రేనాటి చోడుల రాజధాని చెప్పలి లో ప్రాచీన అగస్త్యేశ్వర ఆలయం.source: rayalaseema fb

‘ఎరికల్’ అన్న పదానికి తెలుగు భాషా చరిత్రలో, తెలుగువారి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి తెలుగు శాసనం కలమళ్ల శాసనం ఎరికల్ ముతురాజు ధనుంజయుడు వేయించగా, ఎర్రగుడిపాడు శాసనంలో కూడా ‘స్వస్తిశ్రీ ఎరికల్ముత్తుర్రాజు’ అని ఉంటుంది.

తొట్టతొలి తెలుగు శాసనాల్లో (కలమళ్ళ, ఎర్రగుడిపాడు, తిప్పలూరు, ఇందుకూరు మొ.) మనకు ప్రధానంగా మూడు సారూప్యతలు కనిపిస్తాయి.

  1. అన్నీ కడప జిల్లాలో లభ్యమైనవి
  2. అన్నీ రేనాటి చోళులు వేయించినవి
  3. వాటిల్లో ‘ఎరికల్’ అన్న పదం ఉండటం

రేనాటి ప్రాంతాన్ని పాలించిన చోళులు కాబట్టి రేనాటి చోళులు. వీరి రాజధాని చెప్పలి. అయితే వీరి శాసనాలలో ఎక్కువగా కనిపించే ‘ఎరిగల్’ వీరి తొలి రాజధాని అయ్యుంటుంది అని చరిత్రకారుల అభిప్రాయం. ఇప్పుడు ‘ఎరిగల్’ పేరుతో ఏ ఊరు లేదు. రేనాడులో ఉన్న ఊరు, రేనాటి చోడులకు సంబంధించిన ఊరు అని తప్ప మరే ఇతర ఆధారాలు లేవు.

వీటి ఆధారంగా చరిత్రకారులు కర్ణాటకలోని (అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతం) ‘నిడుగల్’ ప్రాంతమే ‘ఎరిగల్’ అని భావిస్తూ వచ్చారు. ‘నిడుగల్’ చోడ వంశం ఉండటం, ‘ఎరిగల్’ పేరుతో ‘నిడుగల్’ కొంచెం సారూప్యత ఉండటం వల్ల చరిత్రకారులు ఈ అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. అయితే చరిత్రకారులు ఆ భావనకు వచ్చిన తర్వాత కూడా అనేక రేనాటి చోడుల శాసనాలు లభ్యమయ్యాయి. ఇటీవల సిద్దవటం వద్ద కొన్ని రేనాటి చోడుల శాసనాలు లభ్యమవుతున్నాయి.

లభ్యమవుతున్న కొత్త శాసనాల ఆధారంగా మరియు ఇతర ఆధారాల ప్రకారం ‘ఎరిగల్’ అన్నది కర్ణాటకలోని ‘నిడుగల్’ కాదని కడప జిల్లాలోని ‘ఎర్రగుడిపాడు’ అని ప్రస్తుతం చరిత్రకారులు సూత్రీకరిస్తున్నారు

కారణాలు:

  1. ‘రేనాడు’ ప్రాంతానికి ఒక్కో చరిత్ర కారుడు ఒక్కో విధమైన భూభాగాన్ని సూచిస్తూ వచ్చారు. రేనాటి సూర్యచంద్రులు పుస్తకం రచించిన తంగిరాల సుబ్బారావుగారి ప్రకారం కుందూనది పరీవాహక ప్రాంతాన్ని ‘రేనాడు’అంటారు. అత్యధిక చరిత్రకారుల ప్రకారం రేనాడు ప్రాంతం ప్రధానంగా కర్నూలు-కడప ప్రాంతం
  2. రేనాటిచోడుల శాసనాలు, ‘ఎరిగల్/ ఎరికల్’ అన్న పదం ఉన్న శాసనాలు ‘నిడుగల్’ ప్రాంతంలో అలభ్యం(?). కానీ ఇలాంటి శాసనాలు అత్యధికంగా ఎర్రగుడిపాడు చుట్టుపక్కల ప్రాంతాలు, కడప జిల్లాలోనే లభ్యమవడం విశేషం. పైగా స్వయంగా ‘ఎర్రగుడిపాడు’లోనే రేనాటిచోడుల శాసనం, ‘ఎరిగల్’ పదం ఉన్న శాసనం లభ్యమయ్యింది
  3. రేనాటి చోడుల రాజధాని చెప్పలి గ్రామం ఈ ‘ఎర్రగుడిపాడు’ గ్రామానికి ఎంతో సమీపంలో ఉంది. చెప్పలికి కేవలం 15 కిమీ దూరంలో ఎర్రగుడిపాడు ఉండగా, 200 కిమీ పైగా దూరంలో నిడుగల్ ఉంది
  4. ‘ఎరిగల్’ అన్న శబ్దంతో / పదంతో ‘నిడుగల్’ శబ్దం కన్నా ‘ఎర్రగుడి’ అన్న శబ్దం / పదం ఎక్కువగా కలుస్తోంది.

‘ఎరిగల్’ లో ‘ఎర్రగుడి’లో మొదటి మూడు అక్షరాలు సారూప్యం కలిగి ఉన్నాయి. ‘పాడు’ అన్నది ‘గ్రామ’ నామంలో ప్రధాన భాగం కాదు. ఒక శిథిల గ్రామం స్థానంలో / సమీపంలో కొత్త గ్రామం ఏర్పడితే ఆ గ్రామ నామంలో ‘పాడు’ అన్న పదం వస్తుందని కట్టా నరసింహులు గారి భావన. చివారగా కర్నూలులో కూడా ఒక ‘ఎర్రగుడి’ ఉన్నది కానీ, శాసనాలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే రేనాటి చోడుల శాసనాల్లో కనిపించే ‘ఎరిగల్’ అన్న పదం కర్ణాటకలోని ‘నిడుగల్’ అన్న ప్రాంతన్నో కర్నూలులోని ‘ఎర్రగుడి’ ప్రాంతాన్నో కాక కడప జిల్లా, కమలాపురం మండలంలోని ‘ఎర్రగుడిపాడు’ గ్రామమని స్పష్టమవుతుంది.

కాలక్రమంలో ‘ఎరిగల్’ ‘ఎర్రగుడి’ గా మరి ఉండవచ్చు. ‘ఎర్రగుడి’ రేనాటి చోడుల స్వస్థలం / మొదట పాలించిన ప్రాంతం (రాజధాని) అయ్యి ఉండొచ్చు. క్రమంగా ఆ గ్రామం శిథిలమవ్వగా అక్కడే ఆడిపేరుతో మరో గ్రామం ఏర్పడి ఉంటుంది. అదే నేటి ఎర్రగుడిపాడు.

ఈ ఎర్రగుడిపాడు కమలాపురం – యర్రగుంట్ల మధ్యన ఉంది. ఈ విధముగా తొలి తెలుగు శాసనాలు, అవి వేయించిన రేనాటి చోడ రాజులు కడప జిల్లావారే అన్న విషయం స్పష్టమవుతోంది.

ఆధారం:(Rayalaseema fb నుండి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s