
సర్పంచ్ అంటే గ్రామంలో సిమెంటు రోడ్లు వీధిలైట్లు వేయించడం వాటర్ ట్యాంక్ నిర్మించి రక్షిత తాగునీరు అందించడం ప్రజల సమస్యలు ప్రజల సమక్షంలో చర్చించి మెజార్టీ ప్రజల నిర్ణయం గౌరవించి పంచాయతీ సమావేశంలో తీర్మానం చేసి అమలు చేయడం ఇలా భాద్యత కలిగిన పదవి ఇది.
సర్పంచ్ అంటే కేవలం నాయకుల విగ్రహాలకు దండలేసి, సభల్లో నాలుగు ముక్కలు మాట్లాడడం కాదు!
సర్పంచ్ అంటే కేవలం సంతకాలు పెట్టడం, ఖద్దరు బట్టలేసుకుని కారులో తిరగడం కాదు!
సర్పంచ్ అంటే ప్రాథమిక అవసరాలైన విద్య, ఆరోగ్యం, ఉపాధిని గ్రామంలో అందరికీ అందేలా చేయడం!
సర్పంచ్ అంటే గ్రామంలో ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేయడం!
సర్పంచ్ అంటే యువతకు దిశా నిర్దేశం చేసి చైతనం కలిగించడం.
సర్పంచ్ అంటే నీతినియమాలతో, కుల మతాలకతీతంగా ప్రజలని పరిపాలించడం!
సర్పంచ్ అంటే గ్రామ ఆదాయాన్ని పెంచే అవకాశాలను వెతకడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్వచ్చంద సంస్థల నుండి వచ్చే ప్రతి రూపాయిని ఒడిసిపట్టడం! ఖర్చు చేసిన ప్రతిరూపాయి ప్రజాక్షేత్రంలో వివరించగలగడం! ప్రతి పైసా సద్వినియోగం జరిగేలా చూడటం.నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేయడం.
సర్పంచ్ అంటే భూమిని పరిరక్షించి రైతు, కూలీల మధ్య స్నేహభావం పెంచడం!
సర్పంచ్ అంటే గ్రామ మహిళలకు వారి పధకాలను వివరించి,సమానత్వం దిశగా అడుగులు వేయించడం!
సర్పంచ్ అంటే పేద, వితంతు, వికలాంగులకు సాయం చేయడం, నిరుపేదలకు అనాధలకు చేయూతనివ్వడం!
సర్పంచ్ అంటే ఊరంతా పచ్చదనం నిండేలా చేసి, దోమలు లేని పరిశుభ్రమైన వాతావరణం ప్రజలకి కల్పించడం!

సర్పంచ్ అంటే ఊరి ప్రజలందరినీ ఒకే తాటిపై నిలబెట్టి, అందరిని గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు చేయడం!
సర్పంచ్ అంటే 24 గంటలు ఊరు కోసమే కలలు కనడం, ఆ కలలను నెరవేర్చుకోవడం, ఊరి ప్రజల గుండెల్లో దేవుడై గుడి కట్టుకోవడం!
సర్పంచ్ అంటే వయసు రీత్యా కాదు ఆలోచనల రీత్యా పెద్దవాడై ఉండటం!
సర్పంచ్ అంటే గ్రామంలో పేదలకు ‘సేవకుడిలా’ ఆడవారికి ‘రక్షకుడిలా’ ప్రభుత్వ పథకాలను ప్రజలకు సరిగా అందేలా చూసే సంధానకర్త గా ఉండాలి!
సర్పంచ్ కి ఒక కలెక్టర్ కు ఉన్నంత ముందుచూపు ఉండాలి! ఒక సైనికుడికున్నంత ధైర్యం వుండాలి! నిలువెత్తు నిజాయితీపరుడై ఉండాలి!
సర్పంచ్ కి ఉండాల్సింది ధనం కాదు! గుణం!
ఎలక్షన్లో అటువంటి సర్పంచ్ ని మీరే ఎన్నుకోండి! మంచి మార్పుకు శ్రీకారం చుట్టండి.
ఆలోచించండి! ఆచరించండి!!
