
నేటి యక్షగానంలో ఇతరులు పాడుతుంటారు.పాటకు అనుకూలంగా కొందరు ఆడుతారు కథను నడిపే విధానం ముచ్చటగా ఉంటుంది. తోలుబొమ్మలాలు కూడా యింతే. కథను పాటగా పాడుతుం టారు మాటలు చెపుతూ నడుపుతారు పాత్రలకు ప్రత్యేక పాటలుంటాయి. తేడా అల్లా ఒక విషయంలోనే ఉంటుంది. యక్షగానంలో మనుషులు ఆడతారు. తోలు బొమ్మలాటలో బొమ్మలను ఆడిస్తారు. రెంటినీ పోల్చి చూచినపుడు కథనుచెప్పే విధానము ఒకటి గానే ఉంటుంది. ఈనాడు జక్కుల వారు చేసేనృత్యాలు కన్పించవు. కాని యక్షగానాలు చాలా మంది ఆడుతున్నారు.
‘జక్కులవారి కులదేవతలు అక్కదేవతలు. అక్కదేవతలకొండ పేరుతో పిలవబడే పర్వతం అనంతపురం జిల్లాలో ఉంది. అందువలన ఈ విద్య రాయలసీమలోనే ప్రారంభమైందని పండితులు చెపుతారు.”
రాయలసీమలోని అనంతపురం జిల్లాలోజక్కుల వారి కులదేవతైన అక్కదేవతల కొండ వుండడాన్ని బట్టి యక్షగానానికిది మూలమని చెప్పవచ్చు. ఈ నాటికీ గుంటూరు ,గోదావరి జిల్లాలో వున్న జక్కులవారు కళావంతుల కోవకు చెంది అభినయ కళలో ప్రావీణ్యం సంపాదించారు.
జక్కుల వారు ఇక్కడ నుండి బయలుదేరి దక్షిణ దేశమంతాసంచారం చేశారు. వీరి ద్వారా యీ విద్య పలు ప్రాంతాలకు వ్యాపించింది. ఆదరించబడింది. వీరిశైలివృద్ధిపాంది, నృత్యనాటికలో కలసి పోయింది. కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకతను పొందింది.
ఇంతకీ యక్షులెవరు?
ఇంతకీ యక్షు లెవరో తెలుసుకోవాలనుకుంటే మనకు క్రింది ఆధారాలు లభిస్తున్నాయి. బౌద్ధ, జైన, బ్రాహ్మణ సారస్వతాలలో “యక్షులను” దేవతాగణంగా పేర్కొన్నారు. వారు నీతి ప్రవర్తకులనీ, కామరూపులనీ, శూరులనీ, జిజ్ఞాసకులనీ వివరించారు.
ప్రారంభంలో వారి నివాస భూమి సింహళమనీ, వారి రాజు కుబేరుడనీ, బలి చక్రవర్తి సేనాని సుమాలి ఈ యక్షులను ఓడించి రాక్షస రాజ్యం స్థాపించాడనీ, మరికొన్ని గ్రంథాలలో రావణుడు లంకను జయించి కుబేరుని వెడలగొట్టి రాక్షస రాజ్యం స్థాపించాడనీ, వివరింప బడింది.ఓడిపోయిన కుబేరుడు దక్షిణ భారతదేశానికి తన అనుయాయులతో వలస వచ్చాడనీ, చెపుతారు.
యక్షులు “అక్షసీ” నదీ ప్రాంతంవారో లేక “గూచి” అనబడే మంగోలియన్ లో అనీ.
కీ॥శే॥ సురవరం ప్రతాపరెడ్డి గారు తమ అంధ్రుల సాంఘిక చరిత్రలో తమ ఆభిప్రాయం వెలిబుచ్చారు.
ఈయక్షులు ఎవరైనా,
… మేళము గూడి పాడుచుందురు. దిక్పాల సభల (అని పారిజాతాపహరణం) లోనూ. కిన్నెరలు పాట పాడుచుండగా, తాళసంఘ ప్రభేదంబుల గతులనే యక్ష కామినులు నాట్యంబు లాడేవారని రామాభ్యుదయం లోనూ,మంగళమస్తు రమానాథ యని, యక్షు వనితలు కర్ణపర్వముగా పాడేవారని చిత్రభారతం లో వివరించడాన్ని బట్టి, యక్షులు నృత్యగానాల్లో ప్రజ్ఞావంతులని వెల్లడౌతోంది.
ఇలా నృత్యగానాలలో ప్రజ్ఙావంతులైన యక్షులు సింహళం వదలి దక్షిణ భారత దేశానికి వలస వచ్చిన జక్కు జాతి వారని పలువురి అభిప్రాయం.
సింహళంలో వాడుక భాష పాళి, సంస్కృత యక్ష శబ్దానికి ప్రాకృతం “ఎక్కులు” తెలుగు తద్భవం “జక్కులు”. జక్కుల వారు వలస వచ్చిన వారైనా ఆదిమ వాసులైనా వారు సంగీత నృత్య కళాకారులన్న మాట నిజమంటూ, వీరి పేరనే “జక్కిణి రేకులు” “జక్కిణి దరువు” “జక్కిణి నృత్యం” వెలిశాయని శ్రీనివాస చక్రవర్తి గారు నాట్యకళ సంచికలో వుదహరించారు.
ఒకనాడు యక్షగాన వాజ్మయం దక్షిణ భారతదేశంలో అంతటా దేదీప్యమానంగా వెలుగొందిందనటానికి కారకులు మన జక్కులవారే.
యక్షగానాలన్నా జక్కులవారన్నా ఈనాటి వారిలో కొంత హీనదృష్టి వుంది. కాని ఆంధ్రదేశంలో శతాబ్దాల తరబడి యక్షగాన వాజ్మయం, యక్షగాన కళా రూపాలు విచ్చల విడిగా ప్రచారంలో వున్నాయి.
జక్కుల వారు విద్యావివేకాల్లో ఘటికులు. ప్రాచీన జాతుల్లో జక్కులు…బవని వాండ్లు మొదలైన వారు, మేధావి వర్గంగా ఎంచబడేవారు. సంగీత సాహిత్యాల లోనూ, చిత్రశిల్ప కళా ప్రతిభల్లోనూ, అద్వితీయ స్థానాన్ని సంపాదించారు. ప్రతిభావంతులుగా పేరు పొందారు.
ఈనాటి వైదుష్యం:
ఈనాడు కూచిపూడి భాగవతుల కళా వైదుష్యాన్ని మనం ఎలా స్తుతిస్తున్నామో అలాగే నాటి జక్కుల వారిని, బవని వాండ్లనూ స్తుతించేవారు. కాని వంశ పారంపర్యంగా వీరి కళాకౌశలం క్షీణిస్తూ వచ్చింది. ఉన్నతాదర్శాలు నశించాయి. ఆనాటి యక్షగాన వాఙ్మయానికి ప్రతీకగా ఈనాడు, ఆచ్చు గ్రంథాల నైతేనేమి, వ్రాతప్రతులైన తాళపత్ర, సాధారణ పత్ర గ్రంథాలైతే నేమి నాలుగు వందల వరకూ యక్షగాన రచనలున్నాయని వినికిడి.
అయితే కొండవీటి రెడ్డిరాజుల కాలంలోనూ విజయనగర రాజుల కాలంలోనూ, తంజావూరు ఆంధ్రనాయక రాజుల కాలంలోనూ, యక్షగానాలూ యక్షగాన వాఙ్మయం దేదీప్యమానంగా వెలుగొందిన విషయం సర్వసామాన్యంగా అందరికీ తెలిసిందే.
ప్రాచీనంలో ప్రాచీనం: యక్షగానం:
మన ప్రాచీన కళారూపాల్లో అతి ప్రాచీనమైంది యక్షగానం. ఆంధ్ర, తమిళ, కర్ణాటక రాష్ట్రాలలో అతి విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ నాడు మన చూస్తున్న వీథి భాగవతాల మాత్రుకలు ఈ యక్షగానాలే.
యక్షగానాల తరువాత ప్రచారంలోకి వచ్చింది వీథి భాగవతాలు. యక్షగానం అంటే యక్షులచే పాడబడే సంగీత విశేషం అనీ, యక్షగానాలు ఎక్కువగానూ మక్కువగానూ జక్కు జాతివారు ప్రదర్శిస్తారు గనుక యక్ష శబ్దం జక్కు శబ్దంగా మారిందనీ, ఇది

యక్షులతో పాడబడే సంగీత విశేషమనీ , ఇంకెన్నో రీతుల వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించిన వారందరూ వారి వారి రచనల్లో నాటకాలను ప్రస్తావించారు. వారు ఉదహరించిన నాటకాలు, యక్షాగానాలా? లేక యక్షగానాలనే నాటకాలుగా ఉదహరించారా? తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
మన అలంకారికులు:
నాటకాంతం హి సాహిత్యం, కావ్యేషు నాటకం రమ్యం, అని మన సంస్కృత అలంకారికులు సాహిత్య ప్రక్రియలో నాటకానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చినా మన పూర్వాంధ్ర కవులెవరూ నాటక రచనకు పూనుకోలేదనీ, సంస్కృత లక్షణ గ్రంథాలను అనువాదం చేసిన పూర్వాంధ్ర లాక్షిణికులు, నాటకాన్ని వదిలి వేస్తూ వచ్చారనీ శ్రీనివాస చక్రవర్తి గారు (నాట్య కళ జానపద సంచికలో వివరించారు)
అయితే తిక్కనగారి విరాటపర్వం చదివినా పింగళ సూరనగారి ప్రభావతీ ప్రద్యుమ్నం చదివినా వారిద్దరికీ, నాటక కళలో ప్రవేశమున్నట్లు మనకు అర్థం అవుతుంది కానీ వీరిరువురూ తెలుగులో నాటకం మాత్రం వ్రాయలేదు. అలాగే, పిల్లలమర్రి పిన వీరభద్రుడూ, నందిమల్లయ్య, ఘంటసింగయ్య, మంచన మొదలైన కవులు “శాకుంతలం” ప్రబోధ చంద్రోదయం విద్దసాల భంజికలను ప్రబంధాలుగానే వ్రాశారు కాని, నాటకాలు మాత్రం వ్రాయలేదు.
తెలుగు కవుల, సంస్కృత నాటకాలు:
ప్రసిద్ధ సంస్కృత నాటక కర్తలైన భవభూతి, “మురారీ” భట్టనారాయణ ఆంధ్రులే, సంస్కృతంలో ఉన్మత్తరాఘవం, మదనవిలాస బాణం “మహాభారతం” నరకాసురవిజయవ్యాయోగం, రత్నపాంచాలిక; రచించిన భాస్కరుడూ. “పశుపతీ” నాగనాథుడూ గంగాధర కవి “ధర్మసూరి” సింగ భూపాలుడు మొదలైన కవులందరూ ఆంధ్రులే.
వేరే కాక ఆంధ్రకవులైన “వెంకటాధ్వరి” “నృసింహకవి” భట్ట భాణుడు మొదలైన ఆంధ్రకవులు. సంస్కృతంలోనే నాటకాలు వ్రాశారు. ఆ విధంగా సంస్కృతంలో నాటకాలు వ్రాసిన వారిలో దేశం మొత్తంమీద అగ్ర తాంబూలం అందుకున్న వారు ఆంధ్ర సంస్కృత నాటక కర్తలే.
అలాగే కాటయవేమూడూ, సుప్రసిద్ధ తెలుగు నాటక రచయిత కోలాచలం శ్రీనివాస రావు మొదలైన వారు ఆంధ్రులైనా, సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు మాత్రమే రచించారు.
అలాగే తంజావూరు ఆంధ్ర నాయకుల దర్బారులో జిక్కిణి నాట్య గోష్టి జరిగేదనీ__ విజయరాఘవుని ఆస్థానంలో మూర్తి జక్కిణి నృత్యం చేసేదని (రాజగోపాల విలాసంలో ఉదహరించబడింది).
అలాగే, విజయ రాఘవరాయలు కొరవంజి శుభలీల, గుజరాతి, దేశి, చౌపదియు “జిక్కిణి…. నాట్యముల్ హవణించు నవరజ్ఞు” అనీ (ప్రహ్లద చరిత్రలో వ్వవహరించారు.)
అలాగే, తంజావూరు “అన్నదాన” నాటకంలో జక్కుల రంగసాని పదకేళిక పట్టినట్లు వర్ణించాడు. వీరి పేరన “జక్కసాని కుంట్ల, జక్కుల చెఱువు” మొదలైన గ్రామాలు కానవస్తున్నాయి.
పారిజాతాపహరణంలోని “యక్ష గ్రామ వాసవ్యులు” అనే ప్రయోగంవల్ల బ్రాహ్మణ అగ్రహారాల వలెనే జక్కులవారు ప్రత్యేకంగా గ్రామాలు నిర్మించుకున్నారని చెప్పుకోవచ్చు. వీరు ఆంధ్రదేశంలో ముఖ్యంగా గుంటూరు, గోదావరి జిల్లాలలో ఎక్కువగా నివసిస్తున్నారని, దక్షిణ భారతదేశంలోని “కులాలు – తెగలు” అనే గ్రంథంలో “ఈథర్ట్సన్” ఇలా ఉదహరించాడు. జక్కుల వారు తక్కువ తరగతి వ్వభిచారిణులనీ, బలిజ కులస్థులనీ, మంత్రవేత్తలనీ, నృత్యనాటకారంగోప జీవనులనీ, వీరు ఎక్కువగా కృష్ణా జిల్లా తెనాలి దగ్గర వున్నారనీ, వీరిలో ప్రతి కుటుంబమూ, ఒక బాలికను వ్వభిచార వృత్తికి కేటాయించటం మామూలని తెలియజేశారు.
చెన్నశౌరి మొదటి యక్షగానం:చరిత్రను బట్టి చూస్తే 15వ శతాబ్దం ప్రథమ పాదంనుంచే మనకు యక్షగానాల ప్రసక్తి కనబడుతూ వుంది. పదిహేనవ శతాబ్దం నాటి ప్రొలుగంటి చెన్న సౌరి “సౌభరి చరిత్రాన్నీ” ఉదహరించడాన్ని బట్టి తెలుగులో ప్రథమంగా వెలువడిన యక్షగానం అదేనని చెప్పవచ్చు.
ఎందరో చెప్పిన, యక్షగాన వివరణ:
16 వ శతాబ్దంలో రచించబడిన చిత్ర భారతం యక్షగానంలో యక్ష వనితల పాట, యక్షకామినుల నాట్యం పేర్కొనబడ్డాయి. 16 వ శతాబ్దంలో యక్షగానాల ప్రభావం ఎక్కువగా వున్నట్లు తెలుస్తూ వుంది.
కందుకూరి రుద్రయ్య సుగ్రీవ విజయాన్ని యక్షగానంగా వ్రాసి ఆ వూరి జనార్థన దేవునికి అంకిత మిచ్చాడు. సుగ్రీవ విజయం అతి ప్రాచీనమైనది గాను, ప్రాముఖ్య మైనది గాను గుర్తించబడింది. రుద్రయ్య సుగ్రీవ విజయాన్ని యక్షగాన మనే పేర్కొన్నాడు. ఇందులో విశిష్టమైన రగడ భేదాలే గాక, సంవాదనలతోనూ, దరువులతోనూ, సంభాషణలతోనూ, ప్రియదర్శనయోగ్యంగా, వీథినాటకంగా ఆడబడి వుండవచ్చని నేలటూరి వారు వివరించారు.

16వ శతాబ్దపు ప్రాంతపువాడైన చిత్రపౌరి రాఘవాచార్యుని ‘విప్రనారాయణ చరిత్ర’ ‘బాలపాపాంబ అక్కమహాదేవి చరిత్రా’ రచనా విధానం కూడ సుగ్రీవ విజయం కోవకే చెందివున్నాయి.
కర్నూలు జిల్లా వాసిమైన పింగళి సూరన ప్రభావతీ ప్రద్యుమ్నంలోనూ, గంగావతరణం నాటకం లోనూ ఆనాటి ప్రదర్శనా పద్ధతిని గూర్చి వివరించాడు.
అహోబిల ప్రాంతంలో గుశదుర్తి ఆగ్రహార వాస్తవ్యుడు కాజవేంకటాద్రి ‘వాసంతికా పరిణయం’ అనే యక్షగాన ప్రబంధాన్ని వ్రాశాడు.
ఆరోజుల్లోనే నెల్లూరు ప్రాంతంలో కంకంటి పాపారాజు విష్ణుమాయా విలాస మనే యక్షగానంలో అనేక విశేషాలను వివరించాడు.
పేలపురం చేరువలో వున్న వుద్దండమల్ల సముద్రవాసియైన ఎల్లకవి శేషము వెంకటపతి శశాంక విజయాన్ని అనుసరించి ‘చంద్ర తారావిలాస’ మనే యక్ష గానాన్ని రచించాడు.
ఇప్పటికి షుమారు రెండు వందలఏబై సంవత్సరాల క్రితం సేలం జిల్లా హోసూరు తాలూకా తోగీరయ అనే అగ్రహార నివాసి అన్నదానం వెంకటాంబ రామయణం బాలకాండను యక్షగానంగా రచించింది.