
పేదల పెన్నిది గా ముద్ర వేసుకొన్న మహనీయుడు…గాంధీ గా పేరుగడించిన కమ్యూనిస్టు….దళిత పిల్లల చదువు కోసం విశేషంగా కృషి చేసిన సంఘ సేవకుడు…
ఆయన పేరుచెబితే గుర్తుపట్టరేమో కానీ పీలేరు గాంధీ అంటే గుర్తుపడతారు.
సి.కె.గా మరికొందరికి పరిచయం. చల్లా కృష్ణ నారాయణరెడ్డి.
చల్లా కృష్ణనారాయణరెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని రొంపిచర్ల మండలం చల్లావారిపల్లె లో ఆగస్టు 1 1925 న జన్మించారు. మదనపల్లెలో బీసెంట్ థియొసాఫికల్ స్కూల్&కాలేజీలో బి.ఎ వరకు చదువుకున్నారు.
బిఎ రెండో సంవత్సరంలో
ఉండగానే పేద విద్యార్థుల కోసం ఆయన ఒక వసతి గృహాన్ని నిర్వహించారు. కాలేజిలో మంచి హాకీ క్రీడాకారుడిగా రాణిస్తూనే సామాజిక సమస్యల పట్ల స్పందించేవారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు ఫైనల్ ఇయర్లో కాలేజి నుంచి బయటికి వచ్చారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితులైన ఆయన ఎప్పుడూ ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు.
1953లో కమ్యూనిస్టు ఉద్యమంలోచేరారు. పేదల వేతనాలకోసం, భూమికోసం, భుక్తికోసం పార్టీ నిర్వహించిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరవు రోజుల్లో గంజి కేంద్రాలను నిర్వహించారు.
అనేక వసతిగృహాలను నెలకొల్పారు.దళిత పిల్లల చదువు కోసం విశేషంగా కృషి చేశారు.బాకారాపేట, వాయలపాడు,యెర్రవారి పాలెం, నేలబైలు, పీలేరు, మదనపల్లెలో బడుగు వర్గాలకోసం వసతి గృహాలను నిర్వహించారు.
అక్కడ చదువుకున్న మునివెంకటప్ప, అబ్బన్న ఐఎఎస్ అధికారులు అయ్యారు.
రొంపిచెర్లలో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. సోషలిస్టు పార్టీలో క్రియాశీల సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.
సికె 1962లో కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేసి పీలేరు శాసనసభకు ఎన్నికయ్యారు.
1967లో చారుమంజుదార్ గ్రూపులో చేరారు.అయితే, ఆ వెంటనే భారత్-చైనా యుద్ధం కారణంగా 1970లో ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. 1972లో ఉస్మానియా యూని వర్సిటీలో హత్యకు గురైన విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డికి ఈయన చిన్నాన్న అవుతారు.
అత్యవసర పరిస్థితి సందర్భంగా 1975లో మళ్లీ జైల్లో నిర్బంధించింది. రెండేళ్ల తరువాత ఎమర్జెన్సీ ఎత్తివేయడంతో 1977లో విడుదలయ్యారు.
ఆ తరువాత కొన్నాళ్లకు జనతా ప్రచురణలు, అనుపమ ప్రచురణలు నెలకొల్పి -” ది స్కాల్పెల్, ది స్వోర్డ్” -రిచర్డ్ అ లెన్, టెడ్ గోర్డన్, ” ఫాన్‌షెన్”-విలియమ్ హింటన్, ”మై ఇయర్స్ ఇన్ ఎన్ ఇండియన్ ప్రిజన్”-మేరీ టైలర్” రెడ్‌స్టార్ ఓవర్‌చైనా”-ఎడ్గార్ స్నో తదితర పుస్తకాలను తెలుగులోకి ప్రచురించారు.
ప్రజల మనసుల్ని గెలిచేందుకు చిన్న పుస్తకాలు విశేషంగా తోడ్పడతాయని భావించేవారు.

1980లో హైదరాబాద్ బుక్‌ట్రస్టును నెలకొల్పారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ హైదరాబాదు కేంద్రంగా ప్రారంభించిన లాభాపేక్ష రహిత పుస్తక ప్రచురణ సంస్థ.దీని స్థాపకుడు సి. కె. నారాయణ రెడ్డి. ఈ సంస్థలో ఇంకా ఎం. కె. ఖాన్, జి. మనోహర్, శాంతా సింహా, గీతా రామస్వామి సభ్యులుగా ఉన్నారు.అన్ని వర్గాల తెలుగు ప్రజల అభిరుచులనూ, సామాజిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని విశాల దృక్పథంతో పుస్తకాలు వెలువరించాలన్నది ఈ సంస్థ లక్ష్యం. ప్రతి సంవత్సరం విభిన్న అంశాలపై పది నుంచి ఇరవై పుస్తకాల దాకా ప్రచురిస్తున్నారు వీరు.
తెలుగు సాహిత్యాన్ని, భావజాలాన్ని సామాన్యులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో సి.కె.నారాయణరెడ్డి, మరికొందరు ప్రముఖులతో కలిసి హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ఏర్పాటు చేశారు.
కొన్ని పుస్తకాలు అమూల్యమైనవి. వాటికి వెలకట్టలేం. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ లాభాల కోసం పెట్టింది కాదు. కాబట్టి మంచి పుస్తకాలను ప్రజలకు అతి తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తున్నారు.
పుస్తకాల ప్రచురణకు వందేసి రూపాయలపైనే ఖర్చయినా వాటిని కేవలం పది రూపాయల చొప్పున అందుబాటులోకి తెస్తున్నారు. ఇంకొన్ని అయిదు రూపాయలు, రెండు రూపాయలకే ఇస్తున్నారు. మొక్కపాటి నరసింహశాస్త్రి రచన బారిస్టరు పార్వతీశం, ఎస్.జయ రాసిన దేశమంటే మార్కెట్ కాదోయ్ వంటివి కేవలం ఒక్క రూపాయికే అందుబాటులో ఉంచారు. మరికొన్ని ఉచితంగానూ అందిస్తున్నారు.
ఈ సంస్థ చాలావరకు స్వచ్ఛంద సేవకుల సహాయంతో నడుస్తున్నది. వీరు పుస్తకాలు చదవడం, సమీక్షించడం, దిద్దుబాట్లు చేయడం, ముఖ చిత్రాలు రూపొందించడం, ఇంకా ప్రచురణలో అవసరమైన ఇతరపనులు చేస్తుంటారు.
సి.కె.1990 చివరల్లో తన ఆరోగ్యం క్షీణించేవరకూ నిర్విరామంగా కృషిచేస్తూ అనేక పుస్తకాలను తెలుగులో వెలువరించారు. ప్రభుత్వం శాసనసభ్యులకు, మాజీ శాసన సభ్యులకు అనేక సౌకర్యాలను ,రాయితీలు కల్పించినప్పుడు స్వయంగా మాజీ శాసనసభ్యులై వుండి కూడా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు.
జంటనగరాల్లో కుక్కల సంతతి ఎక్కువైనా సరే కుక్కలను చంపకూడదని ఉద్యమం నిర్వహించారు. ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటాలు చేశారు.
భార్య జయప్రద మదనపల్లె ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్ గా, అనంతరం ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. వీరికి ఇద్దరు కూతుళ్లు డా. అరుణ, సి. శైలజ.
సి.కె.నారాయణ రెడ్డి 2013 సెప్టెంబరు 5 న హైదరాబాద్లోచనిపోయారు.
ఆయన కోరిక మేరకు, ఆయన కుటుంబసభ్యులు ఆయన మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి కి అందజేశారు.
✍️రచన:– చందమూరి నరసింహారెడ్డి .ఖాసాసుబ్బారావు అవార్డు గ్రహీత.
