
ఆదికవి నన్నయ్య మొదలు నాటి నుండి నేటి వరకు ఎందరో మహానుభావులు, భాషా పండితులు మన తెలుగు సాహితీ భాండాగారాన్ని తమ అనిర్వచనీయమైన రచనలతో నింపి తెలుగు తల్లికి సదా నీరాజనాలు అర్పిస్తూనే ఉన్నారు.
వేలమంది తెలుగు కవులు తమదైన శైలిలో ఎన్నో రచనలను మనందిరికీ అందించి మనకు భాష మీద మమకారం రెట్టింపు అయ్యేందుకు, మనలో అణగారిపోతున్న భాషా శ్వాసకు ఊపిరి పోసి మన తెలుగు భాష పరిరక్షణకు పూనుకొన్నారు.
అటువంటి ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొంది, మన తెలుగు రాష్ట్ర గీతమైన
“ మా తెలుగుతల్లికి మల్లెపూదండ…” ని రచించిన శ్రీ శంకరంబాడి సుందరాచారి తెలుగు వారందరికీ ఆదర్శమూర్తి.
శంకరంబాడి సుందరాచారి
తనపేరులో తేటగీతి ఛందస్సు ఉందని గ్రహించి 15వేల తేటగీతులను పలికించాడేమో. ఆ కలం ఒరవడి లో ఆటవెలదులు ఆడుకొన్నాయి. పాటలు పరవశించి పోయాయి. ఈయన ఋర్రకథలు ఎందరో బుర్రలకుపదును పెట్టాయి.
శంకరంబాడి సుందరాచారి, 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించాడు. తల్లి కమలమ్మ, తండ్రి రాజగోపాలాచారి.
తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు.
మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన.
తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపునకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు.
ఆంధ్ర పత్రికలో ప్రూఫ్ రీడర్ గా ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.

అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్ర పత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు “నీకు తెలుగు వచ్చా” అని అడిగాడు. దానికి సమాధానంగా “మీకు తెలుగు రాదా” అని అడిగాడు. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు.
ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి.
తర్వాత 1939 లో చిత్తూరు బోర్డు హైస్కూలులో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు.మధ్యలో రెండేళ్లు సెలవు పెట్టి చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో
దీన బంధు చిత్రానికి మాటలు, పాటలు రాశారు. ఆ సినిమా లో నటించారు.
నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు.
తన పై ఉన్నతాధికారి వచ్చి చేతి సంచిని అందివ్వబోతే తిరస్కరించి, ఆఫీసు జవానుకు, ఇన్స్పెక్టరుకు తేడా తెలియని వ్యక్తి విద్యాశాఖలో ఉండటం గర్హనీయమంటూ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం ఆయనది.
ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం ఎవరినీ యాచించని, చేయిచాపని గుణం ఆయనిది.
సుందరాచారి బాల్యం నుంచే గేయాలు, కవితలు రాసేవారు. ఆయన రచించిన ‘బుద్ధ గీత’ ‘ఏకలవ్య’ బాగా ప్రాచుర్యం పొందాయి. పండిత నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబూ రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు సుందరాచారిని ప్రశంసించారు.
1975లో జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహా సభలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాన్ని
రాష్ట్ర గీతంగా గుర్తించి, విద్యాలయాల తరగతులు ప్రారంభించ డానికి ముందు విధిగా పాడాలనిఆదేశించింది.
అప్పటి విద్యాశాఖామంత్రి మండలి వెంకట కృష్ణారావు ‘మా తెలుగు తల్లి’ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు.
మరపురాని ఘటన: హైదరాబాద్‌లో 1975 ఏప్రిల్ 12న ఉగాదినాడు తొలి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమై ఆరురోజుల పాటు వైభవంగా జరిగాయి.
సభ ప్రారంభంలో మా తెలుగుతల్లికి గీతాన్ని ఆలపించడానికి టంగు టూరు సూర్యకుమారిని ఇంగ్లండ్ నుంచి పిలిపించి పాడించారు.
ఆ సమయంలో సదరు గేయకర్త ఎవరు అనే ప్రశ్న అక్కడున్న వారికి వచ్చింది. అక్కడే సభలో దూరంగా వెనుకవైపు ఒక వ్యక్తి చిరిగిన బట్ట లతో, దయనీయ స్థితిలో నిలబడి ఉన్నాడు.
ఆయ నెవరో కాదు శంకరంబాడి సుందరాచారి. అక్క డున్న కొంతమంది ఆయనను గుర్తించారు. వేదికపై ఉన్న మహాసభల నిర్వాహకులు మండలి వెంకట కృష్ణారావు స్వయంగా సుందరాచారిని వేదికపైకి తీసుకెళ్లి సత్కరించి, ప్రభుత్వం తరపున 250 రూపాయల జీవితకాల గౌరవవేతనం ప్రకటించింది.
మద్రాసు ఆంధ్రపత్రికలో
కళావని శీర్షికతోతను రాసిన వ్యాసాలు మంచి గుర్తింపు పొందాయి.
సంపాదకులుగా పదోన్నతి పొంది ”కళావని శీర్షిక నిర్వహించారు. ఆ కాలం లో కొన్ని గ్రామ్‌ఫోన్ కంపెనీలవారి కొరకు పాటలు రాశారు.

”బిల్హాణి ”దీనబంధు చిత్రాలకు పనిచేశారు. డాII సర్వేపల్లి రాధాకృష్ణకి తన కవితలు స్వయంగా చదివి వినిపించి వారి అభినందనలు అందుకున్నారు. రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నగదు బహుమతితో సన్మానించారు.
15,000 పైగా తేటతెలుగులో రామాయణ భారత, భాగవతాలు రచించారు. 1961లో రవీంద్రుని గీతాంజలికి సుందరాచారి అనువదించారు. అలా ఎందరో సాహితీమూర్తుల అభిమానానికి పాత్రులైనారు.
1966 సంవత్సరంలో సంగ్రహవాల్మీకి సుందర రామాయణాన్ని ప్రచరించారు. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో ప్రముఖ సాహితీమూర్తులు రాయప్రోలు సుబ్బారావ్ఞ, మానపల్లి రామకృష్ణకవి పాల్గొని సుందరాచారి కి ” ప్రసన్నకవి ” బిరుదు ప్రదానం చేశారు.
ఆ పుస్తకాన్ని గానకళా ప్రపూర్ణ రాళ్ళపల్లి అనంతశర్మగారికి అంకితం ఇవ్వబడింది. ఎన్నడూ కీర్తి ప్రతిష్టలు ఆశించక నిరాడంబరుడిగా సాహిత్య సేవలే జీవిత లక్ష్యంగా వ్యక్తిగత జీవితంతో నిరంతరం పోరాటం సాగించారు సుందరాచారి.
తన పన్నెండో ఏటనే తెలుగులో కవి త్వం రాయటం ప్రారంభించిన సుందరాచారి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండకావ్య, కథారచనలే కాక, వేలాది ఉపన్యాసాలు కూడా చేశారు. నాస్వా మి, గీతాంజలి వంటి కావ్యరచనలు, కెరటాలు, సుందర సుధాబిందువులు వంటి ఖండకృతులు, గాలిమేడలు, అరాచకం వంటి దృశ్య కృ తులలో నాటకాలు, బుద్ధగీత, ఏకలవ్యు డు వంటి ప్రబోధ రచనలు, శాంతి దూ తలు, రంగిరాస్యం వంటి జానపద రచ నలు చేశారు.
ఎన్ని రచనలు చేసినప్పటికీ వీరి ప్రతిభకు తార్కాణంగా నిలిచిన రచనే ‘
మా తెలుగు తల్లికి మల్లెపూదండ’. భారతదేశానికి ‘జనగణమన’ జాతీయ గీతమైనట్లే, ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ తెలుగు జాతికి రాష్ట్ర గీతమైంది.

శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయము “ప్రసన్న కవి” అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు.
తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు. “నా పేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతిలో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టం” అనేవాడు ఆయన. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది.
మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, బలిదానం అనే కావ్యం వ్రాసాడు. ఆ పద్యాలను పాఠశాలలో పిల్లలకు ఆయనే చదివి వినిపించాడట.
ఆ పద్యాలలోని కరుణ రసానికి పిల్లలు రోదించారని ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి చెప్పాడు
సుందర రామాయణం అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం కూడా వ్రాసాడు.
తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుధ్ధ చరిత్ర కూడా రాసాడు.
రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు.
మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించాడు.
సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. జానపద గీతాలు వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు. ఇవే కాక అపవాదు, పేదకవి, నాస్వామి, నేటికవిత్వము, బలిదానము, కార్వేటి నగరరాజ నీరాజనము మొదలైనవి వీరి ఇతర రచనలు.
ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ నెహ్రూను కలిసాడు. తాను రచించిన బుధ్ధ చరిత్ర లోని ఒక పద్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ఆయనకు వినిపించాడు. నెహ్రూ ముగ్ధుడై ఆయనను మెచ్చుకుని 500 రూపాయలు బహూకరించాడు.
పలువురు పలు సందర్భాలలో
శంకరంబాడి గురించి అన్న మాటలు …
స్వర్గీయ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారన్నారు- మృదువైన పదములు, మధురమైన శైలి, మంచి కల్పన కలిగి వీరి కవిత్వము అనందము నాపాదించకలిగి ఉన్నది.
కీ.శే.కవిసాంరాట్ విశ్వనధ సత్యనారాయణ అన్నారు- తెలుగు పలుకుబై, కవితాశక్తి, సౌకుమార్యము, ఈమూడు గుణములు మూటకట్టి వీరు పొత్తములను రచించుచున్నట్లున్నది.ఈ యుగములో వీరిదొక ప్రత్యేక వాజ్మయముగా ఏర్పాటు కాబోవుచున్నట్లున్నది. వీరిశైలి సంస్కృత సమాసములనుండియు, మారుమూల పదములనుండియు విడివడి సరళమైనది.
శ్రీగడియారం వేంకటశేషశాస్త్రి అంటారు: ఈతని శైలి మిక్కిలి సరళమైనది. భాష సుగమనమైనది. ధార సహజమైనది. పోకడలు, ఎత్తుగడలు, అలంకారములు చమత్కారములు, మున్నగు ప్రసాధనము లన్నియు సుమచిత సన్నివేశములే భావ శ్రుతిలో మేళవించినవి.

శ్రీరాయప్రోలు సుబ్బారావుగారు మాటలలో-సుందరాచారి గారి సూక్తి ఎంత తేటగా సూటిగా వినబడుతుందో అంత స్ఫురితంగా సుదూరంగా ధ్వనిస్తుంది. ఇది ఈ కవి రచనలలోని అనన్య విశిష్టత.
శ్రీమాన్ రాళ్ళపళ్ళి అనంతకృష్ణ శర్మ గారు:తేటగీతుల తెలుగు తీదీపిరుచుల యూట….కొంకుల కొసరుల కాటుపడక సారతరమిది సుందరాచారి కవిత.
సుందరాచారి చివరిరోజులు చాలా దుర్భ రంగా గడిపారు. తిరుపతి వీధుల్లో బికారిగా తిరు గుతూ జీవించారు. చివరి దశలో తన శిష్యుడు మన్న వ భాస్కరనాయుడు ఇంట్లో ఉండేవారు. అనారో గ్యంతో 1977 ఏప్రిల్ 8న తుదిశ్వాస వదిలారు. మా తెలుగుతల్లికి మల్లెపూదండ గేయం తెలుగు ప్రజలు పాడుకుంటున్నంత కాలం ఆయన ఏనాటికైనా తెలు గువారికి చిరస్మరణీయుడే.
2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణము తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో సుందరాచారి జ్ఞాపకార్ధం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పట్ల కృతజ్ఞతా సూచకంగా విగ్రహం దగ్గర నిరంతరం మా తెలుగు తల్లికీ పాట నిరంతరంగా వినిపించే ఏర్పాటు చేసింది.
ప్రతి రోజూ వేలాది పాఠశాలల్లో లక్షలాది విద్యార్థులు గతంలో మన రాష్ట్ర గీతమైన ‘మా తెలుగు తల్లికి మల్లెపూల దండ’ని రాగయుక్తంగా ఆలపించేవారు.
కానీ ఈ తరం విద్యార్థులకు గేయ రచయిత గురించి పెద్దగా తెలియదు.ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెరిగిన నేపథ్యంలో ఆయా పాఠశాలల యాజమాన్యాలు తెలుగుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
ఫలితంగా ‘మా తెలుగు తల్లి’ గేయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. ఇక గీత రచయిత శంకరంబాడి సుందరాచారి గురించి తెలిసే అవకాశం లేదు.
‘సుందర కవి’గా పేరు పొందిన శంకరంబాడిసుందరాచారి చిరస్మరణీయులు.
✍️సేకరణ:–చందమూరి నరసింహారెడ్డి
