రాయలసీమ కు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది. అన్ని రాజకీయ పక్షాలు వారి వారి స్వార్థ ప్రయోజనాల ఫలితంగా సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలు అందడం లేదు. అన్ని రాజకీయ పక్షాలు ఒకే వేదికపై చేరి చర్చలు జరిపి తీర్మానాలు చేసి అమలు చేయగలిగితే అప్పుడు ప్రగతి సాద్యమౌతుంది.

రాజకీయాలు వేరు ,ప్రగతి వేరు అన్న కోణంలో అందరూ ఆలోచించాలి. విశాలదృక్పథం కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితి కనుచూపు మేరలో కన్పించడం లేదు. రాజకీయ పక్షాలు అధికారం కోసం ఏవరి ఏత్తులు జిత్తులు వారు అమలు చేస్తున్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రస్తుత ప్రభుత్వం రాయలసీమ కు హైకోర్టు కెటాయించింది. ఇది రాయలసీమ వాసులందరూ హర్షించాలి. అయితే కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించడం, మరికొన్ని రాజకీయ పక్షాలు సమర్థించడం జరుగుతోంది.

ఇలా చేయడం సమర్థనీయం కాదు. అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా హైకోర్టు కావాలని తీర్మానం చేయడమే కాదు మరిన్ని పథకాలు , కార్యాలయాలు కావాలని డిమాండ్ చేసి సాధించుకోవాలి. రాష్ట్ర విభజన ప్రక్రియ సరిగా జరగలేదు. విభజన జరిగిన అనంతరమైనా రాయలసీమ ,కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి అన్ని రాజకీయ పక్షాలు నుంచి సభ్యులును ఎంపిక చేసుకొని సమగ్రంగా చర్చించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి వాటిని ఆమోదించి అమలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

కర్నూలు ను న్యాయరాజధాని గా ప్రకటిస్తే ఎందుకు ఇంత రాద్దాంతం. రాజధాని పేరుతో ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కాలేదు. దేశంలో చాలా రాష్టాల్లో రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో హైకోర్టులున్నాయి.
ఈవిషయం అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలుసు అయినా రాద్దాంతం చేస్తూ తప్పు దారి పట్టించడం ఎంత వరకు సమంజసం.

ఆంధ్రరాష్ట్రంలో కర్నూలులో రాజధాని గుంటూరులో హైకోర్టు ఉండేది విశాలాంధ్ర కోసం 1956సం. లో రాయలసీమ వాసులు రాజధానిని కోస్తాఆంధ్ర వాసులు హైకోర్టు త్యాగం చేశారు. హైదరాబాద్ కు అన్ని తరలించారు. అప్పుడే తప్పు చేశారు. ఆ తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోవాలి కాని
మళ్ళీ తప్పు చేయకూడదు.

రాజధాని మరియు హైకోర్టు ఒకే చోట ఉండాలని తన స్వలాబాల మాటలు మాట్లాడుతున్నారుతప్ప అలా రాజ్యాంగం లో ఎక్కడా పొందుపర్చలేదు.
రాజస్థాన్ లో రాజధాని జైపూర్ లో అయితే హైకోర్టు జోద్ పూర్ లో పెట్టారు జైపూర్ నుంచి జోధ్ పూర్ కు 335 కిమి దూరం. జైపూర్ లో సర్కూట్ బెంచ్ మాత్రమేఉంది.

కేరళ రాజధాని తిరువనంతపురం అయితే హైకోర్టు కొచ్చిలో పెట్టారు.ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అయితే హైకోర్టు కటక్ లో పెట్టారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ అయితే హైకోర్టు జబ్బాల్ పూర్ లో పెట్టారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అయితే హైకోర్టు అలహాబాద్ పెట్టారు లక్నోలో హైకోర్టు బెంచిని ఏర్పాటు చేశారు. 2000లో ఏర్పడిన 27 వ రాష్ట్రంగా ఏర్పడిన ఉత్తరాఖండ్ తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్ కాగా హైకోర్టు నైనితాల్ లో ఉంది.

మన ప్రక్కరాష్ట్రమైన బెంగుళూరులోరాజధాని మరియు హైకోర్టు పెట్టి ప్రజా సౌకర్యం కోసం దర్వాడా మరియు గుల్బర్గా హైకోర్టు బెంచిలు ఏర్పాటు చేసినారు. మరి కర్నూలు లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయకూడదు.

హైకోర్టు తోపాటు పరిపాలన విభాలను కూడా ఒకే చోటు కాకుండా వికేంద్రీకరణ చేయాలి.ప్రతి జిల్లా లో ఒకొక్క విభాగం ఏర్పాటు చేసి అభివృద్ధి కి శ్రీకారం చుట్టాలి. అమరావతి లో భూములు ఇచ్చిన రైతులు ను రెచ్చగొట్టడం కన్నా వారికి నచ్చజెప్పాలి. అగ్రిమెంట్ ప్రకారం పరిహారం చెలించాలి.

అన్ని రాజకీయ పక్షాలు చొరవ తీసుకొని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కి కృషిచేయాలి.
రాయలసీమ వాసులు తరతరాలుగా త్యాగాలు చేస్తూనే ఉన్నారు. ఇలాఇంకా ఎంత కాలం త్యాగాలు చేయాలి.

గతంలో చేసిన త్యాగాలు పరిశీలించండి. రాయలసీమ కన్నా ముందు ఈ ప్రాంతాన్ని దత్తమండలం అనేవారు. ప్రస్తుత అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు, ప్రకాశం జిల్లాలోని కంభం, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలను, కర్నాటకలోని బళ్లారి, తుముకూరు, దావణగేరి ప్రాంతాలను దత్త మండలం అని పిలిచేవారు

1808 లో దత్త మండలం ను విభజించి బళ్ళారి, కడప జిల్లాలని ఏర్పరచారు. 1882 లో అనంతపురంను బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరి నారాయణరావు “రాయలసీమ” అని పేరుపెట్టాడు. అప్పటినుండి ఆ పేరే స్థిరపడినది.

ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాయి. బళ్ళారి కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. కోస్తా, రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

అప్పుడు ఈ నాలుగు జిల్లాలను ఆంధ్ర రాష్ట్రం లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని కర్ణాటకలో కలిపి వేశారు. ఫలితంగా రాయలసీమ లోని బళ్లారి జిల్లా ను త్యాగం చేశారు.

కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది.1953లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినపుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని కర్నూలును కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు.

అయితే మరో మూడేళ్ళలోనే 1956 లో ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణలో కలపటంతో అప్పటి నుండి విశాలాంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.ఫలితంగా రాయలసీమ వాసులు రాజధాని త్యాగం చేశారు.
హైదరాబాదుకు మారింది.

1972 లో కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలు మార్కాపురం, గిద్దలూరు ను ప్రకాశం జిల్లా లో కలిపారు. ఫలితంగా రాయలసీమ మరో రెండు పెద్ద తాలూకాల భూబాగం కోల్పోయింది.

1953కి ముందున్న రాయలసీమ ఇప్పుడు చాలా కుదించుకుపోయింది.రాయలసీమలో ఉన్న బళ్లారి, తుముకూరు, దావణగేరే ప్రాంతాలు కర్నూలు జిల్లాలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాలు
రాయలసీమవాసుల త్యాగ ఫలితంగా కోల్పోయారు.

1953 వరకూ మద్రాసు రాష్ట్రంలో, 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రంలో, 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాయలసీమ ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉంది.

1953 లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందే రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమ , కోస్తా నాయకులు కలిసి ఓ ఒప్పందం చేసుకొన్నారు. అదే శ్రీబాగ్ ఒప్పందం.

1937 నవంబర్‌ 16న మద్రాసులో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లో సమావేశమై, ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ ఇంటి పేరుమీదనే ఈ చారిత్రాత్మక ఒప్పందానికి శ్రీబాగ్ ఒడంబడిక అని పేరు వచ్చింది. ఆ ఒప్పందం లో చాలా విషయాలు నేటికి అమలు కాలేదు.

ఉదాహరణకు వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతంతో సమానమయ్యే వరకు సాగునీటి సరఫరా విషయంలో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి.శాసనసభ స్థానాలు జనాభా ప్రాతిపదికన కాక, ప్రాంత విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించాలి.

రాయలసీమలో జనసాంద్రత కోస్తా కంటే తక్కువ కావడం వలన ఈ ప్రతిపాదన చేసారు. రాజధాని, హైకోర్టులు చెరో ప్రాంతంలో ఏర్పాటు చెయ్యాలి. ఏదికావాలో కోరుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. మరి ఏదీ?

నాడు బ్రిటీష్ గవర్నర్ మెకంజీ లాంటి వారు గుర్రాలతో సర్వే చేయించి మన రాయలసీమ శాశ్వత కరువు నివారణ కోసం సిద్దేశ్వరమ్ వద్ద అలుగును నిర్మించ తలపెట్టారు, కానీ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా అది పెండింగ్ పడటం, మద్రాస్ విభజన తరువాత కోస్తా లాబియింగ్ తో ఆ ప్రాజెక్ట్ కాస్తా నాగార్జున కొండ వద్ద కట్టడం తో మన రాయలసీమ ప్రజల ఆశలు అడియాసలుగానే నేటికి మిగిలి పోయాయి.

తరువాత రాయలసీమ ప్రజలు డిమాండ్ చేయగా శ్రీ శైలం ప్రాజెక్టు ను నిర్మాణం చేసిన అది కాస్తా విద్యుత్, తాగునీటి అవసరాలకని 69జీఓను అడ్డు గా పెట్టుకొని మెుత్తం నీటినిఈ రోజుకీ కోస్తా వారు దోస్తూ ఉన్నారు.నేటికీ వేల టీ.ఎమ్.సి.నీళ్లు రాయలసీమ భూభాగంలో పారుతూ రాయలసీమకు ఏ మాత్రం పెద్దగా ఉపయోగ పడకుండా సముద్రం పాలు అవుతున్నాయి.

ఇంత కరువు ఉన్నా 2014లో విభజన చట్టములో మన రాయలసీమకు సంబంధించి ఒక జాతీయ ప్రాజెక్ట్ ను కూడా పెట్టాలని ఏ రాజకీయ పార్టీ కూడా డిమాండ్ చేయకపోవడం చాలా బాధాకరం . రాజకీయాలకు అతీతంగా తెలంగాణ, రాయలసీమ ప్రజల కరువు నివారణ కోసం తుంగభద్ర నది పై గుండ్రేవుల ప్రాజెక్ట్ ను, క్రిష్ణానదిపై సిద్దేశ్వరంఅలుగు ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ లుగా విభజన చట్టములో సవరణ చేసి అందులో చేర్చి వెంటనే నిర్మాణము చేపట్టాలని భారత ప్రభుత్వమును రాయలసీమ ప్రజలు సవినయంగా కోరుతున్నారు.

1880 ప్రాంతంలో తుంగభద్ర- కృష్ణా – పెన్నాల అనుసంధాన పథకంతో సీమలో 36 లక్షల ఎకరాల్ని సాగులోకి తేవడానికి సర్‌ మెకంజీ చేసిన ప్రయత్నం మెకంజీ పథకం .ఉత్తర సర్కార్ల నాయకులు, తమిళ ప్రాంత నాయకుల స్వార్థ ఆలోచనల వల్ల, నాటి సీమ నాయకుల దూరదృష్టి లోపం వల్ల ఈ పథకం అమలుకు నోచుకోలేదు.

1951లో నాటి మద్రాసు ప్రభుత్వం కృష్ణా- పెన్నార్‌ ప్రాజెక్టును రూపకల్పన చేసింది. దానికి కేంద్రం నుంచి ప్లానింగ్‌ కమిషన్‌ అనుమతి కూడా లభించింది. ఈపథకం అమలు కాలేదు.

మరోవైపు 1954లో ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంకై జరిగిన ఒప్పందం కారణంగా కృష్ణానది నుంచి సీమ ప్రాజెక్టులకు నికర జలాలు లభ్యమయ్యే అవకాశం లేకుండా పోయింది.

అదే ఏడాది తుంగభద్ర ప్రాజెక్టుకు చెందిన 20 శాతం నీరు, 80 శాతం విద్యుత్‌ ఆంధ్ర వాటాగా, 80 శాతం నీరు, 20 శాతం విద్యుత్‌ కర్ణాటక వాటాగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో సీమకు తుంగభద్ర నుంచి రావాల్సిన నీటిలో అన్యాయం జరిగింది.

కృష్ణా నది నికరజలాలు
పంట భూముల విస్తీర్ణం, వెనుకుబాటుతనం వంటి అంశాల ఆధారంగా నీటి పంపకం జరుగలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నదీ జలాలు మొత్తం 2,746 టీఎంసీలలో పంట భూముల ప్రాతిపదికన 723 టీఎంసీలు, సీమకు దక్కాల్సి ఉంది. కాని 122.6 టీఎంసీల నీటితో సరిపెట్టారు.

అసలు నీటి వనరుల విషయంలో సీమకు న్యాయం జరగాలంటే గోదావరి నదీ జలాలను వీలున్నంత మేరకు కృష్ణానదికి తరలించి, కృష్ణా డెల్టాకు అందించి, ఆ మేరకు కృష్ణానది నుంచి నికరజలాల్ని రాయలసీమలోని తెలుగుగంగ, గాలేరు- నగరి, హంద్రీ- నీవా వంటి ప్రాజెక్టులకు తరలించాలి. పోతిరెడ్డిపాడు కాలువలు వెడల్పు చేయాలి. అదనపు నికర జలాలు కెటాయించాలి.

1962నాటి కేంద్ర ప్రభుత్వ గుల్హతి కమిషన్‌ సూచనలు పాటించాలి. గోదావరి- కృష్ణ- పెన్నా నదుల్ని కలుపుతూ, నూతన ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ సరిహద్దుకు వీలైనంత దగ్గరగా సాగునీటి కాలువ తవ్వితే ప్రకాశం జిల్లా నుంచి అనంతపురం, చిత్తూరు జిల్లాల పశ్చిమ, దక్షిణ హద్దుల వరకూ అదనపు నీటి సరఫరా చేయవచ్చు.

విద్యుత్‌ ఉత్పాదక శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థక ప్రాజెక్టుగా మార్చాలి. 1980 నాటి భారత సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ పథకం, గంగా-కావేరి నదుల అనుసంధాన పథకం అమలయ్యేట్లు కృషిచేస్తే రాయలసీమ మరో కోనసీమగా, మరోడెల్టాగా, మరో కృష్ణా గోదావరి ప్రాంతంగా మారుతుంది.

1953 లో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని ఇచ్చారు. 1957 లో తన్నుకపోయారు. 2014 లో ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టినప్పుడు కనీసం శ్రీబాగ్ ఒప్పందం లాగ మరో ఒప్పందం కుదిర్చిన తర్వాత రాష్ట్ర విభజన జరిగినా , రాజధాని నిర్ణయం జరిగినా ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెద్దలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పక్షాలను కలిపి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి నిర్దేశించిన గడువు లో పూర్తి చేశాలా ఒప్పందం కుదిర్చి అమలు చేయాల్సి ఉంది. అవసరమైన తే చట్టాలు సవరించి అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలి.

విభజన చట్టంలో సూచిన ప్రణాళికలు లే కాకుండా మరింత సమగ్రమైన చట్టచవరణ చేసి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలని అందుకు అవసరమైన నదులు అనుసంధానం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలా జరిగితే ప్రజలు మరో స్వర్ణయుగం చూస్తారు.

రచయిత :– చందమూరి నరసింహా రెడ్డి .ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

చందమూరి నరసింహా రెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s