Thinking scientifically

“ఏది సత్యం ఏదసత్యం
ఓ మహాత్మా ఓ మహర్షి” అని శ్రీశ్రీ ప్రశ్నించాడు. మరి ఆ సత్యాన్ని తెలియజేసేదేమిటి ? సైన్సు. సైన్సు అంటే శాస్త్రం.
ప్రతి రోజు టీవీల్లో జ్యోతిష్యశాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రం ఇలా చెప్పింది, అలా చెప్పింది అని
చెబుతుంటారు. చాలా మంది అవి కూడా సైన్సే అనే భావించే అవకాశం ఉంది.
సైన్సు ఆధునిక పరిణామం. పందొమ్మిదో శతాబ్దం వరకు సైన్సును తత్వశాస్త్రంలో భాగంగా చూశారు.
అంతకుముందు కనుగొన్న సత్యాలను పందొమ్మిది శతాబ్దంలో విడదీసి వాటిని ప్రకృతి నియమాలుగా సూత్రీకరించారు.తరువాత కాలంలో భౌతిక ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడమన్న భావనతో సైన్సును పరిగణించారు. అప్పటి నుంచి శాస్త్రవేత్త, శాస్త్రీయత, శాస్త్ర పరిశోధన భావనలు రూపుదిద్దుకొన్నాయి.
ప్రశ్నించడం శాస్త్ర విజ్ఞానంలోనూ శాస్త్రీయ భావనలోనూ ప్రథమ లక్షణం.
ఎందుకని? ఎందుకని ? ఎందుకనెందుకని ? ఎందుకనెందుకని ?పస్తులెందుకని ? పేదరికం ఎందుకని ? అజ్ఞానం ఎందుకని ? అంటూ దేవి ‘ఎందుకని’ అనే పాటలో ప్రశ్నించడం ద్వారా ఆలోచింపజేస్తుంది.
ప్రశ్నించడంతో మొదలైన శాస్త్రీయ విజ్ఞానం (సైన్స్) ప్రకృతిలో అంతర్గతంగా ఇమిడివున్న అనేక నియమాలనుకనుగొనేటట్లు చేసింది.
ఆపిల్ కిందకే ఎందుకు పడుతోంది ? అని ప్రశ్నించిన న్యూటన్ భూమికి ఆకర్షణ ఉందని కనుగొన్నాడు. రాత్రి, పగలు ఎలా ఏర్పడుతున్నా యనే మథనం ద్వారా భూమి తన చుట్టూ తాను తిరగడమని తెలుసుకున్నారు.ఇలా ప్రకృతిని పరిశీలించడం ద్వారా అనేక సత్యాలు ఆవిష్కృతమైనాయి.
ముందు భూమి బల్లపరుపుగా ఉందన్నారు. తరువాత భూమి గుండ్రంగా ఉందన్నారు. భూమి చుట్టూ సూర్యుడుతిరుగుతున్నాడన్నారు. కాదు సూర్యుని చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగు తున్నాయన్నారు. గెలీలియో కనుగొన్న దూర దర్శినితో ఇది నిర్ధారణయింది.
ప్రకృతి నిరంతరం మారుతుందని, మార్పు నిరంతర ప్రక్రియ అని, ఏదీ శాశ్వతం కాదని సైస్సు గుర్తించింది.
సైనులో (శాస్త్రీయ విజ్ఞానం)లో ఉన్న గొప్ప లక్షణం ఏమంటే.. పాత జ్ఞానం తప్పని తేలితే వెంటనే దానిని తిరస్కరించి కొత్తదాన్ని స్వీకరిస్తుంది. అందుకే కవి గుమ్మావీరన్న ..
“సత్యం సాపేక్షం/లేదు పూర్వ సత్యం/నిన్నటి జ్ఞానం కన్నా/నేటి జ్ఞానమే మిన్న”అనంటాడు.
పరిణామక్రమంలో భాగంగానే జీవం పుట్టిందని తేల్చింది. జీవపరిణామక్రమంలో మనిషి రూపొందాడని, మనుషులంతా ఒక్కటేనని సైన్సు తేల్చింది.
ఇవన్నీ ప్రశ్నించడంతో ప్రారంభమై పరిశీలన చేయడం, సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం దాకా సాగింది.తరువాత ప్రయోగం చేశారు. ఆచరించి చూశారు. ప్రయోగం ద్వారా వచ్చిన ఫలితం ఆధారంగా ఒక
సూత్రీకరణ లేదా ఒక ప్రతిపాదన చేశారు. ఇలాంటి పద్ధతుల ద్వారా ఒక సత్యాన్ని తెలుసుకోగలిగారు. ఈ పద్ధతుల ద్వారా లభించిన జ్ఞానాన్ని శాస్త్రీయ విజ్ఞానం అన్నారు.
శాస్త్రీయ విజ్ఞానం అందించిన సూత్రాలను నిత్యజీవితంలో మన జీవనానికి అన్వయిస్తే వచ్చినవే శాస్త్రీయ భావాలు. ఇవి మనలో తరతరాలుగా గూడుకట్టుకున్న మూఢవిశ్వాసాలను పటాపంచలు చేశాయి, చేస్తున్నాయి.
ఒక వస్తువు ను సృష్టించలేం.నాశనం చేయలేం అని సైన్సు నిరూపించింది. ఒక పదార్థం మరో రూపంలోకి మారుతుందేగానీ అది పూర్తిగా నాశనం కాదని శాస్త్రవిజ్ఞానం నిరూపించింది.
ఎవరైనా సైన్సు తెలిసినంత మాత్రాన వారికి శాస్త్రీయ భావాలు ఉంటాయని చెప్పలేం. శాస్త్రం రుజువు చేసిన వాటికి వ్యతిరేకంగా, రోజువారి జీవితంలో నమ్మినా, ఆచరించినా మూఢనమ్మకాల్లో ఉన్నట్లే లెక్క.
మన దేశ సాహిత్యంలో ఎలాంటి శాస్త్రీయ భావనలున్నాయో చర్చిద్దాం. మనదేశంలో ప్రాచీన సాహిత్యం వేదసాహిత్యంతో మొదలవుతుంది. తెలుగు సాహిత్యం పాల్కురికి బసవపురాణం,
నన్నయ మహాభారతంతో మొదలవుతుంది.
వేదసాహిత్యం క్రీ.పూ. 2000 నాటిది. ఆనాటి ప్రజలకు ఆహార సేకరణ మాత్రమే తెలుసు. ప్రకృతి గురించి వారికున్న అవగాహనను కవితాత్మకంగా రుగ్వేదంలో చెప్పారు. వ్యవసాయం కూడా తెలీనిదశ అది. కానీ వేదాలోలనే అన్నీ ఉన్నాయని చాలా మంది ప్రకటిస్తుంటారు. ‘వేదాల్లో అన్నీ ఉన్నాయష”
అంటూ ఉంటాడు గురజాడ రాసిన కన్యాశుల్కంలో ‘అగ్నిహోత్రావధాన్లు’. ఇటీవల ఒక కేంద్రమంత్రి వేదాల్లో కోతి నుంచి మానవుడు వచ్చినట్లు చెప్పలేదు కాబట్టి డార్విన్ సిద్ధాంతం వాస్తవంకాదని ప్రకటించాడు. రోజూ టీవీల్లో చెప్పే ప్రవచనకారులు శాస్త్రం ఏం చెపుతుందంటే అని అంటుంటారు. వీరు చెప్పే శాస్త్రం ‘వేదాలే’.
క్రీ.పూ. 1000 నాటికి ఇనుము కనుగొన్నారు. దాంతో నాగలితో భూమిని దున్ని వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. అప్పటి నుంచి కొత్త భావాలు ఏర్పడ్డాయి. ఆత్మ, పరమాత్మ భావాలు ప్రవేశించాయి. కర్మ సిద్ధాంతం వచ్చింది. విత్తనం నాటితే అది మొలకెత్తి చెట్టుగా మారి ధాన్యాన్ని, ఫలాల్ని ఇస్తుంది. దీని ఆధారంగా ఈ జన్మలో
మనం చేసేపని (కర్మ),మళ్లీ జన్మలో ఫలితాన్నిస్తుందనే భావన ఏర్పడింది. మంచి పనిచేస్తే వచ్చే జన్మలో మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం. ఇదేకర్మ సిద్ధాంతం.
వృక్షాలు, వనస్పతులు, అంతరిక్షం నుండి ఆత్మ వస్తుందనుకున్నారు వేదకాలంలో. దీనినే భగవద్గీతలో’అన్నాధ్భవంతి భూతానీ’ అనే శ్లోకంలో చెప్పారు. ఉపనిషత్తుల కాలానికి ఆత్మ,పరమాత్మ భావాలు ఏర్పడ్డాయి. ఇది జ్యోతి రూపంలో ఉంటుందన్నారు ముండకోపనిషత్తులో.ప్రతి జీవిలో ఆత్మ ఉంటుందన్నారు. ఇది నాశనం కాదు. ఏ
శాస్త్రం దీన్ని ఛేదించలేదు. అగ్ని దహించలేదు. నీరు తడపలేదు. వాయువు ఆర్పలేదు అంటూ దీని స్వభావాన్ని విపరించారు.
ఈ ఆత్మ ఆధారంగా అనేక కథలు పుట్టాయి.
రామాయణం, భారతంలో చాలా ఉపకథలున్నాయి. పరకాయ ప్రవేశం అనే భావన కూడా వచ్చింది. కోరికలు తీరకుండా మనిషి మరణిస్తే ఆత్మ దయ్యంగా మారుతుందని ఇప్పటికీ చాలా మంది భావిస్తుంటారు.
పల్లెల్లో ఆత్మలు దయ్యంగా మారి తిరుగుతుంటాయని భ్రమపడుతుంటారు. గతంలో కొరివి దయ్యాలుండేవని ఇప్పుడు కరెంటు రావడంతో అవి పోయాయని చెపుతుంటారు.
ఆత్మలను వీడియో తీశామని యూట్యూబుల్లో పెడుతుంటారు.
ఆత్మ భావన ఎలా పుట్టిందంటే ఆదిమకాలంలో మనిషి శత్రువుల చేతిలో, జంతువుల చేతిలోనూ మరణించేవాడు. ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోయేవాడు. అతను మళ్లీ మేల్కోనేవాడు. మరణించిన మనిషి కూడా మేల్కొంటాడనే
భావన ఏర్పడింది. ఇదే మనిషిలో ఏదో తెలియని అదృశ్యశక్తి ఉందనే నమ్మకం ఏర్పడటానికి కారణమైంది. అలాగే మనిషి నిద్రించే సమయంలో కలలు కంటాడు. నిద్రించిన మనిషికి మరణించిన వారికి పెద్ద తేడా కనిపించదు.మనిషి నిద్రిస్తున్న ప్పుడు శరీరంలోని ఒక అదృశ్యశక్తి బయటకు వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి మళ్లీ నిద్రలేవగానే శరీరంలోకి వస్తోందనే భావన వచ్చింది. ఈ భావనే ఆత్మ భావనకు దారితీసిందన్నాడు గ్రాంటో అల్లెన్ తన
‘ఎవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్’లో.ఉపనిషత్తుల తరువాత కాలంలో దర్శనాలు వచ్చాయి. ఇవి న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగ,పూర్వమీమాంస, ఉత్తరమీమాంస.
మీమాంసలో చర్చించే వారు అంతకుముందున్న సిద్ధాంతాన్ని తీసుకుని,దాన్ని తర్కిస్తారు. దీన్ని పూర్వపక్షం చేయటం అన్నారు. తరువాత మరో సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. దీన్ని ఆధునిక తత్వవేత్తలు థీసిస్, యాంటి థీసిస్, సింథసిస్ అన్నారు.
సాంఖ్యులు వేదాలను తిరస్కరించారు. సృష్టికర్తను తిరస్కరించారు. వీరు క్రీ.పూ. 600-500 కాలంనాటి వారు. వీరిలో కణాదుడు ప్రపంచమంతా కణముల సముదాయమన్నారు.
అసితకేశకంబరుడు నిప్పు, నీరు, మట్టి,
గాలి కూడికతో జీవం ఏర్పడిందన్నారు. జీవి మరణించగానే ఆ జీవిలోని నీరు నీటిలో, గాలి గాలిలో, వేడి నిప్పులో,మట్టి నేలలో కలసి పోతుందన్నారు. స్వర్గం, నరకం, దేవతలు ఏమీలేవు. ఉన్నవి ఈ నాలుగే అని అన్నారు.
ప్రకృతి కాత్యాయనుడు నీరు, నిప్పు, గాలి, నేలతో పాటు దు:ఖం, సుఖం, చైతన్యంల కలయికతో జీవి ఏర్పడుతుందన్నాడు.
మీమాంసకులు ప్రతి ప్రదార్థంలో అణువు ఉంటుందన్నారు.
బుద్ధుడు దైవభావనను తిరస్కరించాడు. ప్రకృతి నిత్యం మార్పు చెందుతూ వుంటుందన్నాడు. అయితే ఈ మార్పు సంఘర్షణ ద్వారానే జరుగుతుందని ఏంగెల్స్ చెప్పాడు. కార్యాకారణ సంబంధాన్ని ప్రతిపాదించాడు బుద్ధుడు.
క్రీ.పూ. 300లో చార్వాకులు ఉండేవారు. వీరిని లోకాయతులు కూడా అంటారు. చార్వాకులు మంచివాక్చాతుర్యం గలవారని అర్థం. వీరు నాస్తికులు. పరమాత్మభావాన్ని తిరస్కరించారు. వీరు దేవుడు లేడు. ఆత్మలేదు. మరణానంతరం మిగిలేదేమిలేదు అంటూ బోధించారు.
పరమాత్మను, ఆత్మను నమ్మేవారిని భావవాదులన్నారు. కనిపించే భౌతిక ప్రపంచాన్ని గురించి మాట్లాడేవారిని భౌతికవాదులన్నారు. భావవాదులు పరమాత్మను, ఆత్మను మానసికంగా నమ్మినా ఆచరణలో భౌతికవాదులుగా ప్రవర్తిస్తుంటారు. చార్వాకులు ఇలా చెప్పినారు ...

“కోదదర్శ ప్రథమం జాయామాస మస్థస్వంతం
యదన వస్థావిభక్తి భూమ్యా అసుర సుగాత్మా కృస్విల్ కోవిద్వాంస ముపగాత్ ప్రస్టుమేతత్”

“ప్రకృతి సహజంగా ఈ ప్రపంచ నిర్మాణం జరిగేటప్పుడు ఎవడు చూశాడు ? చూసినవాడు న్నాడా ? ప్రాణంగాని రక్తంగాని ఈ భూమి నుండి ఏర్పడ్డాయి. వీటికి సృష్టికర్త భగవంతుడనేవాడు ఎవ్వడూలేడు. ఆత్మ అనేది లేదు. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ అవివేకుల భావాలు’ అన్నారు చార్వాకులు.
ఈ ప్రపంచం వాస్తవమైనది. దీనికంటే భిన్నమైన మరోలోకం లేదు. పరలోకం ఉందని చెప్పేమాట అబద్ధం. మోసం. వంచన.కపటం. ఒక పురుషుడు స్త్రీకి తోడేలు పాదాలు చూపిస్తానని వేళ్లతో ఏదోచేసి చూపి భ్రమింపజేస్తాడు. అట్లాగే భావవాదులు పరలోకాలను కూడా భ్రమింపజేసి అమాయకులైన ప్రజల్ని మోసం చేస్తారన్నారు.
జైనులు, బౌద్ధులు, చార్వాకులు (లోకాయతులు) వీరంతా ఆత్మ, పరమాత్మ భావాలను వ్యతిరేకించారు. వీరిని భౌతికవాదు లన్నారు.
జనపదాల స్థాయి నుంచి రాజ్యాలు, సామ్రాజ్యాలు క్రీ.పూ. 600 నాటికి ఏర్పడ్డాయి. రాజరికపు వ్యవస్థ వేళ్లూనుకునింది.
వారు తమ ఆధిపత్యాన్ని నిరంతరంగా ఉంచుకోవడానికి, దోపిడీని మరుగుపరచుకొనడానికి
సాహిత్యాన్ని సాధనంగా చేసుకొన్నారు. వాటిని ప్రజల్లో ప్రచారం చేశారు. కర్మసిద్ధాంతం, తలరాత సిద్ధాంతం, జన్మ, పునర్జన్మ, పాపం, పుణ్యం, స్వర్గం-నరకం, ఆత్మ, పరమాత్మల భావాల్ని రామాయణ, మహాభారతాల్లో రచింపజేశారు.
వాటిని నిరంతరం ప్రచారం చేస్తూ వచ్చారు.
కౌటిల్యుడు (చాణక్యుడు) తన అర్థశాస్త్రంలో రాజుకు మూఢవిశ్వాసాలుఉండరాదన్నాడు. ప్రజల్లో మూఢవిశ్వాసాలు ప్రేరేపించి వారిలో భయ భ్రాంతులను సృష్టించాలి. రాజే వాటిని మళ్లీ
రూపుమాపాలి. ఆవిధంగా తాను ప్రజల రక్షకుడని ప్రజలు భావించేటట్లు చేసుకోవాలని చెప్పాడు.
మూఢ విశ్వాసాలకు అధికారానికి దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే (1) అధికారులిచ్చే ఆజ్ఞలకు ప్రజలు విధేయులుగా ఉంటారనుకునేవారు (2) దైవభక్తిని ప్రదర్శించేవారు ప్రతి విషయంలో చట్టబద్ధంగా వుంటారని ఆశించేవారు.
మధ్యయుగాల్లోని రాజరిక వ్యవస్థ ప్రజల్లో తార్కిక దృక్పథానికి అవకాశం లేకుండా చేసింది.
ఇలాంటి పరిస్థితి ఆంగ్లేయులు మనదేశానికి వచ్చేవరకు కొనసాగింది.అయితే వేమన, వీరబ్రహ్మంలు (17వ శతాబ్దంలో) మాత్రం వీరు రాకముందే అనేక సామాజిక మూఢాచారాల పైన, లోకరీతుల పైన ధ్వజమెత్తారు. వీరు ఆచరణాత్మకంగా కూడా చేసి చూపించారు. వీరు సాహిత్యాన్ని సాధనంగా చేసుకొన్నారు.
“రాతిబొమ్మల కేల రంగైన వలువలు
గుళ్ళు గోపురాలు కుంభములను
కూడు గుడ్డ తాను కోరునా దేవుడు’
అని ఒక పద్యంలో చెపుతాడు. అలాగే మరో పద్యంలో
“తోలు కడుపులోన దొడ్డవాడుండగ
రాతి గుళ్ళలోన రాశిబోయ
రాళ్ళు దేవుడైన రాసులు మ్రింగునా ” అని ప్రశ్నిస్తాడు.
వీరబ్రహ్మం కూడా తన తత్వబోధలో
‘చిల్లర రాళ్ళకు మొక్కుతూ వుంటే చెడిపోదువురా ఒరే ఒరే’ అని బోధ చేస్తాడు. వీరిద్దరూ విగ్రహారాధనను ఖండించారు.
తల్లిదండ్రులు బ్రతికుండగా చూడని వారుకూడా మరణించగానే పిండప్రధానం చేస్తారు. కర్మకాండ పేరుతో పెద్దగా కార్యక్రమాలు చేస్తారు. దీన్ని చూసిన వేమన
పిండములను చేసి పితరులందలపోసి
కాకులకును బెట్టు గాడ్దెలారా
పెంట దినెడు కాకి పితరుడెట్లాయెరా ? అంటూ ప్రశ్నిస్తాడు.
వేమన శ్రమకు ప్రాధాన్యత నిచ్చాడు. శ్రమే సమాజానికి మూలమని ఆయన భావించాడు.
“భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్వమెల్ల
శ్రమములోన బుట్టు సర్వంబుతానౌను’
అంటూ శ్రమ జీవన సౌందర్యానికి పెద్దపీట వేశాడు. దీన్నే ఆధునిక కవి గద్దర్
” నువ్వు భూమిదున్న కుంటే వాడు బువ్వ బుక్కలేడు’ అంటూ పాట పాడారు.
వేమన కులవ్యవస్థను తిరస్కరించాడు. ‘కులముచేత విర్రవీగువాగు వారు, గోత్రంబుగలవారు / విద్యచేత విర్రవీగువారు
/ పసిడి గల్గువాని బానిస కొడుకులు’ అనన్నాడు.
అలాగే… ‘మాలమాలగాదు మహిమీదనే ప్రొద్దు | మాట తిరుగువాడు | వానిమాలయన్న వాడెపో పెనుమాల’ అంటూ ఆశాస్త్రీయంగా ఏనాడో ఏర్పడిన కులవ్యవస్థను తిరస్కరించాడు.
వీరబ్రహ్మం ‘కులమెంచగానేల గుణమే కారణం’ అన్నాడు. సిద్దయ్యను, కక్కయ్య మాదిగను తన శిష్యులుగా చేసుకున్నాడు.
‘మతం మత్తుగూర్చు మార్గమ్ము కానరాదు
హితము కూర్ప వలయు నెల్లరకును
హితము కూర్పలేని మతము మారగవలె”
అని మతం మత్తుమందని మార్క్స్ చెప్పిన భావాన్ని పదిహేడవ శతాబ్దంలోనే వీరబ్రహ్మం చెప్పినాడు.
‘సర్వమానవులను సమముగా ప్రేమించు
కులమతాలనెంచి కోపపడకు
కాపు జాతినెల్ల కరుణించుమనే శ్రుతుల్’
అంటూ కుల, మతాలకతీతంగా మనిషి మనుగడ సాగించాలనే ఆధునిక భావాలను వీరబ్రహ్మం తన కాళికాంబ శతకంలో చెపుతాడు.
19వ శతాబ్దంలో ఆంగ్లేయుల రాకతో ఆంగ్ల విద్య అభ్యసించిన పలువురు మనదేశంలో అనేక మూఢా
చారాలను, ఛాందసభావాలను, అంధవిశ్వాసాలను ఖండించారు. వాటిని ఖండించడానికి ప్రాచీన సాహిత్యమైన వేదాలను, ఉపనిషత్తులను, దర్శనాలను ఆధారం చేసుకున్నారు. వీరు కూడా సాహిత్యాన్ని ఆధారం చేసుకొని ప్రజల్లో వీటికి
వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
బెంగాల్ లో రాజారామ్ మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఉత్తరభారతంలో ప్రేంచంద్, ఆనాటి తెలుగు రాష్ట్రాలలో గురజాడ, వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి,దాశరథి, కాళోజీ, శ్రీశ్రీ మొదలైనవారు శాస్త్రీయ భావాలను ప్రచారం
చేశారు.
ఫ్రాన్స్ రచయిత బోదిలేర్ సైన్సుతోనూ, తత్వంతోనూ కలసి కాలుకదపని సాహిత్యం మానవ హత్యా సదృశ్యమే,ఆత్మహత్యా సదృశ్యమే నంటాడు. ఇది వంటబట్టని చాలా మంది రచయితలు అనేక మూఢవిశ్వాసాలను ఛాందస
భావాలను తమ రచనల్లో ప్రతిఫలిస్తున్నారు. లేదంటే సూడో సైన్సును రాస్తున్నారు.
ఐన్‌స్టీన్ కనుగొన్న సాపేక్షతా సిద్ధాంతం ప్రతి విషయాన్ని స్థలకాలాదుల్లో చూడాలన్న జ్ఞానం నేర్పింది.
ప్రాచీన సాహిత్యం స్థలకాలాదులను విస్మరించింది. అందువల్ల పురాణాలను ప్రాచీనమైనవని చెబుతారేగాని అవి ఏ కాలానివో చెప్పరు. అవి క్రీ.పూ. 400 కాలం నాటివని వాటిల్లోని కథల ద్వారా తెలుసుకున్నారు. ఆధునిక రచయితలు స్థలకాలాదుల్లో చెప్పడం మొదలు పెట్టారు.
సైన్సుకు మానవత్వ ముఖం ఉండదు. ఇది ఐనిస్టీన్ తన E=mc^2 సూత్రం ద్వారా రూపొందించిన ఆటంబాబునుఅమెరికా జపాన్ పై ప్రయోగించినప్పుడు గుర్తించాడు. ప్రకృతి విధ్వంసాన్ని గుర్తించాడు. దీన్ని ఆయన వ్యతిరేకించాడు.రచయితలు కూడా పర్యావరణ విధ్వంసాన్ని, అణుబాంబు ప్రయోగాన్ని, యుద్ధాలను నిరసించారు.
చాలా మంది రచయితలు తలరాత సిద్ధాంతాన్ని, మిధ్యావాదాన్ని తిరస్కరిస్తూ రాశారు. సామాజిక మార్పును గుర్తిస్తూ సామాజిక స్పృహతో సామాజిక పురోగతిని ఆకాంక్షించారు. అశాస్త్రీయంగా మనుషులలో విభజించిన వర్ణ
వ్యవస్థను ధిక్కరించారు. బాల్య వివాహాలను ఖండించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. పంచములుగా పిలువబడే దళితులకు మద్దతుగా నిలిచారు. వీరిని అభ్యుదయ రచయితలన్నారు.
పాత సంప్రదాయాలను, ఛాందసభావాలను కీర్తించే వారిని సంప్రదాయ రచయితలన్నారు.
గురజాడ శాస్త్రీయ భావాలను తన రచనల్లో ప్రతి చోటా ప్రతిఫలింపజేశారు.
‘మనిషి చేసిన రాయిరప్పకి, మహిమ కలదని సాగిమొక్కుతు | మనుషులంటే రాయిరప్పల/
కన్న కనిష్టంగానూ చూస్తావేల బేలా ?’ అంటూ గురజాడ ప్రశ్నిస్తాడు.
బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణుడు, భుజం నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, పాదాల నుంచి శూద్రుడు వచ్చాడని మనుధర్మం చెపుతోంది. శూద్రులు తక్కిన వారందరికి సేవకులుగా ఉండాలని కూడా చెప్పింది.పంచములను ఊరికి దూరంగా ఉండాలని చెప్పింది. మనషులంతా సమానమేనని విజ్ఞాన శాస్త్రం తేల్చింది. అందరికీ అన్ని హక్కులున్నాయని, ఒకరినొకరు పరస్పర సహాయసహకారాలతో జీవించాలని అదే ప్రకృతి ధర్మమని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పింది.
గురజాడ వీటిని అందిపుచ్చుకున్నాడు. అందువల్లనే
‘తిండి కలిగితే కండ కలదోయి / కండ కలవాడేను మనిషోయి’ …. అనడమేకాక
‘అన్నదమ్ములవలెను జాతులు | మతములన్నియు మెలగవలెనోయి’ అనన్నాడు.
అంతేగాక
‘మలిన దేహుల మాలలనుచును | మలినచిత్తుల కధికకులముల/ నెలవొసంగిన వర్ణధర్మ మధర్మ ధర్మంబే” అనంటాడు. అధర్మమైన వర్ణధర్మం ధర్మమైందా? అని ప్రశ్నిస్తాడు.
‘ఎల్లెలోకము వొక్కయిల్లై / వర్ణభేదములెల్ల కల్లై / వేల నెరుగని ప్రేమ బంధము /వేడుకలు కురియ’ … అని కూడా చెపుతాడు
‘మీ పేరేంటి, పెద్ద మసీదు’ కథల్లో మత విశ్వాసాల్లోని అహేతుకతను తేటతెల్లం చేస్తాడు.
‘మతములన్నియు మాసిపోవును / జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని గురజాడ మత విశ్వాసాలు, దానికి కనుబంధంగా వున్న ఛాందస భావాలు పోయి మనుషుల మధ్య జ్ఞాన సంబంధాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తంచేశాడు. ఇటీవల జరిగిన ఒక సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింల తరువాత మానవవాదులు మూడవ స్థానంలో వున్నారు. విజ్ఞానం అందరికీ అందే కొద్దీ అజ్ఞానం పటాపంచలవుతోందని తెలుస్తోంది.
తోకచుక్క అరిష్టమని సమాజంలో ఒక మూఢనమ్మకం ఉంది. టి.వీలలో నేటికీ కొంత మంది ఇదే చెపుతూవుంటారు. గురజాడ “హేలీ తోకచుక్క’ను దూరపు బంధువుగా ఇలా వర్ణించాడు.
“దూర బంధువు యితడు భూమికి / దారిచూపుచూ చూడవచ్చును / డెబ్బదెనుబది ఏండ్లకొక తరి/
నరుల కన్నుల పండువై”.
పురుషాధిక్య సమాజంలో భార్య, భర్తల సంబంధాలు ఎలా వుంటాయో అందరికీ తెలిసిందే.
కానీ గురజాడ మాత్రం భార్య, భర్తల సంబంధాన్ని స్నేహితుల మధ్య సంబంధంగా చూచాడు. భర్త దేవుడని చెప్పే మాటను తిరస్కరిస్తూ
‘మగడు వేల్పన పాతమాటది / ప్రాణమిత్రుడనీకు…. అని చెపుతాడు. అంతేకాక “ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును / ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును…” అని చెపుతూ ప్రేమ భావన తోనే భార్య, భర్తల మధ్య సఖ్యత నిలుస్తుందంటాడు.
గురజాడ కన్యాశుల్కం నాటకం బాల్య వివాహాల ద్వారా మహిళలకు జరిగే అన్యాయాన్ని ఎత్తి చూపుతుంది. ఇందులో బుచ్చమ్మ, మీనాక్షి, పూటకూళ్లమ్మలు బాల్య వివాహాల ద్వారా వితంతువులు, వారు పడే బాధలను నాటకంలో
వ్యక్తీకరించాడు.
సి.వి. అనేక రచనలు చేశాడు. విషాద భారతం, జాబాలి మొదలైనవవన్నీ ప్రాచీన సాహిత్యంలోని ఆహేతుక విషయాలను ఎత్తిచూపుతాయి.
వర్ణవ్యవస్థను సంప్రదాయవాదైన విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలుగా కీర్తిస్తే, అదే వర్ణవ్యవస్థను బూషువా “కసరిబుసకొట్టు నాతని నాల్గు పడగల హైందవ నాగరాజు’ అంటూ ఈసడించుకున్నాడు.
శ్రీపాద రాసిన ‘అరికాళ్ళ మంటలు, ఇళ్ళు పట్టిన వెధవాడ పడుచు కథలు’ బాలవితంతువుల సమస్యలను చిత్రీకరించాయి.
కొడవటిగంటి కుటుంబరావు జ్యోతిష్యం కథ జ్యోతిష్యంలో ఉన్న బూటకత్వాన్ని బయట పెడుతుంది. ఇందులో ఒక వ్యక్తి తన చనిపోయిన తమ్ముని జన్మ వివరాలిచ్చి జాతకం అడగుతాడు జ్యోతిష్యున్ని. అవేమి తెలియని జ్యోతిష్యుడు
ఆ వివరాలు తెచ్చిన వ్యక్తివేననుకొని వంద సంవత్సరాలు జీవిస్తాడని జాతకం చాలా బాగుందని చెపుతాడు. ఈ కథ ద్వారా జ్యోతిష్యంలోని అశాస్త్రీయతను ఎత్తిచూపుతాడు కొడవటిగంటి.
‘మనుష్యుడే నా సంగీతం | మానవుడే నా సందేశం’
అని మానవుని కేంద్రంగా కవిత్వం రచించి శాసించిన శ్రీశ్రీ మిథ్యావాదంలోని మర్మాన్ని బయటపెడతాడు.
ఈ మిధ్యావాదాన్ని ఆదిశంకరుడు ప్రతిపాదించాడు. బ్రహ్మసత్యం జగన్మిధ్య అన్నాడు. రజ్జు సర్పభ్రాంతి
సిద్ధాంతం చెప్పాడు. తాడును సర్పం అనుకుంటారు చీకట్లో, వెలుగులో అది తాడని తెలుస్తుంది. అలాగే బ్రహ్మ జ్ఞానంతో ప్రపంచం మిథ్య అని తెలుస్తుందన్నాడు. నాశనమయ్యేది వాస్తవం కాదన్నాడు. ప్రదితీ మాయవుతుందని,
రూపాంతరం చెందుతోందని చెప్పిన బౌద్ధులు, జైనులు, వైశేషకులు చెప్పిన వాటినివ్యతిరేకించాడు. ప్రపంచం మిథ్య అన్న శంకరుడు, విగ్రహాన్ని మాత్రం పూజించడం ఆయన సిద్ధాంతానికి విరుద్ధం. ఇతడు ప్రతిపాదించిన మిథ్యావాదం శాస్త్రీయ
భావన వ్యాప్తికి అవరోధమైంది. దేశ పురోగతికి ఆటంకంగా నిలిచిపోయింది. దీన్ని బ్రద్దలు కొట్టడానికి తన కవిత్వంలో ఇలా చెపుతాడు శ్రీశ్రీ.

‘మాయంటావా? అంతా
మాయంటావా ? ఓ మిధ్యా వేదాంతి ?
ఏమంటావూ ? లోకం మిధ్యంటావూ ?
జమిందారు రోల్సుకారూ
మహారాజు మనీపర్సు
మాయమంటావు ? స్వామీ ఏమంటావు ?
ఏయ్ ఏమంటావు?
పాలివాని నుదుటి చెమట
కూలివాని గుండె చెరువు
మాయంటావూ?

పాలు, పెరుగుగా మారటానికి మజ్జిగ తోడు ఎంత అవసరమో, మనిషిని సమాజాన్ని చైతన్యం చేసేందుకు శాస్త్రీయ భావాలూ అంతే అవసరం. ఈ భావాల వ్యాప్తి రచయితల ద్వారా జరుగుతుంది.
‘జపతపంబుల కన్నా / చదువు సాములకన్నా ఉపకారమే మిన్న / ఓ కూనలమ్మా’ … అని ఆరుద్ర అంటే ‘నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి / కవులు కంటున్న కలలు మనుషుల్లో ఫలిస్తాయి’ అనంటాడు గుంటూరు శేషేంద్ర శర్మ.
సమాజంలో ఉన్న కులోన్మాదం పై కవితాగ్రహం ప్రకటిస్తాడు అశోక్ కుమార్ ఇలా…
‘కమ్మో రెడ్డో కాపో అంటాడు కాని
మనిషని చెప్పడేం ? హిందువో, ముస్లీమో, క్రిస్టియనో
అంటాడు కాని మనిషని చెప్పడేం ?
అమెరికనో, రష్యనో, జపనీయో అంటాడు కాని
మనిషని చెప్పడేం ?
అసలిక్కడ మనుషులే లేరా ? లేక
ఉన్నవాళ్లు మనుష్యులు కారా ? “అని ప్రశ్నిస్తాడు ఆగ్రహంగా
విధిరాత, తలరాత సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ శ్రమతోనే చరిత్ర సృష్టించవచ్చని చెపుతాడు సినారె.
అంతా నుదుట రాసి వుందంటే
యంత్రాలు నడిచేవికావు
విధి పరిధిలో చంక్రమిస్తుంటే
వివేకం పెరిగేది కాదు
సంకల్పం నడుము చుట్టకుంటే
చరిత్ర తిరిగేది కాదు
మనిషి జీవితం / అనుభవాంకితం
శ్రమజీవన సౌందర్యఫలం.
కాలానుగుణంగా ప్రకృతే కాదు సమాజంలోని భాషా సంస్కృతులు కూడా మారుతుంటాయని విజ్ఞానశాస్త్రం నిరూపించింది. ప్రస్తుతం ప్రపంచీకరణలో అన్నీ శరవేగంగా మారిపోతున్నాయి. కరోనా కాలంలో చాలా మార్పులు సంభవించాయి. పర్యావరణం విధ్వంసం ఆగిపోయింది. ఓజోను పొర రంధ్రం పూడిపోయింది. ఢిల్లీలో కాలుష్య స్థాయి తగ్గి సాధారణ స్థాయికి వచ్చింది. అందరినీ రక్షిస్తాడని నమ్మే అన్ని మతాల దేవుళ్ళ ప్రార్థనా మందిరాలన్నీ మూసివేయ బడినాయి.
దేవరకొండ బాలగంగాధర తిలక్ శాస్త్రీయంగా ఆలోచించే కవి. సామాజిక సందర్భాలను చారిత్రక మార్పులను గుర్తించినకవి. అందుకే
‘ఏ సంస్కృతీ కాదొక స్థిర బిందువు | అది నైకనదీనదాల అంత:స్సింధువు / కనిపించని ప్రభావాల కది లొంగుతుంది” అనంటాడు తన అమృతం కురిసిన రాత్రిలో…
ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఏదో ఉందని చాలా మంది భావవాదులు భావిస్తుంటారు. కొంత మంది భగవంతుడన్నారు. మరికొంత మంది అదృశ్య శక్తి అన్నారు.
చెరబండరాజు మాత్రం “నత్వం కామయే,
రాజ్యం వద్దు, స్వర్గం వద్దు, మోక్షం కూడా వద్దు
నాకు కావాల్సిందల్లా ప్రజల కష్టాలన్నీ తొలగించే శక్తి ఒక్కటే’ అనంటాడు.
అదే తిలక్ అయితే…
“దేవుళ్ళని తన రూపంలో సృష్టించుకొని / తన భయాన్ని వాళ్ళకు తగించుకుని / అడిగినప్పుడెల్లా వరాలిమ్మని ఒప్పందం చేసుకుని పరవాలేదని ప్రమత్తుడయ్యాడు మానవుడు… “అని చెపుతాడు.
మరో కవి రాచాపాళెం రఘు ‘సర్వాంతర్యామి సామి వుంటే/ సామి శిలలు చౌర్యమందు టేల?/ సామిరక్షకు రక్షకభటులేల ?’ అని ప్రశ్నిస్తాడు.
ప్రజలంతా శాస్త్రీయ దృక్పథం తో నడుచుకోవాలని చెప్పడమే గాక రాజ్యాంగంలోని ఆర్టికల్ 51-ఎ ప్రకారం శాస్త్రీయదృక్పథాన్ని ప్రజల ప్రాథమిక విధిగా పేర్కొంది.
సమాజంలోని ఆకలి, దారిద్ర్యం, నిరక్షరాస్యత, అపరిశుభ్రత, వనరుల దుర్వినియోగం, పర్యావరణ విధ్వంసం వంటి వాటికి శాస్త్రీయ ఆలోచనే పరిష్కార మార్గాలను సూచించగలదు.
దాశరథి తన అగ్నిధార కావ్యంలో రాసిన ‘ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానల మెంతో | ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో / భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మనవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో’ అనే గీతంలో మానవ పరిణామం పైన, భూమి పుట్టుక గురించి సమాజంలోని అసమానతల పైన స్ఫూర్తిదాయకమైన, శాస్త్రీయ భావాలున్నాయి.
‘రచయిత అన్నవాడు సైంటిస్ట్ కానక్కర్లేదు. కానీ అతడికి శాస్త్రీయ దృక్పథం ఉండాలి. ఇది లేకపోతే అతడి రచనలు అర్ధసత్యాలు – రసవిహీనతా సంక్రమిస్తాయి. జీవితానికి ప్రాణవాయువు ఎంత అవసరమో అలాగే రచయితలకు సైంటిఫిక్ దృక్పథం అవసరం’ అని శ్రీశ్రీ ఏనాడో చెప్పినాడు.మతం ఓడిపోతూ వుంది. సైన్సు గెలుస్తోంది. ఇదే ఈనాటి చారిత్రక పరిణామమని నొక్కి వక్కాణించాడు.

‘ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడో
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి వస్తాయో
ఎక్కడ అవిరామమైన సత్యాన్వేషణ పరిపూర్ణతవైపు చేతులు చాస్తుందో
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని ఎలాంటి విశ్వాసపు దారిలో ఇంకిపోదో
అలాంటి స్వేచ్ఛాపథంలోకి పయనించాలి… దేశం మేల్కొనాలి’ అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ కోరినట్లు
రచయితలు, సామాజిక కార్యకర్తలు, శాస్త్రీయ దృక్పథంలో సమాజాన్ని ముందుకు తీసుకెళతారని ఆశిద్దాం.

__పిళ్లా కుమారస్వామి, 9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s