రాళ్లపల్లి అనంతకష్ణ శర్మ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా (నేటి కంబదూరు మండలం)లోని రాళ్లపల్లిలో 1893 జనవరి 23న జన్మించారు. తల్లి అలమేలు మంగమ్మ వద్ద సంగీతం, తండ్రి కృష్ణమాచార్యుల వద్ద సంస్కృతాంధ్ర కావ్యాలు నేర్చారు. ఆయన తల్లి అలివేలు మంగమ్మ సంగీత గురువులు. ఆమె సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళ భాషలలోని భజన కీర్తనలు, పెళ్ళి పాటలు, జోలపాటలు, పూజ పాటలు కథా గేయాలు చిన్ననాడే శర్మగారికి నేర్పింది. మేనమామ గారి ప్రోత్సాహంతో ఫిడేలు వాయించడం నేర్చుకున్నాడు.
ఆ కుగ్రామంలో చదువుసంధ్యలకు ఎలాంటి అకాశాలూ లేనందువల్ల మైసూరు వెళ్లారు. పరకాల మఠయతీంద్రులైన శ్రీకష్ణ బ్రహ్మతంతుల వారి వద్దనూ, చామరాజనగరం రామశాస్త్రి వద్దనూ, సంస్కృత కావ్యనాటకాదుల్నీ, అలంకార గ్రంథాలనూ లోనారసిలో అభ్యసించారు. తర్వాత మైసూరు మహారాజా కాలేజీలో ప్రొఫెసెరుగా పనిచేస్తున్న కట్టిమంచి రామలింగారెడ్డి స్నేహసహచర్యాలు లభించాయి. సుమారు ఎనిమిదేళ్ల నిత్యసాహిత్య సంబంధాల వల్ల రెడ్డి గారి ‘నెల పల్కుపదును’, ‘తెలివిలోతు’, నిండుతెలుగు మనసు, శర్మకు చాలా వరకు దక్కగలిగాయి. కట్టమంచి ‘కావ్యదీప్తికి కరుగు మనసు’ను కూడా పుణికి పుచ్చుకోగలిగారు. కట్టమంచి ప్రతిభా దీధితులు ప్రసరించకుండా, పాశ్చాత్య సాహిత్య ప్రభావం పడకుండా వుంటే రాళ్లపల్లి ఏ సంస్కృత పండితులుగా వుండిపొయేవారేమో? లేకపోతే, అచ్చ తెలుగు రామాయణము, నీలాసుందరి పరిణయము, ఆంధ్రనామ సంగ్రహాలకే పరిమితమైన శర్మ తెలుగు చదువు, ఎలాంటి డిగ్రీలూ లేని పాండిత్యం ఆయనకు మైసూరు మహారాజా కాలేజీలో తెలుగు పండిత పదవిని అలంకరింపచేశాయంటే కట్టమంచి చలవే కదా.
అందుకనే శర్మ తన ‘శాలివాహన గాథా సప్తశతీ సారము’ను అంకితమిస్తూ (1964) కట్టమంచి ‘సరసమిత్రుడ నగ గరుడన జేపట్టి పయికి నెత్తినట్టి ప్రభు’వని మనసారా స్మరించుకున్నారు. మైసూరు మహరాజా కాలేజీలో (1912-49) పనిచేసిన కాలంలో శర్మ జీవితంలో కొద్ది ఆటుపోట్లు వాటిల్లినా, దాదాపు ప్రశాంతంగా గడిచిందనే చెప్పొచ్చు. సంస్కృత, తెలుగు, కన్నడ సాహిత్యాల్లో శిఖర ప్రాయులైన విద్వాంసుల స్నేహ సౌహార్ర్దాలు, కర్ణాటక సంగీత కోవిదులైన వీణ శేషణ్ణ, బిడారం కృష్ణప్ప, మైసూరు వాసుదేవాచార్యుల్లాంటి మహనీయుల ప్రేమ ఆదరాభిమానాల మధ్య, కావ్యమర్మజ్ఞత, సంగీతాస్వాదనా రసికతలు ముప్పిరికొన్నాయి.
తెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాతలలో అనంతకృష్ణశర్మ అగ్రేసరుడు. విమర్శనా రీతులలో వీరు మార్గదర్శకుడు. అన్నమాచార్యులు వారి కృతులను – కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు.

మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు.
చామరాజునగరం రామశాస్త్రిగారి వద్ద శాకుంతలం, ఉత్తరరామ చరిత్ర, ముద్రా రాక్షసం, అనర్ఘరాఘవం, కాదంబరి వాటిని చదివాడు. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించాడు.
శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ అనగానే యువ సాహిత్య విద్యార్థులకు చటుక్కున ‘రాయల నాటి రసికత’, ‘నిగమ శర్మ అక్క’ ‘వేమన హాస్యము–నీతి’ వీటిలో ఏ ఒక్కటైనా స్ఫురించక మానదు. ఇక ‘నాచన సోముని నవీన గుణములు’, ‘ఆంధ్ర వాఙ్మయమున నాచన సోమనాథునికి కేయదగిన స్థానము’ ‘తిక్కన తీర్చిన సీతమ్మ’, ‘త్యాగయ్యగారి నాదసుధారసం’, ‘రంగనాథ రామాయణము’ వీటిలో ఏ ఒకటీ, రెండైనా తట్టక మానవు. సునిశిత విమర్శకులకు ‘నాగార్జున సాగరం’, ‘పెన్నేటి పాట’, ‘వదరుబోతు’, ‘వేమన పద్యములు’ మొదలైనవాటికి రాళ్లపల్లివారు రాసిన పీఠికలు పదేపదే చదవాలనిపించక పోదు. మరి కవితా ప్రియుల్లో శర్మ అనువదించిన ‘శాలివాహన గాథాసప్తశతీ సారము’ లోని గాథలు జ్ఞప్తికి రాకపోవు. అనంతకృష్ణులవారి మేరుకృతి ‘వేమన’(1929)లోని వారి సూచీముఖ పరశీలనా దృష్టికీ, చుంబక శైలీ విన్యాసానికీ, సుకుమార హాస్యానికీ, హృదయ ఛేదక వ్యంగ్యానికీ లోనుగాని వారెవరు!
రాళ్ల పల్లి కవితా రమణీయానికి ముగ్ధులైన విశ్వనాథ సత్యనారాయణ ‘పెనుగొండ కొండ,’ ‘శమీపూజ’ కవితలు తెలుగులో కలకాలం నిలుస్తాయని అన్నమాట తెలిసిన వాళ్లెందరు? శర్మగారి ‘సంధ్యావందనము’, ‘ప్రబంధ కవి’, ‘ముసలి వీణ’ కవితల్లోని జాతీయతా స్ఫూర్తినీ, కావ్య సంగీతాల రాసిక్యాన్నీ పసికట్టిన వారున్నారో లేదో?
నిగమశర్మ అక్క, నాచన సోముని నవీన గుణములు, తిక్కన తీర్చిన సీతమ్మ, రాయలనాటి రసికత అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. కట్టమంచి రామలింగారెడ్డి గారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండిత పదవిని అలంకరించాడు. అప్పటి నుండి తెలుగులో రచనా వ్యాసంగాలను మొదలుపెట్టాడు. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించాడు. పెద్దన పెద్దతనము అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశాడు.
‘ఆర్జవం’ అంటే తాను అనుభవించిన భావాలనే వెలువరించే అకృతిమ స్వభావం.ఇతరుల మెప్పులకో, సంప్రదాయ సంరక్షణకో ఆశపడి, తన మనస్సులో నిజంగా లేని భావాలను ఆరోపించుకుని, రచనా వ్యాపారం సాగించే సంత సరుకు కాదు. ఈ ఆర్జవ గుణమే ఆయన వ్యవహారంలోను, కవితలలోనూ భావాలకు త్రీవతను, భాషకు పదునైన తీర్పును ఈయగలిగింది. ఆధునిక, అత్యాధునిక విమ్శకుల నిబద్ధత, నిమగ్నత, నిబిడత లాంటి మాటలకంటే బలమైనదీ, అర్థవంతమైనదీనూ ఈ ‘ఆర్జవం’ అనే పదం. దీన్ని శర్మ తమ విమర్శనా వ్యాసంగంలో ఆద్యంతమూ పాటించారు. అనంతకృష్ణులు పాటించిన విమర్శనా విధానం– భావము, వస్తువు, రచనలను వారి పేరు చెప్పకుండా అనుసరించిన విమర్శకులు ఎంతోమంది ఉన్నారు రాళ్లపల్లి విమర్శ వ్యాసాల్ని లోతుగా పరిశీలిస్తే, వారి సమకాలీన విమర్శకుల కంటే ఎంతో ముందుచూపూ, సూక్ష్మతర పరిశీలనా దృష్టీ కలవారని తెలుస్తుంది.
సంగీతప్రియులైన శర్మ కృష్ణప్పగారి వద్ద నాలుగైదు సంవత్సరాలు శాస్తీయసంగీతాన్ని అభ్యసించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చెలికాని అన్నారావు తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరారు. ఆయన ఏడు సంవత్సరాలు (1950-57) సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు. రేడియో కు “ఆకాశవాణి”యని పేరు పెట్టినది ఆయనే.
రాయలసీమ సాహిత్యములో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుకొండ – కొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ వ్రాశాడు.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ సంప్రదాయ పాండిత్యానికి, సాహిత్య విమర్శకు గొప్ప పేరొందిన పండితుడు. విశ్వవిద్యాలయాలు వ్యవస్థీకృతమైన దశలో డిగ్రీలు లేని పాండిత్యాన్ని అంగీకరించడం, ఆచార్యత్వాన్ని ఇవ్వడం చేయని విధానాల వల్ల రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వలె క్షుణ్ణంగా సంప్రదాయ విమర్శ సాహిత్యాన్ని వివేచన చేయగల సమర్థుల సేవలు వినియోగించుకోకపోవడంతో వారి పాండిత్యం నుంచి విశ్వవిద్యాలయ పరిశోధన వ్యవస్థలు ప్రయోజనం పొందలేకపోయాయి. విశ్వవిద్యాలయ వ్యవస్థలోని తెలుగు సాహిత్య విమర్శల్లో ప్రామాణ్యాలు లోపించడం, సంప్రదాయిక సంస్కృత సాహిత్య విమర్శ పద్ధతుల నుంచి ప్రయోజనం పొందకపోవడం వంటివి ఇటువంటి పండితులు విశ్వవిద్యాలయాల్లో కొలువు కాకపోవడం వల్లనే వచ్చిందని సాహిత్య పరిశోధకుడు వెల్చేరు నారాయణరావు పేర్కొన్నాడు.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు.
సత్యం,శివం,సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి భాషణ మితహితం. సంభాషణ సరసచతురం.
కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించారు. ‘పెద్దన పెద్దతనము’ అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు.
1928 నవంబరు చివరన శర్మ వేమనపై చేసిన ఉపన్యాసాలు ఎంతో విజ్ఞానదాయక మైనవి. ఆ ఉపన్యాసాలలోని కొన్ని వాక్యాలు “ఇరు ప్రక్క లందును మరుగులేని మంచి పదనుగల చురకత్తివంటి కవితాశక్తి, దానికి మెరుగిచ్చినట్టి, సంకేత దూషితముగాని, ప్రపంచ వ్యవహారములందలి సూక్ష్మదృష్టి, గాయపు మందు కత్తికే పూసి కొట్టినట్లు తిట్టుచునే నవ్వించు హాస్యకుశలత”… ఇవన్నియు వేమన్నను సృష్టిచేయునపుడు బ్రహ్మదేవుడుపయోగించిన మూల ద్రవ్యములు” అన్నారు. వేమన ద్వారా రాళ్ళపల్లి వారు కవి జీవిత కావ్యార్థ సమన్వయ విమర్శకు బాటవేశారు. రాళ్ళపల్లివారి సారస్వతోపన్యాసాలు, వారిని తెలుగు విమర్శకులలో అగ్రగణ్యునిగా చేశాయి. పీఠికా రచనలో కూడా రాళ్ళపల్లి గొప్ప పేరు గాంచారు.అనంతకృష్ణ శర్మ గారు సంగీత, సాహిత్య రంగాలలో చేసిన అవిరళ కృషికి తగిన గుర్తింపు లభించిందనే చెప్పాలి. తెలుగునాట, కర్ణాటక దేశంలో కూడా ఆయనకు తగిన గౌరవం వివిధ పురస్కారాల రూపంలో దగ్గింది. ‘రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు’, ‘నిగమశర్మ అక్క’, ‘తిక్కన్న తీర్చిన సీతమ్మ’ వంటి ఎన్నో మహత్తర గ్రంధాలను భావితరాలకు అందించిన మహానుభావుడు మన శర్మ గారు. 1934లో బళ్ళారిలో ధర్మవరం కృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావుల స్మారకోత్సవంలోశర్మగారిచ్చిన ”నాటకోపన్యాసములు”లో నాటక లక్షణములను విపులంగా వివరించారు. సుందరపాండ్యుని ”ఆర్య”ను శర్మగారు తెనిగించారు. ప్రాకృత భాషలో పరిణితులైన శర్మగారి ”గాథాసప్తశతీసారము” వారి అనువాద సామర్ధ్యానికి నిదర్శనంగా వుంది. మధునాపంతులవారు రాళ్ళపల్లివారిని గురించి రాస్తూ ”సాహిత్య ప్రపంచమున కవితా విమర్శన శాఖకు వారి దర్శనము చిరంతన వసంతమన్నారు”. శర్మగారు రచించిన ”గానకలె”, జీవమత్తుకలె” అన్న గ్రంథాలు వారి కన్నడ భాషా వైదుష్యానికి మచ్చుతునకలు.


సంగీత ప్రియులైన శర్మగారు, సంగీత విద్వాంసులైన బిడారం కృష్ణప్పగారి వద్ద నాలుగైదేళ్ళు శాస్త్రీయంగా సాధన చేశారు. 1927లో అనంతపురంలో జరిగిన ఆంధ్రగాయక మహాసభలో శ్రోతలు భోజన సమయాన్ని విస్మరించి అత్యంత ఆసక్తితో విని వారి గానలహరిలో మునకలు వేశారు. మైసూరు మహారాజావారు ఏర్పాటుచేసిన కవితాపరీక్షలో ప్రథమబహుమతి నందుకొని మహారాజావారి దర్బారులో ఘన సత్కారమందుకొన్నారు. గానకళాసింధు, గానకళాప్రపూర్ణ, సంగీత కళానిధి బిరుదములందుకొన్నారు.
మైసూరులో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తిరుమల – తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చెలికాని అన్నారావు తాళ్ళపాక కవుల కీర్తనల పరిష్కరణ కార్యం నిర్వహించవలసిందిగా ఆయన్ను కోరారు. ఆయన ఏడు సంవత్సరాలు (1950-57) సంకీర్తనలను పరిశీలించి కొన్నింటికి స్వరకల్పన గావించి వాటి గొప్పతనాన్ని చాటాడు.
శర్మగారిని కేంద్ర సంగీత నాటక అకాడమీ 18-10-1970న “ఫెలోషిప్‌” తో సత్కరించింది.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యా లయం 30-4-1974 గౌరవ “డి.లిట్‌”పట్టాతోగౌరవించింది.
మైసూరులో జరిగిన 4వ సంగీత సమ్మేళనంలో ‘గాన కళాసింధు’ బిరుదుతో సత్కరించారు.
బెంగుళూరు గాయక సమాజం ‘ సంగీత కళారత్న’ బిరుదుతో సత్కరించింది.
సంగీత, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలందించిన శర్మగారిని 1979 మార్చి 11న తి.తి.దేవస్థానం వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించారు. వయోభారంతో వారు తిరుపతికి వెళ్ళలేక పోయారు కార్యనిర్వాహణాధికారి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌గారు బెంగుళూరు వెళ్ళి సాయంత్రం 4 గంటలకు శర్మగారికి బిరుదు ప్రదానంచేసి సత్కరించారు. అదే రోజు రాత్రి7-05 గంటలకు శ్రీనివాసుని ఆస్థాన విద్వాంసులైన రాళ్ళపల్లివారు స్వర్గస్థులైనారు.
ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు

✍️సేకరణ:– చందమూరి నరసింహా రెడ్డి ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత.

చందమూరి నరసింహా రెడ్డి

రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s