అనంతపురం జిల్లాలో ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల మధ్య గల ఊరే మడకశిర. ఇది చారిత్రక ప్రాశస్త్యం గల ప్రాంతం. మరాఠా రాజుల పరిపాలన తర్వాత మడకశిర పాలెగాళ్ళ సంస్థానంగా పేరుగాంచింది. ఆ సమయంలో నిర్మించిన కోటలు, బురుజులతో అలరారిన ‘సింహగిరి’ కాల క్రమంలో మడకశిరగా రూపాంతరం చెందింది. ఇలాంటి మడకశిర ప్రాచీన చరిత్రను గ్రంథస్థం చేసిన ఘనత శ్రీ కరణం సత్యనారాయణరావుకి దక్కుతుంది. బహు భాషా వేత్తలైన వీరు విద్యా వ్యవస్థలో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించినవారు. గురువుల ప్రోత్సాహం, చదువుపై అమితమైన ప్రేమ, తన ప్రాంతంపై అభిమానం లాంటివి వీరిని చరిత్ర రచయితగా తీర్చిదిద్దాయనవచ్చు. ఈ నేపథ్యంతోనే 2006లో‘పెనుగొండ చరిత్ర’ ను రెండు భాగాలుగా వెలువరించారు. 2018 లో ‘మడకశిర ప్రాచీన చరిత్ర’ ను రచించారు.              కరణం సత్యనారాయణరావు ‘సింహగిరి చరిత్ర’ (మడకశిర ప్రాచీన చరిత్ర) గ్రంథంలో పొందుపరిచిన విషయాల్ని స్థూలంగా పరిచయం చేసుకొందాం. మౌర్యుల కాలం నుండి 1947 వరకూ గల మడకశిర ప్రాచీన చరిత్రను ఇందులో నిక్షిప్తం చేశారు. మడకశిర ప్రాంత ఉనికి, అక్కడి చారిత్రక ఆధారాలు, శాసన వివరాలు, ఈ తాలూకాలోని ప్రసిద్ధ దేవాలయాల ప్రాశస్త్యం, వ్యవసాయం, యాజమాన్యం, నీటిపారుదల సౌకర్యాలు, రహదారుల సమాచారం, రెవిన్యూ, భూమిశిస్తు, శాంతి భద్రతలు, ఆనాటి ప్రజల జీవన విధానం, సాంఘిక పరిస్థితులు మొదలైన ఎన్నో అంశాల్ని ఈ గ్రంథంలో పరిశీలించారు. ఇది విద్యార్థులకు, పరిశోధకులకు బహు ఉపయోగకరం. రచయిత ఎక్కడా విసుగు పుట్టించకుండా చెప్పే విషయాన్ని ఆసక్తికరంగా, విజ్ఞానాత్మకంగా, సులభమైన శైలిలో  రాసుకుంటూ వెళ్ళారు.          ‘మడకలపల్లి’నే మడకశిర అంటారని, ‘సింహగిరి’, ‘అళియగిరి’ లను కలిపి మడకశిరగా పిలుస్తారని కరణం సత్యనారాయణరావు తెలిపారు. ఏ ప్రాంత చరిత్రను తెలుసుకోవాలన్న శాసనాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మడకశిర చుట్టు పక్కల గల శాసనాల్ని సేకరించారు. ఇవి సుమారు ఇరవై ఉంటాయి. అందులో  అగళి, అమరాపురం, ఛత్రం, గుడిబండ, హలుకూరు, హరే సముద్రం, హేమావతి, మడకశిర, మధూడి, మోరుబాగిలు మొదలైనవి పేర్కొనవచ్చు. రచయిత ఈ శాసనాల పుట్టు పూర్వోత్తరాల్ని తెలియజేశారు. వీటి ఆధారంగానే మడకశిర ప్రాచీన చరిత్రను పురాతత్త్వ, సాహిత్య పరంగా పరిశీలించారు. బ్రూస్ పూట్ అనే ఇంగ్లీషు అధికారి మడకశిరను తొలిసారి గుర్తించారని, దీని వల్ల అక్కడ ప్రజల జీవన విధానం స్పష్టంగా బోధపడుతుందని కరణం వారు అంటారు. అయితే నేడు కొందరు ధనం కోసం ఆశపడి ఈ ప్రాచీన ఆధారాల వినాశనానికి పాల్పడ్డారని వాపోయారు.శాతవాహనులు, పల్లవులు, చౌతులు, కాదంబులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, బాణులు, రాష్ట్ర కూటులు, నోళంబ పల్లవులు, కళ్యాణి చాళుక్యులు, దేవగిరి యాదవులు, ద్వార సముద్రపు హోయసలులు, నిడుగల్లు చాళుక్యుల ఏలుబడిలో మడకశిరకు ప్రత్యేక గుర్తింపు ఉందని రచయిత సోదాహరణంగా నిరూపించారు. విజయనగర రాజుల కాలంలో హరిహరరాయలు, వీరణ్ణ, ఒడయార్లు మొదలైనవారు నిడుగల్లు, మడకశిర, రత్నగిరి కోటల్ని నిర్మించారని గుర్తుచేశారు.         నీలకంఠాపురం శ్రీ రామిరెడ్డి, గొల్లపల్లి రమణ శాస్త్రి, శ్రీ అనంతరాజు నర్సింగరావు, రాళ్ళపల్లి కరణం నాగేశ్వరరావు, కరణం రామదాసరావు, రాళ్ళపల్లి కె. సుబ్బయ్య మొదలైన వారు మడకశిర తాలూకా నుండి జాతీయోద్యమంలో ఉత్సాహంగా పాల్గొని ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం మరవరాని ఘట్టంగా సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఈ పుస్తకంలో రచయిత 1952 నుండి 2014 వరకు మడకశిర శాసన సభ్యులుగా  పనిచేసిన వారి జాబితాను పొందుపరిచారు. ప్రసిద్ధ విద్యావంతుల్ని స్మరించారు. అగళిలో రామస్వామి దేవాలయం, ఛత్రంలోని వేణుగోపాల స్వామి గుడి, మడకశిర కోటలోగల వెంకట రమణాలయం, వేణుగోపాలాలయం లాంటి దేవాలయాల వివరాల్ని సవివరంగా తెలిపారు.  1920 నుండి 1946 వరకు బ్రిటిష్ భారత ప్రభుత్వం జరిపిన ఎన్నికల్లో అనంతపురం జిల్లా వివరాల్ని పట్టిక రూపంలో పొందుపరిచారు. మడకశిరలో అగ్రవర్ణాల నుండి అట్టడుగు వర్గాల వరకు ప్రజలు ఆరాధించే దేవుళ్లను, దేవతలను, గుళ్లు, గోపురాల మహిమాన్వితాలను స్పృశించారు. ముఖ్యంగా అగళిలో రామస్వామి దేవాలయం, ఛత్రంలో వేణుగోపాల స్వామి గుడి, హరే సముద్రంలో లక్ష్మీనరసింహాలయం, మడకశిర కోటలో వెంకట రమణాలయం, వేణుగోపాల స్వామి ఆలయాలు మొదలైనవి చెప్పుకోవచ్చు. ‘‘వ్యవసాయము ఇక్కడ జూదము లాంటిది. వరుణ దేవుని కరుణ జాలిమీదనే ఈ వ్యవసాయము ఆధారపడుతుందం’’టూ…(పుట: 83) మడకశిర నీటి పారుదల సౌకర్యాల్ని మన కళ్ళముందుంచారు రచయిత. ఆనాడు ఒక ఊరికి సంబంధించిన సమస్త  వివరాలన్నీ ‘కవిలాసము’ లో పొందుపరచడం జరుగుతుండేదని చెబుతూ… ఇవి కరణాల దగ్గర భద్రంగా ఉండేవని తెలిపారు. అలా మడకశిర ప్రాంత భూ వివరాలు తమ ఇంట్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. వీటి ఆధారంగానే కరణం వారు మడకశిర ప్రాచీన చరిత్రను ఎంతో బాధ్యతగా పుస్తకరూపంలో తీసుకొచ్చారనేది స్పష్టమవుతుంది. చరిత్రకారుడిగా సత్యనారాయణరావు ఈ గ్రంథ రచనలో ఎంతో సంయమనం పాటించారు. అన్ని సామాజిక వర్గాల ప్రజల సాంఘిక, రాజకీయ, ఆర్థిక, పౌరాణిక జీవితాల్ని ఉన్నదున్నట్లుగా తెలియజేశారు.           రచయిత పుస్తక రచనలో భాగంగా అనేక ప్రాంతాలు తిరిగి, ఎన్నో శాసనాలను కనుగొని, వాటి ఫొటోలు తీసుకుని సందర్భానుసారంగా గ్రంథంలో పొందుపరిచారు. 120 పుటలు గల ఈ పుస్తకం తప్పక చదవదగింది.         కరణం సత్యనారాయణరావు రాసిన ఈ గ్రంథం బాగా వెనకబడ్డ అనంతపురం జిల్లాలోని తాలూకాల చరిత్రను తవ్వితీయాలని సూచిస్తుంది. మడకశిర లాంటి చారిత్రక నేపథ్యం గల ఊళ్లు రాయలసీమ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయని వాటిని కూడా ప్రపంచానికి తెలియజేయాలనే ఆకాంక్షను ఈ గ్రంథం కలిగిస్తుంది. భావి పరిశోధకులకు, చరిత్రకారులకు, రచయితలకు ఉపయగపడుతుంది.

– బడిగె ఉమేశ్ (పరిశోధక విద్యార్థి) హైదరాబాదు విశ్వవిద్యాలయం, ఫోన్ : 9494815854

1 comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s