నార్ల వారంటే ఆరాధన
వెతికి వెతికి సంపాదించిన ‘నార్ల’ వారి వ్యాసాలను కుట్టి దాచుకున్న పుస్తకం ఈనాటికీ తన వద్ద ఉందని మురిపెంగా నాగసూరి గారు చెబుతారు.
”కమలాక్షి – చూపులు కాకి చూపులు” ”పేరు గంగా భవాని – తాగుబోతే నీటి చుక్కలేదు”. అంటూ నార్ల వారి హెడ్డింగులకు ఆకర్షణ అధికం కదా! ఈ వ్యాసాల్లో చాలా భాగం ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీలను విమర్శించినా, జయప్రకాష్‌ నారాయణ, సునీల్‌ కుమార్‌ ఛటర్జీల మొదలైన విలువైన అంశాలు చాలానే ఉన్నాయంటారు. వీటితో బాటు ‘నార్లవారి మూడు దశాబ్దాలు”, ”నార్లవారి మాట”, ”సీతజోస్యం”, ”కొత్తా-పాత” పుస్తకాలు, గొఱ్ఱెపాటి వెంకట సుబ్బయ్య వ్రాసిన ‘నవమేధావి నార్ల’ పుస్తకాల ప్రభావం తనపై అపారం అంటారు. ఈ అధ్యయనం, తెలుగు, సైన్సు, జర్నలిజం రంగాలపై తనకు విపరీతమైన ఇష్టాన్ని పెంచాయంటారు.
పొత్తూరి వారి ప్రేమ
నాగసూరి గారు జర్నలిస్టుగా ఎదగటంలో పొత్తూరి వారి ప్రేమ అపరిమితం అని చెబుతారు. తాను సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు వారు ఎమ్‌.ఎస్సీ పూర్తిచేసి జర్నలిజంలోకి రమ్మని సలహా ఇస్తూ ”వ్రాసే కోరికే ఉంటే పూర్తికాలపు జర్నలిస్టు కానక్కరలేదని, వేరేపని చేస్తూ కూడా వ్రాయవచ్చన్నారట”. ఈ సలహా నాగసూరి అభిరుచికి అనుకూలంగా ఉంది. తరువాత కాలంలో పొత్తూరి వారి ప్రసంగాలు, ”నాటి పత్రికల మేటి విలువలు” పుస్తకంగా మారిందంటారు. నాగసూరిగారి ”టి.వి.ముచ్చట్లు”, ‘మీడియా స్కాన్‌’ పుస్తకాలకు ముందు మాట వ్రాయటం, ఆవిష్కరణ కూడా చేసేరు. 2000 సం|| ఆరంభంలో ఆకాశవాణి, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ”తెలుగు పత్రికారంగం” సదస్సు ప్రసంగ పాఠాలు, ”ఏమంటున్నారు ఎడిటర్లు” అనే పేరుతో ప్రెస్‌ అకాడమీ ముద్రించింది. దీనిలో పొత్తూరి వారి పాత్రను గుర్తుచేసుకొంటే ఆనందం అంటారు.


వి.కృష్ణారావు రచనలు ఏడు సంపుటాలు పరిశీలించి సమర్పించిన ధారావాహిక శీర్షిక పేరు ”సాహితీ దర్పణం”, జి.వి.కృష్ణారావు సమగ్ర సాహిత్యం పై విజయవాడ ఆకాశవాణి సమ్యక్‌ వీక్షణం. ఈ ప్రసంగాలకు ”గ్రంథాలయ సర్వస్వం’ 2002 ప్రత్యేక సంచికగా కూడా ఆవిష్కృతమైంది.
మహీధరుని ఉత్సాహం
ఎంతో హేతుబద్ధంగా కమ్యూనిజాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్న మహీధర రామ మోహనరావు గారు ఎనభై సంవత్సరాల ముదిమి వయసులో సైతం ఆకాశవాణి కార్యక్రమాలను శ్రద్ధగా వినటమే కాదు, ప్రతిరోజూ ఫోన్‌ చేసి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచేవారట. ఒకసారి స్త్రీ వివక్ష మన సమాజంలో ఎలా ఎపుడు ఎక్కడ మొదలైందనే చర్చను నిర్వహిస్తున్న సమయంలోనే మహీధర ఫోన్‌ చేసి ”అసలు పెళ్ళి అనేది స్త్రీకి అవసరమా అని అడగవయ్యా… ఇన్ని ఇతర విషయాలెందుకు?” అని ప్రశ్నించడంలో వారి ఉత్సాహ స్థాయి, ప్రగతివాద భావాలవైపు ఇష్టం ప్రస్ఫుటమయ్యాయి అంటారు.
సాహితీ యోధుడు అవంత్స సోమసుందర్‌
పాతికేళ్ళ వయసులో సీనియర్‌ కవులకు ధీటుగా ”వజ్రాయుధం” కవితా సంకలనం వెలువరించిన అవంత్స సోమసుందర్‌ పరిచయం ఢిల్లీ ఆకాశవాణి భవనం ముందు ఎలా ఎదురైందీ వివరిస్తారు. మరొక పర్యాయం ఆకాశవాణి పనిమీద పిఠాపురం వెళ్ళినప్పుడు మొదటి అంతస్తులో బండ్లకొద్దీ పుస్తకాల మధ్య వృద్ధ సాహితీ యోధునిలా దర్శనమిచ్చారంటారు.

నాగసూరి తల్లి తండ్రులు.


జీవితగాథల పరిశీలన
”నిజానికి ఆత్మకథలు” చదవడం అంటే ఒక ఉన్నత శిఖరం మూలాలు పరిశీలించటమే. అందుకోగలిగిన వారికి అందుకోగలిగినంత ముడి సరుకు లభిస్తుందంటారు నాగసూరి.
ప్రముఖ చిత్రకారుడు సంజీవదేవ్‌ శతజయంతికి ముస్తాబైన రావెల సాంబశివరావు గారి ‘సంజీవదేవ్‌ జీవనరాగం’ ఇటీవల కాలంలో చక్కగా, పొందిగ్గా వ్రాయబడిన జీవిత చరిత్రగా ప్రస్తుతిపొందింది. ”సంజీవ్‌ దేవ్‌ సాహిత్యం చెరుకున కాసిన పండు. ఆయన కళాకృతులు, మంచి గంధపు కొమ్మన పూసిన కుంకుమ పూలు. సంజీవ్‌దేవ్‌ వ్యక్తిత్వం తేనె చిలికిన వెన్న…” అని చెప్పి మరోసారి చదువుకోండి ఎంత బ్రిలియంట్‌ గా రావెల వ్యక్తీకరించారో గమనించమంటారు నాగసూరి. వైవాహిక సులోచనమ్‌, లలిత లవంగ హాస్య సమీరాలు” వంటి పదబంధాలతో అలరారుతున్న సంజీవదేవ్‌ జీవనరాగం చదవండి, సాహిత్య చిత్రకళా లోకాల్లో జీవనరాగం ఏమిటో తెలుస్తుంది అని ప్రోత్సహిస్తారు.
బాలబంధు బి.వి.నరసింహారావు
బాల సాహిత్య సృజనకర్త. నాట్యంలో ఆరితేరిన వ్యక్తి, పాఠశాలల ఇన్‌స్పెక్టరుగా ఉద్యోగం చేసిన బి.వి. నరసింహారావు (1913-1994) సంపూర్ణ రచనలు 3 సంపుటాలుగా వచ్చాయి. ఉషారేఖ, విద్యారేఖ, ఉద్యోగరేఖ, నాట్యరేఖ, సాహిత్యరేఖ ఇలా 16 రకాల రేఖలు ‘జీవనరేఖలు’ ఆత్మకథగా ఇమిడిపోయాయి. ”నాట్యానుభవం, రచనానుభవం నా ఉపన్యాస కళకు మెరుగులుదిద్దాయి” అని బాలబంధు బి.వి. నరసింహారావు ఆత్మకథలో పేర్కొన్నారు. నేను అపుడూ ఇపుడూ కూడా విశ్వనాధ వారి ఉదాత్తానుదాత్త పద్య పఠన పద్ధతీ, కృష్ణశాస్త్రి బొమ్మ కట్టే ఉపన్యాస వైఖరి, శ్రావ్యమైన గేయ పద్య పఠన వైఖరి, రాయప్రోలు వారి ముత్తయిదువ ముసలిబాణి, హనుమచ్ఛాస్త్రి గారి గడుసు పోకడ, శ్రీశ్రీ ఎక్కిళ్ళుతీరు… అన్నీ అనువదించగలను అంటారు. అంతరించిపోతున్న సాహిత్య తెగగా మారిపోయిన బాలసాహిత్యానికి బాసటగా భవిష్యత్తుపై ఆశ కల్పించారంటారు నాగసూరి.


పర్యాటక ప్రియుడు
కర్నూలు జిల్లాలోని బెలుంగుహలు చూశారా? ఉత్తరాంధ్రలో బొఱ్ఱాగుహలు చూశారా? అంటూ ప్రశ్నించే నాగసూరి మంచి పర్యాటక ప్రియులు. భ్రమణకాంక్ష రచయిత, ఎమ్‌. ఆదినారాయణతో బాటు యారాడ కొండల ఎక్కి దిగిన విషయాలు, నడచిన దూరాలు, చేసిన పరిశీలనలు ఇలా ఎన్నో రాసి మనల్ని చకితుల్ని చేస్తారు. గోవాలో ఏ బీచ్‌ నుంచి అయినా, మరో బీచ్‌కి వెళ్ళాలంటే రెండు మూడు కి.మీ. రోడ్డుగుండా వెళ్ళాల్సిందే. అలాకాక ఒక బీచ్‌ ముగింపు దగ్గరుండే గుట్ట వెంబడి పోతే అరకిలోమీటరులోపే ఇంకో బీచ్‌ చేరుకోవచ్చని జాగ్రఫీ వివరణ కూడా ఇస్తారు.
విశాఖపట్నం బీచ్‌ ఆకర్షణలమయమని చెబుతూ ఎవరి స్థాయిని బట్టివారికి లభ్యమవుతాయంటారు. వీరికి నచ్చినవి మాత్రం, ఒకటి సబ్‌మెరైన్‌, రెండవది 1971 వార్‌ మెమోరియల్‌, సముద్రంలోపల ప్రయాణంచే సబ్‌మెరైన్‌ను చూసే అవకాశం మామూలుగా లభించదు. కానీ, విశాఖపట్నం బీచ్‌లో సబ్‌ మెరైన్‌తో బాటు వివరించే నిపుణులు కూడా ఉంటారు. కాబట్టి సబ్‌మెరైన్‌ లోకి వెళ్లండని సలహా ఇస్తారు. సబ్‌ మెరైన్‌ కన్న విలువైనది, అపురూపమైనది. 1971 వార్‌ మెమోరియల్‌ సమున్నతంగా సముద్రం వైపు చూస్తున్నట్లుగా నిలబడి ఉంటుంది. పాకిస్తాను సబ్‌మెరైన్‌ పై భారత రక్షక దళాలు దాడిచేసి విజయం సాధించిన సంఘటనకు, విజయానికి గుర్తు ఈ వార్‌ మెమోరియల్‌ కట్టడం..అని చెబుతూ ఇటువంటి చారిత్రక అంశాలు గమనిస్తే ఎంతో ఉత్తేజం కలుగుతుందంటారు.
గోవా గురించి చెబుతూ హిందువుల ఇంటి ముందు తులసి కోట ఉండటం ఎంత ఆనవాయితీనో – క్రైస్తవుల ఇళ్ళ ముంగిట శిలువ ఉండటం అంతే అలవాటంటారు. హిందువులు మరాఠీ మాట్లాడితే, క్రైస్తవులు కొంకిణి మాట్లాడతారని, కొంకిణిని దేవనాగరి, రోమన్‌ లిపులతో బాటు కన్నడ, మళయాళం లిపుల్లో వ్రాస్తారంటారు. కొంకణి భాషలో అచ్చయిన పుస్తకమే భారతదేశంలో అచ్చయిన తొలి పుస్తకమని వెల్లడించారు.
ఇంకొక ఆసక్తికరమైన విషయం – కుంభర్ణుడు
హిందూపురం నుంచి అనంతపురం వస్తున్నప్పుడు పెనుకొండ తరువాత రోడ్డుకు ఆనుకొని ఉన్న కొండ వద్ద పెద్ద కుంభర్ణుని విగ్రహాన్ని పర్యాటకులను ఆకర్షించటానికి అనంతపురం కలెక్టర్‌ సోమేష్‌ కుమార్‌ కాలంలో ఏర్పాటు చేశారట. భారీ ఆకారంలో కుంభకర్ణుడుంటే, వాడి మీద ఈగల్లాగ, దోమల్లాగ పళ్ళాలు పట్టుకున్న భటులు, ఇది బయటకు కనిపించే దృశ్యం. కానీ దగ్గరకు వెడితే కుంభక్ణుడి లోపలికి వెళ్ళి హాయిగా ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్న కేఫ్‌లో కాఫీ టీలు తిరుగుతూ తాగవచ్చంటారు. అనంతపురం చుట్టుప్రక్కలలో పండే నారింజ, బొప్పాయి, జామపళ్ళు ప్రదర్శనకు తోడు విరివిగా పళ్ళ అమ్మకాలు, కన్యాకుమారి, బెంగుళూరు నుంచి హైదరాబాదు, నాగపూరు ఢిల్లీ వెళ్ళే హైవే కనుక ఆ రాష్ట్రాల ప్రజలు వీటిని రుచి చూడవచ్చు. ఇది కలెక్టర్‌ సోమేష్‌ కుమార్‌ గారి అద్భుతమైన ఆలోచనకు ప్రతిరూపం.
మేలత్తూర్‌ భాగవతమేళా
ప్రతి సంవత్సరం నరసింహ జయంతినాడు ఆరంభించి, ఒక వారం రోజులపాటు ప్రదర్శించే భాగవత మేళా నాటకాల ప్రస్తావన ఉంది. సుమారు 200 సం.ల క్రితం మేలత్తూరుకు చెందిన వెంకట్రామ శాస్త్రి వ్రాసిన ‘ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కళ్యాణం, మార్కండేయ చరిత్ర’ మొదలైన పది నాటకాలు, ఈనాడు మేలట్టూరు గడ్డపై ప్రదర్శన పొందుతున్నాయి. నేటికీ తెలుగు చదవటం, వ్రాయడం రాని ఈ తెలుగు సోదరులు తమిళ లిపిలో రాసుకొని, బట్టీపట్టి ఈ నాటక ప్రదర్శన లివ్వడాన్ని ప్రస్తావించారు.


సంప్రదాయబద్ధులు – తమిళులు
మద్రాసునగరంలో త్రాగుడు అలవాటు ఎలా ఉన్నా, బ్రాందీ షాపుల సంఖ్య తక్కువని చెబుతూ టిఫిన్లు, భోజనాలు తక్కువ ఖరీదులో రుచికరంగా లభిస్తాయంటారు. ఇంక మద్రాసు ట్రాఫిక్‌ గురించి ఆలోచిస్తే రోడ్డుమీద నడిచేవారు, రోడ్డుదాటే వారి భద్రత దృష్ట్యా వాహనాలు నడుపుతారంటారు.
మద్రాసు వారి పూల మక్కువ గురించి ఎంత చెప్పినా తక్కువే, అంటూ సిటీ బస్సుల్లో చివరి సీట్లలో జీవిక కోసం చకచకగా పూలమాలికలు అల్లే ‘పూబంతులు’ తరచు కనబడతారంటారు. ఇది నాగసూరి వారి పరిశీలనా దృష్టి.
సంప్రదాయాన్ని గౌరవించే తమిళులు పితృదేవతలకు భోజనమంటూ, వేసే టిఫిను పదార్ధాలకు లెక్కలేనన్ని కాకులూ ఎగురుకుంటూ వస్తాయట. పర్యావరణం, జీవకారుణ్యదృష్టితో ఆలోచిస్తే పువ్వులు – కాకులు అన్నీ ప్రమోదభరితమే! ప్రత్యేకించి ఇంటి ముందు ముగ్గుపెట్టే స్త్రీలు, బొమ్మల కొలువులు పెట్టడానికి ‘శిక్షణా తరగతులు’ ఒకటేమిటి అన్నింటిలోనూ వారిది, సంప్రదాయబద్ధమైన కళాత్మక దృష్టి.
తెలుగు సాహిత్యానికీ, జర్నలిజానికీ ఎనలేని కృషి చేసిన విద్వాన్‌ విశ్వంగారి గురించి క్లుప్తంగా వివరించే మోనోగ్రాఫ్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ కోసం 2011లో వెలువరించారు నాగసూరి.
ప్రఖ్యాత అనువాదకుడు, చక్కని, చిక్కని పొట్టి వాక్యం తెలుగులో రాసేవారు తక్కువని ఆలోచిస్తున్న సమయంలో వచ్చిన రావెల సాంబశివరావుగారి ”బింబాలు – ప్రతిబింబాలు” సాహితీ ప్రసంగాల సంపుటిని నాగసూరికి అంకితం ఇవ్వడాన్ని ప్రస్తావించారు. నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రారుగా పనిచేసిన రావెల గారు ఎన్నో రచనలు – లోహియా, పి.వి.నరసింహారావు, మధుదండావతే, అబ్దుల్‌ కలాం, బిపిన్‌ చంద్ర, జాన్‌గ్రే, నీషే, ఐన్‌స్టీన్‌ వంటివారి రచనలను తెలుగులోనికి అనువదించారు.
చిత్రకారుని స్మరణ
అక్షరాస్యతతో ప్రమేయం లేకుండా సందేశాన్నివ్వగలిగే నరసింహారావు చిత్రాల గురించి నాగసూరి గారి మాటలు చిత్రంగా ఉంటాయి. శ్రావ్యతకు దృశ్యరూపం ఉంటుందా? వర్ణ సమ్మేళనం గళం విప్పగలదా? రాగం కనబడుతుందా? అందం వినబడుతుందా? అనే ప్రశ్నలకు జి. నరసింహారావు చిత్రాలు సమాధానం ఇస్తాయంటారు.
జరిగిన కథ – మల్లాది
రచయితల గురించి వ్రాయడం మామూలు విషయం కానీ, మల్లాది కృష్ణమూర్తి గారు తన 42 సంవత్సరాల రచనా జీవితంలో తారసపడిన సంపాదకుల గురించి వ్రాసిన పుస్తకం ‘జరిగిన కథ’. ఈ గ్రంథాన్ని విశ్లేషిస్తూ ‘ప్రపంచపు మొహాన్ని మొత్తం ప్రపంచానికి చూపించే పత్రికా అద్దం ఎలా ఉందో అద్దానికి తెలియదు. ప్రపంచానికీ తెలియదు. అద్దం ఎంత సొగసుగా ఉందో, ఎంత మకిలిగా ఉందో ఇలాంటి పుస్తకాలు చూపిస్తాయంటారు” మన రచయిత.
మార్పు చెందుతున్న రచయితల ప్రవృత్తిని ప్రస్తావిస్తూ, యండమూరి వ్యక్తిత్వ వికాసం వైపు ఒరిగిపోగా, సెక్స్‌ కథల నుంచి మల్లాది ఆధ్యాత్మికం వైపు ఒరిగిపోయారంటారు. పెద్ద పెద్ద వాక్యాలలో, సంస్కృత కొటేషన్లలో అర్ధంకాని ఆధ్యాత్మిక భాషను మల్లాది నిక్కర్లలో హల్‌ చల్‌ చేసే వారికి కూడా బోధపడేలా వ్రాయటం టెక్నిక్‌ పరంగా హర్షణీయం అని కితాబిస్తారు. ప్రయాణంలో కాలక్షేపానికే కాకుండా రచయితను పరిశీలించవచ్చని కష్టపడి ఎన్నుకొని పట్టుకెళ్ళిన పుస్తకాలు, చదవబడటానికి సహకరించకపోవచ్చంటారు. ఇది అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే!
ఛీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ – వి.ఎస్‌. రమాదేవి
కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌ గా పనిచేసిన వి.ఎస్‌ రమాదేవి పదవులు ఒక పార్శ్వం కాగా కళాకారిణి ఆమె మరొక పార్శ్వం. రమాదేవి గారు ‘లా’ చదివే సమయంలో హైదరాబాదు ఆకాశవాణిలో అనౌన్సర్‌గా కొంతకాలం పనిచేసారు. 1954 నుండి 1962 వరకు ఆమె హైదరాబాదు మొదటి మహిళా అనౌన్సర్‌, రేడియో నాటక కళాకారిణి. న్యాపతి కామేశ్వరమ్మ హైదరాబాదు వచ్చే వరకు ఈమె బాలల కార్యక్రమాలు నిర్వహించారు. అంటే హైదరాబాదు తొలి రేడియో అక్కయ్య రమాదేవి గారు. రేడియోతో పాటు రంగస్థలం పై కూడా నటనానుభవం ఆమె స్వంతం.
ఇక రచయిత్రిగా రమాదేవి కథలు, నవలలు, నాటికలు చాలా వ్రాశారు. ”విపులాచ ఫృథ్వీ” కాలమ్‌ గోరాశాస్త్రి కాలంలో ప్రారంభమై దశాబ్దాల పాటు నడిచి, ఆమె కన్నుమూసే దాకా ఆ శీర్షిక కొనసాగింది. ఒకేసారి పది పుస్తకాలను ఆవిష్కరించిన విశేషమైన వ్యక్తి కూడా రమాదేవి గారే! ఆమె అభిప్రాయాలు చాలా నిష్కర్షగా ఉండేవట. ”చెత్తగా ఉన్న టి.వి. ఛానెల్స్‌ను అవార్డుల పరిశీలన నుంచి బహిష్కరించాలని” సూటిగా సూచించడం చాలా ఆనందం కలిగించిందంటారు. ఆమె ఉన్నతికి భర్త చేసిన దోహదం గురించి ప్రముఖంగా ప్రస్తావించిన నిగర్వి అంటారు మన నాగసూరి.
ఆవేదన
కన్యాకుమారిలో హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కలిసే చోట ఇక్కడితో దేశం – నా దేశం అయిపోతుందా? అని మాలతీ చందూర్‌ రాసిన ఎక్కడివో భావాలను మదిలో ఆర్ద్రంగా నెమరువేసికొంటున్నప్పుడు మాలతీ చందూర్‌ గారిని రికార్డు చేయలేకపోయానన్న ఆవేదన అర్ధమవుతుంది. అలాగే చిన్ననాటి ‘తెలుగు విద్యార్థి’ పత్రికలో పలుసార్లు సంజీవదేవ్‌ గారి వ్యాసాలు చదివినా ఒక్క కార్యక్రమం రికార్డు చేయలేక పోవటం.. ఎంతో బాధ కలిగిస్తుందని నిజాయితీగా అంగీకరిస్తారు.
అమ్మ – కోతికొమ్మచ్చి
జన్మరీత్యా అమ్మ – జీవితం రీత్యా ఫ్రెండు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు – తెచ్చుటలో కన్న ఇచ్చుటలో ఉన్న హాయిని చూపిన దైవం’ అని తల్లిని పొగిడిన రమణకు, ఆమె కాలధర్మం చెందినపుడు అంతిమ కర్మలకు పదిహేను వందలమంది రావటం ఆశ్చర్యం కలిగించిందంటారు. జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి సాహిత్య చిత్తరువుల తయారుచేసే రచయిత ముళ్ళపూడి రమణ – నిత్యం తల్లిని చూస్తూ కూడా ఆమె గొప్పతనాన్ని పూర్తిగా గమనించలేదని ఒప్పుకుంటారు. ”మా ఊళ్ళో పుట్టినపుడు నాకు ఒక్క అమ్మే గాని మద్రాసులో పెరిగినపుడు, తొమ్మండుగురు అమ్మలు దొరికారు. అని తన జీవితంలో ఎదురైన అమృత మూర్తులను ప్రస్తావించడం స్వీయ చరిత్ర ”కోతి కొమ్మచ్చి”లో గొప్పగా అనిపిస్తుంది.
ఏ తల్లికయినా సమస్యలు తప్పవని చెబుతూ – మాతృదేవోభవ, అమ్మ చెప్పింది సినిమాలను ఉదహరిస్తారు. మాధవి, సుహాసిని పాత్రల ద్వారా అమ్మల యాతన గురించి ఆలోచించమని దృశ్యరూపాల ద్వారా కళాత్మకంగా చెప్పిన ఈ రెండు సినిమాల దర్శకులను అభినందించడం మన సంస్కారం అంటారు రచయిత. మాతృమూర్తుల కన్నీటి కథలు ఎన్ని రాసినా, కొత్తరూపంలో ఇంకా కొన్ని జతచేరుతుంటాయి. నిత్యం చూసే అమ్మ విలువను అంచనా వెయ్యటం సామాన్య విషయం కాదంటారు.
పండుగ కాని స్వాతంత్య్రం
మేధస్సుకు, విజ్ఞానానికి ప్రతీకగా కొలిచే గణేశుని ఉత్సవాలు, నగర కాలుష్యంగా, పట్టణ మాలిన్యంగా మారిపోయాయని విచారిస్తారు. ”జనసందోహం తెచ్చిన సందేహం” అనే వ్యాసం పెద్ద సవాలుని ప్రజలపై ప్రయోగించింది. ‘నాగరికత – హేతువు, చదువు, సంస్కారం పెరిగిన మనిషి సందర్భాలను సృష్టించుకొని పండుగలను జరుపుకుంటారు. ప్రజలంతా పురాణ గాథలని నమ్ముతారని చెప్పలేము. అలా నమ్మితే మన నైతిక స్థాయి ఇలా ఉండేది కాదు కదా! ఈ పండుగ సందర్భాలు కల్పించే వాతావరణాన్ని, ఆరేడు దశాబ్దాలుగా స్థిరబడిన మన స్వాతంత్య్రం, మరి ఏ దినోత్సవాన్ని రూపొందించ లేకపోయిందా? కాస్త మనసుపెట్టి ఉదారంగా ఆలోచించండి అని అర్ధిస్తారు.

పెద్దలమాట – అధ్యయనం
ప్రతిభకూ వయసుకూ సంబంధం లేదని చెబుతూ కాళీపట్నం రామారావు దేవదాసు నవలను రాసినపుడు శరత్‌బాబు వయసెంత? అని ప్రశ్నించటం అలవోకగా జరిగినా ఆ మాటలు ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపి ధైర్యాన్నిచ్చాయంటారు.
నాగసూరి గారిని గమనించి రాయలసీమ ప్రాంతంలో జనరల్‌ రీడింగు ఎక్కువగా ఉంటుంది కదా! అని తుమ్మల వేణుగోపాలరావు గారు విశాఖపట్నంలో ప్రశ్నించారట. ఈ సందర్భంలో డాక్టరేటు మధ్యలో వదిలివేసి ఆకాశవాణికి వచ్చారని తెలిసి నాగసూరి గారిని మళ్ళా డాక్టరేటు వైపు ప్రోత్సహించినవారు శ్రీ తుమ్మల వేణుగోపాలరావు గారు. జర్నలిజంలో ఏం.ఏలో చేరగానే, పరిశోధనా ప్రణాళిక వేసి, ఎవరిదగ్గర చేయాలో కూడా సూచించారట. అలా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాగసూరి జర్నలిజం పి.హెచ్‌.డి. పూర్తి చేశారు. ఈ పోత్సాహం అంతా తుమ్మల వారిదేనంటారు.
నాగసూరి స్వయం కృషి
వృత్తి ప్రవృత్తి ఏకమైన ఆకాశవాణి ఉద్యోగం తన అభిరుచులతో అల్లుకుపోయిందంటారు. ఎక్కడికి వెళ్ళినా, అక్కడ చారిత్రక, సాంస్కృతిక, వైజ్ఞానిక నేపథ్యాలు అవగతం చేసుకుని వాటిని సాహిత్య స్పర్శతో ఆకాశవాణి కళారూపంగా స్థానిక సృజనకర్తలతో మలచుకుంటూ వెళ్ళిపోయానంటారు.

సహధర్మచారిణితో నాగసూరి

దీనికి సమాంతరంగా వీరి రచనా కృషి ముప్పది సంవత్సరాలుగా ముప్పిరిగొంటోంది. తన విజయం తన స్నేహితురాలు, సహధర్మచారిణి హంసవర్ధినిదేనని సంతృప్తిగా ప్రకటించారు.
చివరిగా ఒకమాట. డా|| నాగసూరి వేణుగోపాల్‌ గారి ‘వేణునాదం’ పుస్తకం చదవకపోతే కోల్పోయేదేమీ లేదు. కాని చదివితే మాత్రం జీవితం మరింత స్ఫూర్తివంతంగా, అర్ధవంతంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవచ్చునని మాత్రం నాకనిపించింది.
(వేణునాదం అవలోకనా వ్యాసమంజరి
రచన – నాగసూరి వేణుగోపాల్‌
సెప్టెంబరు 2020
పేజీలు 240
వెల – రూ. 200
దొరుకు చోటు నవోదయ బుక్‌ హౌస్‌, కాచిగూడా
లేదా
జి. మాల్యాద్రి
విజ్ఞాన ప్రచురణలు
నెల్లూరు)

  • డా|| ప్రభల జానకి,
    M.A, M.Phil, Ph.D, & D.Lit.,
    ఫోన్ : 9000496959
డా|| ప్రభల జానకి,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s