
ఆస్పరి మండలం ఆలూరు తాలూకాలోని జోహరాపురంలో 1928 లో జన్మించారు సర్దేశాయి తిరుమల రావు(Sardesai). వీరి చదువంతా ఆదోని, అనంతపురంలలో సాగింది. రాచుపుటాణా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎస్.సి ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. విద్యార్థిగా ఉన్నప్పుడే తెలుగు, సైన్సుల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. 1954 లో కెమిస్టుగా అనంతపురంలోని తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో చేరి అక్కడే జూలై 31, 1983 లో ఆ సంస్థ డైరెక్టరుగా పదవీ విరమణ పొందారు. తమ 30 ఏళ్ళ ఉద్యోగ ప్రస్థానంలో ఒక్కరోజు కూడా సెలవుపై ఆయన వెళ్ళలేదంటే పనిలో ఎంతటి దీక్షాదక్షుడో తెలుసుకోవచ్చు. అదే స్థాయిలో సాహిత్య సేవ చేసిన మహనీయుడాయన. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. అనంతపురం కమలా నగరులో సోదరుడితో కలిసి చిన్న రేకుల షెడ్డులాంటి ఇంటిలో ఎంతో నిరాడంబరంగా జీవించారు. మనుషులతో మాట్లాడేటప్పుడు ఆయన ఎంత సౌమ్యుడో, సాహిత్య విమర్శ విషయంలో అంత కటువుగా ఉండేవాడు. “జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు” అన్న పుస్తకం సంపాదకీయంలో ఆయనను విలక్షణ సాహితీమూర్తిగా పేర్కొంటూ తెలుగు సాహిత్యాన్ని బాగా పరిశీలించిన ఆయన మిగతా శాఖలవలె కాక తెలుగులో విమర్శ అంతగా ఎదగలేదని ఆవైపు చూపు సారించారని పేర్కొన్నారు. తన కటువుదనానికి కారణం విశ్వవిద్యాలయాలు, అకాడమీలకు దూరంగా ఉండటమేనని ఆయన చెప్పేవారు. ఆంధ్రపత్రిక, భారతి, హిందూ, బ్లిట్జ్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ, సైన్స్ టుడే వంటి పత్రికలు మాత్రమే చదివే ఆయన వాటికె తమ రచనల్ని పంపేవారు. ఒక్క భారతి పత్రికలోనే 23 వ్యాసాలు, 15 లేఖలు, 50 కలగూరగంప వ్యాసాలు, 5 గ్రంథ విమర్శలు రాశారంటే సాహిత్యంలో ఆయన చేసిన కృషిని అర్థం చేసుకోవచ్చు. ఆయన తెలుగులో రచించిన మూడు గ్రంథాలు కన్యాశుల్క నాటక కళ, సాహిత్య తత్వము శివ భారత దర్శనము ఆయనే ప్రచురించుకోగా, విమర్శ ప్రతి విమర్శ అన్న గ్రంథాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు వెలువరించారు. దానికి ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సంపాదకత్వం వహించారు. విమర్శకు ఆయన రచనలు ఓ విశాల ప్రాతిపదికను ఏర్పరచాయని డా.రాచపాళెం అంటారు. సర్దేశాయిని ఒక మంచి తులనాత్మక సాహిత్య విమర్శకుడుగా పేర్కొంటారాయన. సాహిత్యాన్ని సాహిత్యాంశాల పరిశీలనకే పరిమితం చేయకుండా ఇతర కళలతో, శాస్త్ర, సాంకేతిక, మత, రాజకీయ, ఆర్ధిక, చారిత్రక విషయాలను జోదించి సమన్వయం చేసారంటారు రాచపాళెం. కన్యాశుల్కంలోని పాత్రలను చార్లెస్ డికెన్స్(charles dickens) పిక్ విక్ పత్రాలలో, కింగ్ లియర్ నాటకం, ఎమిలీజోలా(emilyjola) రచించిన నానా నవలలోని పాత్రలతో పోల్చటమే కాదు నిరూపించారు సర్దేశాయి. సర్దేశాయి కావ్యాలను పరిశీలించే పధ్ధతులను మూడు విభాగాలుగా పేర్కొన్నారు. అవి లక్ష్యానుసరన పధ్ధతి, లక్ష్ణానుసరణ పధ్ధతి, కవిమార్గానుసరణ పధ్ధతి. వాటిలో మూడవదైన కవిమార్గానుసరన పధ్ధతి మంచిదని ఆయన చెబుతారు. ఆయనకు ప్రజల భాష అంటే గౌరవం. లోకోక్తుల వల్ల కావ్య, కవిత్వ స్థాయి పెరుగుతుందంటారు. కవి వాక్యాలు జనంలోకి వెళితే, జనం భాషకి గౌరవం పెరుగుతుందని సర్దేశాయి సిధ్ధాంతం. ప్రకృతిలో ఉన్నది ఉన్నట్టు చెప్పటం కవి పని కాదని తిరుమలరావు చెబుతారు. ఉన్నదానికి తన స్రుజనాత్మకతను జోడించాలంటారాయన. శాంతంగా స్మరించే ఆవేశమే కవిత్వమని వర్డ్స్వర్త్ అంటే ఆవేశంగా ప్రకటించే శాంతమే కవిత్వమని సర్దేశాయి చెప్పారు. అలా తిరగేసి వ్యాఖ్యానించటం ఆయనకి సరదా. తిరుమలరావు శాస్త్ర సాహిత్య రంగాలలో సవ్యసాచిగా పేర్కొంటారు రావినూతల శ్రీరాములు. సర్దేశాయి మనస్సు విజ్ఞాయ శాస్త్రానికి అంకితమైందని, గుండే నిండా సాహిత్య ఉందని వారే చెప్పారని శ్రీరాములు చెబుతారు. ఇక మినీ కవితా ప్రక్రియ కొత్తదేమీ కాదని అధర్వవేదంలో మినీ కవితలున్నాయని సర్దేశాయి చెప్పారు. పొయ్యిలో పిల్లిని లేపటమంటే వంట చేయటం కాదని, వంట నొదలు పెట్టటం మాత్రమేనని సర్దేశాయి చెబుతారు. ఏ ఒక్క విషయాన్నీ ఆయన తేలిగ్గా తీసుకోలేదు. గొప్ప పరిశీలన తరువాత మాత్రమే ఆయన మాట్లాడడం, రాయటం చేసేవారు. మతాలు వాతిలోని అంశాలను కూడా తిరుమల రావు పలు సందర్భాలలో పేర్కొన్నారు. ఆయన నిశితంగా అన్ని విషయాలను పరిశీలిస్తారు. శాస్త్ర సాంకేతిక రంగం, సాహిత్య కళారంగాల్లో ఆయన పద్నాలుగు అవార్డులు పొందారు. ఆయన పలువురు కవులకు రాసిన లేఖలు కూడా ఎంతో ప్రసిధ్ధి పొంధాయి. వాటిలో ఆయన ఎన్నో విషయాలు పేర్కొనేవారు. డా.కొలకలూరి ఇనాక్(Inaq) రచన “దిక్కు లేనోడు” పై కూడా సర్దేశాయి సద్విమర్శ ఘాటుగా చేశారు. జరిగిన సంఘటనలనే రాసి కథ, సన్నివేశం, పాత్రలు కల్పితాలు, నిరాధారాలు అనడం సరికాదంటారు. లేనిది ఉన్నదనడం, ఉన్నదానిని లేదు అనడం చేయకూడదంటారీయన. రచయితకు సత్యమొక్కటే ఆధారం కావాలంటారు. ఆ వ్యాసం జూన్ 1979 భారతిలో వచ్చింది. అలా పలు రచనలు చేసిన సర్దేశాయి 1994 మే పదవ తేదీన అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన జీవితం, కవిత్వం, శాస్త్ర సాంకేతిక అంశాల ద్వారా నేటి తరం ఎన్నో విషయాలను నేరుచుకోవలసి ఉంది. వారి సాహిత్యాన్ని అధ్యయనం చేయటమే ఆయనకు మనమిచ్చే నివాళి.
(డా.నాగసూరి వేణుగోపాల్, శ్రీ కోడీహల్లి మురళీమోహన్ సంపాదకత్వం వహించిన “జ్ఞాన సింధు సర్దేశాయి తిరుమలరావు” పుస్తకం ఆధారంగా)
