‌   

                తొలి తెలుగు పదం కర్నూలు జిల్లాలో లభించడం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మలుపు.కందెనవోలు చరిత్ర తెలుగు సాహిత్య చరిత్రలోనే సువర్ణాక్షరాలుగా లిఖించదగ్గది. దీనికి కారణం లేకపోలేదు. ప్రపంచంలోనే తొలి తెలుగుపదం ‘ అన్ ధిర లోహము ‘ అనగా ఆంధ్రలోకము అనే పదం కర్నూలు జిల్లా కన్నమడకలలో లభించినది. ఇది అత్యంత ప్రాచీన శాసనంగా గుర్తించారు. తొలి తెలుగుపదం ‘ నాగబు ‘ అని నిర్ధారించినప్పటికీ అంతకుముందే ‘ ఆంధ్రలోకము ‘ అనే పదమున్నప్పటికీ సాహిత్యకారులు, చరిత్రకారులు సమాజ క్షేత్రంలోకి తీసుకెళ్ళలేక పోయారు. ఆ పదం కర్నూలు జిల్లాలో లభించడం అరుదైన విషయం. 

            ప్రపంచానికి బౌద్ధ సిద్ధాంతాలను ప్రవచించిన సిద్ధ నాగార్జునుడు, శైవత్వాన్ని బోధించిన ఆదిశంకరులు కర్నూలు జిల్లా శ్రీశైలంలో నివసించడం వల్ల సాహిత్య చరిత్రలో కర్నూలు జిల్లా స్థానం చిరస్మరణీయమైంది.. నన్నయకు ముందు నుండి అనగా 11 వ శతాబ్దానికి పూర్వమే జిల్లాలో సాహిత్య కృషి చేసినట్లు జిల్లాకు చెందిన చారిత్రిక,సాహిత్య పరిశోధకులు వైద్యం వేంకటేశ్వరాచార్యులు తన పరిశోధనా గ్రంథమైన “కర్నూలు జిల్లా కవితరంగిణి” లో పేర్కొన్నారు.

          జాను తెలుగు, వస్తుకవిత అనే పదాలను సృష్టించిన నన్నెచోడుడు  శ్రీశైలనివాసి మల్లికార్జున పండితుడికి తన కుమార సంభవ కావ్యం ఇచ్చాడు. నన్నెచోడుడు కూడా పూర్వం కర్నూలు జిల్లాలో భాగమైన ఒరయూరు వాసి. ఈ ప్రాంతమిప్పుడు ప్రకాశం జిల్లాలో ఉంది. ఒకప్పటి కర్నూలు జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు తాలూకాలను విడదీసి 1972 ఫిబ్రవరి 2 తేదిన ప్రకాశం జిల్లాలో కలిపినారు. ఈ ప్రాంతం కంబం-అర్ధవీడు దారిలో కంబానికి 16 కి.మీ. దూరంలోని మొహద్దీన్ పురం దగ్గర కొండ సమీపాన ఉన్నట్టు కావ్యంలో పేర్కొన్నారు. నన్నెచోడుడు పాలించిన పాకనాటికి ఒరయూరు రాజధాని.

            శ్రీకృష్ణ దేవరాయల అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన పింగళి సూరన నివాస స్థానం కర్నూలు జిల్లాలోని కానాల. ఆకువీడు పెదవేంకట్రాది, నంద్యాల కృష్ణమరాజుల ఆశ్రయంలో సూరన కావ్యాలు రచించారు. తొలి తెలుగు ద్వ్యర్థి కావ్యంగా ప్రసిద్ధికెక్కిన రాఘవపాండ వీయం సృష్టికర్త సూరన. ఒకే పద్యంలో రామాయణ, భారత కథలు వచ్చేలా రచించిన ఈ కావ్యాన్ని విరుపాక్షేశ్వరుడికి అంకితం చేశాడు. భాషా శ్లేష,శబ్ధశ్లేష, అర్ధశ్లేషలే కాకుండా అర్థాన్వయశ్లేష, శబ్దాన్వయ శ్లేషలను ప్రయోగించాడు. ప్రబంధ యుగంలో విప్లవాత్మకమైన అపూర్వసృష్టి కళా పూర్ణో దయం, ఇది నాటకీయ శైలిని కల్గిన గ్రంథం. ఎనిమిది అశ్వాసాలు గల ఈ ప్రబంధాన్ని నంద్యాల కృష్ణమరాజుకు అంకితం చేశాడు. గిరిజా కళ్యాణం,గరుడ పురాణం, ప్రభావతి ప్రద్యుమ్నం అనే రచనలు చేశాడు. 

             ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి క్రీ.శ. 1601-1671 మద్యకాలంలో జీవించారు. 47 గ్రంథాలను రచించిన ఈయన పూర్వనామం ‘ వేంకటేశ ‘. స్వస్థలం తమిళనాడులోని కంచీపురం అయినప్పటికీ స్థిర నివాసం జిల్లాలోని మంత్రాలయమే. ఈయన రచనలు పరిమళ, చంద్రికా ప్రకాశ, న్యాయముక్తావళి, దశోపనిషత్ ఖండార్థ, భావదీపిక, దశ ప్రకరణ టీకి, తంత్ర దీపికా, అణుభాస్య, ఈశావాస్య వివృద్ధి, భేద బోధిని, పాదావళీల్ఫిణం, ప్రాతః సంకల్పగద్య, పురుష సహీటీక, ఆంధ్రణి సూక్త, మంత్రార్థ సంగ్రహ,భాజసంగ్రహ రామకృష్ణ, చరిత్ర మంజరి తదితర రచనలు చేశారు.

       16, 17 వ శతాబ్దాల మధ్యకాలంలో   సాహిత్య చరిత్రలో ఇద్దరు సంఘ సంస్కర్తలు  కనిపిస్తారు. ఒకరు ప్రజాకవి వేమన, రెండోవారు పోతులూరి వీరబ్రహేంద్రస్వామి. పోతూలూరి వీరబ్రహేంద్ర స్వామి బనగానపల్లె వాసి. యాగంటి క్షేత్రంలో నివసించి, కాల జ్ఞానతత్త్వాలు రచించాడు. దాదాపు

23 సంవత్సరాలు జీవించి కాలజ్ఞానాన్ని ఈ ప్రాంతంలోనే రాశారు. అనంతరం కందిమల్లయ పల్లెకి వెళ్ళి సమాధి అయ్యారు.

              తొలి తెలుగు నవల పుట్టింది కర్నూలు జిల్లాలోనే.

కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకల గూడూరుకు చెందిన వేంకటలక్షమ్మ, తెన్నరంగయ్యల కుమారుడు నరహరి గోపాల కృష్ణ మశెట్టి గొప్పకవి, పండితుడు, సాహితీవేత్త.

ఈయన కాలం 1833-1888. మద్రాసులో జన్మించినప్పటికీ జన్మప్రాంతం పై మమకారంతో డిప్యూటి కలెక్టర్ గా ఈ ప్రాంతానికి వచ్చాడు. కర్నూలు జిల్లా చరిత్రను ఆంగ్లంలోను, తెలుగులోను రచించిన మొదటి వ్యక్తి. అంతేకాక ఇప్పటివరకు తెలుగు సాహిత్య చరిత్రలో తొలి నవల కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన రాజశేఖర చరిత్ర అనుకుంటున్నప్పటికీ, ఈయన రాసిన రంగరాజు చరిత్ర (సోనాబాయి చరిత్ర) మొదటి నవల. దీనికి సాహిత్య చరిత్రకారులు తగు ప్రచారం

కల్పించలేదు .. డిస్ట్రిక్ట్ మాన్యువల్ రచించిన తొలి భారతీయుడు కూడా ఈయనే. A manual of

Kurnool District in the Madras presidency అనే పేరుతో కుంఫీనీ ప్రభుత్వం ఈ గ్రంథాన్ని ప్రచురించింది.

ఈయన కుంఫీని ప్రభుత్వంలో ప్యాపిలి డిప్యూటి కలెక్టర్ గా పనిచేశారు. ప్రసిద్ధ వ్యాకరణ కర్త పరవస్తు చిన్నయసూరి రచించిన Manual of Hindu Law తెలుగు అనువాదానికి చిన్నయసూరి శెట్టిగారి సహాయం పొందాడంటే ఈయన రచనా పటిమ అర్థం చేసుకోవచ్చు.

           కర్నూలులోని భగీరథిబాయి, వేంకటరావులకు జన్మించిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయ పితామహుడుగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించు కున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈయన గొప్ప దేశభక్తుడు, రాజకీయవేత్త కవి రచయిత. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శాసన సభ్యునిగా, ఆంధ్రరాష్ట్ర సాధనకు కృషి చేశారు. ఈయన అబ్రహంలింకను, ప్రచ్ఛన్న పాండవం, ప్రపంచ చరిత్ర, ప్రభుత్వం, శ్రీరామ చరిత్రం, హైందవ స్వరాజ్యం, నీతి ధర్మం, మూర్ఖరాజు, ఓటు, కౌన్సిళ్ళ చరిత్ర, సత్య ప్రియత్వము-గాంధీ మహాత్ముడు, విద్యలోని విలువ, మనదేశం, మన శరీరం, వయోజన విద్య,ఆంధ్ర జాతీయ వాచకము, పౌర విద్య, సభలు సమావేశాలు, చీనా-జపాను ప్రళయం రచనలు చేశారు. 

            అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, కేంద్రమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య రాజకీయవేత్త ఒక్కటే కాదు, సాహితీవేత్త కూడా, కర్నూలు సమీపంలోని పెద్దపాడు గ్రామానికి చెందిన సుంకలమ్మ, మునెయ్యలకు 1921 లో జన్మించిన దామోదరం సంజీవయ్య కీర్తనలు, పద్యాలు రచించారు. భీష్మ జననం అనే హరికథను రచించారు.ఆంగ్లభాషలో ఆర్థికశాస్త్రవ్యాసాలు రాశారు.

___కెంగార మోహన్ kengara mohan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s