బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు?

కనక మృగము భువిని కద్దులేదనకుండ
తరుణి విడిచిపోయె దాశరధియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వదాభిరామ వినుర వేమ.

విగ్రహారాధనను విమర్శిస్తూ….

పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టి
చెలగి శిలల సేవ జేయనేల?
శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?
విశ్వధాభిరామ వినురవేమ.

కులవిచక్షణలోని డొల్లతనం గురించి….

మాలవానినంటి మరి నీటమునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?
విశ్వదాభిరామ వినుర వేమ.

ఆ కాలం పరిస్థితులను బట్టి చూస్తే…
వేమన గొప్ప హేతువాది అని గ్రహింపవచ్చు.

సమాజంలో ఎంతో దృఢంగా పాతుకుపోయిన ఆచారాలను, భావాలను అంత నిశితంగా ఎత్తిచూపడానికి….
చాలా ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి.

ఇతరుల సొమ్ముకు ఆశించే లక్షణం “వెన్నదొంగ”లోనూ కనిపిస్తుంది.

పాలకడలిపైన పవ్వళించినవాడు
గొల్ల ఇండ్ల పాలు కోరనేల?
ఎదుటివారి సొమ్ము ఎల్ల వారికి తీపి
విశ్వదాభిరామ వినుర వేమ.

ఎంత అద్భుతమైన ఆటవెలదులు!

సమాజం లోని డొల్లతనం కనులకు కట్టలేదా ఈ పద్యాలు చదివితే.

జ్ఞాన గుళికలవి.

వేమన గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా….బ్రౌన్ దొర వారు కాల నిర్ణయం చేశారు.(1652-1730)

వేమన భోగి…వేశ్యాలోలుడని స్వర్ణం సాధించాడని చివరకు విరక్తి తో యోగి గా మారాడని వేమన యోగిగా మారడంలో వదిన గారి పాత్ర ఉందని వదిన గారి కుమార్తె మరణం తో విరక్తి తో దేశ సంచారంచేసి యోగి అయి జ్ఞాన సంపదను పామరులకు కూడా అర్థం అయ్యేలా ఆటవెలదుల రూపంలో పద్యాలుగా విరచించాడని ఓ కథ.

కాదు మొదట వేశ్యాలోలుడుగా ఉన్నా సంసారి అయ్యాడని పిల్లలు కూడా ఉన్నారని మరో వాదన. ఇక అభిరాముడు అనే విశ్వబ్రాహ్మణ స్నేహితుడు….విశ్వధ అనే వేశ్య గురించి కొందరు ప్రముఖంగా చెప్తారు. వేమన యోగిగా మారడానికి…వీరి పాత్ర ఉన్నట్ల సినిమాలు కూడా తీశారు.

ఎందరో వేమన గురించి పరిశోధించారు. ఒకరు చెప్పినది మరొకరు ఒప్పుకోలేదు!కానైతే వేమన తన గురించి ఓ పద్యంలో తనే చెప్పుకున్నారు.

ఊరుకొండవీడు వునికి పశ్చిమవీధి,
మూగచింతపల్లె మొదటి యిల్లు,
ఎడ్డిరెడ్డికులము యేమని చెప్పుదు
విశ్వదాభిరామ వినురవేమ!

విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగు వాడు ఉండడు.

వానకు తడవనివారు ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని…. లోకోక్తి.

అంత ప్రఖ్యాతి… గాంచిన వేమన సుమారు 1652 – 1730 మధ్య కాలములో జీవించాడు. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు.

ఇంకొక పరిశోధన ప్రకారం కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కులస్థులకు జన్మించారని అంటారు.

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి, ప్రజల్ని మెప్పించిన కవి వేమన.

ఆటవెలదితో అద్భుతమైన కవిత్వము…,

అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు యోగి వేమన. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి రెండు పాదాల్లో నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు.

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు కాడు
కొలది హంసల కడ కొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ!

కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు.

అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.

నాలుగో పాదం “విశ్వదాభిరామ వినుర వేమ” అనే మకుటం. ఈ మకుటానికి అర్థంపై కూడా రెండు వాదనలున్నాయి.

వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన.

విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని..అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా,వినుము – అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు పండితులు. బ్రౌను కూడా ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు.

శ్రీ శ్రీ అన్నారు కవిత్రయమంటే తిక్కన, వేమన మరియు గురజాడ అని.

సమాజాన్ని సంస్కరించే ఇలాంటి రచనలు షుమారు 350 ఏళ్ళ క్రిందే వ్రాశాడు మహానుభావుడు. అయినా మనుషుల మనస్తత్వాలు మారినట్లు ఎక్కడా కనిపించడం లేదు!

ఇక వేమన జీవిత చరిత్ర ను ఎంతో కళాత్మకంగా తీశారు 1947 లో కె.వి.రెడ్డి గారు. చిత్తూరు నాగయ్య గారు వేమన గా జీవించారు. ఆ మూవీ చూచి ఓ బాలుడు ముమ్మిడివరం బాల యోగిగా మారాడని మీరూ విన్నారు. తమాషా ఏమిటంటే ఆ బాలయోగి దర్శనానికి నాగయ్య గారు వెళ్ళడం! కె.వి.రెడ్డి గారి దర్శకత్వ ప్రతిభ అలాంటిది. ఇక నాగయ్య గారి నటన గానం అద్భుతం.

ఇదే వేమన జీవితాన్ని నటుడు విజయ చందర్ కూడా నిర్మించారు. శ్రీ వేమన చరిత్ర గా 1986 లో విడుదలైన ఆమూవీ కాలానుగుణంగా కాస్త మార్పులతో తీసినా గొప్ప విజయవంతం కాలేదు. సత్యం సంగీతం మాత్రం గొప్పగా ఉంది.

సమాజాన్ని , మతాన్ని ,కులాన్ని విగ్రహారాధనను నిరశిస్తూ సంఘ సంస్కరణాభిలాషతో వేమన వ్రాసిన పద్యాలు ఆణిముత్యాలు.

వేమన పద్యాలు అన్ని ద్రవిడ భాషలలోనూ అనువదించుకున్నారు. యూరోపియన్ భాషలలో కూడా!

వేమన అన్ని మతాలలోని డాంభికాచారాలను,మూఢ విశ్వాసాలను తన పద్యాలలో ఎత్తిచూపి సంస్కరించే ప్రయత్నం చేశారు.

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలంలోని కటారుపల్లి గ్రామంలో సజీవ సమాధి అయినట్లు విశ్వాసం. దీనిపై అభిప్రాయ బేధాలున్నాయి.

గతించి ఇన్నేళ్ళయినా యోగి వేమన పద్యాలు నిత్య సత్యాలు గా నిలిచిపోయాయి.

కె.వి.యస్ .ప్రసాద్ ఫేస్బుక్ వాల్ నుంచి.

కె.వి.యస్ .ప్రసాద్

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s