోటకు వెళ్ళిపోయింది.

ఆమెను మరోసారి చూడగానే మొహియార్‌కు పోయిన ప్రాణాలు తిరిగొచ్చినట్లయింది. ఆమె కనుమరగు కాగానే మొహియార్ పరిస్థితి మరీ మొదటికొచ్చినట్లయింది. వ్యాపారం మీద మనసు పోలేదు, దైనిందిక కార్యకలాపాలేవీ నిర్వర్తించుకోలేక పోయాడు. ఎంత మరచిపోదామన్నా చంద్రవదన వదనం మొహియార్ కన్నుల నుండి, అతని హృదయ ఫలకం మీద నుండి చెరగకుండా వుండిపోయింది. హృదయంలో యేదో తెలీని భాద, కన్నులు మూసినా తెరచినా చంద్రవదన రూపమె మొహియార్ కు కనిపించసాగింది. అతని పరిస్థితి అతనికే అర్థం గాకుండా పోయింది. యెలాగైనా సరే చంద్రవదనను మరోసారి చూడాలన్న కోరిక మొహియార్‌లో బలపడసాగింది. యెలాగోలా ఆ పగలు, రాత్రి నరకంలాగా గడిపేసాడు మొహియార్. తెల్లవారగనే ఖాద్రీ నృసింహుని గుడి ముంగిట వెళ్ళి నిలుచొని కలువపూవు వెన్నెలరేడుకై యెదురు చూస్తునట్లు చంద్రవదన దర్శనం కోసం వేచి చూడసాగాడు.

అతని తపస్సు ఫలించినట్లు చంద్రవదన స్వామివారి దర్శనానికై వచ్చి, దర్శనం ముగించుకొని వెళ్ళిపోయింది. ఆమెను చూడగానే కోటి యేనుగుల బలం వచ్చినట్లైంది మొహియార్ కు. తిరిగి ఆమె వెళ్ళిపోగానే అతని ప్రాణాలు యెవరో బలవంతంగా అతని నుండి లాగేసుకున్నట్లు అయిపోయేది మొహియార్ కు. తిరిగి మరుసటి రోజు ఆమె వచ్చే వరకు అన్న పానీయాలు మాని నిత్యం ఆమెనే తలుస్తూ బ్రతుకు భారంగా వెళ్ళదీసేవాడు మొహియార్. ప్రతి రోజూ ఇదే పరిస్థితి, కేవలం ఆమె నిమిషమాత్ర సందర్శనానికై నిద్రాహారాలు మాని కన్నులు కాయలు కాచేలా యెదురు చూసేవాడు మొహియార్.

మొహియార్ వాలకం కనిపెట్టిన ఓ గూఢాచారి పట్నం పాళెగానికి ఈ వర్తమానం అందించాడు. ఇందులో తన కూతురు ప్రమేయం యేమీ లేకపోవడంతో, అనవరంగా యెందుకు రచ్చ చేయాలని భావించిన పట్నం పాళెగాడు చంద్రవదనను గుడికెళ్లకుండా యేదో ఒక సాకు చెప్పి కట్టడి చేసాడు. ఇవేమీ తెలియని మొహియార్ యెప్పటిలాగే ప్రతి రోజూ ఆమెకోసం గుడి దగ్గర యెదురుచూడసాగాడు. ఆమె రాకపోవడంతో రేపొస్తుంది మరునాడొస్తుంది అనుకుంటూ అనునిత్యం ఆమెనే తలచుకుంటూ ఆకలి దప్పులు మరచి నిత్యం చంద్రవదననే స్మరించసాగాడు.చంద్రవదనను చూడకుండా వుండలేక, చూచే మార్గం కానరాక, ఆమెను మరచిపోలేక, నిత్యం ఆమెనే స్మరిస్తూ, అనునిత్యం మధుపానంలో మునిగితేలసాగాడు.

రాను రానూ అతని ఆరోగ్యం క్షీణించి, చంద్రవదన స్మరణలోనే ప్రాణాలొదిలాడు మొహియార్. కదిరిలో స్థానికంగా వున్న మొహియార్ వ్యాపార మిత్రులు అతను బ్రతికుండగా, అతనికిది తగదని హితవు చెప్పినా వినక చివరకు యిలా ప్రాణాలు కోల్పోవడంతో, యెంతో దుఃఖించి అతని పార్థివ దేహాన్ని ఖననం చేయడానికై అతని మృతశరీరాన్ని కదల్చాలని యెంత ప్రయత్నించినా మొహియార్ శరీరం అయస్కాంతానికి తగులుకున్న ఇనుపముక్కలాగా ఆ ప్రదేశం నుండి యిసుమంతైనా కదలలేదు. దాంతో వారు యేం చేయాలో పాలుపోక తమలో తాము తర్జన భర్జనలు పడసాగారు. ఇంతలో అటుగా వెల్తున్న ఓ సాధువు మొహియార్ మృతశరీరాన్ని పరికించి, ఇతను యెవరినో చూడాలన్న కడసారి కోరిక తీరకుండానే మృతిచెందాడు అందువల్లే అతని శరీరం ఖననం కోసం కదలడం లేదు. అయితే ఇతను యెవరినైతే చూడాలనుకున్నాడో వారు గనుక వచ్చి ఇతన్ని చూసినట్లైతే ఇతని శరీరం అంతిమ సంస్కారాలకు కదలుతుందని అలా గాకుంటే యెన్ని యేనుగులొచ్చినా యీ పీనుగును యీడ్చలేవని చెప్పాడు.

అతను చూడాలనుకున్నది స్వయంగా పట్నం పాళెగాని కూతురు చంద్రవదన కావడంతో ఆ విషయం ఆ పాళెగానితో యెలా చెప్పాలో తెలీక తమలో తామే మధన పడసాగారు మొహియార్ మిత్రులు. ఈ విషయం దావాలనంగా ఆ నోటా ఈ నోటా కదిరి పట్టణమంతా వ్యాపించి జనం తండోప తండాలుగా వచ్చి మొహియార్ శవాన్ని దర్శించుకొని వెళ్ళసాగారు.
ఈ విషయం కార్చిచ్చులా కదిరికి పండ్రెండు క్రోసుల దూరంలో వున్న పట్నానికి కూడా చేరుకుంది. పట్నం లోని ప్రజలంతా చంద్రవదన మొహియార్ ల విషయమే గుసగసలాడుకోసాగారు. పట్నం కోటలో వున్న చంద్రవదనకు ఈ విషయం ఓ చెలికత్తె ద్వారా తెలిసి యెంతో ఆశ్చర్యపోయింది. తాను కనీసం యేనాడు కళ్ళెత్తి చూడని, పల్లెత్తి కూడా మాట్లాడని ఓ వ్యక్తి తనను ప్రాణాధికంగా ప్రేమించి తను కానరాక నిరాశతో ప్రాణాలొదిలాడని తెలిసి, అతని పార్థివ శరీరాన్ని చూడాలన్న కుతూహలంతో, తండ్రికి చెప్పకుండా చెలికత్తె సాయంతో సామాన్యమైన పడుచువలె కదిరికి బయలుదేరి వెళ్ళి మొహియార్ మృతశరీరమున్న చోటికి చేరుకుంది.

అక్కడికి చేరుకున్న చంద్రవదనకు మొహియార్ మృతదేహం ప్రాణమున్న సజీవశిల్పంలాగా అనిపించింది. అతని అందచందాలకు ముగ్దురాలైన చంద్రవదన, ఇంతటి రూపసి, సౌమ్యశీలి తనను ప్రేమించి, తాను కనిపించక తనకోసం ప్రాణాలర్పించాడన్న కఠోరమైన నిజాన్ని తట్టుకోలేక విభ్రమతో, తీవ్రమైన మనోవేదనకు గురై, ఒక రకమైన వుద్రేకంతో కూడిన వుత్తేజంతో వెళ్ళి మొహియార్ యెడమ చేతిలో, సంతాపంతో తన కుడిచేతిని వేసింది చంద్రవదన. అంతే ఆమె చేయి మొహియార్ చేతికి, యేనుగంత అయస్కాంతానికి ఓ చిన్న ఇనుపముక్క అతుక్కున్నట్లుగా అతుక్కుపోయింది. అక్కడున్న వారంతా శతవిధాలా ప్రయత్నించినా ఆమె చేయి మొహియార్ చేతి నుండి వెలువడలేదు. దాంతో చంద్రవదన అది దైవేక్షగా భావించి మొహియార్ పార్థివ శరీరంతో బాటూ తాను కూడా ఖననానికి సిద్దమయ్యింది.

ఈ విషయం పట్నం పాళెగానికి తెలిసి, అది తమ వంశానికే మాయని అప్రతిష్టలా భావించి, తనకసలు కూతురు పుట్టనే లేదనుకొని చంద్రవదన మొహియార్ ల సమాధి యాత్రలో పాల్గొనలేదు. చంద్రవదన మొహియార్ ల అంతిమయాత్రలో జనం తండోపతండాలుగా పాల్గొన్నారు. చంద్రవదన, మొహియార్ పార్థివ శరీరంతో చేయీ చేయీ కలిపి సమాధిలోనికి సజీవంగా ప్రవేశించింది. వేల సంఖ్యలో హాజరైన ప్రజానీకం ఆమెకు ఆశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. నేటికీ చంద్రవదన మొహియార్ ల సమాధిని మనం కదిరి పట్టణంలో ఖాద్రీ నృసింహ స్వామివారి ఆలయానికి కూతవేటు దూరంలో ప్రభుత్వ ఆసుపత్రికి యెదురుగా సందర్శించవచ్చును. ప్రేమలో పడిన యువతీ,యువకులు నేటికీ చంద్రవదన మొహియార్ ల సమాధిని సందర్శించి, తమ ప్రేమ ఫలించాలని ప్రార్థించి, వారి గుర్తుగా అక్కడి మట్టిని ఓ చిటికెడు తమతో తీసుకెళ్ళడం ఆనవాయితీ.

సంగీతవాణీ

గమనిక : సెయింట్ వాలైంటైన్ ఆనాటి రోమ్ పాలకుడు క్లాడియస్ యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా, శాంతి సామరస్యాలకై పాటుపడుతూ,
ఆనాడు పెళ్ళైన యువకులకు యుద్దంలో పాల్గొనే మినహాయింపును తొలగించలేక అప్పటి పాలకుడు క్లాడియస్ యుద్దానికి యువకుల ఆవశ్యకతై చర్చీలలో పెళ్ళిల్లు చేయరాదని ఆజ్ఞ విధించినప్పటికీ,
వాలైంటైన్ రాజాజ్ఞను ధిక్కరించి, తన చర్చిలో యువకులకు పెళ్ళిల్లు చేసి
వారు యుద్దానికి వెళ్ళకుండా అడ్దుకున్నాడని,
అతన్ని రాజద్రోహం క్రింద భందీ చేసి వురితీసారు!?
అతను యుద్దాలకు వ్యతిరేకంగా శాంతిసామరస్యాల కోసం నాడు చేసిన కృషి!

ఆంగ్లేయుల వ్యాపార సూత్రీకరణలో భాగంగా? డిశంబరులో క్రిస్మస్ కు మొదలైన అమ్మకాలు నూతన సంవత్సర వేడుకల వరకూ కొనసాగి ఇంగా మిగిలిపోయిన అడుగూ బడుగూ ఫిబ్రవరిలో ముగుంచుకొని, మార్చ్ నుండి క్రొత్త పద్దులు వ్రాసుకోవడానికై వాలైంటైన్ డే ను కాస్తా ప్రేమికుల రోజుగా మార్చారు!?

కాబట్టి యువతీ యువకులు ముందుగా మీ ప్రేమలో మొదటి స్థానమైన తల్లిదండ్రులు అక్కచెల్లెల్లు అన్నదమ్ముల్ల ప్రేమలు విస్మరించకుండా భాద్యతతో మెలిగి, జీవితంలో సరిగా స్థిరపడిన తర్వాతే మీ ప్రేమను పెద్దలనొప్పించక ఒప్పించి మరీ వీలు కాని పరిస్థితుల్లో, పెద్దల తోడు లేకున్న మేము ఆర్థికంగా సామాజికంగా కులమతాలపరంగా ఎదుర్కునే కష్టనష్టాలను ఎదురొడ్డగలమనుకున్నప్పుడే ఇలాంటి వాలైంటైన్ డే ల వంటి వాటి గురించి ఆలోచించండి……

అడవల శేషగిరి రాయుడు.

అడవల శేషగిరి రాయుడు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s