
కడప నుంచి ఎర్రగుంట్ల కు వెళ్లే మార్గమధ్యంలో’ కోగటం గ్రామం కనిపిస్తుంది.ఈ గ్రామం కమలాపురం మండలం పరిధిలో ఉంది.
2011 లెక్కల ప్రకారం, కోగటం గ్రామం జనాభా 3400.గ్రామం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం 2389 హెక్టార్లు.
కోకటం గ్రామంలో సుమారు 848 ఇళ్ళు ఉన్నాయి.మహిళల జనాభా49.4 % ( 1678). మొత్తం అక్షరాస్యుల శాతం60.4 % (2053). అందులో మహిళా అక్షరాస్యులు25.4 % (863).ఇది రాయలసీమ లోని వై ఎస్ ఆర్ జిల్లాకు చెందిన కమలాపురం మండలంలో ఉంది. కమలాపురం నుండి 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది. కడప సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కోగటం పేరు వినగానే గుర్తు కొచ్చే కవి ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన. ప్రబంధ యుగానికి పెద్ద దిక్కు. విజయనగర సామ్రాజ్య సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు పెద్దన. కృష్ణదేవరాయలుఅల్లసాని పెద్దన కు ఇచ్చిన దానాల్లో’ కోగటం’ అగ్రహారం కూడా ఉంది.” కోకట గ్రామాద్యనేక అగ్రహారములన్ అడిగిన సీమలయందు నిచ్చె” అని పెద్దన ఒకచోట రాసుకున్నాడు. పెద్దనకు కోగటం గ్రామాన్ని ‘ఉంచిలి’ (పన్ను లేని అగ్రహారం) గా ఇచ్చినట్లు, పాపాఘ్ని నది నుండి ఈ గ్రామమునకు పెద్దన కాలువ త్రవ్వించి నట్లు , గ్రామంలో ఉన్న సకల లింగేశ్వర స్వామికి , అలాగే చెన్నకేశవ స్వామికి కూడా దానాలు చేసినట్లు , మరింత సమాచారం కోగటం కైఫియత్తు లో చూడవచ్చని పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రాసిన ‘యుగకర్త పెద్దనామాత్యుడు’ అనే వ్యాసంలో కొంత వివరణ ఉంది. ఈ ఊరికి సమీపంలోనే పెద్దన జన్మించిన ‘పెద్దనపాడు’ అనే గ్రామం కూడా ఉంది.

రాయల కోరికపై పెద్దన్న ‘మనుచరిత్ర’ కావ్యాన్ని రచించాడు. ఈ మనుచరిత్రకే ‘స్వారోచిష మనుసంభవం’ అనే నామాంతరం కూడా ఉంది. ”అల్లసాని వాని అల్లిక జిగిబిగి”- అనే నానుడి, పెద్దన్న కవిత్వశైలి ఏ విధంగా ఉందో తెలియపరుస్తుంది. పుణ్యక్షేత్రాలను వర్ణించటంలో, యుద్ధవర్ణన చేయటంలో, వృక్షాలనూ, లతలనూ, వివరించడంలో పెద్దన్న పాండిత్య ప్రకర్ష మనకు వెల్లడి అవుతోంది. సామెతలనూ, జాతీయాలనూ ప్రయోగించటంలో ఆయన దిట్ట. మనం మాట్లాడుకునే మాటలను యథాతథంగా పద్యాలలో ఉపయోగించటం పెద్దన్నకు అలవాటు. మనుచరిత్ర తప్ప పెద్దన్న రాసిన కావ్యాలేవీ మనకు లభించటం లేదు.

శివభక్తుడైన అల్లసాని పెద్దనకు కోగటంలోని పురాతన కోటేశ్వర, చెన్నకేశవ ఆలయాలు అప్పజెప్పినట్లు ఆలయంలో ఆధారాలున్నాయి. కోగటానికి సమీపాన ఉన్న పెద్దనపాడులో జన్మించిన అల్లసాని పెద్దన కోగటం అగ్రహారంలో పెరిగినట్లు పెద్దలు చెబుతున్నారు. ఇక్కడ పెద్ద కుటుంబీకులకు బంధువులు ఉండడంతో ఈ గ్రామంలో పెరిగినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అతి పురాతన ఈ దేవాలయం పలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. కోటేశ్వరాలయంలో పార్వతీదేవి అమ్మవారితో పాటు సిద్ధి వినాయకుడు, వీరభద్రస్వామి, చెన్నకేశవుని విగ్రహమూర్తులున్నాయి. కొన్ని విగ్రహాలు దెబ్బతినడంతో వాటి స్థానంలో నూతన విగ్రహాల ప్రతిష్ఠ జరిగింది.
18 లక్షలతో పునర్నిర్మాణం
కోగటంలో ప్రస్తుతం ఉన్న ఆలయం ప్రస్తుతం ఉన్న కోటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామివార్ల ఆలయం రూ.18,83,790 లక్షలతో నిర్మాణం జరిగింది. అప్పట్లో దేవదాయ, ధర్మదాయశాఖ శ్రేయోనిధి , గండ్లూరి పోతులూరు వీరప్రతాప్ రెడ్డి విరాళంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. పుష్పగిరి పూర్వపు పీఠాధిపతి జగద్గురు పుష్పగిరి శంకరాచార్యులు, శ్రీ విద్యానృసింహ భారతి స్వామివారిచే ప్రారంభించబడింది. 1.6.1998లో ఈ నూతన ఆలయాన్ని నృసింహభారతి స్వామి ప్రారంభించారు. ఈ ఆలయం ప్రస్తుతం కూడా నిత్య పూజలు, నిత్య నైవేద్యాలు అందుకుంటోంది.
అతి పురాతన ఆలయం
కోగటంలోని కోటేశ్వర చెన్నకేశవస్వామివారి ఆలయం అతి పురాతనమైనది. తమ పెద్దల కాలం నుంచి ఇక్కడ ఆలయ అర్చకులుగా పనిచేస్తున్నాం. ఎంతో పురాతనమైన శిల్ప సంపద కూడా ఇక్కడ ఉంది. కొన్ని మూలవిరాట్ విగ్రహాలు దెబ్బతినడంతో వాటి స్థానంలో కొత్త విగ్రహాలు ఏర్పాటు చేశారు. 1998లో ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో ఈ విగ్రహ ప్రతిష్ఠలు జరిగాయి. గతంలో కోటేశ్వరాలయం, చెన్నకేశవాలయం వేర్వేరుగా ఉన్నాయి. ప్రస్తుతం రెండు ఆలయాలు ఒకే ఆలయంగా మారాయి. ప్రస్తుతం ఉన్న కోటేశ్వరస్వామి మూలవిరాట్ను కాశి నుంచి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు.
వీరభద్రస్వామి, సిద్ధివినాయక విగ్రహాలు కూడా ఆలయ నూతన నిర్మాణంతో పాటు ప్రతిష్ఠించినవే. పార్వతీదేవి విగ్రహం, చెన్నకేశవస్వామి విగ్రహాలు పూర్వం నుంచి ఉన్న విగ్రహాలే. ఆలయంలో పెద్ద నంది విగ్రహం కూడా ఉంది. తమ పెద్దలకు గుర్తు వచ్చినప్పటి నుంచి నిత్య పూజలు జరుగుతున్నాయి. ఆలయం పక్కనే కోనేరు ఉండేది. ప్రస్తుతం ఆ కోనేటిలో వివిధ మొక్కలు పెంపకం చేపట్టారు. ఈ ప్రాంత ప్రజల భక్తుల కొంగుబంగారంగా కోటేశ్వర శివకేశవాలయం నిలుస్తోంది. కార్తీకమాసంలో ఈ ఆలయాన్ని ఎక్కువ మంది భక్తులు సందర్శిస్తారు.
ఈ గ్రామం మాజీ ఎమ్మెల్యే సొంత ఊరు. అలాగని అభివృద్ధి ఎక్కడికో వెళ్లిందంటే పొరపాటే. ఇప్పటికీ సిమెంటు రోడ్డు సరిగా లేని వీధులు కొన్ని ఉన్నాయి. డ్రైనేజీలు లేక వర్షం వస్తే రోడ్డుపైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన వ్యక్తి మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఆయన హయాంలో కొంత మేరకు అభివృద్ధి పనులు జరిగినా ప్రస్తుతం అవి అధ్వాన స్థితికి చేరుకోవడంతో ఆ గ్రామ ప్రజల పరిస్థితి వర్ణణాతీతంగా తయారైంది.
మండల పరిధిలోని కోగటం గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎక్కువ జనాభా ఉన్నా… అతి చిన్న పంచాయతీ కంటే అధ్వానంగా దర్శనమిస్తోంది. ఈ గ్రామానికి చెందిన వ్యక్తి మొదట మండలాధ్యక్షుడిగానూ, అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన హయాంలో ఆలయాల అభివృద్ధితో పాటు టూరిజం కింద కొన్ని నిధులు, సిమెంటు రోడ్లు, కొన్ని వీధుల్లో డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే అప్పట్లో వేసిన కోగటం గ్రామంలోని సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు ప్రస్తుతం అధ్వాన స్థితికి చేరుకోవడంతో కొద్దిపాటి వర్షం పడినా నీరు రోడ్లపైనే ప్రవహిస్తూ ఉంటుంది. డ్రైనేజీలు కూడా కుచించుకుపోయి ఆక్రమణలకు గురై పూడిపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తుంటుంది. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వ హయాంలో అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఆ గ్రామాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కమలాపురం నుంచి పోట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరుకు వెళ్లాలంటే కోగటం నడిబొడ్డు నుంచి వెళ్లాల్సిందే. ఆ దారిలో ఎవరు వెళ్లినా ఏమిటీ గ్రామం ఇలా ఉంది, ఎందుకీ దుస్థితి అనుకోక మానరు. ఎందుకంటే ఆ ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న డ్రైనేజీలు చూస్తే ఎవరికైనా అలా అనిపించక మానదు. వ్యర్థాలతో డ్రైనేజీలు నిండి మట్టి, రాళ్లతో, కొన్ని చోట్ల పూడిపోవడంతో వర్షాకాలంలో ఈ గ్రామంలో ప్రజల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంటుంది. ఏదేమైనా ఓ వెలుగు వెలగాల్సిన కోగటం గ్రామం అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తోంది.