రచన :–దస్తగిరి
— ‘ భారతి ‘ మాసపత్రిక జూన్ 1982

ఏలపదాలు జానపద సాహిత్యానికి సంబంధించిన ఒక రూప వైవిధ్యం. ఈ పదాల సృష్టీ, గానమూ ‘ కవిల ’ తోలేటప్పుడే జరుగుతుంది కనుక, వీటిని ‘ కవిల ‘ పాటలని కూడా అంటారు. సేద్యం చేసేటప్పుడు, బండి తోలేటప్పుడుకూడా వీటిని పాడుతుంటారు. దాదాపు యివన్నీ రెండులైన్ల పదాలే. కవిలిబానను బావిలో ముంచుతారు. మునిగిన బానను పైకి తెచ్చి కాలువలో గుమ్మరిస్తారు.ఇవి రెండు చర్యలు. బానను ముంచాటానికి బారి నుండి కాడిని పైకి తోలుతారు. ముంచిన బానను పైకి తేవడానికి కాడిని బారిలోకి దించుతారు. అవి రెండు చర్యలు.రెండు ‘ కాన్లను ’ ఉపయోగిస్తారు. ఇద్దరు మనుషులుంటా రు. పదాలూ రెండు లైన్లే. పదము చివరి అక్షరంతో దిగటం ప్ర్రారంభిస్తారు. బారిలోకి వేగంగా జారుతారు. కనుక ఆ చివరి అక్షరానికి వేగంగా దొర్లిపోయే రాగం జతపరుస్తారు.
ఈ పదాలను పరిశీలిస్తే మనం ఆయా గ్రామాల్లోని వివిధరకాల ప్రజలను, వారి జీవనరీతులను పరిచయం చేసుకున్నట్లుం టుంది. వారు చేసే శ్రమా, వారు అనుభవించే ఆ శ్రమ ఫలితమూ, వారి జీవితాల్ని చుట్టుముట్టిన అసమంజసాల్ని, న్యాయం అన్యాయాలనూ, కష్టసుఖాలనూ, ఆనంద విషాదాలనూ, అనురాగ ద్వేషాలను, ఆశలను, ఆరాటాలనూ అంతేగాక వివిధ రకాల అలరించే ప్రకృతిసౌందర్యాన్ని చూస్తున్నట్లు ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది.
శ్రమ:–
అతడు శ్రమిస్తాడు. ఊపిరి పీల్చడం ఎట్లో శ్రమ చేయడమూ అంతే. శ్రమలేని జీవితాన్ని ఊహించలేడు.పనిని ప్రేమిస్తాడు. గౌరవిస్తాడు. పనిలో ఆనందాన్ని,అందాన్ని చూస్తాడు. పని ఎంత కష్టంగా వున్నా వెనక్కుపోడు. బరువుపడడు. పని బరువు అయినకొద్దీ చాలెంజిగా తీసుకుంటాడు. శక్తినంతా ధారపోసి వీరోచితంగా నెరవేర్చుతాడు.పనిలో లీనమై అలా నెరవేర్చడమే మనిషి గొప్పదనంగా భావిస్తాడు. పనినే కాదు పని పరికరాల్నీ ప్రేమిస్తాడు. వాటిని సంగీతసాధనాలుగా అలాపిస్తాడు. శ్రమైక జీవన సౌందర్య మతనిది.
కవిలి తోలినా, పంట పెట్టినా, బేరం చేసినా, గానుగ తోలినా, బండి తోలినా, మాన్లు కొట్టినా, మరేమి చేసినా సాటిలేని విధం గా చేయాలనుకుంటాడు. ఎద్దుల బేరంలో ‘వేల్లమద్ది’ (ఊరుపేరు) గొల్లారెడ్డి అతనికతడే సాటి. రామిరెడ్డి ఎపుడూ చీనాచెట్లలో మునిగితేలుతుంటాడు. గంగిరెడ్డి గానుగ పెట్టింది మొదలు కడయ్యేవరకూ యింటికి రానేరాడు. భీమన్న వేసిన ఒక్క గొడ్డలి దెబ్బకే మాను మొదలంటా కూలుతుంది. బావకొడుకు బండి తోలితే పర్వతాలు నేలకొరుగుతాయి.
కవిలి తోలటం చిన్నాబన్నా పని కాదు. ప్రాణాపాయకరమైనది. చాలా మెలకువగా వుండాలి. ఏమాత్రం అజాగ్రత్త అయినా ‘గంగమ్మతల్లిని చేరుకోక తప్పదు. కోడిపుంజు కూత కూసేవేళ అతడు కవిలిబాన వీపున మోసుకొని, ఎద్దులు తోలుకొని బాయి దగ్గరకు వస్తాడు.-
“ బాలులం మేమొచ్చినాం బాయిగంగా మేలుకోయా!” అని గంగను మేలుకొల్పుతాడు. “ కాపాడు తల్లీ!” అని దండం పెడ తాడు. “ యిద్దరాము బాలులం. బద్రం బాయిగంగా!” అని భక్తిపూర్వకమైన హెచ్చరిక చేస్తాడు. “ బాలుడు, ఎద్దులు నీ బార మమ్మా!” అని భారమంతా గంగ పైన మోపుతాడు.
అతడు పదాలేస్తుంటే వెండిది కవిలిబిళ్ళ ఏడునాదు లెల్లబల్కుతూ సంగీతం సమకూర్చుతుంది.
“ దాపటెద్దు ధర్మరాజు, వలపటెద్దు వగలకాడు
ఏడు వూర్ల ఎదుల్లో , నా ఎద్దులకు దీటే లేదో!” అని ఎద్దుల్ని కీర్తిస్తాడు.
అతని ఎద్దులు బారిమీద బొమ్మలై కులుకుతాయి… గుర్రాలిడిసినట్లే. ఆ ఎద్దులకు ముల్లుబర్ర అట్లాంటిది, ఇట్లాంటిది కాదు. “ఎర్రగొండా ఎదురు బర్ర నా ఎద్దులకు ముల్లుబర్రా!” అని గొప్పగా చెప్తాడు. ‘ మల్లమ్మ చెరువూ మంచిదే మందునీళ్ళకే మరు వ లెల్లు’ తుంది.
ఆరుగాలం యింత జీవన్మరణ పోరాటంగా కష్టపడినా ఫలితం – ఆకలి, దరిద్రం, రోగం, విషాదం.
“ బాయి బాయి కవిలి తోలి బలము తగ్గె చిన్నదానా!” అని తన ఊహాలోకపు చిన్నదానితో తన ఆవేదనను వెలిబుచ్చుతాడు.
అపుడు ఆ సుందరి – “కవిలి తోలి కడగా రారో కందిబ్యాళ్ళపూర్ణము పెడతా!
గుడ్లపెట్టను కోసి గోధుమపూరీలు చేసి పెడతా!” అంటుంది.
కానీ ఇదంతా అతని ఆశ. జీవితమంతా తీరనే తీరని రుచికర స్వప్నం. పంట పండీ ఆకలి. అందువల్లనే ఇది చాలా విషాదకర మైన అంశం. ఈ విషాదానికి కారణం దేవుని దయ లేకపోవడమే అనుకుంటాడు. ‘ కడుపునిండా తిండి లేదు. కట్టుకోను గుడ్డ లేదు. చేసిన పాపమేమీ బగవంతుడా?” అని అడుగుతాడు. పైవాని దయ వుంటేనేజీవితం వెల్లమారుతుందనే ఈ తాత్వికతే అతని సమస్త జీవిత విషాదానికీ కారణం.
ఇంకా ఆ వూర్లో శ్రమద్వారానే కాక యితర మార్గాల ద్వారా డబ్బు సంపాదించేవారూ వున్నారు. దొంగ రాముళ్ళ గురించీ, నేల గుంతలుపడే వరకూ కూర్చోని సిగ్గూ లజ్జా విడిచి పైమింది గుడ్డలతో సహా ఒడ్డి ఆడే జూదగాళ్ళ గురించీ, పీల్చిపిప్పి చేసే వ్యాపారుల గురించీ, వడ్డీవ్యాపారుల గురించీ ఏలపదాలు పరిచయం చేస్తాయి. అప్పుల్ని చెల్దిరోగంతో పోలుస్తారు. చెల్ది రోగ ము మాననట్లే అప్పులూ తీరవు. వ్యాజ్యాల గురించి “ వెండి కూడినా, బంగారం కూడినా పార్టీలకు మొదలంట ఊడూ” అంటాడు.
కుటుంబ జీవితం :–
సమాజంలోని వైరుధ్యాలు, వైషమ్యాలు సూక్ష్మరూపంలో కుటుంబంలో కనబడుతాయి. యజమానికింద బానిస, ప్రభువు కింద దాసుడు, పెట్టుబడిదారు కింద కార్మికుడు – ఈ వ్యవస్థారూపమే కుటుంబంలోనూ కనబడుతుంది. మగవానికింద స్త్రీ, అత్త కింద కోడలు వ్యవస్థ కనుగుణ రూపమే.కోడలు మీద అత్త చలాయించినట్లుగా అల్లుని మీద మామ చలాయించలేడు. పురుషా దిపత్యసమాజం కనుక. యిద్దరూ మగవారు, సంపదకు అధికారులు కనుక. మగవానికున్న ఆధిక్యత ఆర్థికంగా అతనికున్న పెద్దరికానికి ఫలితమే. వారసుల్ని కనే, సేవలు చేసి, శారీరకసుఖాలు తీర్చే భోగవస్తువు స్త్రీ. పీడన వున్నచోట్ల తిరుగుబాట్లూ ఉం టాయి. ఈ క్రమానికి సూక్ష్మరూపాన్ని కుటుంబకలహాల్లో చూడవచ్చు. ఒకోసారి భర్తమీద భార్యా, అత్తమీద కోడలు అధికారం చలాయించడం కద్దు. అంటే ఒకరిమీద ఒకరు అధికారం చలాయించడం తప్ప, ఎదుటివారు కిమ్మనకుండా తమకు లోబడి వుండాలనడం తప్ప, పరస్పర అవగాహనతో, ఒద్దికతో, సౌమనస్యంతో కలసి మెలసి మెలగటం, పరిష్కరించుకోవటం వుండ దు. పురుషాధిపత్యం, ఆర్ధిక పరాధీనత, మూఢసంప్రదాయాలూ, ఆచారాలూ, నమ్మకాలూ స్త్రీ జీవితాన్ని అతలాకులం చేస్తు న్నాయి. ఏ సమాజంలోనైనా పాలకవర్గం తనకు అనుకూల సంస్కృతీ సంప్రదాయాలను ప్రజలలో కొనసాగింపజేస్తుంది.వర్గ దోపిడిసమాజం పీడనా సంస్కృతినే రుద్దుతుంది. అది యజమాని కార్మికుల సమానత్వాన్ని ఆమోదించదు. ఆలుమగల సమా
నత్వాన్ని గూడా సమర్థించదు. స్త్రీ స్వేచ్చను సహించదు, పీడితుని స్వేచ్చను సహించదు గనుక. బలవంతంగా నైనా పురుషాధి క్యాన్ని స్త్రీ హీనత్వాన్ని పోటీలు పెట్టి నిలబెడుతుంది. అందుకే శ్రమజీవుల కుటుంబాలలో కూడా స్త్రీకి దుర్గతులే తెరచుకొని వుంటాయి. అయినా ఆస్తిపర వర్గాలలో కన్నా శ్రామికవర్గ స్త్రీ స్వతంత్రంగా జీవితాన్ని ఎదుర్కోగలిగి వుంటుందన్నది వాస్తవం.
మొగుడే కుటుంబంలో సర్వాధికారి. అతడు లేక ఏ చిన్న పనీ జరగదు. అతడుపోతే బాయికింద బీడే. కనీసం యిండ్లు కప్పనూ కష్టమే.
మొగుని చలకోల ఏటుపడితే పెండ్లాం గాజులు చిట్లుతాయి. పై నిండా వాతలే-
“ ఈ యింటి బోకిలో కూడొండలేను, రోకలెత్తి దంచలేను.
దిన దినమూ దెబ్బలాయ, దిక్కులేని పానమాయ!” – అని విలపిస్తుంది కోడలు.
“ చేసుకున్న మొగుడైతే చేతులెత్తి మొక్కల్ల” అనే వాళ్ళూ వున్నారు, మందుపెట్టి మొగుని జంపి కోర్టుకెక్కిన వాళ్ళూ వున్నారు.
ఒకామె ఒకన్ని విడిచి, మరొకరిని కట్టుకొన్నా బాధ తప్పలేదట! అయితే కొంత తేడా వుంది – ‘ వానికంటే వీడుమేలు వాకిలేసి దంచుతాడు” అంటుంది.వారసుని కోసమో, వాంచల కోసమో మూడో పెండ్లి చేసుకొన్న ముసలోడు ‘ దూడపిల్లా దుడపడింది బలము చాలదు ఏమి సేతూ? ’ అని వాపోతాడు.
అత్త అధికారాన్ని కోడలు సహించదు. కోడలు ఎదురింపును అత్త ఓర్చదు. అందుకే “ కత్తికట్టిన కోడిపుంజులాలె కొట్లాడుతా రో అత్తాకోడళ్లు!” అంటాడు పదకర్త.
ప్రతి చిన్న అవసరానికి అత్తమీద ఆధారపడటం నామోషి. అత్త ఆ అవసరం తీర్చడానికి తిరస్కరిస్తే మరింత అవమానం.కొన్ని యిండ్లలో కమ్మలు, మెట్టెలు మెరుగు పెట్టించాల్సిన బాధ్యత పుట్టింటివారిది. అది ఆచారం. పుట్టింటివారు మెరుగు పెట్టించలేక పోతే – అత్తగార్ని అడిగితే – ఆమె దెప్పిపొడిస్తే – అది కోడలికి భరించలేని బాధ. అందుకే “ కమ్మలు,మెట్టెలు మెరుగు మెట్టీ, అత్తను గానకుండా జొన్నలిస్తా!” అంటుంది కంసాలితో కోడలు. చాటుమాటు వ్యవహారంతోనైనా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకో జూస్తుంది. కోడళ్ళలోనే ఒకరికొకరికి ‘ కొవిరిబెల్లం ’ ఒద్దికలుంటే ; మరికొందరిలో ‘ గంగా గౌరి సంవాదా ’ లుంటాయి. సమిష్టి కుటుంబాలు వ్యష్టి కుటుంబాలుగా చీలిపోవటాన్నిచెడు సంఘటనగా వర్ణిస్తాడు ఏలపదకర్త. సమిష్టి కుటుంబ విచ్ఛేద కారకురాలిగా స్త్రీ ని ముఖ్యంగా కోడల్ని నిందిస్తాడు. “ కూడా వుంటే కుదిరేది లేదు,వేరేపోదాం వెర్రిమొగుడా!” అని చెవినిల్లు కట్టుకొని పోరి జయిస్తుందట కోడలు. నిజంగా ప్రేమ, అనురాగం, వాత్సల్యం, మమతలతో వుండవలసినకుటుంబసంబంధాలు రాబందుగోళ్ళ చిక్కిన పావురంలా, గిల గిలలాడుతుండడమే, నిప్పులబడిన పువ్వుల్లా మల మలలాడుతుండడమే అతని ఈ తల్లటకు కారణం. సీతారాములు తలిదండ్రులు. రామ లక్ష్మణులు అన్నదమ్ములు. సీతా లక్ష్మ ణులు వదినా మరదులు.వీరిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తాడు. లోకంలో అలా జరగనందుకు బాధపడతాడు. సంతానం మీద ముఖ్యంగా మగసంతానంమీద చాలా కోరిక. చందమామ లాంటి కొడుకు పుట్టాలని మొక్కులు మొక్కుకుంది ఆమె. “ అప్పల్ల( కొడుకు ) పుడితే పత్తెముండి బాగా సాకాల”ని అనుకొంది. దేవలాలకు తిరిగింది. క్షేత్రాలకు పోయింది. నాగులకు ఒక్కపొద్దులుంది. ముత్తైదువుల ఆశీస్సులు పొందింది. అయినా సంతానం కలుగలేదు. ఇక ఆమెకు మొగుని మగతనం మీదే అనుమానమొచ్చింది. “ మూతిమీద మీసముంటే ముట్టు నిలపర ముండకొడక” అని నిలదీసింది.
దాంపత్యేతర సంబంధం :–
ప్రేయసీ ప్రియులు సంకేత స్థలాలలో కలుసుకోవడాన్ని ఉత్సుకతతో వర్ణిస్తాడు ఏలపదకర్త.
ఒక కన్య నున్నంగ తలదువ్వి, నూగ్గాయి జడ వేసి, నీలిచీర కట్టుకొని, మొగ్గల రయిక తొడుక్కొని ‘ లాకదూడవాడు కవిలి కాడ ఉన్నాడని కడవలో కలకండ వేసుకొని పోతే; అతగాడు అక్కడలేడు.’ ఆమెకు దుఃఖములు కలిగినాయి. కంటినీరు కడవ నిండింది.
ఆమే అతగాడూ “ కట్లకని నువ్వు రా, కముజులేట నేను వస్తా” అని కూడబలుక్కున్నారు. అదే ప్రకారంగా ఆమె పోయి కట్టె లేరుతోంది. కొంతసేపటికి కముజుకూత వినపడింది. ఇక ఆ బాలపాప ‘ కముజు కూసేకూతలాకు కట్లేర బుద్దికాలేదో!” అంటుంది.
“ ఎవర్నేమి అడగవల్ల నీకు నాకు యిష్టమైన? ఎక్కుదాము దొంగరైలు ” అంటాడట అతగాడు.
“ వాన వచ్చ, వాడు వచ్చ వానికేమి కప్పవల్ల?” అంటే “ వజ్రాల పైటకొంగు వానికింత కప్పరాదా?” అనేది సమాధానం.
ఈ ఏలపదకర్త సాంగత్యవాంఛను విచ్చలవిడిగా తీర్చుకోవటాన్ని ఎక్కువ పరిమాణంలో, ఎక్కువ బూతులతో వర్ణిస్తాడు. ఈ పదకర్త మగవాడే కనుక ఇందులో ‘ వికృత మగబుద్దిపాలు’ ఎక్కువ. మగవానికన్నా స్త్రీనే విచ్చలవిడిగా తిరుగుతుంది. స్త్రీయే మగవాన్ని చెరుపుతుంది. లోకాన్నీ చెరుపుతుంది అంటాడు. స్వయం నిగ్రహం, సంయమనం, ఉదాత్తమైన, ఉన్నతమైన సంస్కృతీ శీలత లేనపుడు విచ్చలవిడితనం పెరుగుతుంది. ఉదాత్తమైన, ఉన్నతమైన గుణశీలత అలవర్చక పోవడమే కాక, మానవున్ని బలహీనతల ఊబిలో ముంచే దోపిడీసమాజపు హీన సంస్కృతే ఈ విచ్చలవిడితనాన్ని పోషిస్తుంది.
ఇతని అంచనా ప్రకారం వస్తువుల కాశపడి స్త్రీలు సుఖాన్ని అమ్ముతారు. చలువచీర కాశపడి, గుండీరవిక కాశపడి, ఉడుత బొప్పలచీర కోసం, వేలు వేలు ఉంగరాల కోసం, ఊరకనే ఉండలేకా మగవాన్ని తగులుకుంటారు.
“ నిన్నుజూచి నిలువా లేను, నన్ను జూచి నగా వద్దు ” అని అతగాడంటే
“ కానిపోని మాటలాకు కన్నుసైగ లేల పోరా!” అంటుందట ఆమె.
“ కాటికి కన్నుల్లదానా! యాటికి రమ్మన్నా రావు” అంటే “ వస్తా పోతా డౌలే కాని, చేత బొట్టు( పైసలు) లేదో!” అని ఈసడి స్తుందట. మొగునికి ద్రోహం చేసే ఆలు గురించే చెప్తాడు గాని, ఆలికి ద్రోహం చేసే మొగుణ్ణి ఏమీ అనడు. పైగా మగవారు ‘ ఏమీ ఎరుగని నంగనాచి.’ అంతా స్త్రీలే నేరనోళ్ళకు నేర్పిస్తారట.
రహస్యం బయటపడకుండా ఉండటానికి “ ఎద్దు తొక్కిన అడుగులోనే ఎల్లిరారా యెంకటరమణా!” అని ఉపాయం చూపి స్తుంది ఓ విధవరాలు. అయినా ఆ గుట్టుతెలుసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్న రామిరెడ్డికి “ రొట్టి చేసి పెడుదు గుట్టు రట్టు చేయకుమని లంచం ఆశ పెడుతుంది.
కొంచంగానైనాసరే స్త్రీలకు జరిగే ఘోర అన్యాయాలూ చెప్తాడు. అతగాడు “ నమ్మితే చీనాచెట్లు ” అని ఆశ చూపినాడు. ఆ కన్నె నమ్మింది. అయితే వాడు నమ్మకద్రోహం చేసినాడు.
“ సిన్నవాడా! నిన్ను కూడకమునుపు నిమ్మపండు వొళ్ళు నాదీ!” అంటూ వాని నమ్మకద్రోహానికి ఫలితంగా గుల్లయిన తన శరీరాన్ని చూపుతుంది ఆవేదనతో.
ఆ బాలపాప ‘ సుగ్గి కాలం ’ లో బంగకపోయినా అందదు,పొందదు. అయితే ఆ పాపే గాలికాలంలో అతని కోసం వెంటపడు తుంది, బతిమాలుతుంది. ఎండాకాలంలో కాలే బండను పరుపుగా చేసుకోమన్నా అంగీకరిస్తుందట. ఆకలి పరిస్థితులు మనిషిని ఎంత నీచస్థాయికి దిగజార్చుతాయో అనేందుకు యింతకన్నా స్పష్టమైన ఉదాహరణ ఏముంది? లేనివారి ఆకలి అవసరాలను ఆసరాగా చేసుకొని ఉన్నవారు లేనివారిని ఎంత కిరాతకంగా పీడిస్తారో అనేందుకూ, ఈ ఆకలి అవసరాలే – ఈ ఆర్ధిక పరిస్థితులే ఉన్నవారికి లేనివారిని దాసోహం చేయిస్తున్నాయనేందుకు, ఈ అవసరాలు తీరే ఆర్ధిక పరిస్థితులు ఒనగూడితే
ఈ పీడనకు లొంగిపోరు. పీడన అంతమవుతుంది అనేందుకు స్పష్టమైన ఉదాహరణ యిది.
“ ఈడు కాదు, జోడు కాదు వావి కాదు, వరుసకాదు వాని పోరు పోరుకాదు.” అని అనైతికసంబంధాలను ఒకామె ఈసడిస్తుం ది. “ ఒద్దు ఒద్దు ముద్దులా మరిది! అన్న పెండ్లాం కన్నతల్లీ!” అని ఓ వదిన బుద్ధి చెబుతుంది.
వర్ణన:–
దృష్టికి ఆనిన, భావనకు తోచిన ప్రతి వస్తువు మీద ‘ కవి ’ కడతాడు ఈ వర్ణన ఆయా పదకర్తల సామర్థ్యం బట్టి కొన్నిచోట్ల పేల వంగా వుంటుంది. కొన్ని చోట్ల అద్భుతంగా, మురిపించే విధంగా వుంటుంది. అల్పాక్షర అనల్పార్థ రచనగా వుంటుంది.
స్త్రీని వర్ణించడంలోబలే ఉత్సాహం చూపిస్తాడు. ‘ దాసరి యంగప్పబిడ్డ ధర్మారం యేగుచుక్క’ ట. కంసలోల్లపిల్ల కంటికింపిరి గా వుంటుందట. ‘ చీటీపూల రవికది చించానోల్ల చిన్నది.’ ‘ పదిమంది కూలోల్లలోనా పగలు చుక్కర నేసేపడచు’ ‘ అగ్గు రారం ( అగ్రహారం) సుబ్బిశెట్టిపిల్ల కొప్పులో బంగారు బిళ్ళ పెట్టుకొంది’ “ అద్దములా దాని మొగము ఎద్దులింటికి వెలుగు తగిలా!” — ఎట్లాంటి వర్ణనో చూడండి.
“ కాటికి కన్నుల్లదానా! కందిరీగనడుముదానా!
వదులుకొప్పు, బిగువు రవికా, వంగి నీళ్ళు చేదేదానా!”
“ చేదబాయి బండ్లపైన కులుకుతున్నావు
వగలు వగలు పడొద్దు పాప! వక్కలేస్తావు నీళ్ళ కడవ!” అని హెచ్చరిస్తాడు ఓ వగలమారి మామగాడు.
“ కురులు, కురులు కూడదీసి, పక్కపాపిట దీసి. కావరంబు కన్నులాకూ కాటికింత పెట్టుకోని, నీళ్ళ బావి నడవలోన నిలిచి రొండు మాటలాడు!” అంటున్నాడు కవిలి తోలే గజ్జలేసిన గంగిరెడ్డి సేద్యగాడు.
ఆ బాలపాప తనను మల్లి, మల్లి చూసుకుంటూ పోతుంటే “ మల్లి మల్లి సూడాకే మల్లెలు జల్లున రాలినట్లుండు!” అని మాటల్ని గుబాలిస్తాడు.
సార్ల సార్ల అంగీ తొడుక్కొని చదువు చెప్పే ‘సాతాని’ అయవారు, కిర్రుమెట్లు తొడుక్కొని బో జంబంగా నడిచే కిట్టిగాడు, పుల్లిగాని అసాధారణ కోపం, కాసుగుర్రం పాలకీలో పోయే రంగారెడ్డి పయనం, ఏటికాలు ఎగేసుకుంటా ఎడమచేయి ఊపు కుంటా పయనం అయిన లాలిశెట్టి, దూడదాండ్లకు మందు తెమ్మని దుర్గం దూదేకులోని వెంటపడే దూడవాండ్లు, సంచి భుజా న వేసుకొని వచ్చే మందుల చౌడన్న, ఎండపొద్దు ఎదురుగాలికి పోతావుంటే ఎగిరేపైట, కొత్తచీర కట్టుకోని, కొడుకు రంగా నెత్తుకొని పోతుంటే, కొయ్య తట్టుకొని, కోక కొర్రుపట్టి, కొడుకు రంగా నేలపడటం, వచ్చిపొయ్యే దావలోన మందులు నూరే అన్న, సంకలో సారాయి సీసాతో పాటలు పాడే పాపిడి ( లంబాడి ), సంక్రాంతి పండక్కి జరిగే కోడిపందేలు, పశువులు కూడి నపుడు రేగే ఎర్రదుమ్ము, రాళ్ళ సేనులో పావురాలు వాలటం, పైన గద్ద పల్టీలు కొడుతుంటే, కోడిపెట్టను హెచ్చరించడం, పీర్ల దేవుళ్ళ ఊరేగింపు, వచ్చిపోయే దావాలో వున్న రాగిమాను రచ్చబండ, రచ్చబండపైన జరిగే ఏవేవో చర్చలు, ఏటిలో టెంకాయ కొట్టడం, ఏటుపడితే జల్లున రాలే ఏటిగడ్డన నేరేడు చెట్టు, తోటలోని మల్లెలు రవరవ గాలికే రాలిపోవటం, ఎద్దుమొద్దు లేని బండి రైలుబండి — యిలా యింకా అనేకమైన వాటిని వర్ణిస్తాడు.
అదును చూసి పదమేస్తే ఆమె పైట కొంగు అదురుతుంది. అతను పదమేస్తే ఆమె కంటి నీరు కడవ నిండుతుంది. ఆతను పద మేస్తే ‘ ఇతూరైరా యాల పదమూ!’ అని వన్స్ మోర్ పలుకుతారట!

కదిరి, నల్లమాడ తాలూకాలలోని చారుపల్లె, బడవాండ్లపల్లె, పోలంవాండ్ల పల్లె, హరిజనవాడ, మీసాలవాండ్లపల్లె,పట్నం, కాళసముద్రం, ఎరదొడ్డి, కొత్తపల్లె గ్రామాలలో సేకరించిన 700 ఏలపదాల ఆధారంగా ఈ వ్యాసం. ఇందులో పేర్కొనబడిన ప్రాంతాలు, వ్యక్తులు ఇప్పటికీ వున్నారు. ఇందులోని సంఘటనలు ఈ గ్రామాల ప్రజలందరికీజ్ఞాపకమే.

రచయిత :–విద్వాన్ దస్తగిరి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s