Srujana nedu,27.12.2020

సమాజంలో వున్న అనేక రుగ్మతలను చూసో, సమాజం ఇలా వుండకూడదని భావించో, సమాజాన్ని ప్రతిఫలించాలనో రచయిత రచన చేస్తాడు. ఆ రచనను చదివిన పాఠకునికి సమాజాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలవుతుంది.
సాహిత్యం సమాజాన్ని మార్చుతుందా? అని చాలామంది అడుగుతుంటారు. వాస్తవానికి సాహిత్యం, సామాజిక మార్పు పరస్పర సంబంధం కలిగి వుంటాయి. దీని గుర్తించిన బుద్ధుడు తన ధర్మాలను కథల రూపంలో వివరించే ప్రయత్నం చేశాడు.అలాగే ఇలాంటి ప్రయోజనం కోసమే పంచతంత్ర కథలు,ఈసప్ కథలు పుట్టాయి. సాహిత్య ప్రయోజనంపై పలువురు పలు విధాలుగా చెప్పారు. గురజాడ సాహిత్యం పాఠకునిలో సంస్కారం కలిగిస్తుందని భావిస్తే, సాహిత్య ప్రయోజనం ప్రచారమేనని శ్రీశ్రీ అన్నాడు. వీటితో పాటు సాహిత్యం మనిషిలో చైతన్యం కూడా కలిగిస్తుందని బాలగోపాల్‌ భావించాడు. కథ, కవిత్వం, నవల, వ్యాసాలు, గేయాలు, పాటలు మొదలైన రచనలన్నీ సాహిత్యమే. రచయిత తన రచనను తనకోసం మాత్రం రాయడు. పాఠకుల కోసం రాస్తాడు. పాఠకులు ఆ రచనలను చదివి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. అయితే వాటిని పాఠకుడు సరైన వాటిని ఎన్నుకోవటానికి విమర్శకుడి అవసరం ఉంది.
ప్రతీ ఒక్కరికీ ఒక తాత్విక దృక్పథం ఉంటుంది. కానీ ”నాకు మీ సాహిత్య వివాదాలు తెలియవు. నలుగురినీ మంచి చేసుకోవటం అంతకన్నా తెలియదు.” అని తిలక్‌ చెప్పినట్లుండే రచయితలు ఎవరూ ఉండరు. ప్రతీ ఒక్కరికీ ఒక తాత్విక దృక్పథం (ప్రాపంచిక దృక్పథం) ఉంటుంది. అది చిన్నప్పుడు కుటుంబం ద్వారా, అనుభవం ద్వారా, సమాజం ద్వారా ఏర్పడి ఉంటుంది. రచయితకూ అలాంటి తాత్విక దృక్పథం ఉంటుంది. దాన్ని ఏదో విధంగా రచయిత వ్యక్తం చేస్తాడు.
మొదట్లో రచయిత ఉద్దేశ్యమే సాహిత్యం అని భావించారు విమర్శకులు. తర్వాత కాలంలో నవ్య విమర్శకులు రచనే ముఖ్యం గానీ, రచయిత ఉద్దేశ్యం ఎందుకు? అని ప్రశ్నించారు. రచన ఏం చెబుతోంది? ఎలా చెబుతోంది? అని పరిశీలించారు. వీరు రచయిత రచనా కాలాన్ని, సందర్భాన్ని వాళ్ళు పరిగణనలోకి తీసుకోలేదు.
భారతీయ సాహిత్యం లో విమర్శ చాలాప్రధానమైనది. అలంకారికులు ధ్వని, వక్రోక్తి, అలంకారాలు, శైలి మొదలైన అంశాల పరంగా కావ్యాన్ని పరామర్శించారు. ఇది క్రీ.శ. 1వ శతాబ్దంలో భరతునితో ప్రారంభమైంది. క్రీ.పూ. 3వ శతాబ్దంలోనే పాశ్చాత్య సాహిత్య మీమాంస పుట్టింది.
కథను చదివినా,నాటకాన్ని చూసినా పాఠకుడి/ ప్రేక్షకుడిలో భావప్రక్షాళన జరుగు తుందన్నాడు అరిస్టాటిల్‌. దీనిని కెథార్సిస్‌ అన్నాడు. ఇతని ప్రకారం విమర్శకుడు రచనకు నిబద్ధుడు. కథకు స్థలకాలాదులు, సన్నివేశ ఐక్యత ఉండాలన్నాడు. వీటిలో సన్నివేశ ఐక్యతకు ప్రాధాన్యత ఇచ్చాడు అరిస్టాటిల్‌.
కాలిమాకస్‌ అనే సాహిత్యకారుడు ”ఇతరులు నడిచిన బాటలో నడకవండి. కొత్తదారులు వెదకండి. కొత్తరకాల పువ్వుల్ని కోయండి” అంటూ రచయితలకు సూచించాడు. విమర్శకుడు సమాజానికి నిబద్ధుడని చెప్పినాడు ఆర్నాల్డు.
రచయిత తీసుకున్న కథావస్తువుపై ప్రాంతం, కాలం, ప్రక్రియ, రచయిత దృక్పథం ప్రభావాలు ఉంటాయని ఇప్పుడు అందరు విమర్శకులు ఆమోదిస్తున్నారు.
మార్క్సిజం సాహిత్యాన్ని అన్ని రంగాల సమాహారంగా చూస్తే, మార్క్సిజాన్ని విమర్శిస్తూ వచ్చిన ఆధునికానంతర వాదం ప్రతిరంగాన్నీ ముక్కలు ముక్కలుగా చూసింది.
సమాజంలో ప్రతి ఒక్కటీ పరస్పరాధారితం. విడివిడిగా ఏదీ మనలేదు. చూడడానికి అలా అనిపించినా ఏదీ సర్వస్వతంత్రంగా లేదు. ప్రకృతిలోనూ, సమాజంలోనూ ప్రతీదీ సాపేక్షమే. ఏ వర్గానికి ఆ వర్గంగా ఏ రంగానికి ఆ రంగంగా విడివిడిగా చూడడం చాలామంది విమర్శకులలో ఫ్యాషనైపోయింది. ఆధునికానాంతర వాదం నిరాశామయ ప్రపంచంవైపు తొంగిచూస్తుంది. మార్క్సిజం ప్రపంచాన్ని మార్చగలమనే ధైర్యాన్ని, మార్చుకోవచ్చనే పురోగామి దృక్పథాన్ని పెంపొందిస్తుంది. చరిత్రకు సాహిత్యానికి, సమాజానికి సాహిత్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తింపచేసింది మార్క్సిజమే. రూపంలో శైలి ఒక అంశమని కూడా గుర్తించింది మార్క్సిజమే.
సాహిత్య విమర్శ అంటే గుణదోష విచారణ చేయడం. ఇలా చేయాలంటే రచయిత కన్నా విమర్శకుడు రెండాకులు ఎక్కువ తెలుసుకుని ఉండాలి. ముఖ్యంగా భారతీయ సమాజంలో ఉన్న భారతీయ వేదాంతం, బౌద్ధం, మార్క్సిజం, ఫ్రాయిడ్‌, ఆడ్లర్‌, యాంగ్‌ మనస్తత్వ సిద్ధాంతాలు, అస్తిత్వ వాదాలుగా వచ్చిన స్త్రీవాద, దళితవాద, మైనారిటీ వాద సిద్ధాంతాల ప్రభావం రచయితలపై ఉంది. అందువల్ల వాటిగురించి విమర్శకునికి అవగాహన ఉండాలని ప్రముఖ విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య చెబుతారు. విమర్శకునికి రాజకీయ, సామాజిక, చారిత్రక అవగాహన ఉండాలి.
కవికి కొంత పిచ్చి ఉండడం వల్లే కవిత్వం రాస్తాడని గ్రీకులు భావించారు. రచయితకు సమాజంలోని కొన్ని విషయాల పట్ల అసంతృప్తి ఉంటుంది. వాటిని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తించి రచనలు చేస్తాడు. ఫ్రాయిడ్‌ దీన్ని ఏమంటాడంటే రచయిత తనకు నచ్చని ప్రపంచం స్థానంలో ఒక కొత్త బంగారులోకాన్ని సృష్టించుకొని తన ఆత్మానందం కోసం రచనలు చేస్తాడన్నారు. బహుశా దీన్ని దృష్టిలో వుంచుకొనే రారా, తిలక్‌ అమృతం కురిసిన రాత్రిని విశ్లేషిస్తూ కవి తనలో తాను ఏకాంత సౌందర్యాన్ని సృష్టించుకున్నాడన్నట్లు బహుశా రాశాడేమోనని మనం భావించాలి. రచయిత తను సృష్టించిన ఆ కొత్తలోకం వాస్తవమని తన రచనాశైలి ద్వారా పాఠకుడిని భ్రమింపచేస్తాడు.
రచనకు సంబంధించిన ప్రేరణ, ఆలోచన రచయిత అంతఃచేతన (సుషుప్తావస్థ) లో జరుగుతాయి. ఫ్రాయిడ్‌ భాషలో ”ఇడ్‌” లో జరుగుతాయి. రచయిత తన మానసిక పరిధిని, ఆత్మన్యూనతా భావాన్ని, సామాజికంగానో, శారీరకంగానో అధిగమించడానికి చేసే ప్రయత్నంగా రచనలు చేస్తాడన్నాడు ”ఆడ్లర్‌”. కార్ల్‌యూంగ్‌ మరింత ముందుకుపోయి రచయితకు వారసత్వమైన నమ్మకాలు, పురాణగాథలు, సామూహిక సుప్తచేతనలో ఉండి అది రచనల్లో ప్రతిఫలిస్తుందన్నాడు.
* * *
(సృజన నేడు,27.12.2020)

Pillaa kumaraswaamy,9490122229

పిళ్ళా కుమారస్వామి,9490122229

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s