నిలువెత్తు విగ్రహంతో, మరువలేని అద్భుతమైన, విస్పష్టమైన వాచకంతో,అద్భుతమైన నటనా పటిమతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అందాల నటీమణి కన్నాంబ.

కన్నాంబ ప్రసిద్ద రంగస్థల నటి, గాయని. చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ.

కన్నాంబ 5 అక్టోబర్‌ 1911 న కడప పట్టణంలో జన్మించింది. ఆమె తండ్రి వెంకట నరసయ్య, తల్లి లోకాంబ. తండ్రి కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండేవారు. వారికి కన్నాంబ ఒక్కటే కూతురు. కన్నాంబ ఎక్కువ కాలం వాళ్ల అమ్మమ్మగారింటఏలూరులోనే పెరిగింది. కన్నాంబ తాత నాదముని నాయుడు. ఆయన వైద్యవృత్తిలో వుండేవారు. కన్నాంబ చిన్నతనంలోనే సంగీతం మీద ఆసక్తి కనబరచడంతో తాతగారు ఆమెకుసంగీతంలో శిక్షణ ఇప్పించారు.
ఈమె జన్మతేది పైన పుట్టిన ఊరు పైన కొంతవివాదం ఉంది. 1911కాదని 1912అని అయితే కన్నాంబ ఓ ఇంటర్వ్యూ లో 1911 సంవత్సరం అని ప్రకటించారు.
కడప లో జన్మించిన ఏలూరు లోనే పెరిగింది.

11వ ఏట నాటకాలు చూడటం మొదలుపెట్టి, ఆ తర్వాత ‘నావెల్‌ నాటక సమాజం’లో చేరి, బాల తారగా పలు పాత్రలు చేసింది.

తన 13వ ఏటనే కన్నాంబ నాటకాల్లో నటించడం ప్రారంభించింది. ఆమెకు పదహారు సంవత్సరాల వయసులో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏలూరు పట్టణంలో సత్యహరిశ్చంద్ర నాటకం జరుగుతోంది. ఆ నాటకానికి కన్నాంబ కూడా వెళ్లింది. చంద్రమతి పాత్రధారి శోకరసంతో పాడాల్సిన పద్యాలను పాడలేకపోవడంతో ప్రేక్షకులు గేలి చేయడం మొదలెట్టారు. ప్రేక్షకుల మధ్య నుంచి కన్నాంబ లేచి రంగస్థలం మీదకు వెళ్లి చంద్రమతి పాత్రను తను పోషిస్తానని ప్రకటించి, వేగంగా ముఖానికి రంగుపూసుకొని వచ్చి పద్యాలు పాడుతూ వుంటే, ప్రేక్షకులు నిశ్చేష్టులై చూస్తూ వన్స్‌ మోర్లు కొట్టడం ఆరంభించారు. దాంతో కన్నాంబ నాటక ప్రస్థానం మొదలైంది. ఇదే నాటక సమాజం వారు కన్నాంబకు సావిత్రి, సత్యభామ, అనసూయ, చంద్రమతి వంటి మంచి మంచి పాత్రలు ఇచ్చి వారి నాటకాలను రక్తికట్టించే ప్రయత్నం చేశారు.

ఆ రోజుల్లో ప్రసిద్ధ రంగస్థల నటీనటులచేత రికార్డింగ్‌ కంపెనీలు నాటక పద్యాలు పాడించి వాటిని రికార్డులుగా విడుదల చేసేవారు. వాటిలో కన్నాంబ పాడిన ‘కృష్ణం భజే రాధా’ అనే ప్రైవేట్‌ రికార్డు శ్రోతల్ని వుర్రూత లూగించింది.

1935లో ‘హరిశ్చంద్ర’ సినిమా
లో మెట్టమొదటనటించడానికి అవకాశం వచ్చింది. అదే ఆమే మొదటి సినిమా.

అందులోఅద్దంకిశ్రీరామమూర్తి హరిశ్చంద్రుడుగా నటించగా చంద్రమతి పాత్రకుకన్నాంబకు పిలుపొచ్చింది. అప్పుడు ఆమె బళ్లారిలో హరిశ్చంద్రనాటకంలో చంద్రమతిగా నటిస్తుండగా దర్శకుడు పుల్లయ్య కన్నాంబను కలిసి తమ సినిమాలో నటించమని ఆహ్వానించారు. అయితే కన్నాంబ ఒక షరతు మీద నటించేందుకు ఒప్పుకుంది. అప్పటికే వాటి బృందంలో 22 మంది కళాకారులు నాటకాల్లో వివిధపాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తను సినిమాల్లోకి వెళ్లిపోతే వారంతా ఆర్ధిక ఇబ్బందులకు గురికావలసి వుంటుంది కనుక వారందరికీ ‘హరిశ్చంద్ర’ సినిమాలో నటించే అవకాశం కలిపిస్తే నటిస్తానని కన్నాంబ చెప్పడంతో అందుకు పుల్లయ్య అంగీకరించారు. అలా భీమారావు, పులిపాటి వెంకటేశ్వర్లు, బందరు నాయుడు, ఆకుల నరసింహారావు వంటి రంగస్థల నటులు సినిమాల్లోకి వచ్చారు. ఈ చిత్రం బాగా విజయవంతమైంది.

కరుణరసం ఉట్టిపడే పాత్రల్లో గాని, వీరరసం ఉప్పొంగే పాత్రల్లో గాని కన్నాంబ నటన వర్ణనాతీతంగా వుండేది. ఆమె కేవలం తెలుగు చిత్రసీమకు మాత్రమే పరిమితం కాలేదు. తెలుగు వాళ్లు ఎంతగా ఆమెను ఆదరించారో అంతే సమానంగా తమిళ ప్రేక్షకులు కూడా ఆదరించారు. అటువంటి గొప్ప నటీమణి, నిర్మాత, గాయని కన్నాంబ .

తన నాటకరంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ‘ చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో “ద్రౌపది”గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది.

కన్నాంబ నటించిన రెండవ సినిమా బెజవాడ సరస్వతి టాకీస్‌ వారు నిర్మించిన ‘ ద్రౌపదీవస్తాప్రహరణము.
హెచ్‌.ఎం.రెడ్డి పర్యవేక్షణలో ఈ చిత్రానికి అతని కుమారుడు హెచ్‌.వి.బాబు దర్శకత్వం నిర్వహించారు. సి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు శ్రీకృష్ణుడుగా నటించగా, ద్రౌపదిగా కన్నాంబనటించింది.

ఈ చిత్ర విజయంతో బెజవాడ సరస్వతి టాకీస్‌ వారు 1937లో ‘కనకతార’ సినిమా నిర్మించారు. అది కన్నాంబ నటించిన మూడవ సినిమా. అందులో కన్నాంబ కమల పాత్ర ధరించింది.
ఈ సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడడంతో కన్నాంబ పేరు తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైంది.

చలన చిత్ర పితామహుడు అనదగ్గ హెచ్.ఎమ్.రెడ్డి, నటి కన్నాంబ లతో కలిసి 1938 లో రోహిణి పిక్చర్స్ స్థాపించారు. అనంతరం కొన్ని కారణాల తో సంస్థ నుండి బయటకు వచ్చారు.

1938లో హెచ్‌.ఎం.రెడ్డి ‘గృహలక్ష్మి’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో కన్నాంబ పతాక సన్నివేశంలో ‘సత్యం జయిస్తుంది… ధర్మం జయిస్తుంది’ అని అరుస్తూ పిచ్చిదానిలా రోడ్డు వెంబడి పరుగెడుతుంది. ఈ సన్నివేశ చిత్రీకరణ మద్రాసులో జరుగుతున్నప్పుడు కన్నాంబ నిజంగానే పిచ్చిదానిలా అడ్డంగా పరుగెడుతుంటే, నిజమేననుకొని పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. తరువాత అది షూటింగ్‌ అని తెలిసి తప్పుకున్నారు. కన్నాంబ నటన అంత సహజంగా ఉండేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

బందరు ‘బాలమిత్ర నాటక సమాజం’లో పనిచేస్తున్నప్పుడు వారు ప్రదర్శించే నాటకాలకు కడారు నాగభూషణం ప్రయోక్తగా వ్యవహరిస్తుండేవారు. అప్పుడే నాగభూషణానికి కన్నాంబతో పరిచయం కలిగింది. వారి పరిచయం పెరిగి ప్రణయంగా మారి ఇద్దరూ దంపతులయ్యారు. కన్నాంబ అతణ్ణి ఇష్టపడి పెళ్లాడింది. అయితే నాగభూషణం అప్పటికే వివాహితుడు కావడంతో ఈ వివాహ వార్తను 1941 వరకు వారిద్దరూ అధికారికంగా ప్రకటించలేదు.

కన్నాంబ-నాగభూషణంల దత్త పుత్రిక రాజేశ్వరిని దర్శకుడు సి.పుల్లయ్య కుమారుడు సి.ఎస్‌.రావుకు ఇచ్చి పెళ్లి జరిపించారు. పెళ్ళి ఆయ్యాక సి.యస్ .రావు సినీనటి రాజసులోచన ప్రేమలో పడ్డారు .
ఈ కారణంగా రాజేశ్వరి సి.యస్ .రావు విడిపోయారు.

కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకుని
‘శ్రీరాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ’ స్థాపించి సినిమా నిర్మాణానికి పూనుకొన్నారు. 1941లో తొలి సినిమా ‘తల్లిప్రేమ’ నిర్మించారు. దానికి జ్యోతిష్‌ సిన్హా దర్శకత్వం వహించారు. ‘తల్లిప్రేమ’ సినిమా విజయవంతమైంది.

తెలుగు తమిళభాషల్లో 22 చిత్రాలు నిర్మించారు ఆమె. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది

ఎం.జి.రామచంద్రన్, ఎన్.ఎస్.రాజేంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, పి.యు. చిన్నప్ప, నందమూరి తారక రామారావు, తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లోఆమెనటించింది.

సినీరంగంలో ఒక వెలుగు వెలిగిన అద్భుత నటీమణి పసుపులేటి కన్నాంబ. కన్నాంబ ఏకంగా 170 సినిమాల్లో నటించి రాణించింది. అప్పటి సినీరంగంలో కన్నాంబ అత్యంత ధనవంతురాలని పేరుంది. ఏడువారాల నగలతో ఇంట్లో ఎక్కడ చూసినా బంగారం కనిపిస్తూ వుండేది. నిలువెత్తు విగ్రహంతో, అద్భుతమైన, విస్పష్టమైన వాచకంతో, అంతే అద్భుతమైన నటనా పటిమతో అలరారిన నటీమణి , నిర్మాత, గాయని కన్నాంబ.

శ్రీ భవాని పిక్చర్స్‌ వారు నిర్మించిన ‘చండిక’ (1940). అందులో చండిక పాత్రను కన్నాంబ పోషించగా, వేమూరి గగ్గయ్య, ఆరణి, బళ్ళారి రాఘవ, లలితాదేవి ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ సినిమాలో
‘నేనే రాణీనైతే, ఏలనె ఈ ధర ఏకథాటిగా…..’ అని ఒక పాట. చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవిగా, ధాటిగా కళ్లెర్రజేస్తూ పాడిన మహానటి పనుపులేటి కన్నాంబ.

‘సతీసుమతి’ (1942) చిత్రం నిర్మించి విజయం సాధించారు. ఈ సినిమా తరువాత కన్నాంబ అనారోగ్యం పాలవడంతో రెండేళ్లు సినిమా నటనకు ఆమె దూరమైయ్యారు. తరువాత 1945లో బయటి సంస్థలు నిర్మించిన ‘మాయాలోకం’, ‘మాయా మశ్చీంద్ర’, ‘పాదుకా పట్టాభిషేకం’ అనే మూడు చిత్రాల్లో కన్నాంబ నటించారు.

చిత్ర వైఫల్యాలు ఆర్ధిక కష్టాలు తెచ్చిపెట్టాయి. కన్నాంబ ఈ సినిమాలలో నటిస్తూవుంటే, నాగభూషణం దర్శకత్వ బాధ్యతలు చేపట్టేవారు. తరువాత ‘శ్రీవరలక్ష్మీ ఫిలిమ్స్‌’ అనే అనుబంధ సంస్థను నెలకొల్పి ‘వీరభాస్కరుడు’, ‘సతీసావిత్రి’ వంటి మరికొన్ని సినిమాలను నిర్మించారు. అప్పుడు చిత్తజల్లు పుల్లయ్య తనయుడు సి.యస్‌.రావు, నాగభూషణం సంస్థలో పనిచేస్తూ వుండేవారు. సి.యస్‌.రావు పనితనం, కార్యదీక్ష నాగభూషణాన్ని బాగా ఆకట్టుకుంది. కలకత్తా కాళీ ఫిలిమ్స్‌ వారి ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమా వచ్చిన ఇరవయ్యేళ్ల తరువాత కడారు నాగభూషణం అదే సినిమాను ‘శ్రీకృష్ణ తులాభారం (1955) పేరుతో మరలా నిర్మించారు. చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. నాగభూషణం స్వయంగా దర్శకుడైవుండి కూడా ఈ సినిమాకు సి.యస్‌.రావును దర్శకునిగా పరిచయం చేశారు. దర్శకునిగా తెలుగులో రావుకు ఇది తొలి సినిమా. తొలి సినిమాతోనే సి.యస్‌.రావుకు మంచి పేరొచ్చింది. ఈ చిత్ర విజయం సి.ఎస్‌.రావుని ఒక ఇంటివాణ్ణి చేసింది.

1952లో నాగభూషణం దర్శకత్వంలోనే ‘పేదరైతు’ అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. సినిమా పరాజయంపాలై అప్పులను మిగిల్చింది.
సంవత్సరంవిరామంతరువాత కన్నాంబస్వయంగా ‘సతీసక్కుబాయి’(1954) చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. అయితే అప్పటికే ‘సతీసక్కుబాయి’ కథ హక్కులు దర్శకులు కె.వి.రెడ్డి వద్ద వున్నాయి. ఆ సంగతి కన్నాంబకు తెలియదు. ‘సతీ సక్కుబాయి’ చిత్రాన్నిరాజేశ్వరి ఫిలింకంపెనీవాళ్లుతీస్తున్నారని తెలిసి కె.వి.రెడ్డి కన్నాంబను కలిసి విషయం ఆరాతీశారు. కన్నాంబ కన్నీళ్లు పెట్టుకొని ‘రెడ్డిగారూ ఈ సినిమాహక్కులు మీవద్ద వున్న విషయం నాకు తెలియదు. మేము రెండు సినిమాలునిర్మించిఅప్పుల పాలయ్యాం. నాగభూషణం గారు చెబితే వినకుండా పేదరైతు, సౌదామిని సినిమాలు నిర్మించారు.

మేము అప్పులబారి నుంచి బయటపడాలంటే వేరే మార్గం లేదు. సక్కుబాయి సినిమాకు జనాదరణ లభిస్తుందనే ధైర్యంతో సినిమా మొదలు పెట్టాము. సహకరించండి’ అంటూ ప్రాధేయపడింది. దాంతో దర్శకుడు కె.వి.రెడ్డి ఆ హక్కులు కన్నాంబకు ఇచ్చి వేశారు. ‘సతీ సక్కుబాయి’ సినిమా బాగా ఆడింది.

కన్నాంబ దాతృత్వం గురించి ఆరోజుల్లోఎన్నోకథలు
చెప్పుకునేవారు. హాస్యనటుడు పద్మనాభం కూడా మద్రాసులో అడుగు పెట్టినప్పుడు భోజనంపెట్టి, వసతి కల్పించిన సాధ్వీమణి కన్నాంబ.వీరికంపెనీలో భోజనం చెయ్యనికళాకారుడు ఆ రోజుల్లో వున్నారంటే ఎవరూ నమ్మేవారు కాదు.

1944-63 మధ్య కాలంలో చాలా తమిళంలో సినిమాల్లో నటించారు. ‘మహామాయ’, ‘తులసి జలంధర’, ‘దైవనీతి’, ‘నవజీవనం’, మంగైయర్కరాశి’, ‘సుదర్శన్‌’, ‘ఎలైవుళవాన్‌’, ‘మూండ్రు పిళైగళ్’, ‘పెన్నరాశి’, ‘తికుప్పిన్‌ తరం’, ‘మక్కలైపేట్ర మగరాసి’ సినిమాలు మచ్చుకు కొన్ని మాత్రమే.

ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే అంజలీ పిక్చర్స్‌ వారి ‘అనార్కలి’ చిత్రంలో జోదాబాయిగా నటించి మెప్పు ప్పొందింది. ‘వదిన’, ‘చరణదాసి’, ‘ఉమాసుందరి’, ‘తోడికోడళ్ళు’, ‘ఆడపెత్తనం’, ‘శ్రీకృష్ణమాయ’, ‘కార్తవరాయని కథ’, ‘మాంగల్య బలం’, ‘రాజమకుటం’, ‘రేచుక్క-పగటిచుక్క’, ‘అభిమానం’, ‘మాబాబు’, ‘పెళ్లి తాంబూలం’, ‘ఉషాపరిణయం’, ‘లవకుశ’, ‘పరువు-ప్రతిష్ట’ వంటి సినిమాల్లో చక్కటి నటనా పటిమను ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరణకుపాత్రురాలయ్యింది.

సొంత బ్యానర్‌ మీద కన్నాంబ 30 సినిమాల దాకా నిర్మించారు. ‘నవజీవనం’ అనే సినిమాకు రాష్ట్ర బహుమతి లభించింది.

పసుపులేటి కన్నాంబ నేపధ్య గాయనిగా చేసిన చిత్రాలు
1.సుమతి (1942)
2.తల్లిప్రేమ (1941)
3.గృహలక్ష్మి (1938)

కన్నాంబగొప్పఐశ్వర్యవంతురాలు అనీ, బంగారు కాసులు డబ్బాల్లో పోసి, పప్పులు, ఉప్పులు పెట్టుకునే డబ్బాల మధ్య ఎవరికీ తెలియకుండా ఉంచేవారనీ చెప్పుకునేవారు.

రెండు భాషల్లో ‘దక్షయజ్ఞం’ చిత్రం నిర్మించి భారీగా నష్టపోయారు.

ఐశ్యర్యం ఎలా వస్తుందో ఎలా పోతుందో వరూ చెప్పలేరని పెద్దలు చెబుతారు. ఎలా పోయాయో, ఏమైపోయాయో గాని కన్నాంబ మరణంతో కంపెనీతో సహా అన్నీ పోయాయి. ఆమె భర్త నాగభూషణం ఒక చిన్నగదిలో ఉంటూ కాలక్షేపం చేసేవారు.ఈయన1976లో చనిపోయారు.

తెలుగులో కన్నాంబ నటించిన ఆఖరి చిత్రం నాగయ్య నిర్మించిన ‘భక్తరామదాసు’. అందులో రామదాసు భార్యగా కన్నాంబ నటించింది.

కన్నాంబ 7మే 1964న 52 ఏళ్ల వయస్సు లో చెన్నైలో
మరణించారు.

కన్నాంబ మృతదేహాన్ని వారి కులాచారం ప్రకారం నగలతోనే పూడ్చిపెడితే దొంగలు ఆ నగలను కాజేసి ఆమె శవాన్ని కూడా మాయం చేశారట.

కన్నాంబ మరణంతో కంపెనీతో సహా అన్నీ పోయాయి. ఆమె భర్త నాగభూషణం ఒక చిన్నగదిలో ఉంటూ కాలక్షేపం చేసేవారు.
ఈయన1976 లో చనిపోయారు. కన్నాంబ సినీ జీవితం మరువలేనిది.


సేకరణ:– చందమూరి నరసింహారెడ్డి. ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

చందమూరి నరసింహారెడ్డి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s