
మృదువుగా మాట్లాడుతూ విరుద్ధమైన అభిప్రాయం చెప్పడంలో తనది అందెవేసిన చేయి….
ఆధునికతను ఆహ్వానిస్తూనే సంప్రదాయంలోని ఘనతను వ్యక్తపరచిన మహాత్ముడు… జీవితంలో సాహిత్యం, పత్రికా వ్యాసంగం ఉద్యమం ముప్పేటగా సాగించిన మహోన్నతుడు…. రాయలసీమ జనజీవితాన్ని ప్రతిబింబించిన తొలి కావ్యం పెన్నేటి పాటను అందిచిన రచయిత… మాణిక్యాల మూట…. విద్వాన్ విశ్వం
విశ్వం పేరు వినగానే తెలుగువారికి ‘పెన్నేటి పాట తో పాటు గుర్తుకు వచ్చేది. మాణిక్యవీణ’. తెలుగు పత్రికారంగంలో రచనకు వన్నె, వాసి సంతరించి పెట్టారాయన. తెలుపు నలుపు, అవీ-ఇవీ వంటి ప్రత్యేక శీర్షికలు నిర్వహించారు
మీసరగండ విశ్వరూపాచారి
అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో 1915, అక్టోబర్ 21న జన్మించాడు.
తండ్రి మీసరగండ మునిరామాచార్యులు.తల్లి
లక్ష్మమ్మ .స్వగ్రామం లో చిన్నతనంలోనే శంకరశాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు.
సంప్రదాయ పద్ధతిలో కర్నూలు,ప్రొద్దుటూరు లలో సంస్కృత కావ్య నాటకాలంకారాలను, తర్కశాస్త్రాన్ని అభ్యసించాడు.
మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలోనూ, ఆంధ్రం లోనూ కావ్యనాటకాల నూ, ఛందో అలంకారాలను, తర్కశాస్త్రాన్ని అధ్య యనం చేసి విద్వాన్ పట్టా పుచ్చుకున్నాడు.
అనంతపురంలో చిలుకూరు నారాయణరావు వద్ద శిష్యరికం చేశాడు. బెనారస్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తూ అనారోగ్యం వలన పూర్తి చేయలేక పోయాడు.
మీసరగండ విశ్వరూపాచారి
‘విద్వాన్ పట్టానే ఇంటిపేరుగా
స్థిరపడింది. ఈయన అసలు పేరు చాలా మందికి తెలీదు.
విద్వాన్ విశ్వం అంటే దాదాపు తెలీని వారుండరు.
బెనారస్ నుండి అనంతపురం తిరిగిరాగానే తరిమెలనాగిరెడ్డి తో కలిసి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. ప్రజలను చైతన్యపరచటానికి గ్రంథ ప్రచురణ అవసరమని భావించి నవ్యసాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ఏర్పాటు చేసి నవ్యసాహితి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు.
ఫాసిజం మొదలైన అంశాలపై పుస్తకాలను ప్రచురించాడు. దానితో బ్రిటీషు ప్రభుత్వం రాజద్రోహం క్రింద తరిమెల నాగిరెడ్డిని, విద్వాన్ విశ్వం ను అరెస్టు చేసి మొదట బళ్ళారిలోని అల్లీపూర్ జైల్లోనూ ఆ తర్వాత తిరుచిరాపల్లి జైలు లోనూ నిర్భందించింది.
తిరుచిరాపల్లి జైలులో విశ్వం బెజవాడ గోపాలరెడ్డి వద్ద బెంగాలీ నేర్చుకున్నాడు. ఈ జైలులో రాజాజీ, టంగుటూరి ప్రకాశం వంటి నాయకుల సాహచర్యం లభించింది.
కోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు రాయలసీమ కరవు గురించి హృదయం ద్రవించి బాధామయ కంఠంతో కన్నీటి పాటను ఆలపించిన కవి విద్వాన్ విశ్వం.
తెలుగు నాట దత్తమండలపు స్వాతంత్య్రోద్య మ రోజుల్లో కల్లూరి సుబ్బారావు, గాడిచర్ల హరిస ర్వోత్తమరావు, చిలుకూరి నారాయణరావు, పప్పూ రు రామాచార్యులు వంటి వారి మార్గదర్శకత్వంలో విశ్వం నడిచారు.
ఈయన అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, రాయలసీమ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా, జిల్లా జాతీయసభకు, జిల్లా లోకజనసంఘానికి, మండల క్షామనివారణ సభకు,జిల్లా ఆంధ్రమహాసభకు ప్రధాన కార్యదర్శిగా,జిల్లా రైతు మహాసభకు ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు.
వామపక్ష సాహిత్యంతో, రాజకీయాలు అనుబంధం విస్త రించింది. ‘ఇంగ్లీషు చదువుల ద్వారా మార్క్సిజానికి పయ నించినవారు చాలామంది ఉన్నారు. ప్రాచ్య విద్యలు చదివి సామ్యవాదం వైపు మొగ్గిన ప్రజ్ఞావంతులు కొందరే ఉంటారు వారిలో విశ్వం ఒకరు.

బహుముఖం విరికన్నె’ ఆయన తొలి ఖండ కావ్యం. నీలం సంజీవరెడ్డి వివాహ సందర్భంలో ఆ గ్రంథం ఆవిష్కృతమైంది
ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాకుండా మరింత లోతుగా రాజకీయాలు శాస్త్రపద్ధతిలో వివరించడానికి పత్రికారంగం వైపు దృష్టి సారించాడు.
1945లో మీజాన్ పత్రిక లో అసిస్టెంట్ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేశాడు. తరువాత విజయవాడలో ప్రజాశక్తి దినపత్రిక లో అసిస్టెంట్ ఎడిటర్‌గా సుమారు మూడు సంవత్సరాలు పనిచేశాడు.
తర్వాత మద్రాసుకు తరలివెళ్ళి అక్కడ బాలభారత్ విద్యాలయం లో సంపాదకుడిగా కొన్నాళ్ళు పనిచేశాడు. 1952 ఆగష్టు 15న ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ప్రారంభమైనపుడు దానిలో ఎడిటర్ ఇన్చార్జ్గా చేరారు. అక్కడ 1959 వరకు పనిచేశాడు.

‘వినిపింతునింక రాయలసీమ కన్నీటి పాటకోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజెరి కొట్టుకొనుచు’ అంటూ విద్వాన్ విశ్వం గానం చేసిన ‘పెన్నేటి పాట’ రాయలసీమ కరువు నేపథ్యంగా 1954లో వచ్చిన తొలి కావ్యం.
నదిలా ప్రవహించినప్పుడు పరిపూర్ణమైనట్టే, ఎండిపోయినప్పుడు జీవితం స్తంభించిపోతుంది. ఎండిపోయిన పెన్నానది ఇసుకతో నిండిపోయి ఆ ప్రాంతపు జీవన వాస్తవికతను ఈ కావ్యంలో విశ్వం కళ్లకు కట్టినట్టు చూపించారు.
రాయలసీమ లో పెన్నేటి గట్టున ఉన్న పల్లెల బ్రతుకునీడ ఇందులో కాన వస్తుంది. అక్కడి పలుకుబడులూ ఊరు, పేరులూ ఇందులో కనిపిస్తాయి.
ఇది కావ్యం. చరిత్రగానీ, కథగానీ కాదు. కాబట్టే ఏ ఒక్క పల్లెనో ఏ వ్యక్తి జీవితాన్నో ఉద్దేశించి వ్రాసినది కాదు. నార్లవారికి అంకితం చేశారు
దీనికి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ పీఠిక రాశారు.
1959లో ఆంధ్రపత్రిక దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేసిశారు.ఆంధ్ర పత్రిక దినపత్రికలో ‘అవీ.. ఇవీ’, శీర్షిక విశ్వం రాశారు.
1960లో విజయవాడకు వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశాడు. ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ‘ఇవ్వాళ’ శీర్షిక రాశారు.
బాణుడి కాదంబరి విద్వాన్ విశ్వం గారు తెలుగులోనికి అనువదించగా 1962 లో పుస్తకరూపంలో వచ్చింది.
1963లో ఆంధ్రప్రభ దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా చేరాడు. 1967లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక కు సంపాదకుడిగా మారాడు.
ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలోనే రెండు దశాబ్దాల పాటు నడిచిన శీర్షికలలో మాణిక్యవీణ ఒకటి.
మాణిక్య వీణకు ముందు ఆంధ్రప్రభ వారపత్రికలోనే సుమారు ఏడు సంవత్సరాల పాటు ‘తెలుపు-నలుపు’ శీర్షిక ప్రధానంగా భాషాంశాలతో నడిచింది.

విద్వాన్ విశ్వం విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా “ఆంధ్రప్రభ”తెలుగు వారపత్రిక ను నడిపించిన సంపాదకుడు విద్వాన్ విశ్వం.
ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో పదవీవిరమణ చేసిన తరువాత 1981నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. ఈ సమయంలో విశ్వం కథాసరిత్సాగరాన్ని 12 సంపుటాలుగా అనువదించారు.
” చందమామ “లో ద్విపద కావ్యం రూపంలో వ్రాసిన పంచతంత్ర కథలను బాపు బొమ్మలతో తి.తి.దే. ప్రచురణగా వెలువరించాడు.
బ్రహ్మసూత్రాలు శంకరభాష్యం నాలుగు సంపుటాలను, అధర్వణ వేదాన్ని అనువాదం చేసి ప్రచురించాడు.
విద్వాన్ విశ్వం ‘ నవ్య సాహిత్య మాల ‘ సంస్థను నెలకొల్పి అనేక రాజకీయ, సాహిత్య గ్రంథాలు వెలువరించారు.
పాశ్చాత్య సాహిత్యం నుంచి రోమా రోలాండ్, క్రిస్టోఫర్, చెహోవ్ మరికొందరు ప్రముఖుల రచనలను తెలుగువారికి అందించారు. ఆ రచనలు అన్నింటిలోనూ సమన్వయ దృక్పథాన్ని ప్రతిబింబింపజేశారాయన. ఆయన గోర్కీని అభిమానిస్తారు. కాళిదాసు ను ఆరాధిస్తారు.

బ్రిటిష్ జవాన్లతో పోరాడి అమరుడైన హంపన్న కథను ‘ ఒకనాడు ’ కావ్యంగా విశ్వం రాశాడు. విశ్వం అనువాద కృషిని ప్రత్యేకంగా చెప్పాలి. మేఘ సందేశం, కాదంబరి, కిరాతార్జునీయం, దశకుమార చరిత్ర గ్రంథాలు సంస్కృత సాహిత్యంలో ఒక్కోటి విలక్షణమైనవీ, గొప్పవీ! ఈ నాలుగు గొప్ప గ్రంథాలను తెలుగు లో అనువాదం చేశాడు. కల్హణుని రాజ తరం గిణి, నీతి చంద్రికను చక్కగా అనువదించారు.
ఈయన వ్యక్తిగత జీవితం బాధాకరం విశ్వం భార్య పద్మ
పిల్లలు వినత, బాలచంద్ర, విద్యాపతి, హేమచంద్ర, కాదంబరి, మమత.
ఒక కూతురు అకాల మరణం, కుమారుడు ఇల్లు విడిచిపోవడం ఆయనను బాగా దెబ్బ తీశాయి. 1987 అక్టోబర్ 19వ తేదీన విద్వాన్ విశ్వం తిరుపతిలో కన్నుమూశారు.
పత్రికారంగంలో ఉన్నత విలువలు నిలబెట్టిన విశిష్ట పాత్రికేయులుగా నేటి తరం పాత్రికేయులకు విద్వాన్ విశ్వం ఆదర్శప్రాయులు.
రచన:– చందమూరి నరసింహారెడ్డి.ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.
