ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాలో ‌రొద్దం ( Roddam) ఒక మండలం. దీని  పిన్ కోడ్  515123.         పెనుగొండ నుండి  పది మైళ్ళ దూరంలో ఉన్న రొద్దం గ్రామం జిల్లాలోనే అత్యంత ప్రాచీన గ్రామాలలో ఒకటి. ఇది క్రీ.శ 4వ శతాబ్దము నుండి 7వ శతాబ్దము మధ్యకాలంలో స్థాపించబడినదని అంచనా. ఇక్కడ పెన్నానది ఒడ్డున స్థానికులు రుద్ర పాదం అని పిలిచే ఒక శిలపైన కట్టిన గుడి ఉన్నది. పశ్చిమ చాళుక్యుల కాలంలో రొద్ద (రొద్దం) నొళంబవాడికి ప్రాంతీయ రాజధానిగా ఉన్నది. క్రీ.శ.992లో రెండవ తైలాపుడు చోళ రాజరాజును ఓడించిన తర్వాత రొద్దంలో స్థావరమేర్పరచినట్టు బళ్ళారి జిల్లాలోని కొగలి శాసనాలు తెలుపు తున్నాయి. ఆహవమల్ల మొదటి సోమేశ్వరుడు రొద్దం ప్రాంతీయ రాజధానిగా నొళంబవాడిని పాలించినట్టు శాసనాలలో తెలుస్తున్నది.రొద్దం గ్రామానికి పూర్వ నామము రౌద్రపురము అని పేరున్నట్లుగా తెలుస్తున్నది. దానికాధారము 17.9.1927 నాటి సాధన పత్రిక…. 9వ పుటలో నున్న ఒక వార్త.       సమీప పట్టణమైన హిందూపురం నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2311 ఇళ్లతో, 10164 జనాభాతో 5505 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5073, ఆడవారి సంఖ్య 5091. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1418 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 64. 

రౌద్రపురం లేదా రొద్దనాడు అలియాస్ రొద్దం.

 ఇది రాయలసీమే? ఇక్కడెవర్ని చరిత్ర గురించి ప్రశ్నించినా మొట్టమొదట ఏమాత్రం తడుముకోకుండా చెప్పే పేరు కృష్ణ దేవరాయల పేరే! కానీ చాలామందికి తెలీని విషయమేమంటే, దక్షిణా పథానికి రెండవ రాజధానిగా వేసవి విడిదిగా  ఘనచరిత కలిగిన ఘనగిరి అదే పెనుకొండను, తన జీవితకాలంలొ అసలొక్కసారికూడా సందర్శించలేదని చాలామంది చరిత్రకారుల అభిమతం! ఆయన సామాన్య ప్రజానీకానికి వేసిన లంజపన్ను, వీరముష్టి పన్నులాంటి సేవలు పక్కన పెడితే, దానాలు పొందిన వర్గంచే సాహితీ సమరాంగన సార్వభౌముడిగా కీర్తింపబడుతూ దేవాలయాలకు భూరి విరాళాలతో జీవితాన్ని గడిపినా ఇక్కడి సామాన్యులకే కాదు అసమాన్యులక్కూడా తెలీని విషయమేమంటే? ఈ రాయల సీమకు కృష్ణ దేవ రాయలి కంటే ముందు కూడా చాలా చాలా గతించిన ఉజ్వల చరిత్రుందని!
అవును సంగమ, సాళువలాంటి మరో రెండు వంశాలు ఈయన కంటే ముందు దక్షిణాపథాన్ని విజయవంతంగా ఏలాయని. వారి హయాంలోనే ఇక్కడ ఎక్కువ భాగం చెరువులు చిక్కన్న వడయార్ ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయని!? ఇక ఈ రొద్దం విషయమే గమనించినట్లైతే రౌద్రపురంగా స్థానికులు పేర్కొంటున్నప్పటికీ రొద్దనాడుగా శాసనాల్లో పిలవబడ్డ ఈ ప్రాంతం పదహారో శతాబ్దం కాదు పదో శతాబ్దంలోనే తన వునికి చాటుకుందంటే మీరంతా ఆశ్చర్యపడకుండా వుండగలరా!
ముందుగా అక్కడి చరిత్రను తేటతెల్లం చేస్తున్న దేవాలయాల గురించి తెలుసుకునేముందు, దేశవ్యాప్తంగా వున్న దేవాలయాల ప్రధాన శైలులు గమనించినట్లైతే? అవి నాగర(ఉత్తరాది) ద్రావిడ(దక్షిణాది) వేసర(నాగర ద్రావిడ రెండూ కలగలపిన) చెప్పుకోవచ్చు.            దేవాలయాల్ని యోగ, భోగ, వీర, అభిసారికనే నాలుగు వర్గాలుగా పేర్కొనవచ్చు.                యోగ అంటే ఊరికి కాస్తంత దూరంగా ఏ కోనల్లోనో కొండల మీదుండే యోగ నరసింహలాంటి దేవాలయాలు.           భోగ అంటే వూరి మద్యలో సకల భోగ భాగ్యాలతో అంగరంగవైభవంగా అలరారే వైష్ణవ సంప్రదాయపు దేవాలయాలు.           వీర అంటే పల్లెలు, గ్రామాలు, వూర్లు లేదా కోటలు పేటలకు కొనా లేదా మొదల్లో వుండే వీరాంజనేయుని వంటి దేవాలయాలు.             అభిసారిక అంటే ఇవి కొంచెం తాంత్రిక మైనవిగా భావించవచ్చు, ఇవి చాలామటుకు వూరి చివర్లలో వూరికి దూరంగా వుండడం విశేషమైతే, ఇవన్నీ కూడా ఎక్కువుగా వీరభద్ర, భద్ర కాళి, భైరవ వంటి శైవ సంప్రదాయపు దేవాలయాలే కావడం మరో విశేషం.        

             రొద్దానికి మొదల్లోనే పురాతన వీరాంజనేయుడి గుడి మనకు స్వాగతం పలికితే, ప్రస్తుతం వూరి మద్యన (ఒకప్పుడు వూరు బయట కావచ్చు) ఇక్కడున్న వీరభద్ర దేవాలయం పూర్తిగా 

శిథిలమై వారక్కడ కొత్త గుడి కట్టుకొని, భిన్నమైన వీరభద్రుని విగ్రహాన్నలా బయల్లో వుంచేసారు.
 అదే ప్రాంగణంలో వీరభద్రుడి విగ్రహం ప్రక్కనే శిథిలమైన మరో విగ్రహం కిరీటం వంటి మకుటం కలిగిన జటాఝూటపు శివుడిగా భావించ వచ్చేమో. బహుశా వీరభద్రుడు శివుడి జటాఝూటం నుండి వెలువడ్డవాడిగా సూచించడానికిలా ఏర్పాటు చేసిండచ్చేమో. ఇక అక్కడే పడిపోకుండా భూమిలో సగానికి సగం కూరుకుపోయి నిలుచున్న వేసర శైలిలోని రెండు స్థంభాలను పరిశీలించినట్లైతే, వాటి అందాలను చూడాల్సిందే కానీ వర్ణించడానికి వీలుకాదు.

అలాగే ఇంకాస్త ముందుకెలితే ఓ పాత దిబ్బలో సగానిపైగా కూరుకుపోయున్న పెద్ద నంది తన కిందున్న చరిత్రను తవ్వి తీసే వారికోసం మౌనంగా తపస్సు చేస్తున్నట్లు కనిపిస్తుంది. దాని పక్కనే నాలుగడుగుల దూరంలో వున్న భిన్నమైన చిన్న నంది సీమలో చరిత్రకు పట్టిన గతికి సాక్షీభూతంగా దిగాలుగా కూర్చుని కనిపిస్తుంది. మరో పదడుగులు దూరం వుత్తరంగా నడిచామంటే పెన్నేటి గడ్డునే వున్న (ప్రస్తుతం ఆక్రమణలు పరివాహక ప్రాంతం కుచించుకుపోవడం వల్ల పెన్నేరు చాలా దూరంగా వుందని గమనించగలరు) మరో పురాతన ఆధునీకరించబడిన దేవాలయం 

స్థానికులు రొద్దకాంబ లేదా రౌద్రకాంబగా పిలిచినప్పటికీ నాకు తెలిసినంత మటుకు అది భద్రకాళి గుడి అయ్యే అవకాశాలే ఎక్కువని భావిస్తున్నాను. అక్కడున్న మూలవిరాట్టును ప్రస్తుత ఆధునిక ప్రభావం వలన విపరీతంగా అలంకరించడం వలన ఇదమిద్దంగా గమనించడం సాధ్యపడలేదు.
ఇక ఆ దేవాలయ పరిసరాల్లో స్థానికులకు అవగాహనలేక విరిగిపడున్న సగం బండరాయిపై వున్న శాసనాన్ని లైవ్ లో మొబైల్ ద్వారా వీక్షించిన ప్రఖ్యాత విశ్రాంత పురావస్తు శాఖ ఏడీ మాన్య శ్రీ విజయ్ కుమార్ జాదవ్ గారు అది పదవశతాబ్దానికి చెందినదని, అందులో వున్న భాష కన్నడమని, లిపి కన్నడ తెలుగు కలగలపి వుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆయన చెప్పిన దానిని బట్టి ఈ రొద్దం మొదట ఎల్లోరా వంటి గొప్ప నిర్మాణాలు చేపట్టిన ఇప్పటి మహారాష్ట్రాలోని మాన్యకేతాన్ని పరిపాలించిన రాష్ట్రకూటుల ఏలుబడిలో, హెంజేరు32000 అంటే ప్రస్తుతం హేమావతి రాజధానిగా చేసుకొని సామంతులుగా పరిపాలించిన నొళంబ పల్లవుల పాలనలో వుండినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం సగానికి పైగా భూమిలో పూడుకుపోయున్న ఆ నంది అప్పటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా పదకొండవ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా మెలిగిన మలయనూరు రాజధానిగా పరిపాలించిన తెలుగు చోళుల ఏలుబడిలో కూడా ఈ రొద్దం తన ప్రాభవాన్ని కొనసాగించుకుందని చెప్పవచ్చు. ఇంతకు మునుపు నేను చెప్పిన ఆ ఆధునీకరించబడిన వీరభద్ర దేవాలయం దగ్గరున్న శిథిలావస్థకు చేరుతున్న ఆ రెండు స్థంభాలు వీటికి ససాక్ష్యంగా నిలుస్తున్నాయి. వీటి నిర్మాణశైలి కంబదూరులోని మల్లేశ్వర స్వామి గుడిలోని స్థంబాలను పోలివుండడం మనం గమనింపవచ్చు.
ఆ తర్వాత పదమూడో శతాబ్దంలో పెనుకొండ రాజధానిగా ఏలిన హొయసాలులు తదుపరి పద్నాలుగో శతాబ్దం నుండి హరిహరి రాయలు బుక్కరాయల సంగమ వంశపాలనలో శ్రీకారం చుట్టుకున్న విజయనగర రాజుల పరిపాలనలో కూడా ఈ రొద్దం తన ప్రభలు చిందించిందనే చెప్పచ్చు.

ఇక ప్రధానంగా ఈ రొద్దకాంబ గుడి పరిసరాల్లో పడున్న వీరగల్లులు పదో శతాబ్దం నుండి పదహారో శతాబ్దం వరకూ వున్న చరిత్రను తేటతెల్లం చేస్తున్నాయి.            వీర అంటే యుద్దాల్లో కానీ లేదా ఆ వూరికి సంబందించిన పశు సంపదను కాపాడ్డంలో వీరమరణం పొందిన వారి గుర్తుగా కన్నడ భాషలో కల్లు లేదా వ్యావహారికంలో గల్లుగా పిల్చే రాయి అంటే వీరులను స్మరించేటందుకు ఏర్పాటు చేసుకున్న సంస్మరణ ఫలకాలని చెప్పుకోవచ్చు. 

        వీరగల్లుల గురించి చెప్పుకోవాలంటే, ఒకే రాతి పలకపై రెండు లేదా మూడు నాలుగు విభాగాలుగా ఒక రాతి బండపై వీటిని ముందుగా క్రింద భాగంలో ఆ వీరుడెవరో ఆయుధాలతో వున్నట్టు, రెండవ భాగంలో అతను యుద్దంలో నిహతుడైనట్టు, మూడవ భాగంలో తన సతులతనితో సహగమనం చేసినట్టు, నాలుగవ భాగంలో అతను సతీ సమేతుడై శివసాయుజ్యం పొందినట్లుగానూ వీటి నిర్మాణశైలి వుంటుంది. ఒక్కోసారి మూడవ భాగంలోనే సతులతో శివసాయుజ్యం పొందినట్లుగా కూడా చూపిస్తారు. ఇంతకు మునుపు చెప్పినట్లు ఈ వీరగల్లులపై కొన్ని పశువులను చూపించితే వీరు ఆ పశుసంపదకోసం చేసిన పోరాటంలో నిహతులైనట్లుగా భావించాలి.

ఇలాంటి వీరగల్లులు రాయలసీమంతా విస్తారంగా లభిస్తున్నప్పటికీ ప్రత్యేకించి అనంతలో వీటికో ప్రత్యేక స్థానముందనే చెప్పచ్చు. అనంతపురానికి ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలోని బత్తలపల్లికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్న ఈదుల ముష్టూరు అనే పల్లెలో వున్న వీర ముద్దప్ప ఆలయం వద్దున్న పదులకుపైగా వున్న వీరగల్లులిక్కడి గతించిన వీరుల కథలకు కేవలం మౌన సాక్ష్యాలుగా నిలుచున్నాయి. నిజం చెప్పాలంటే ఇది వీరుల ముష్టూరుగానూ కాలక్రమేణా యీదుల ముష్టూరుగానూ అయివుండచ్చని చరిత్రకారుల అభిప్రాయం. ముష్టి అంటే బలమైనా లేదా చిన్న అని అర్థం వస్తుంది, ముష్టూరు అంటే చిన్న వూరు లేదా శివుడు ఉంఛం స్వీకరించేవాడు కావున ముష్టీశ్వరుడిగా కూడా పిలవబడినందువల్ల ఇది శైవ ప్రాంతమయ్యే అవకాశమే ఎక్కువని గమనించగలరు. చెన్నేకొత్తపల్లి నుండి దక్షిణంగా ముష్టి కోవెల అనే గ్రామం కూడా వుండడం గమనింపవచ్చు.
ఈ వీరగల్లుల సంస్కృతి ఎనిమిదవ శతాబ్దంలోని వైదంబుల నుండి ప్రారంభమై పదహారో శతాబ్దం విజయనగర రాజుల పరిపాలనల్లో కూడా కొనసాగినట్లుగా మనకు తెలుస్తోంది. అందుకుదాహరణ మన తిమ్మమ్మ మర్రిమానుగా ప్రసిద్ధికెక్కిన సతీ సహగమన వుదంతం. ఇదీ క్లుప్తంగా రొద్దం గతించిన చరిత్ర. మరిప్పటి సీమ చరిత్రకు పట్టిన చెదలు అనంత చరిత్రకు పట్టిన అధోగతికి కారణాలు విశ్లేషిస్తే?
ముందుగా ఇక్కడి ప్రజలకు తమ స్థానిక చరిత్ర పట్ల అనాసక్తి, యువత కరువు కాటకాలకు దూరాభారాల వలసలు, స్థానికుల్లో వుండే అపోహలు, గుప్త నిథుల త్రవ్వకాల వేటగాల్ల కరకు కాట్లు వంశ పారంపర్యంగా రాజకీయ నాయకుల తయారీ, వారికి సీమ చరిత్రపై కనీసం కరవైన శ్రద్ధ, టూరిజాన్ని ప్రోత్సహించాలన్న కనీస జ్ఞానం లోపించడం
ఎన్నికైన ఏ ప్రభుత్వాలైనా కేవలం దేవాదాయ శాఖ, దేవాలయాల్లో హుండీలపైనే చూపు తప్ప పురావస్తు శాఖనసలు పట్టించుకోకపోవడం.
ప్రస్తుతం పురావస్తు శాఖలో విభజన తర్వాత వున్న అధికారుల్లో చాలామందికి తాము పనిచేస్తున్న శాఖపై కనీస జ్ఞానం లేకపోవడం, కనీసం ప్రభుత్వమైనా పూనుకొని వీరికి విశ్రాంత అధికారులచే తర్ఫీదిప్పించకపోవడం
ప్రభుత్వ పాఠశాలులు కళాశాలలు యూనివర్శిటీల్లో చరిత్రంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా చరిత్రను సరిపెడుతున్న వైనాలు. బూటక పరిశోధనలు కడుపుకోసమై వుత్తుత్తి నాణ్యతలేని చారిత్రక పరిశోధనలు
అయిపు అజాలేని ప్రజాసంఘాలు వున్న ఇంటాక్ వంటి చారిత్రక పరిరక్షణా సంస్థలు కేవలం జిల్లా కేంద్రాల్లో సమావేశాలకే పరిమితాలు.
వెరశి ఇన్ని గ్రహణాలు ఒక్కసారిగా మిందపడితే సీమ అనంత చరిత్రకు కారు చీకట్లు కమ్ముకోక మరేమౌతుందో మీరే చెప్పండి. నిజం చెప్పాలంటే అప్పుడెప్పుడో నిజాం హాయాంలోనో తర్వాత బ్రిటీష్ వారి హయాంలోనో జరిగిన చారిత్రక పరిశోధనలు తప్పితే కొత్తగా సీమ చరిత్రకై సమగ్ర పరిశోధన జరగలేదనే చెప్పచ్చేమో. అలా సీమ చరిత్రను సమగ్రంగా పరిశోధించనంత వరకూ పదకొండు రూపాయలా ఎనిమిది పైసలా రెండణాల వీరులే సినిమాల రూపంలో కొత్త చరిత్ర గతులు సృష్టిస్తుంటారు. అంత వరకూ వూరు మాత్రమే వుండి పేరు తెలియని మరెందరో వీరులు వీరగల్లులై ఈ సీమలో పుట్టిన పాపానికి అనంతంగా రోదిస్తుంటారు…


సంగీతవాణీ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s