
మద్యం అలవాటుకు బానిసలైన వారు దాని నుండి తప్పించుకోవడానికి పాండురంగ మాల వేసుకునే విధానం దేశంలోనే ప్రధమంగా మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.అదెక్కడంటే అనంతపురం జిల్లా, రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో. అక్కడ కొలువైన ఆ పాండురంగ స్వామే మద్యాన్ని మానిపించే దేవుడు.
ఉంతకల్లు, అనంతపురం జిల్లా, బొమ్మనహాళ్ మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన బొమ్మనహాళ్ నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బళ్ళారి (కర్ణాటక) నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.
రాయదుర్గ లో రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుండి ఆటోలో ఎక్కి సమీపాన ఉన్న ఉంటకళ్ (ఉంతకల్లు) పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. బళ్లారి నుండి వచ్చేవారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గం వరకు చేరుకొని, అక్కడి నుండి ఉంటకల్లు దేవాలయానికి వెళ్ళవచ్చు.
ఉంతకల్లులో ఉన్న పాండురంగ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రామస్తులందరూ భక్తి శ్రద్దలతో పూజా కార్యాక్రమాలను నిర్వహిస్తుంటారు.ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పాండురంగ స్వామి దేవాలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు.
కొన్ని శతాబ్దాల క్రితం ఈ ఊరు ప్రజలు తరచూ మహారాష్ట్ర లోని పుణ్యక్షేత్రమైన ‘పండరీపురం’ వెళ్లివచ్చేవారు. ఆతర్వాత ఇక్కడే ఒక దేవాలయాన్ని నిర్మించుకొని పాండురంగ స్వామి దేవాలయం గా పేరుపెట్టుకున్నారు.
మద్యానికి బానిసైనవారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి పాండురంగ మాల ధరిస్తే మళ్ళి జన్మలో దాని జోలికి పోరనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. మాల ధరించిన ఏ ఒక్కరూ మళ్లీ ఇప్పటివరకు మద్యం జోలికి వెళ్లలేదని స్థానికులు చెపుతున్నారు.
పాండురంగ మాల’ ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రోజుపడితే ఆరోజు వేసుకోకూడదు. మాలాధారణ నిర్వహణ నెలలో కేవలం రెండు రోజుల మాత్రమే ‘శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి’ రోజుల్లోనే మాల ధరించాలి. ఆ రోజులలో రాష్ట్రం నలుమూలల నుంచే కాక పక్కనున్న కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో హాజరవుతుంటారు.
పాండురంగ మాల వేసుకునే విధానం
పాండురంగ మాల ధరించాలనుకొనేవారు ముందుగా 100 రూపాయల ధర చెల్లించి టోకెన్ తీసుకోవాలి. ముందురోజు అర్ధరాత్రి నుంచి మాలను స్వామి వారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు చేస్తారు. మాల ధరించేవారు ఉదయాన్నే నిద్ర లేచి స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకోవాలి. గుడి ప్రాంగణంలో టోకెన్ నెంబర్ ప్రకారం క్యూ లైన్ లో నిల్చోవాలి. ఇలా నిల్చున్న భక్తులకు ఆలయ ప్రధాన పూజారి వచ్చి వారి మెడ లో మాల వేస్తారు.
ఆరోజున ఎంత ముందైతే భక్తులు వస్తారో, అంతమందికి ఉచిత భోజనాన్ని గ్రామస్తులే వండి, వడ్డిస్తారు. టోకెన్ కు 100 రూపాయలు తప్ప ఇంక దేనికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాలధారణ చేసిన వారు వరుసగా మూడు ఏకాదశ రోజులలో ఇక్కడికి వచ్చి ఆలయ ప్రాంగణంలో నిద్రపోవాలి. ఆ మూడు ఏకాదశ రోజులు అయిపోయినాక మాల తీసేయవచ్చు.