అయోధ్యలో రామజన్మభూమి ఆలయనిర్మాణానికి శరవేగంగా పనులు ఆరంభమైయ్యాయి.  ఆలయం నిర్మించేందుకు అయిదు దశాబ్దాలుగా ఉద్యమం సాగుతూవస్తున్నది. ఈ కల 2020 ఆగస్టు 5వ తేదీనాటికి సాకారమయింది. ప్రపంచం యావత్తు కోట్లాది మంది తిలకిస్తుండగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమిపూజ చేశారు.
అయితే, ఈ సందర్భంలో గుర్తుంచుకోవలసిన వ్యక్తి తెలుగు నాట ఒకరున్నారు. రామమందిర ఉద్యమానికి ఆయన అండగా ఉన్నారు. రామమందిరం నిర్మించాలని కలలుగన్నారు. ఉద్యమానికి ఎంతగానో సహకరించారు.అతడు ఎవరో కాదు పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని దివంగత పుల్లారెడ్డి.
అయోధ్య రామ జన్మభూమి ఆందోళన అని మాట పలికితే రథయాత్ర (సెప్టెంబర్ 25, 1990-అక్టోబర్ 30,1990) అద్వానీ గుర్తుకొస్తారు. కోర్టు కేసులో మాత్రం పుల్లారెడ్డి కీలకమైన వ్యక్తి.
ఆ రోజుల్లో కోర్టులో కేసు వాదించడానికి రోజుకు లక్షల్లో ఖర్చు వస్తున్నందున దాని భరించడం  ఢిల్లీ విశ్వహిందూ పరిషత్ (విహెచ్ పి) కు కష్టమయింది.
అపుడు విశ్వహిందూపరిషత్ కు పుల్లారెడ్డి కోశాధికారి.విహెచ్ పి అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింగల్  హైదరాబాద్ వచ్చారు . కోర్టు కేసుల కోసం ఇరవైఐదు లక్షలు సమీకరించాలి. ఇంత పెద్ద మొత్తం  సమీకరించడం అప్పటికప్పుడు కష్టంగా ఉన్న సమయం. అందుకే పుల్లారెడ్డి ఒక మార్గం చూపిస్తారని ఆయన హైదరాబాద్ వచ్చారు.
పుల్లారెడ్డి ఇంటికి వచ్చిన ఆయనతో ఈ విషయం ప్రస్తావించారు. పుల్లారెడ్డి ఇంట్లోకి వెళ్లి వచ్చి రెండు లక్షల రూపాయలు తెచ్చి అశోక్ జీ చేతిలో పెట్టారు. సాయంత్రానికి మరో పది లక్షలు అందించారు.   మిగతావి సమకూరుద్దామని భరోసా ఇచ్చారు.
‘రామజన్మభూమి కేసులో  విజయం సాధించే వరకు వాదించాల్సిందే.   దాని  పోరాడవలసినదే. ఎక్కడికైనాఎంత దూరమైనా, ఎన్ని త్యాగాలకైనా వెరవకుండా ముందుకు వెళ్దాం,’ అని పుల్లారెడ్డి అన్నారు.
ఈ భరోసా ఇవ్వడమే కాక ఎర్రమంజిల్ కాలనీలో  తన ఇంటి ముందు నిలబడుకుని అశోక్ సింఘాల్ చేతులు పట్టుకొని, ‘నేను బతికున్నంతవరకూ, విశ్వహిందూపరిషత్  కు కోశాధికారిగా ఉన్నంతవరకు కోర్టు వ్యాజ్యాలకు నిధుల కొరత రానీయను,’ అని మాటఇచ్చారు.
” అవసరమైతే ఈ ఇల్లు అమ్మేస్తాను ,నా భార్య దగ్గరన్న లక్షల రూపాయల విలువచేసే నగలు అమ్మేస్తాం,’ అంటూ భార్య నారాయణమ్మ తో కలసి అశోక్ సింఘాల్ చేతులు పట్టుకుని హామీ ఇచ్చి పంపారు.
అశోక్ సింఘాల్ ఆనందాశ్రువులు  సుడులు తిరుగుతుండగా పుల్లారెడ్డిని ఆలింగనం చేసుకున్నారు.ఆలింగనం చేసుకుని పుల్లా రెడ్డి గారి భుజాన్ని ఆనందపు అశ్రువులతో తడిపేసారు అశోక్ సింఘల్. 2011 డిసెంబర్ లో అశోక్  సింఘల్ రిటైరయ్యాక విహెచ్ పి అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైందెవరో కాదు, పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి
నేతి మిఠాయిలకు పర్యాయపదంగా నిలిచిన పుల్లారెడ్డి పూర్తి పేరు. గుణంపల్లి పుల్లారెడ్డి 1920 ఆగస్ట్ 12న కర్నూలు జిల్లా గోకవరం గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుల్లమ్మ హుస్సేన్ రెడ్డి దంపతులకు జన్మించారు. ఆయన భార్య నారాయణమ్మ. వారికి  ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు.
చిన్నాన్న కసిరెడ్డి వెంకటరెడ్డి  ప్రోద్బలంతో పుల్లారెడ్డి గారు మిఠాయిల వ్యాపారం లోనికి అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ మిఠాయి అంటే పుల్లారెడ్డి స్వీటే అనే స్థాయికి తీసుకువచ్చారు.
తొలుత టీ దుకాణం తో ఆయన జీవన యాత్ర మొదలయింది. మజ్జిగ అమ్మడం, బట్టల దుకాణం వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసినా, చిన్నాన్న ప్రోత్సాహంతో కర్నూలులో 1948లో మిఠాయిల దుకాణం  ప్రారంభించారు. అది ఆయన జీవితంలోని కాదు, తెలుగు వారి  మిఠాయిల వ్యాపారంలో  కూడా కొత్త  మలుపు
తన వ్యాపార దక్షతతో పుల్లారెడ్డి మిఠాయిలను స్వచ్ఛతకు, రుచికి మారు పేరుగా నిల్పారు. ఉదాహరణకు సింహాద్రి సినిమాలో ఒక పాటలో “నీ అధరామృతం పుల్లారెడ్డీ, అర కేజీ అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ” అని వస్తుంది. అనతికాలంలోనే పుల్లారెడ్డి నేతి మిఠాయిలు ప్రాచుర్యంలోకి రావడంతోపాటు వ్యాపారం కూడా విస్తరించింది.
1957లో  హైదరాబాద్ లోని అబిడ్స్ లో  మరొక దుకాణాన్ని తెరిచారు. ఒక చిన్న దుకాణంగా ప్రారంభమైన అయన వ్యాపారం ఇప్పుడు వందల మంది పనివారితో విదేశాలకు సైతం మిఠాయిలు పంపేంతగా ఎదిగింది. పనివారిని సొంతమనుషుల్లా చూసుకుని వారికి ఇళ్లుకూడా కట్టించారు.
పాకశుద్ధి ఎంత అవసరమో వాక్శుద్ధి కుడా అంతే అవసరం కనుక అబద్దం ఆడకు అని తరచూ చెప్పెవారు.
మన తెలుగు రాష్ట్రాల్లో పుల్లా రెడ్డి స్వీట్స్ పేరు వినని వారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే, ఏ పండగొచ్చినా, ఎలాంటి ఆనంద సందర్భమైనా పుల్లా రెడ్డి స్వీట్స్ కొని అందరికి పంచటం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ముఖ్యంగా, హైద్రాబాద్ లో పుల్లారెడ్డి స్వీట్స్ షాప్, ఆ నగరానికే ఒక ప్రత్యేకతను తీసుకొచ్చి పెట్టింది. ఎవరైనా హైదరాబాద్ నుండి మిగిలిన ప్రాంతాలకి వెళ్లే వారు ఉంటె, కచ్చితంగా ఈ పుల్లారెడ్డి స్వీట్స్ కొని తీసుకువెళతారు.
తిరుమల తిరుపతి దేవస్థానం  మొట్ట మొదటి సారిగా శ్రీవారి గుడి వంట గదికి ఆహ్వానం అందుకున్నది  పుల్లా రెడ్డి స్వీట్స్ షాపే. టీటీడీ  తాము భక్తులకి అందించే ప్రసాదాలు ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా సూచనల కోసం పుల్లా రెడ్డి స్వీట్స్ ని ఆహ్వానించారు. ఇలా ఒక దేవస్థానం వారు ఒక స్వీట్స్ షాప్ వారిని ఆహ్వానించటం ఎంతో గౌరవప్రదమైనది. తిరుమల తిరుపతి దేవస్థానం  పుల్లా రెడ్డి స్వీట్స్ కి ఇచ్చిన గౌరవం చాలా అరుదైనది. దాదాపు ఇది ఎవరికీ తెలియని నిజం.
కర్నూల్ లోని గోకవరం అనే ఒక పల్లెటూరులో, సైకిల్ తొక్కుతూ తన భార్య తయారు చేసిన స్వీట్స్ ను అమ్ముతూ అంచెలంచెలుగా ఆ విశిష్ట స్థాయికి ఎదిగారుపుల్లారెడ్డి. పాత కర్నూల్ మార్కెట్ లో ఒక చిన్న స్వీట్ షాప్ పెట్టి ఈ రోజు స్వీట్ వ్యాపారాన్ని కోట్లవ్యాపారంగా మారేందుకు బాట వేసిందాయనే.
ఆంధ్ర ప్రదేశ్ లో మొట్ట మొదటి సారిగా తెలుగు స్వీట్ షాప్ గా జి. పుల్లా రెడ్డి స్వీట్ షాప్ పేరు తెచ్చుకుంది. మన తెలుగు వాళ్ళకి, ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది పుల్లా రెడ్డి స్వీట్స్. అప్పటివరకు వేరు వేరు ప్రదేశాల నుండి వచ్చిన మిఠాయి వ్యాపారులకు గట్టి పోటీని ఇచ్చింది పుల్లా రెడ్డి స్వీట్స్.
1954 సంవత్సరం నుంచి  పుల్లా రెడ్డి స్వీట్స్, గవర్నర్  రాజభవన్ కి అధికారికంగా స్వీట్స్ సరఫరా చేయటం ప్రారంభించింది. 1974 లో జి. పుల్లా రెడ్డి  ఆర్ యస్ యస్ సంఘ్ చాలక్ గా చేరారు. 1975 లో ఆయన పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా, దేశానికి ఉపయోగపడే సేవ చెయ్యాలనే తపన పుల్లారెడ్డిని ఈ స్థాయికి తీసుకొచ్చింది.
ఉడిపి పేజావర్ మట్, పుల్లా రెడ్డి కి  ‘దానగుణ భూషణ’ అనే బిరుదును 1991 లో అందించారు. దాని మరుసటి సంవత్సరం 1992 లో ‘జమ్నాలాల్ బజాజ్’ అవార్డును అందుకున్నారు.
విశ్వహిందూపరిషత్ తో ఆయనకు ఉన్న అనుబంధం వల్ల ఒక దశలో ఆయన లస్కర్ ఇ తాయిబా(LeT) హిట్ లిస్టులోకి కూడా ఎక్కారు. ఈ విషయాన్ని2002లో విలేకరుల సమావేశంలోనే పోలీసులు వెల్లడించారు.
పుల్లా రెడ్డి స్వీట్స్ ను స్థాపించిన జి పుల్లారెడ్డి  ఏవిధమైన ఉన్నత విద్య చదువుకోలేదు. అయినప్పటికీ భారతదేశంలో విజయవంతమైన కొద్ది మంది వ్యాపారవేత్తలలో పుల్లారెడ్డి ఒకరిగా నిలిచారు. ఎంత ఎత్తుకి ఎదిగినా, ఒదిగి ఉండగలిగే స్వభావం వల్ల ఆయనకు ఎన్నో గౌరవ సత్కారాలు లభించాయి. ఎవ్వరికీ అందని గౌరవ బిరుదులూ పొందారు.
అంతటి తో ఆగకుండా, సమాజం పట్ల ఆయనకి ఉన్న శ్రద్ధను పనుల రూపంలో చూపించి అందరికి వీలైనంత మంచిని చేసే ప్రయత్నం చెయ్యటం లో ఆయన పూర్తిగా విజయం సాధించారు. వ్యాపారం ద్వారా గొప్ప స్థాయికి ఎదిగి, ఆ స్థాయిని తిరిగి వ్యాపారం ద్వారా కాకుండా తన సేవా భావం వల్ల, సమాజం పట్ల గౌరవ భావం తో ఆయన మెలిగిన తీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. రుచికరమైన పుల్లా రెడ్డి స్వీట్స్ రాయలసీమ కే ప్రత్యేకం..
పుల్లారెడ్డి పరిస్థితుల ప్రభావం వల్ల 5వ తరగతి వరకు మాత్రమే చదివారు, కానీ ఆయనకు చదువంటే అమితమైన అభిమానం. వ్యాపారంలో ఎదిగిన కొద్దీ ప్రజలకు, సమాజానికి ఏమైనా చేయాలన్న తపనతో 1975వ సంవత్సరం హైదరబాద్ లో జి. పుల్లారెడ్డి ఛారిటీస్ ట్రస్ట్ ను ఏర్పరిచి దాని ద్వారా విద్యావ్యాప్తికై కృషిచేశారు.
1984-85 లో జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను,1994 -95లో జి.పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలను, మహిళల కోసం 1997లో జి.నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు. ట్రస్ట్ తరపున ఎందరో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తూ విద్యావ్యాప్తికి తనవంతు కృషి చేసారు.
కర్నూలు జిల్లాలోని ఎన్నో పాఠశాలల అభివృద్ధికి సహాయం చేశారు. అనాథ బాలురకోసం విజ్ఞాన పీఠం పేరుతొ విద్యాలయాన్ని స్థాపించి వారికి విద్యతో పాటు వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. ఎన్నో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను, డిగ్రీ కళాశాలలను స్థాపించారు.
పుల్లారెడ్డి గారి పై భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలతో పాటు, హిందూ మత ప్రభావం ఏంతో ఉంది. తన దానధర్మాలలో భాగంగా అనేక దేవాలయాల పునరుద్ధరణకు, నిర్మాణాలకు భూరి విరాళాలు ఇచ్చేవారు. ఆ క్రమం లోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.), విశ్వ హిందూ పరిషత్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆర్.ఎస్.ఎస్ లో 1974లో సంఘ్ చాలక్ అయ్యారు. 1980లో విశ్వ హిందూ పరిషత్ హైదరాబాద్ శాఖకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సంస్కృత భాషా ప్రచార సమితి అధ్యక్షునిగా, విశ్వ హిందూ పరిషత్ జాతీయ కోశాధికారిగా, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. వీరి మరణానంతరం వీరి కుమారుడు జి.రాఘవ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుని గా పనిచేశారు.
2007, మే7న పుల్లారెడ్డి చనిపోయారు.

రచయిత :– చందమూరి నరసింహా రెడ్డి. ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

చందమూరి నరసింహా రెడ్డి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s