పర్యావరణ అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీచేయడం రాయలసీమ వాసులకు తీరని ద్రోహంగా పరిగణించాలి. ముందస్తు అనుమతులు లేకుండా పనులు మొదలు పెట్టడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొనడం విచారకరం. పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ వాసుల ఆశాకిరణం. తరతరాలుగా రాయలసీమ ప్రాంతంలో కరవు నెలకొని రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గొంతెండిన సీమ వాసుల దాహర్తి తీర్చడానికి ఈ పథకం దోహదం చేస్తుంది. పర్యావరణ అనుమతులు లేవంటూ తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన జి. శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ కె.రామకృష్ణ , సైబల్ దాస్ గుప్తాతో కూడిన ట్రిబ్యునల్ ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇది కొత్త ప్రాజెక్టు కాదని, ఇది రాయలసీమ ప్రాంతానికి తాగునీరు అందించడానికి
చేపడుతున్న విస్తరణ ప్రాజెక్టు అని, కాబట్టి దీనికి పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఆంధ్ర సర్కారు చేసిన వాదనలను తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు అవసరం లేదని యన్.జి.టి నియమించిన సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదికను కూడా పక్కనబెట్టి ఈ తీర్పు వెలువరించింది.
ఇది రాష్ట్ర ప్రభుత్వం కు షాక్ ఇచ్చిందని ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు సంకలు గుద్దుకోవడం మరింత బాధకరం ,బాధ్యతారాహిత్యంగా పేర్కోనవచ్చు. ఇది రాయలసీమ వాసులకు జరుగుతున్న అన్యాయంగా గుర్తించాలి. గోరుచుట్టుపై రోకలి పోటులా ఉంది. అంతంత మాత్రంగానే ఉన్న నీటీవనరులు తో రాయలసీమ కరవు విలయతాండవం చేస్తోంది.ఈ తీర్పు గుదిబండ లాంటిది. పార్టీలకు అతీతంగా ఈ సమస్య పై పోరాటం చేసైనా సాదించుకోవాలి.

శ్రీశైలం ప్రాజెక్టు

వెనుకబడిన రాయలసీమ కు నదీ జలాలు అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అవసరమైతే నిబంధనలు సడలింపు చేసి తక్షణమే సహయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ సమస్య పై పోరాటం సాగించాలి. రాయలసీమ బిజెపి నాయకులపై ఈబాధ్యత మరింత ఎక్కువగా ఉంది.కేంద్ర ప్రభుత్వం కు రాయలసీమ పరిస్థితి వివరించి న్యాయం జరిగేలా చూడాలి. రాయలసీమ కు బుదేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేయాలని విభజన సమయంలో పార్లమెంటు లో కోరారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చారు. రాష్ట్రం ప్రాతినిధ్యం లేకపోవచ్చు కేంద్రంలో అధికారంలో ఉన్న సంగతిమర్చిపోకూడదు. రాష్ట్రంలో అధికారం లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రాజెక్టు మంజూరు చేశాం.నిధులు ఇచ్చాం టెండర్లు పిలిచాం .మాపని అయిపోయిందని చెప్పకుండా నిరంతరం ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉంది .అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను కేంద్రం వద్దకు తీసుకువెళ్లి రాయలసీమ స్థితిగతులను వివరించి నిబంధనలను కొంతమేరకు సవరించేలాచేసైనా ఈ ప్రాజెక్టు సాధించుకోవడానికి కృషి చేయాలి .తెలుగు దేశం రాయలసీమ నాయకులు ఈ సమస్య పై గళం విప్పి విమర్శలు కాకుండా న్యాయం కోసం పోరాడాలి. వామపక్ష పార్టీలు తమ పోరాటాన్ని కొనసాగించి రాయలసీమకు న్యాయం జరగడానికి చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉంది. అనవసరంగా మతవిద్వేషాలు రగిలించేలా బిజెపి ,తెలుగు దేశం విగ్రహాల రాజకీయలకు పాల్పడకుండా ప్రజాప్రయోజనకరమైన అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. రాష్ట్రంలో ఘోరంగా దెబ్బతిన్న రహదారుల విషయంలో, రాయలసీమ కు నదీజలాలుఅందించే పనుల్లో జరుగుతున్న జ్యాప్యం , రాష్ట్రంలో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం ,నూతన పరిశ్రమల ఏర్పాటు లో జ్యాప్యం తదితర సమస్యలు పై ప్రతిపక్షాలు దృష్టి సారించి ప్రభుత్వం మెడలు వచ్చి పనిచేయించే దిశగా కృషి చేయాల్సి ఉంది.

శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచే వాటా నీటిని వినియోగించుకుని రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడానికి చేపట్టినదే రాయలసీమ ఎత్తిపోతలపథకం.

ఏపిలో హంద్రి-నీవా, గాలేరు-నగరి తదితర ప్రాజెక్ట్లు నిర్మాణం చివరిదశలో ఉన్నాయి. ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించాల్సి ఉంది. తరచూ వరద నీరు వృధా అవుతోంది. గత ఏడాది 600 టిఎంసీలు వృధా అయ్యింది.

ఏపిలోని రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించడానికి వరద, మిగులు, నికర జలాల కేటాయింపు ఉన్నాయి. అందుకు సంబంధించి కొన్ని పథకాలు పూర్తయి మరికొన్ని పథకాలు నిర్మాణంలో ఉన్నప్పటికి కేటాయించిన నీటిని ఏపి వినియోగించుకోలేకపోతోంది.
కేడబ్ల్యూడీటీ2
తీర్పు వెలువడే వరకు 2015లో కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు మేరకు ఏపీకి 512 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులు చేస్తామని తేలిచ్చెప్పారు.

వివాదాలు తలెత్తకుండా
కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డు ఏర్పాటైంది. కానీ. పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువలను నోటిపై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయి. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి.
శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని అధికారికంగా వినియోగించుకోవచ్చు. ఒకటి రెండు సంవత్సరాలు మినహాయిస్తే ఎప్పుడూ కూడా సగం నీటిని కూడా సీమ ప్రాజెక్ట్ లకు అందించలేదు. రాయలసీమకు తెలుగు గంగ ద్వారా (29 టిఎంసీలు), ఎస్.ఆర్.బి.సి ద్వారా (19టీఎంసీలు), గాలేరు-నగరి-ద్వారా (39టీఎంసీలు), చెన్నైకి తాగు నీరు కోసం (15టీఎంసీలు), టిబిపిహెచ్ ఎల్ సి ద్వారా (10టీఎంసీలు), కలిపి మొత్తం 114 టిఎంసీల నీటిని వినియోగించుకోవడానికి అనుమతి ఉంది. 2004నుంచి నుంచి 2020 వరకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే పూర్తి సామర్థ్యం ఎప్పుడూ వినియోగించు కోలేదని విశదవవుతోంది.
ఈ పరిస్థితుల్లో నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని వృధాను అరికట్టేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపి ప్రభుత్వం చేపట్టింది. ఇది కొత్త పథకం కాదని ఎన్జీటి ఆదేశాల మేరకు ఏర్పడిని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటి తేల్చిచెప్పింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు లేనేలేదు. పాత ఆయకట్టుకు అంటే పైన పేర్కొన్న ప్రాజెక్ట్ లకు కేటాయించిన నీరు ఎస్ఆర్ఎంసిలోకి వెళ్లేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకోసం సంఘమేశ్వర వద్ద పంపింగ్ కేంద్రాన్ని నిర్మించి నీటిని ఎస్ఆర్ఎంసిలోకి పోతిరెడ్డిపాడు సమీపంలో విడుదల చేస్తారు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ను కొత్త ప్రాజెక్ట్ గా పరిగణించాల్సిన అవసరం లేదు. కేటాయించిన నీటిని ఉపయోగించుకునేందుకు మాత్రమే.
ఏపిలోని రాజకీయ పార్టీలు ప్రజలకు పనికి రాని విషయాలపై రాజకీయం చేస్తూ దీనిపై మాట్లాడడం లేదు. తెలుగుదేశం, బిజెపి, పార్టీలు దొందు దోందు గా వ్యవహరిస్తున్నాయి. వామపక్షాలునిర్లిపిత్తంగా ఉన్నాయి. దీనిపై మాట్లాడితే ప్రాంతాల ప్రకారం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ పార్టీలు నోరుమెదపడం లేదు. ఇక మీడియా కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తోంది. అందువల్ల ఏపిలో దీనిపై చర్చేలేదు. అదే సమయంలో ఏపి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచలేకపోతోంది. ఇక్కడ ఏపి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ బిజెపి నాయకులు చేసిన ఫిర్యాదులకు అనుకూలంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.ఏపి బిజెపి శాఖ ఈవిషయంలో చొరవ తీసుకొని సమస్య పరిష్కారం దిశ గా ముందుకు వెళ్ళి రాయలసీమ వాసులకు దగ్గర కావడానికి అవకాశం అందిపుచ్చుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి ఉంది.

పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి కాలువ), టీజీపీ (తెలుగుగంగ), గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ల ఆయకట్టుకు ఇప్పటికే నీటిని అందిస్తున్నారని, ఆ ఆయకట్టును స్థిరీకరించేందుకు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులకు పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.
పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ)–2006 నోటిఫికేషన్‌ పరిధిలోకి రాయల సీమ ఎత్తిపోతలపథకం రాదని స్పష్టం చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈ 2020 జూలై 29న నివేదిక ఇచ్చింది. పాత ఆయకట్టుకు నీళ్లందించడానికే రాయలసీమ ఎత్తి పోతలపథకం చేపట్టారని, ఈ పథకం ద్వారా విద్యుదుత్పత్తి చేయడం లేదని, జలాశయాలను కొత్త గా నిర్మించడం లేదని పేర్కొంది. అందువల్ల ఈ పథకానికి పర్యా వరణ అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతలకు పర్యా వరణ అనుమతి తీసుకోవాలని తీర్పు రావడం గందరగోళాని కి దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకం పనులు ఆపడంలేదని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు అమలు చేయడం లేదని జి.శ్రీనివాస్ మళ్లీ కోర్టు ధిక్కార కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయడంలేదని కోర్టు కు తెలిపింది. ఈ వివాదం కు త్వరలోనే ముగింపు పలికేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాయలసీమ వాసులు కోరుతున్నారు.

13-1-2021విశాలాంధ్ర దినపత్రిక నుంచి.వ్యాస రచయిత చందమూరి నరసింహా రెడ్డి .ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.

https://epaper.visalaandhra.com/index.php/epaper/edition/19004/andhrapradesh/page/3#
చందమూరి నరసింహారెడ్డి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s