
వేణునాదంలో జీవనరాగ వైవిధ్యం.
రాయలసీమ లోని ఓ మారుమూల కుగ్రామం లో జన్మించి జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూసి ఆకాశవాణి లో ఉన్నతస్థాయి ఉద్యోగం నిర్వహిస్తున్నారు. ఆయన జీవిత మజిలీలు వివరిస్తూ రాసిన వేణునాదం పై సమీక్ష.
కరోనా అందించిన ఆశించని విశ్రాంతి అక్షరం మీద ప్రేమతో దాచుకున్న అనేక వ్యాసాలను తిరిగి చదువుకొనే అవకాశం కల్పించింది. 2013 ప్రాంతంలో ఆంధ్రప్రభ ఆదివార సంచికలలో ‘ముద్ర’ పేరున నాగసూరి వేణుగోపాల్ గారి నాలుగైదు సమీక్ష, వ్యాసాలను అనుకోకుండా చదివాను. అవి ఎందుకో బాగా ఆలోచింపచేసాయి. స్వల్ప ప్రయత్నంతోనే మూడు రోజుల్లో మొత్తం పుస్తకం ‘వేణునాదం’ గా చేతిలోకి వచ్చింది. ఈ వ్యాసాలను రచయిత అలవోకగా రాసినట్లు కనిపిస్తున్నా, వస్తువులోని గాంభీర్యం పుస్తకాన్ని వదలనివ్వదు. అక్షరాలకు అక్కరలేని అలంకరణలతో ముస్తాబులేదు. చెప్పింది ‘కాలమ్’ కథ అయినా తన కథతో బాటు ఎంతోమంది ప్రముఖుల జీవిత కాలాలను కొలిచిన కథా, కమామిషు కనిపిస్తుంది.
ఈ ‘వేణునాదం’ లో రచయిత బాల్యం, చదువు, కుటుంబ విషయాలు, సూచన ప్రాయంగాను, తనను తీర్చిదిద్దిన గురువుల, పత్రికల, వ్యక్తుల, వ్యవస్థల వివరణ హృద్యంగా ఉంది. ఆకాశవాణి ఉద్యోగం, ప్రసార మాధ్యమాల విశ్లేషకునిగా తన అనుభవాలతో బాటు లబ్ధప్రతిష్ఠులైన అనేక మంది వ్యక్తుల పరిచయాలను, సాన్నిహిత్యాన్ని ప్రస్తావించారు. ఇవేమీ సమగ్రం కాకపోయినా ఎపుడో అపుడు స్ఫూర్తినిస్తాయనటంలో సందేహం లేదు. ఉన్న కాస్త సమయంలో ఎంతమంది రచయితలను, ఎన్ని పుస్తకాలను చదవగలం? అని బుద్ధిజీవులు బెంగపెట్టుకుంటూంటారు. ఆ రకంగా ఆలోచించినా ఎవరి అభిరుచికైనా, ఆసక్తిని, ఆనందాన్నివ్వగలిగే రెండు మూడు పుస్తకాలు, ఇద్దరు, ముగ్గురు రచయితలు ఈ ‘వేణునాదం’ పుస్తకంలో లభ్యమవుతారు. ఎంత తీసుకోవటమన్నది వారి వారి ఇష్టమే!

”అక్క విజయలక్ష్మితో కలిసి పదకొండుమంది అమ్మకు పిల్లలు. నేను వరుస క్రమంలో ఎనిమిది. మా పల్లెలో ఐదో తరగతి వరకే చదువు. ఆరో తరగతి కావాలంటే 5 కి.మీ. మించి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో అందరినీ ఎంతో కొంత చదివించేలా అమ్మా-నాన్న పడిన కష్టం వారికే తెలుసు. ”అమ్మదగ్గర ఐదవ తరగతి వరకే ఉన్నాను. ఆ పదేళ్ళే ఆటలయినా, పాటలయినా, దెబ్బలయినా, తరువాతంతా బాల్యాన్ని కోల్పోయిన విషాదమే” అంటారు. కొనతట్టుపల్లి గ్రామంలో గుడిలేకపోయినా ఐదవతరగతి వరకు పాఠాలు చెప్పే బడి, అందులో సింగిలు టీచరు ‘గ్రేసమ్మ’ చెప్పిన క్లాసు పాఠాలు, గోవిందరెడ్డి సారు చెప్పిన దేశభక్తి పాఠాలు ప్రాథమిక విద్య అందించిన ఆసక్తికరమైన అంశాలంటారు.
గోవిందరెడ్డి సారు
వార్తాపత్రికలు లభించనిచోట హిందూపురానికి ఇరవై కిలోమీటర్లదూరంలో కొనతట్టుపల్లి అనే ఒక కుగ్రామంలో ఐదవ తరగతి మాత్రమే ఉన్న స్కూలు విద్యార్ధులకు దేశభక్తి సంఘటనలు వివరంగా చెప్పటం సామాన్యమైన విషయమా? 1971 యుద్ధ సమయంలో గోవిందరెడ్డి సారు ప్రతి రోజు చివరి అరగంట, గత రోజు జరిగిన యుద్ధవిశేషాలు, భారత సేనలు ఏయే ప్రాంతాల్లో ఎలా పోరాడి దూసుకుపోతున్నాయో పటం చూసి వివరించేవారట. అంతేకాదు ఆ రోజు, మరుసటి రోజు మన సేనలు మరింత బాగా పోరాడాలని ఆశిస్తూ, విద్యార్థినీ విద్యార్ధులతో దేశభక్తి గీతం ఆలపింపచేసి, ఆరోజు పాఠాలు ముగించి జాతీయ గీతంతో జైహింద్ చెప్పించేవారట! చిన్నతనాన లభించిన ఆ అనుబంధానికి, జ్ఞానదాహార్తికి లభించిన ఉపశమనానికి, విశాఖతీరంలో నిలిచిన సబ్‌మెరైన్‌ను వీక్షించినపుడు మాస్టారు జ్ఞాపకం వచ్చి సెల్యూటు చేయడం నమ్రత మాత్రమే అని చెప్పలేం. అంతటి యుద్ధనౌక సబ్‌మెరైన్‌ను గుర్తించినవారు సామాన్య జాలరులైతే ఇంతమంది పిల్లల్లో దేశభక్తిని మేల్కొల్పింది గోవిందరెడ్డి సారు.
జానకీరాం సోషల్ స్టడీస్ క్లబ్
హిందూపురం నేతాజీ మునిసిపల్ హైస్కూలులో చదువుతున్న సమయంలో, ఐదు దశాబ్దాల క్రితం ‘సోషల్ క్లబ్’ ను ప్రారంభించి, విద్యార్ధులలో సాంఘిక శాస్త్రం పట్ల అభిరుచి పెంచిన ఉపాధ్యాయులు శ్రీ కల్లూరి జానకీ రామారావు గారి ప్రస్తావన ‘వేణునాదం’ లో ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి స్థాయి కలిగిన ఆంగ్ల, తెలుగు పత్రికలు కేవలం నెలకు 20 పైసలు విద్యార్థి నుండి వసూలు చేసి చదివింపచేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ పత్రికలను, వారానికి రెండు రోజులు ఇంటికి కూడా ఇచ్చే సౌకర్యం కలిగించటం, ఈ వ్యవహారమంతా మధ్యాహ్నం ఇంటర్వెల్ సమయంలోనే చక్కబెట్టడం, వెనుక గురువుగారి సహృదయత, చదువు నేర్పించే దీక్ష అర్ధంచేసుకోవాలి. అలా ‘రీడర్స్ డైజస్ట్’, ‘మిర్రర్’, ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ, బ్లిట్జ్, సండే, కాంపిటీషన్ మాష్టరు, ‘విస్డమ్’, తెలుగు వారపత్రికలు చూడటమే కాదు, చదివే అవకాశం లభించింది. పత్రికా ప్రపంచానికుండే, పెద్ద పెద్ద వాకిళ్ళను తెరచి ఆహ్వానించటం సామాన్యమైన విషయం కాదు. గౌరవనీయమైన పత్రికలను పరిచయం చెయ్యటమే కాదు, సీరియస్ పత్రికలను చిన్నవయసులో తెలిసికోవడానికి దోహదపడిందంటారు. జానకీ రామారావు సారు లాంటి ‘దారిదీపాలుంటే’ కొంతమంది విద్యార్థులైనా స్ఫూర్తి పొందకపోరు. స్కూలు లేని ఊళ్ళు, టీచర్లు లేని పాఠశాలలు, పాఠాలు చెప్పని పంతుళ్ళు వీరికి తారస పడలేదు. ఉన్నంతలోనే స్కూలుకు పంపిన తల్లిదండ్రులు, కాలాన్ని వ్యర్ధం చెయ్యని బాల్యం – వెరసి నాగసూరి గారు.
పద్యం మీద మక్కువ
సంవత్సరాల వారీగా రాసిన ఉగాది శుభాకాంక్షల పద్యాల ”ఉగాది స్వర్ణభారతి” (1922-72) పుస్తకం చదివిన వేళ పద్యంపై మక్కువ ఏర్పడిందంటారు. ఈ పద్యాలు కేవలం వసంతం, చిగుళ్ళు, కోయిల, మామిడి వంటి విషయాలకే పరిమితం కాక, ఆ సంవత్సరంలో జరిగిన కీలక, జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ సంఘటనలను సమీక్షిస్తూ ఈ పుస్తకంలో పద్యరచన సాగిందట. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు, చైనా, జపాన్ సంగ్రామం, ఇలా ఏభై సంవత్సరాల చరిత్రను విహంగ వీక్షణం చేయటం… వర్తమాన విషయాలు పద్యంలో పొదగటమనేది ఆ చిన్ని ఊహలకు అందని విషయం. ”శ్రీకాకుళం మొదల్జేసి, విశాఖపట్న మనంతపుర”మంటూ 1956 నవంబరు 1వ తేదీన వ్రాసిన సీస పద్యంలో జిల్లాల పేర్లన్నీ పేర్కొనటం ”భలే – భలే” అనిపించిందట. ఈ పుస్తక రచయిత కల్లూరు అహోబలరావని తరువాత ఎపుడో తెలిసింది.
పద్య కవిగా నాగసూరి
బెంగుళూరు నుంచి వచ్చే ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రతి గురువారం ప్రత్యేకించి ‘సాహిత్యప్రభ’కు కేటాయించి సాహిత్య చర్చలు జరపటం ఆనందదాయకమైంది. పాత పత్రికలలోని సాహిత్య పేజీలు భద్రపరచుకొని మననం చేయటంతో ”తేటగీతి”లో 17 పద్యాల రచన కూడా జరిగిందంటారు. తరువాత కాలంలో వచనం మెరుగనుకోవటంతో పద్యం వెనక్కి జరిగిందంట. పదహారు లైన్ల కవిత తన పదవతరగతిలోనే ‘ఆంధ్రపత్రిక’లో ప్రచురితమవటం గొప్ప శుభారంభంగానే భావించారు.

నాగసూరి తొలి వ్యాసాలు
”వేమన” కవి కాదని పురాణం సుబ్రహ్మణ్యశర్మ వ్రాసిన వ్యాసాన్ని విబేధిస్తూ వ్రాసిన ”వేమన వాదనలో కవిత” నాగసూరి గారి తొలి పత్రికా రచన 1986 మార్చి 9న ”ఆంధ్రప్రభ”లో ముద్రితమైంది. వెనువెంటనే తెలుగు పత్రికల సంపాదకీయాల గురించి ‘ఆంధ్రపత్రిక’ సంపాదకీయం పేజీలో వ్యాసం అచ్చయింది. ‘సోలార్ వాటర్ హీటర్’ గురించి ‘ఆంధ్రజ్యోతి’లో మొదటి సైన్సు వ్యాసం రావడం అతి తక్కువ కాలంలోనే జరిగింది. మూడు విభిన్న రంగాలు – మూడు విభిన్న పత్రికలు అదీ వీరి తొలిరచనాదశ.
సైన్సు – సాహిత్యం అవినాభావ సంబంధం
దినంలో ఏదో క్షణాన నీడ పొడువు, వస్తువు పొడవు సమానంగా ఉంటాయి అంటూ ఫిజిక్సును పరిచయం చేస్తారు. పుట్టపర్తిలో డిగ్రీ చదవడం వలన ప్రశాంతి నిలయానికి చేరువగా ఉన్న గుట్టలను డిగ్రీకొండలని, తిరుమల కొండలను పి.జి. కొండలుగా నామకరణం చేసి పరిశీలించడం వీరికిష్టం.
సైన్సు – సారస్వతాల సర్దేశాయి తిరుమలరావు పేరు ‘భారతి’ పత్రికలో వివిధ అంశాల రచయితగా పేర్కొంటారు. అనంతపురం ‘తైల సాంకేతిక పరిశోధనా సంస్థ’లో 34 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 1983లో డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. తైల సాంకేతిక పరిశోధనా పత్రాలు 400లకు పైగా సమర్పించారు. నిజానికి బియ్యపు తవుడు నుండి నూనె తీసే పద్ధతిని అభివృద్ధి చేయటంలో రైస్ బ్రౌన్ (Rice Brown) ఆయిల్ ఈ మధ్య వాడుకలోనికి వచ్చి వీరిపేరు అందరికీ తెలిసింది. వీరికి సంస్కృతాంధ్రాల్లోనే కాక ఇంగ్లీషులోనూ మంచి పాండిత్యం ఉంది. సైన్సూ, సారస్వతాల సర్దేశాయి తిరుమలరావు గారు కన్యాశుల్కంలో కథానాయకుడు కందుకూరి వీరేశలింగం అని తన ప్రసంగాన్ని ప్రారంభించేసరికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారట. ‘సంస్కరణ స్ఫూర్తి’ వస్తువుగా నాటకం రూపం ధరించిందని వారి భావన. సైన్సుకూ, సారస్వతానికీ సంబంధం బలంగా ఉండాలని పరస్పరం రెండు రంగాలు ప్రభావితమై లాభపడాలని వారి ఆశ… జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా|| రావూరి భరద్వాజ రచించిన ‘ఆకాశంలో ఆశ్చర్యార్ధకం’ వీరిని మలితరం సైన్సు రచయితలలో ఒకనిగా నిలబెట్టిందని చెబుతూ ఆ విధంగా వారికీ తనకూ బంధం కుదిరిందంటారు.
”పాతికేళ్ళ సైన్సు దాహం తీరిన వేళ”లో ఎంత ప్రయత్నించినా ప్రముఖ శాస్త్రవేత్త వై. నాయుడమ్మ గూర్చి వివరాలు తెలియనందుకు అసంతృప్తి చెందటం కనిపిస్తుంది. నిజానికి నాయుడమ్మ జీవితం సాధించిన విజయాలు, అవలంబించిన వైఖరి చాలా ఆసక్తి కలిగిస్తాయని నాటకానికీ, సినిమాకీ తగిన కథా వస్తువుందంటారు. వారి జీవిత విశేషాలు సరిగా భద్రపరచలేని స్థితిలోనికి, వ్యవస్థ జారిపోయిందని, ఆవేదనగా చెబుతూ కె.చంద్రహాస్ వ్రాసిన ”ది పీపిల్స్ సెంటిస్టు, డాక్టర్. వై.నాయుడమ్మ” పుస్తకం కొంతవరకు తనకు సంతృప్తి కలిగించిందంటారు. మూఢ నమ్మకాలనుండి జనాన్ని దూరం చేసి శాస్త్రీయ ధృక్పధానికి చేరువ చేయాలనే తపన ఈ రచయితలో కనిపిస్తుంది.
తెలుగువాడు హోసూరు నరసింహయ్య
బ్లిట్జ్ పత్రికలో కొన్నివారాలపాటు సాగిన వార్తలలో హోసూరు నరసింహయ్యగారు కేంద్ర బిందువు. సత్యసాయి మహిమలను సైన్సు పరంగా పరీక్ష చేయాలనే నేపథ్యానికి సంబంధించింది ఆ సంచలనం. 1970 దశకంలో వీరు బెంగుళూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ‘ది కమిటీ టు ఇన్వెస్టిగేట్ మిరకిల్స్ అండ్ అదర్ వెరిఫియబుల్ సూపర్స్టిషన్స్’ అని ఒక శాస్త్రవేత్తల బృందాన్ని తన అధ్యక్షతన ఏర్పరిచారు. సత్యసాయి మహిమలను శోధించటమే ఈ బృందం లక్ష్యం. అతి పేద కుటుంబంలో వెనుకబడిన కులాలకు చెందిన నరసింహయ్య హైస్కూలు చదువుకోసం కాలినడకన యాభై కిలోమీటర్లు దూరంలో ఉండే బెంగుళూరుకు నడిచి వెళ్ళటం చాలా గొప్పగా అనిపించిందంటారు. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఎమ్.ఎస్.స్సీ చేసి ఆ కాలేజీలోనే లెక్చరర్ అవటం, ఓహియో స్టేట్ యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో పి.హెచ్.డి. చేసి తిరిగి తను చదివిన కళాశాలకే ప్రిన్సిపాలు అవటం వెనుక గాంధేయవాది నరసింహయ్యగారి దీక్ష-దక్షతలు అర్ధమవుతాయి. 1985లో వీరికి పద్మభూషణ్ అవార్డు లభించింది. నరసింహయ్య పట్ల ఆరాధనతో ”సైన్సు, సమాజం, సాహిత్యం” అనే తన పుస్తకంలో వారి వ్యాసాలను అనువదించటం జరిగింది. మాయలనూ, మంత్రాలనూ, సైన్సుపరంగా చట్టబద్ధంగా, శోధించిన సమరశీలి హోసూరు నరసింహయ్య గారు ‘ఉభయచరజీవి’ కాకపోవటం వలన గౌరవం అంటారు.
నాగసూరి – ఆకాశవాణి
ఆకాశవాణి, డా|| నాగసూరికి ఉద్యోగమిచ్చి ఆదరించింది. ఎక్కడకు బదిలీ చేసినా ఆకాశవాణి కార్యక్రమాలలో నాగసూరి తనదంటూ ఒక ముద్రవేశారు. తన తపనకు సృజన జోడించి, ఆకాశవాణిని జనావళికి చేరువ చెయ్యడం ద్వారా ఋణం తీర్చుకున్నాడనే జి. మాల్యాద్రి గారి అభినందన ప్రత్యేకం.
2013 – ఆకాశవాణి మద్రాసు ప్లాటినం ఉత్సవాలలో భాగం కావటం గొప్ప సంభ్రమాన్ని – సంబరాన్ని కలిగించిందంటారు. 1938లో జూన్ 16న మదరాసు రేడియో కేంద్రం ప్రారంభం కాగా తెలుగు ప్రసారాలను తీర్చిదిద్దిన మహామహులలో ఆచంట జానకీరాం గారే తొలి ప్రయోక్త కూడా. ఆచంట జానకీరాం ఆత్మకథ ‘నా స్మృతిపథం – సాగుతున్న యాత్ర’లలో అధికభాగం రచయిత ఆకాశవాణి అనుభవాలే చోటుచేసుకొన్నాయి. చక్కనిశైలి, ఉద్యోగం పట్ల నిబద్ధత, జీవితంపై మహత్తర సౌందర్య దృష్టి గల జానకీరామ్ విలువైన రేడియో కార్యక్రమాలు రూపొందించారు. ఈ పుస్తకాన్ని చదివి, దగ్గరపెట్టుకోవల్సిన విలువైనదంటారు నాగసూరి. తెలుగులో ప్రసారమైన తొలి రేడియో తెలుగు నాటకం, ముద్దుకృష్ణ వ్రాసిన ‘అనార్కలి’. ఈ రేడియో నాటకంలో సినిమా భానుమతి నాయిక కాగా, దేవులపల్లి కృష్ణశాస్త్రి నాయకపాత్ర వేశారు. అక్బరుగా డాక్టరు అయ్యగారి వీరభద్రరావు నటించారు. ప్లాటినం జూబ్లీ వేడుకల్లో గౌరవం పొందిన బాలాంత్రపు రజనీకాంతరావు, డాక్టర్ రావూరి భరద్వాజగార్ల ఆకాశవాణి కృషి తన ఉత్సాహాన్ని మరింత ఇనుమడింప చేసిందంటారు.

ఆకాశవాణి విజయవాడ స్వర్ణోత్సవాలు 1998లో జరిగాయి. 1948 డిసంబరు 1వ తేదీన అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రెవెన్యూ మంత్రి కళావెంకట్రావు ఆకాశవాణి కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించారు. అప్పటికి మద్రాసు కేంద్రం ప్రారంభమై పది సంవత్సరాల కాలం అవటం వలన విజయవాడ కార్యక్రమాలు ఉన్నత స్థాయిలోనే ఉన్నాయని అనుభవజ్ఞులు నిర్ణయించారు. తెలుగు పత్రికలు పూర్తిగా విజయవాడకు తరలి రాకముందే ఆకాశవాణి మొదలై, కొంతమేథో కళా నేపథ్యాన్ని ఏర్పరచిందంటారు. ఆ కాలంలో ఆకాశవాణిలో పనిచేసిన దిగ్ధంతుల జాబితా చూస్తే విస్మయం కలుగుతుంది. పింగళి లక్ష్మీకాంతం, గుర్రంజాషువా, దాశరధి, బుచ్చిబాబు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గోపీచంద్, ఇలా ఎంతోమంది కృషి చేసి ఆకాశవాణికి ఘనమైన చరిత్రను, గౌరవాన్ని చేకూర్చారు. శతాబ్దం మారుతున్న సమయంలో నాగసూరి గారు విజయవాడ వచ్చారు. ఉత్సవాల సందర్భంగా ”శత వసంత సాహితీ మంజీరాలు’ పేరున ఈ శతాబ్దపు వంద గొప్ప తెలుగు పుస్తకాల గురించి విశ్లేషణల సమాహారం అందించటం చారిత్రకతను పొందిన అంశం అంటారు. 2002లో కృష్ణా మహోత్సవాల సందర్భంగా ”కృష్ణాతరంగం” అనే మంచి ప్రసంగాలను ఆకాశవాణి అందించింది. భాష గురించి పెద్దిభొట్లవారి అర్ధవంతమైన విశ్లేషణ, బెజవాడ భోజనం గురించి వీరాజీ ఇచ్చిన ఆహ్లాదకరమైన వివరణ ఈ సంచికకు ప్రత్యేక ఆకర్షణ అని చెబుతూ సావనీర్లలో ఈ సంచిక గొప్ప సంచలనాలంటారు.
ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 2010లో జరుపుకున్న 60 ఏళ్ళ ఉత్సవాలలో నాగసూరి గారు భాగమయ్యారు. నిజానికి ఈ కేంద్రం 1933లో మహబూబ్ ఆలీ అనే తపాలశాఖ ఉద్యోగి చిన్నస్థాయిలో ప్రారంభించాడట. 1935 ఫిబ్రవరి 3 నుంచి నిజాం అధీనంలోకి వచ్చి నిజాం రేడియోగా మారింది. మొదట సరూర్ నగర్ నుండి తరువాత ఖైరతాబాద్ ప్రాంతం నుండి ఈ ప్రసారాలు జరిగేవట. పోలీసు యాక్షను తరువాత 1950 ఏప్రిల్ 1 నుంచి భారత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చి ఆకాశవాణిగా పేరు మార్చుకుంది. 2012లో కడప బదిలీ అయిన తరువాత అది కడప కేంద్రానికి స్వర్ణోత్సవ సందర్భమని తెలియటంతో ముచ్చటగా మూడు స్వర్ణోత్సవాల నాయకుడయ్యారు. 1963 జూన్ నెల 17న కడప కేంద్రం ఆరంభం కాగా అదే సంవత్సరం ఆగస్టు 4న విశాఖపట్నం ఆకాశవాణి ప్రారంభమైంది.
ఒక్కసారి పునశ్చరణ చేసుకొంటే విజయవాడ అనగానే ‘శత వసంత సాహితీ మంజీరాలు’, ‘జీవన బింబం’, అనంతపురంలో ‘అనంత కళారూపాలు’ (అమళ్ళదిన్నె గోపీనాధ్), విశాఖపట్నంలో ‘వెలుగుజాడ’, ”నేటికీ శ్రీపాద” ‘ఆదివాసీ అంతరంగం’, హైదరాబాదులో ‘మన తెలుగు’, కడపలో ‘అన్నమయ్య పదగోపురం’, ఈ ప్రాంతం – ఈ వారం ‘బ్రహ్మంగారి తత్వప్రభ’ శ్రోతల మనోఫలకాలపై ముద్రవేసిన కార్యక్రమాలను అందించానన్న సంతృప్తి కనిపిస్తుందంటారు రచయిత.
”ఆకాశవాణిలో పనిఇస్తే తప్పించుకోకు. పనిచేయడమే అసలు అధికారం. అలాగే ఇవ్వకపోతే దేబిరించకు. మరింత చదువుకో…ఇంకొంత అర్ధవంతంగా కాలం గడుపు..” అంటూ సూచించిన శిష్ట్లా జగన్నాధరావుకు శ్రీశ్రీ అంటే ఒక వీక్నెస్. తెలుగు, మరాఠీ, కొంకిణి, హిందీ, ఇంగ్లీషు భాషల్లో శ్రీశ్రీ కవితా పంక్తుల్లో కొన్ని ఒకే పేజీలో వచ్చే విధంగా చక్కని పుస్తకం ప్రచురించారట. వీరు కూడా గోవా ఆకాశవాణిలో పనిచేసారు. జీవితంలో తనకు తారసపడిన ప్రతి వ్యక్తిలోని సాహిత్య పిపాసను గుర్తించటమే కాదు వాళ్ళను తనవాళ్ళుగా భావించటం నాగసూరిగారి ప్రత్యేకత.
మిగతా రెండో భాగం….
- డా|| ప్రభల జానకి,
M.A, M.Phil, Ph.D, & D.Lit.,
ఫోన్ : 9000496959
