సుభాషిణి  పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, కర్నూలులో ఉద్యోగబాధ్యతలు నిర్వ హిస్తున్నారు.  ఈమె రాసిన దాదాపు నలబైఐదు కథలు రెండు సంకలనాలుగా వచ్చాయి. సుభాషిణి కథలలో ప్రధానంగా వస్తువైవిధ్యం మూడు ధోరణులలో కనబడుతుంది. మొదటి  సంపుటి “మర్మమెల్లా గ్రహించితిని తల్లీ” లోని కథలు కార్పొరేట్ విద్యావ్యవస్థలో చోటుచేసుకొన్న సంసృతిని, దాని పర్యావసానాలు, ప్రతిఫలనాల గురించి చర్చించిన కథలు. ముఖ్యంగా కార్పొరేట్ పెట్టుబడి విద్యవ్యవస్థను ఎలా ప్రభావితం చేయగలిగిందో, తన ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవ చైతన్యం నుంచి రచయిత్రి పట్టుకోగలిగింది. అర్థిక సరళీకృత సంస్కరణల ప్రభావాలను, స్త్రీలపై పడుతున్న అదనపు భారాలను, ఆక్రమంలో ఎదురవుతున్న సంఘర్షణలను, వాటి ప్రతిఫలనాలను స్త్రీవాదదృక్పథంతో సృజించిన రెండవ సంపుటి “అమూల్య”. తెలంగాణా ప్రాంతంలో  పెల్లుబికిన ప్రాంతీయచైతన్యం ప్రత్యేక రాష్ట్రానికి దారితీయడంతో, ఆ ప్రేరణతో “గాయాలు” ’దృతరాష్ట్ర కౌగిలి’ ’రెండు సందర్బాలు’ కథలను రాశారు. ఈమెకథల్లో ప్రాంతీయ, పితృస్వామిక రాజకీయాలను ప్రశ్నించటమే కాక వాటిని సాధించే క్రమంలో పాఠకులకు  ప్రాంతీయ, చారిత్రక దృష్టికోణాన్ని అందిస్తుంది.

 సామాజిక అభివృద్ధిక్రమంలో రచయిత నిర్వర్తించేపాత్ర ప్రతి చారిత్రక సందర్భంలోను చర్చనీయాంశమౌతూ, ఒక నిర్దిష్ట సమాధానం దగ్గర ఆగటం సాహిత్య చరిత్రను గమనించినప్పుడు తెలిసే సాధారణ సత్యం. ఈ చారిత్రకక్రమంలో రచయితలు ఎలాంటి సంఘటనలకు స్పందిస్తున్నారు.  ఏవర్గాలవైపు రచయితలున్నారనేది చాలా స్పష్టంగా తెలు స్తుంది.  కానీ ఆయా వర్గాలవైపు నిలబడ్డ రచయితలు నిర్వహించే పాత్ర, వాళ్ళ సాహిత్యఆవరణ ఎప్పుడూ ఒకేరకంగా వుండవు. మారుతున్న జీవిత వాస్తవికతకు అనుగుణంగా రచయితల సాహిత్య వస్తువు, వ్యక్తీకరణ పద్ధతులు మారటం అత్యవసరం.అలామారని రచయిత కాల క్ర మంలో అదృశ్యమౌతాడు.  ఇది ఏ కాల సాహిత్యానికైనా, సమాజానికైనా వర్తిస్తుంది.  స్థూలంగా చెప్పాలంటే, సామాజిక స్థితి రచయిత సాహిత్య ఆవరణను నిర్దేశిస్తుంది.  ప్రతి చారిత్రక సందర్భాన్ని, ఆ సందర్భంలో అన్ని వైరుధ్యాల్ని గుర్తించి ఆ క్రమంలో రచన చేసే రచయితే చారిత్రకస్పృహవున్న రచయిత. ఈస్పృహతోనే సుభాషిణి దశాబ్దాలవారిగా కొనసాగుతున్న ప్రాంతీయవివక్ష రూపాలను మూడు కథలుగా మలిచారు.

రాయలసీమ పట్ల, ఆ ప్రాంత  సాంస్కృతిక, రాజకీయాంశాల పట్లవున్న చిన్నచూపు  కారణంగా రాయలసీమ వాసులు చారిత్రకంగా రాజకీయంగా వెనుకబడుతున్న  క్రమాన్ని రచయిత్రి “రెండు సంధర్భాలు”కథలో చర్చించారు. ఇందులో కృష్ణా – పెన్నార్ ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రాంతం వాళ్ళు చేసిన విద్రోహాలను చర్చించి, ఎండగట్టారు. అంతేకాదు ఆ విద్రోహాన్ని ప్రశ్నిస్తూ… వర్తమాన రాజకీయ సంధర్భాన్ని అనుసంధానంచేయటంతో వస్త్వైక్యాన్ని సాధించగలిగారు. కొత్తతరం పాఠకులలో చారిత్రక స్పృహను ప్రేరేపించే ప్రయత్నం “రెండు సంధర్భాలు”, “ధృతరాష్టృని కౌగిలి”   కథల్లో  కనబడుతుంది.

రాయలసీమ వాసులుగా తాము పొందుతున్న అవమానాలను “గాయాలు” కథలోని కథకురాలు, ఆమె కూతురు పాత్రల సంభాషణల్లో గమనించగలం.  తినే తిండి, నీళ్ళ వసతి, మాండలిక భాష (యాస, మాటతీరు), రైలు-బస్సులాంటి ప్రయాణ సౌకర్యాలు, కరెంటుకోత, స్థానికంగా పెరిగే చెట్ల రకాలు, జనసాంధ్రత, మారుమూలకు విసిరేసినట్లున్న గ్రామాల భౌగోళికత, వాటి వాతావరణం ఇలా వివక్షకు గురవుతున్న అన్ని అంశాలను ’గాయాలు’ కథ(2013)  గుర్తుచేస్తుంది. ఈవివక్షకు ప్రధానకారణం ప్రాంతాలఅభివృద్ధిలో జరిగిన అసమానతల పర్యవసానం. రాయలసీమ పట్ల జరిగిన విద్రోహచర్యలు, ’చరిత్రలో నమోదు కాకపోవటమేనని కథకురాలిపాత్ర వ్యాఖ్యానిస్తుంది’. ప్రాంతీయ ఉద్యమాలు వచ్చిన తరువాత అన్ని ప్రాంతాల వారు తమకు జరిగిన అన్యాయాలను గుర్తించటమే కాక తమ చరిత్రను పునర్మూల్యాంకనంచేసి, పునర్నిర్మాణదృష్టితో ఆలోచిస్తున్నారు. ఆచైతన్యంతోనే….  

“మనమంతా ఒక్కటే అని మేము ఎలా అనుకోగలం! ఇక మావాళ్ళు కూడా మీ వెనుక తోక వూపుకుంటూ తిరిగే వాళ్ళుగా వుండకపోవచ్చు! మీ సహవాసం యిక మాకు వద్దు’ అన్నమాట వినడానికి మీరు సిద్ధంగా వుండండి.  ఆ టైమ్ కూడా బహూశా ఎంతో దూరంలో లేదు” (పు.౧౯. “రెండు సంధర్భాలు”, గోదావరి త్రైమాసిక పత్రిక వరంగల్ జూలై-డిశంబర్ 2016.) అంటూ కథకురాలిపాత్ర అల్టిమేటం జారీ చేస్తుంది. ఈ పునరాలోచన  పొరుగు ప్రాంతాల వారివలన కలిగిన ప్రేరణ. ఆస్పూర్తి వల్లే తాము కూడా వివక్ష రాజకీయాలను ఎదుర్కో గలమన్న కథకురాలి ధీమా రాయలసీమ వాసుల ఆత్మగౌరవ  ప్రకటనగా వ్యక్తమవుతుంది.

కృష్ణా-పెన్నార్ ఫ్రాజెక్ట్ ను సిద్దేశ్వరం దగ్గర కట్టాలన్న ప్రతిపాదనను పునరుటంకిస్తూ రాయలసీమ ప్రాంతంలో ఊపిరి పోసుకుంటున్న వర్థమాన సంఘర్షణలను సుభాషిణి “రెండు సంధర్భాలు” కథగా మలిచారు. గతంలో కృష్ణా-పెన్నార్ ఫ్రాజెక్ట్ నిర్మాణానికి తిలోదకాలిచ్చిన తెలుగు రాష్ట్రాలను పాలించిన నాయకులకంటే, దోచుకోవాలనే ఉద్దేశంతోనే దేశంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులే రాయలసీమ కరువును ఎక్కువగా పట్టించుకున్నారన్న ఒక కొత్త ప్రతిపాదన రచయిత్రి  ఈ కథలో పాఠకులముందుంచింది.

 “కళ్ళముందే నీళ్ళుంటాయి. మనవే కదా అనిపిస్తుంది. కానీ ఏదీ మనది కాదు అని అర్థమైతే ఆబాధ అనుభవించేవాడికే తెలుస్తుంది. త్యాగం వీళ్ళది. ఫలితం వాళ్ళది”.( పు. “ధృతరాష్టృని కౌగిలి”, డి.టి.ఎఫ్. సావనీర్ 2015.)

రాయలసీమ నుండి చాలామంది మంత్రులు ముఖ్యమంత్రులయ్యారు.  రాయలసీమకు దక్కాల్సిన న్యాయమైన వాటాలు దక్కక పోవడానికి రాజకీయాలకు దూరంగా వున్నవారికి అర్థం కావు. తమ కళ్ళముందు ప్రవహించేనీళ్ళు  తమకు అందకుండా ఇరుగు ప్రాంతాలకు పొరుగు రాష్ట్రాలకు అందుతున్న క్రమాన్ని తన పాఠకులకు అర్థంచేయించే క్రమంలో కోస్తాంధ్ర నీటి రాజకీయాల గుట్టు రట్టుచేసిన కథ “దృతరాష్టృని కౌగిలి”. రాష్ట్ర నాయకులు నీళ్ళ కోసం ఆందోళనలుచేసే స్థానిక నాయకులనోళ్ళు ఎలామూయిస్తారో చాలా వివరంగాఈకథ చర్చించింది.

 “రెండు సంధర్భాలు” కథలో రాయలసీమలో దప్పికకు ఓర్చుకొని వుండాలని చెప్పే సంధర్భంలోనూ, అలాగే ’ధృతరాష్టృని కౌగిలి’ కథలో “దువ్వినంతకాలం దువ్వినారు….ఇంగ దువ్విచ్చుకోడానికి ఈడ ఎవ్వరూ సిద్ధంగాలేరు” (పు. “ధృతరాష్టృని కౌగిలి”,డి.టి.ఎఫ్. సావనీర్ 2015.) అన్న జార్జ్ మాటల్లోని ధర్మాగ్రహం ప్రాంతీయ ఉద్యమరూపం తీసుకోబోతున్నదన్న సూచనే “రెండు సంధర్భాలు” కథా సంధర్భం.

కర్నూలు జిల్లాలో శ్రీశైలం డ్యాం ఆయకట్టు కోసం భూములిచ్చిన రైతులు భూములు పోగొట్టుకొని, తమ అనుబంధాలు, ఆత్మీయతలు పెనవేసుకొన్న గ్రామాలను వదలి, చెట్టుకొకరు పుట్టకొకరు చెల్లాచెదురైనారు. ఆనేల సొంతదారులైన వీళ్ళు కోస్తాంధ్ర భూముల నీటి పరిరక్షకులుగా మాత్రమే మిగలడానికి, రాయలసీమ ప్రాంతం నుండి రాజకీయ నాయకులు మంత్రులు, ముఖ్యమంత్రులవుతున్న క్రమ పరిణామానికి గల లంకెను ఈ కథలో రచయిత్రి చిత్రించారు. ఈరాజకీయ విద్రోహచర్యలకు రాయలసీమ ప్రాంతవాసులు తగిన గుణపాఠం నేర్పగలరన్న విశ్వాస తీర్మానం ఈ క్రింది వాక్యాలలో గమనించవచ్చు.

“ఏం జేసినా ఈ అలుగును యిడ్సిపెట్టగూడదు మేడం కట్టితీరాల్సిందే…..ఈకొండల ఎత్తువరకు ఎప్పుడూ నీళ్లు నిలబడినాయంటే ….మన భూములకు కూడా నీళ్ళు పార్తాయి…” అంటూ యువకుడు ముందుకు అడుగేస్తాడు. యిద్దో…రాళ్ళు కొల్లలకు పడిండాయి. మనిషికో నాలుగురాళ్ళు ఏట్లోకిదొర్లిచ్చినామంటే అలుగు కట్టేసినట్లే…! ఎవడో అడ్డు వచ్చేటోడు రమ్మను సూద్దాం…” (పు. “ధృతరాష్టృని కౌగిలి”,డి.టి.ఎఫ్. సావనీర్ 2015.)అంటూ అరవై సంవత్సరాలు పైబడినవ్యక్తి పంచను మోకాళ్ళ పైకి ఎత్తికట్టి మట్టిలో కూరుకుపోయిన బండరాయిని లేపడానికి ప్రయత్నించడం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా తోడవ్వాల్సిన  ఆనివార్యతను ఈకథ చిత్రించింది.

నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఇబ్బంది వుండకూడదనే ఉద్దేశ్యంతోనే కర్నూలు జిల్లాలో  శ్రీశైలం డ్యాం నిర్మాణం జరిగిందని, సాగర్ నిర్మాణోద్దేశాన్ని ఈకథలో సుభాషిణి బట్ట బయలు చేసింది. కోస్తాంధ్ర ప్రయోజనాల కోసం అంతకుముందే కట్టబడిన ప్రకాశం బారేజ్ వుండగా నాగార్జున సాగర్ నీళ్ళు కూడా వాళ్ళకే ఎక్కువ శాతం ఉపయోగించడాన్ని రాయలసీమ ప్రాంత రాజకీయనాయకులు చూస్తూ “ఎలా వూరుకున్నారో నాకయితే అర్థమే కాడంల్యా……నాకు మటుకు అనుకుంటే కడుపు కాలిపోతాది”(పు.“ధృతరాష్టృనికౌగిలి”,డి.టి.ఎఫ్.సావనీర్2015.)అని ఆక్రోశించే రాయసీమ వ్యధార్థజీవుల హృదయఘోషలో సుభాషిణి కంఠస్వరం మమేకమై ప్రతిధ్వనిస్తుంది.

యాభై సంవత్సరాల మునుపే సిద్ధేశ్వరం దగ్గర అలుగు నిర్మాణం జరిగివుంటే, ప్రకాశం బ్యారేజ్ ద్వారా సాగుబడిలో కొచ్చిన భూములు లాగే రాయలసీమ ప్రాంతంలోని భూములు కూడా పచ్చని పంటపొలాలతో కళకళ లాడేవన్నఆలోచనకే సీమవాసుల గుండెలో రెపరెప లాడే ఆశలతీరును కూడా ఈకథాంశం నిక్షిప్తం చేసింది.

 సుభాషిణి సాగునీటి రాజకీయాలతోపాటు, రాయలసీమ కరువు రాజకీయాన్ని నడుపుతున్న సామాజిక శక్తులను సైతం కథావస్తువు చేసింది. తెలుగు కథా సాహిత్యంలో ఇంతకు ముందు కరువు ఇతివృత్తంతో వచ్చిన కరువు కథల కంటే “కరువెవరికి”కథ భిన్నమైనది.  కరువు ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో చాలా మంది తమ కథల్లో చెప్పారు.  అయితే అసలు కరువుకు గురవుతున్న వారెవరు? భౌగోళికంగా ఒకే ప్రాంతంలో జీవిస్తున్న వారందరిపైనా కరువు ఒకేరకమైన ప్రభావాన్ని చూపుతుందా? ఒకే రకమైన ఫలితాలనిస్తుందా? అన్న ప్రశ్నలన్నింటికి ఈ కథలో సమాధానాలు దొరుకుతాయి.  ఇప్పటివరకు వచ్చిన కరువు ఇత్తివృత్తంగాగల కథలలో పురుష పాత్రలే ప్రధాన భూమికను పోషించాయి.  కానీ ఈకథ మొత్తం స్త్రీపాత్రల ద్వారానే నడుస్తుంది.  పురుషపాత్రలు నామమాత్రంగా వీళ్ళ సంభాషణల్లో అప్పు డపుడు తొంగి చూస్తుంటాయి, కానీ భాగస్వామ్యం వహించవు. ఇది పూర్తిగా మూడు తరగతుల స్త్రీల మనోభావాలను ప్రతిపలించిన కథ.

          ఈకథలో ప్రధాన పాత్రధారి ఈరమ్మ.  రాయలసీమ గ్రామాలకు కరువు ఎప్పడో ఒకసారి వచ్చిపోయే చుట్టంకాదు, వాళ్ళతోపాటు సహజీవనం చేస్తుంటుందన్న వ్యాఖ్యానానికి నిదర్శనం గా రూపించిన పాత్ర. ఆమె భర్త రాముడు అంకిరెడ్డి దగ్గర పాలేరుగా పనిచేసి, పక్షవాతంతో బాధ పడుతూ మంచంలో వుంటాడు.కరువు కారణంగా ఈరమ్మ కొడుకు, కోడలు పనులకోసం పట్నం చేరతారు.  వీళ్ళ పిల్లలిద్దరినీ ఈరమ్మ కూలి చేసి అతి కష్టంపైన పోషిస్తుంటుంది.  రెండవస్త్రీ చంద్రమ్మ అదే వూర్లో కేవలం వ్య్వసాయం మీదనే ఆధారపడి జీవించే మధ్యతరగతి సన్నకారు రైతు కుటుంబం ఈమెది.  చందమ్మ కూతురు జయమ్మకు పెళ్ళి కుదురుతుంది.  కట్నంకోసం భూములు అమ్ముదామంటే, కొనేవాళ్ళులేక సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో,  కూతురు జయమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది.మూడవ స్త్రీ రామసుబ్బమ్మ ఆఊరి భూస్వామి అంకిరెడ్డి భార్య. వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదని పట్నంలో కాంట్రాక్టులు, ఆ ఊర్లోనే కరువు పనుల కాంట్రాక్టులు చేస్తుంటాడు.

రాయలసీమ నేపథ్యంలో ఆర్థికస్థాయీ బేధాలుగల ఈమూడు కుటుంబాలలో కరువు  ఏ కుటుంబంపైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది ప్రధాన కథాంశం. ఈకథలో రెండు మూడు సంధర్భాలల్లో యాదృచ్చికంగా కరువు ప్రభావిత ప్రాంతాలలో కూడా కులం-కట్నం సమస్యలు మానవ సంబంధాలను ఎలా విచ్చిన్నంచేస్తాయో ఈకథలో అంతర్లీనంగా రచయిత్రి చర్చించారు. రామసుబ్బమ్మ ఆధిపత్య కులానికిచెందిన భూస్వామి భార్య. చంద్రమ్మ వెనుకబడినకులానికి చెందిన మధ్య తర గతి సన్నకారు రైతు భార్య, ఈరమ్మ దళిత వ్యవసాయకూలీ భార్య. సామాన్యంగా స్త్రీవాద రచయిత్రులు ఆర్థికాంశాలను సృజించడంలో బాగా వెనుకబడ్డారన్న వ్యాఖ్యానాలకు ఈకథ ఒక సమాధానం. ఆర్థిక దృష్టికోణంతో నడపడం కూడా ఈ కథ ప్రత్యేకత. ఈమె కథలు ఒక  స్త్రీవాదమో, ఒక ప్రాంతీయ వాదమో, ఒక మార్క్సిజమో కాక ఈ సిద్దాంతాల చైతన్య సమాహార రూపంగా దర్శనమిస్తాయి. సారాంశంలో  పాఠకుడిని చర్చలోకి ఆహ్వానం పలుకుతాయి. చర్చ స్పష్టతకు దారి.

రామసుబ్బమ్మ కొడుకు కూతురు గురించి ఈరమ్మ కుశలమడిగిన సంధర్భంలో ఆమె వాళ్ళ చదువులు, కోచింగుల గురించి చెప్తూ ఇలా అంటుంది.

          “కాలేజీల్లో సేర్చేదానికి……మీ మాదిగోళ్ళకు అయితే ఒక్క పైసా కట్టకున్నా కూడా వాళ్ళే పిల్చి కాలేజీల్లో సేర్పించుకుంటారంట…..అందులో నిరుడు, ఈతూరి పంటలు లేవని గుత్త లెక్కలు కూడా యియ్యలా…..ఎట్లనో గట్ట కట్తాములే అనుకుంటే కాలేజీల్లో సేరినాక మోటరు సైకిల్ కూడా కొనియ్యాలంట… లెక్కలన్నీ వీనికే అయిపోతుండాయి. … ఈతూరి గుత్త లెక్క వచ్చింటే సునీతకు రాళ్ళగాజులు, లాంగుసైను సేపియ్యాలను కొంటి…. బంగారు కూడా సానా పిరమూ అయిపాయా… ఇంక ఏం కొంటామో ఏమో…”అంటుంది.(పుట 59-60 కరువెవరికి” కె.సుభాషిణి, స్పూర్తి పబ్లికేషన్స్ )

          రామసుబ్బమ్మ మాటల్లో పాఠకులకు రెండు విషయాలు అర్థమవుతాయి. 

ఒకటి- షెడ్యూలు కులాలు తెగలవారికిగల రిజర్వేషన్ల వలన వాళ్ళు ఉచితంగా చదువుకోగల అవకాశం వుండటం, ఓ.సి. కులాల్లోని పిల్లలు చదువుకోసం డొనేషన్లు కట్టాల్సిరావడం.

 రెండు –  కరువు రావడంతో గుత్త డబ్బులు చేతికి రాకపోవడం. ఆడబ్బుతో బంగారు చైను, మోటారు సైకిలు లాంటి విలాస సౌకర్యాలు పొందలేక పోవడం.  భూస్వామి అంకిరెడ్డి – రామసుబ్బమ్మ కుటుంబానికి వచ్చిన కష్టమిది.

 భూస్వామి అంకిరెడ్డి కుటుంబం కాంట్రాక్టులన్నీ చేజిక్కుంచుకొని, నగదులో నడుస్తున్న కుటుంబమైనా, రిజర్వేషన్లు కూడా షెడ్యులు కులాల వారికే ఇస్తున్నారు అన్న అసూయ, ఉక్రోషం రామసుబ్బమ్మ వెళ్ళగక్కడంలో ఆధిపత్య కులాలకు దళితుల రిజర్వేషన్ పట్ల గల వ్యతిరేకతలో కులాధిపత్య అభిజాత్యం వ్యక్తమౌతూంది. స్వార్థంతో పేదవాళ్ళ కష్టాన్ని దోచు కొని అందలాలు ఎక్కి అనుభవిస్తున్నా ఇంకా అనుభవించ లేకపోతున్నామన్న ఉక్రోషమే రామసుబ్బమ్మ మాటల్లో కనబడుతుంది.  శ్రమవిభజనలో సంతులిత న్యాయం జరక్కపోవడం వలనే ఈరమ్మ లాంటి నిరుపేద దళిత వ్యవసాయ కూలీల బ్రతుకులు తినడానికి తిండి, తాగడనికి మజ్జిగ నీళ్ళ కోసం వాళ్ళపై ఆధారపడల్సి వస్తుంది. ఆధిపత్యకులాలు తమ ఆధికార ఛత్రం కింద బతుకుతూ, తమకు ఊడిగం చేస్తున్న దళిత కులాల పట్ల ఆధిపత్య కుల అభిజా త్యాన్ని కూడా ఈ కథ చిత్రించింది.

          కుల, వర్గ ఆధిపత్యాల మూలంగా  అణచివేతకు గురవుతున్న తమ బ్రతుకులు ఇన్ని కష్టాల్లో ఎందుకు కూరుకుపోతున్నాయో ఈరమ్మకు కారణాలు తెలుసు.  రామసుబ్బమ్మ తన కులం పేరెత్తి మాట్లాడిన సందర్భంలో ఆమె తన ప్రత్యక్ష అనుభవాల నుండి పొందిన తార్కికఙ్ఞానం ఆలోచనల రూపంలో ఇలా వ్యక్తమౌతుంది. 

“ఏంది ఆయమ్మ సెప్పిండేది…. మాదిగోళ్ళకు ఊరకనే పిల్సి సదువు సెప్తారా… మరి… అట్టయితే …. ఈ ఊర్లో ఒక్క మాదిగోనికి కూడా సదువు రాలేదే … కనీసం సెన్నంపల్లిలో వుండే పెద్ద బడికి పోలేదే….. యింగ ఇంజినీర్లు, డాకటర్లు అయ్యేమాటేనా….. అయినా ఈయమ్మ ఏంది మామాదిగోళ్ళతో పోల్చు కుంటుంది…. వాళ్ళు యాడ…..మేమేమన్నా తిండి, లేక్కలు ఎగిరేసు కుంటాండామా…..ఏంమాట్లాడతాది….వూర్లో పనులు ల్యాక బతకడానికి ఊరిడిసి పోయేటోళ్ళమే మేము.  వాళ్ళు పోతాండారా….. వాళ్ళకేం ఖర్మ పట్టింది …. అంటూ ఈరమ్మ భగ్గుమని మనసులోనే మండిపడుతుంది.  కారణాలు తెలిసీ, వాళ్ళ ముందు మట్లాడలేక పోతున్న అసహాయత, అవమానాలే ఈరమ్మను మరింత పదునుగా ఆలోచించేట్లు చేసింది.  ఆక్రమంలోనే కరువు బియ్యం ఇస్తున్నామన్న ప్రభుత్వ హామీ పథకాల్లోని డొల్లతనం కూడా ఆమె ఆలోచనల నుండి తప్పుకోలేక పోయింది.

 పనికి ఆహారపథకం గ్రామీణ పేదల వలసలను అదుపు చేయడానికిగాను ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకం. ఆ పథకంలోని లోపాల్ని, లొసుగుల్నిఈకథలో సుభాషిణీ బట్టబయలు చేశారు.  పేదల కోసం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలు ఏ వర్గంవారికి, ఏ కులం వారికి ఉపయోగపడుతున్నాయన్న మౌళిక ప్రశ్నలకు, సంతలో ఎదురపడిన ఆదెమ్మ- ఈరమ్మల మధ్య జరిగిన జరిగిన సంభాషణలే సమాధానంగా నిలుస్తాయి.

వలస కుటుంబాలు పనికోసం పట్నానికి పోవడంతో పడిన కష్ఠాలను తెలియజేస్తాయి.  అంతేకాకుండా “పనికి ఆహారపథకం” పేరుతో కరువు పనుల పని తీరులో వున్న లోటుపాట్లు కూడా వీళ్ళ మాటల్లో ఇలా అర్థమవుతాయి.

          “అయితే కూలి యియ్యకుండా బియ్యం యిత్తే …. కూర నార ఏమి పెట్టి కొనాలా…. రోగాలు రొచ్చులు వస్తే ఏం సెయ్యాల ఆపని సేయిచ్చుకొనే నాకొడుకులందురు వుత్త బువ్వదిని బతుకుతుండారేమో.  మాఊరి అంకిరెడ్డి కూడా ఈనడమన యిట్టాంటి కాంటాకుటు పనులు సేపిత్తాన్నాడు గావల్ల…. యింటి నిండా బేర్సి పెట్టినారు బియ్యం మూటలన్ని.వాయన కయితే… రోజు కోడిగుడ్లు, వారానికి రెండు మూడు తూర్లు సియ్యల కూరాకు వుండాల….”  అంటూ తన ఆక్రోశాన్ని బయట పెడుతుంది..  అంతేకాకుండా “పనికి ఆహారపథకం” పేరుతో కరువు పనుల పని తీరులో వున్న లోటుపాట్లు కూడా వీళ్ళ మాటల్లో  అర్థమవుతాయి.అధిపత్య, దళిత వర్గాల మధ్య గల హెచ్చుతగ్గుల సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని రచయిత్రి చాలా జాగ్రత్తగా ఈ కథలో విశదపరిచే ప్రయత్నం చేశారు.

          ఈరమ్మ మాటల్లో ఎంత వాస్తవం ఉన్నప్పటికీ భూస్వామి భ్యార్య రామసుబ్బమ్మ మొఖంపైన మాట్లాడే ధ్తెర్యం ఈరమ్మకే కాదు రాయలసీమలోని ఏ దళిత స్త్రీకి లేదు.  రాయలసీమలో తెలంగాణా, కోస్తాలో ఉన్నంతగా కుల సమస్యలేదు. అని మాట్లాడే వారికి ఈ కథ ఓ చెంపదెబ్బ.  “మాట్లాడలేకపోవటం” కంటే అణచివేత రూపం ఏముంటుంది. సమాజంలో అన్ని రకాలుగా దోపిడీకి గురవుతూ, కళ్ళముందే కఠిన వాస్తవాలు సాక్షాత్కరిస్తుంటే, పెదవి విప్పి ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెనుదిరగటంతో వుడికి పోతున్న మనసును శాంతంగా వుంచడానికి  దళితస్త్రీల ఎన్ని నరాలు చిట్లిపోయాయో చెప్పడం కంటే, ఆ అపనిందల్ని, అవమానాల్ని భరించినపుడే, అందులోని హింస అర్థమవుతుంది.

ఈరమ్మ కుటుంబం తిండిగింజలకు, ఆరోగ్యానికి, చదువుకు దూరమై అలమటిస్తూ వుంటే, దలితులే బాగుపడుతున్నారని ఉక్రోషపడిన అంకిరెడ్డి-రామసుబ్బమ్మ వర్గీయులు దళితులపై పెత్తనాన్ని, ఆధిపత్యకుల సంస్కారాన్ని పూర్తిగా వదిలించుకుంటే తప్ప, తమ సంపదకు, భోగాలకు కారణమైన పేదల శ్రమే వాళ్ళకు అదునపు ఆదాయంగా మారుతుందన్న వాస్తవం తెలుస్తుంది. కుల, వర్గ ప్రాతినిధ్య స్త్రీలుగా రామసుబ్బమ్మ, చంద్రమ్మ  మనగలిగినంత కాలం స్త్రీలమధ్య  కుల, వర్గ వైరుధ్యాలు అంతంకావు.

ఈరమ్మ పాత్రను సుభాషిణి చాలా చాకచక్యంగా మలిచారు.  చాలా చైతన్యవంతమైన పాత్ర ఇది.  కరువు పనులు  అయిపోతున్నా అంకిరెడ్డి ఇంట్లో బియ్యం బస్తాలు అంత ఎత్తున  పేరుకుపోవడానికి, తనకొడుకు పనులుదొరక్క తిండిగింజలకు కోసంపడే అవస్థకు గల సంబంధం ఈరమ్మకు తెలుసుకోగలిగింది. దళిత వ్యవసాయ కూలీ ఆదెమ్మ పాత్రద్వారా ఈరమ్మ తన కుటుంబం పనికోసం పడుతున్నకష్టాలను తెలుసుకుంటుంది.  ఇన్ని బియ్యం మూటలు తమ గ్రామంలో పడివుంటే తన కుటుంబం పట్నానికి వలసెందుకు పోవాలన్న తిరుగుబాటు  ఈరమ్మలో కలుగుతుంది.  అందుకే, “యిన్ని బియ్యం నూకలు సంపాయించుకోలేక సావాల్నా…. ఆడేమో మూటలు మూటలు మూల్గుతుండాయి …… అవి మాయట్టాటోళ్ళకు అందేదెట్ల…” అంటూ ఆలోచిస్తుంది. అంకిరెడ్డి యింట్లో బియ్యం బస్తాలు ఎందుకు మేటబడ్డాయో, అక్కడికెలావచ్చిచేరయో తెలిసినపుడు,”ఆ బస్తాలకు కాళ్ళెలా రప్పించాలో’ అని ఈరమ్మ ఆలోచిస్తుంది.

 ఆలోచించనంతవరకె సమస్యలు సమస్యలుగా భయపెడతాయి.  ఆలోచించే మొదడు వేసే ప్రశ్నలకు – జవాబుల్ని, జవాబులకు ఆచరణ రూపాన్ని అందించడానికి ఈరమ్మ లాంటి వాళ్ళకు ఎంతోకాలం పట్టదు.  బియ్యం బస్తాలకు పాదాలెలా మొలిపించాలో ఈరమ్మకు తెలుసు.  జరగబోయే కరువుదాడికి తగిన వ్యూహ రచన కూడా ఈరమ్మ అంత:చేతనలో వుందనిపిస్తుంది. ఈ ఆలోచనల్లోనుండే ఈరమ్మ ఇంట్లో వెలిగించిన వెలుగు తడికెలగుండా, బయటకు వెళ్ళిందని చిత్రించడం, ఈరమ్మలో మొదలైన ఆలోచనల వెలుగు ఊరంతా విస్తరిస్తుందని రచయిత్రి “మండుతున్న పొయ్యితో”  ప్రతీకాత్మకంగా చెప్పారు.  పొయ్యిలో వెలుగుతున్న మంటల వెలుగు ఆమె ఒక్క ఇంటికే పరిమితం కాక, తడికెల గుండా వీధంతా విస్తరించింది. ఆవెలుగు ఇంటింటికి ప్రసరించడానికి కావలసిన సంకల్ప బలం, నాయకత్వ లక్షణం ఈరమ్మ పాత్ర వ్యక్తిత్వంలో వుంది.  సుభాషిణి ’కరువెవరికి’ కథాలక్ష్యం కేవలం సామాజిక, ఆర్థిక అంతరాలను చిత్రించడమే కాదు. ఆ స్థితిని అధిగమించడానికి కావాల్సిన సాధన సంపతి కరువుదాడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యక్షంగా కరువుదాడి చేయించడం వేరు. ఆమార్గంలో ఆలోచనలను ప్రేరేపించడం వేరు. కరువుదాడి గురించి ఎక్కడా ఆమాటను వాచ్యంగా చెప్పకపోయినా తన ఆలోచనలను సామాజిక అంతరాలతో మేళవించి సూచన ప్రాయంగా పాఠకులకు కథాలక్ష్యాన్ని స్ఫురింపజేయడం,  సుభాషిణి కథన నైపుణ్యానికి మచ్చుతునక.

సమాజం అభివృద్ధి వైపు నడవడాన్ని పురోగమన స్పృహ వున్న ఏ వర్గానికి చెందిన వారైనా వ్యతిరేకించరు.  అయితే అది ఏ లక్ష్యాలతో ఎటువైపు నడుస్తూందీ అనే గమనం ముఖ్యం. యంత్ర నాగరికత నుంచి పొందాల్సింది కొత్త సాంకేతిక ఙ్ఞానాన్ని, అనుభవాలను మాత్రమే కాదు.  కొత్త మానవ సంభంధాల్ని ఆలోచనా విధానాల్ని కూడా. దీన్ని గుర్తించని నాగరికత సమాజ అభివృద్ధి కంటే సమాజ విధ్యాంసానికే ఎక్కువగా దారి తీస్తుంది.  అంతేకాదు మనిషి అంతరంగిక విధ్వంసానికి కూడ కారణమౌతుంది. సమస్త అభివృద్ధి మనిషిని మానవీకరించడానికే కాక మరింతగా అమానవీకరించడానికే వుపయోగపడుతుంది. సాంస్కృతిక రంగంలో  ఈ క్రమాన్ని గుర్తించటం మన కర్తవ్యం.

మన సమాజ ఆర్థిక చట్రం, ప్రధానంగా విలువల చట్రం. ప్యూడల్ లక్షణాలు వదులుకోకుండానే, ఏకకాలంలో యాంత్రిక యుగ లక్షణాలను కూడా సంతరించుకుంటూ ఆ క్రమంలో అమానవీకరణకు కూడా కారణమౌతుంది.

          తెలుగు వచన సాహిత్యంలో ఈ అమానవీకరణ, పరాయీకరణ సంస్కృతిని చిత్రించిన రచనలు చాలా స్వల్పం.  ఆ స్వల్ప పరిణామం కుడా ఉత్తరాంధ్ర, తెలంగాణా నుండే వచ్చాయి.  తెలుగు సాహిత్యంలో రచయిత్రులు ప్రపంచీకరణ అమానవీకరణ ప్రతిఫలనాలను వాటి వింత పోకడలను పట్టించుకున్నవాళ్ళు చాలా తక్కువ. అందులోనూ విద్యావ్యవస్థలోకి అసంబద్ధంగా చొచ్చుకు వచ్చిన ప్రపంచీకరణ పుట్టగొడుగుల గురించి సుభాషిణి పట్టించుకొని చేసిన కథా సాహిత్యం ఒక పార్వ్శమైతే, మానవ సంబంధాల్లో ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలలో ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా స్త్రీల జీవితాల్లో చొరబడిన బహుళజాతి  కంపెనీలు సృష్థిస్తున్న సాంస్కృతిక విద్వంసం మరో పార్శ్వం. వాటి మూలాలను రెండు తరాలకు చెందిన స్త్రీల ఆలోచనల్లోని వైరుధ్యాలు తల్లీ-కూతుళ్ళ మధ్య చొరవ చేసుకోవడం,  ’అమూల్య’ కథగా రూపుదిద్దుకుంది. 

        “ఏం మనిషి….? ఎన్నికొనిచ్చినా ఈ పిల్లకు తృప్తి లేదు” అనుకుంటుంది తల్లి. . (’అమూల్య’ పేజి.నెం.19).

          “ఇంతరేటా? వద్దు ….. కొంచెం తక్కువలో చూపెట్టండి అని షాపు వాళ్ళ దగ్గర మాత్రం దయచేసి అనొద్దు…. ప్లీజ్…. ఘోరంగా వుంటుంది….?” అని తల్లితో అంటుంది కూతురు. (’అమూల్య’ పేజి.నెం.19).

పెట్టుబడి పోకడలను అందిపుచ్చుకున్న పిల్లవేరు నేలవిడిచి ప్రవర్తించడాన్ని రోలింగ్ చీరలు చేసే  ఒక సాధారణ గృహిణి తన కూతురి ఆలోచనలను దారిలో పెట్టగలిగింది.  బ్రాండెడ్ వస్తు వ్యామోహం పట్ల అర్థంలేని కృత్రిమ పోకడలను అవసరాలుగా భావించే యువతను అందులో నుంచి తప్పించి, చైతవ్యవంతం చేసుకొనే అవకాశం వుందని ’అమూల్య’ ’రమదేవి కొడుకు’ కథల్లో చిత్రించారు. ప్రపంచీకరణ పెనువుప్పెన నుండి తప్పించే ఈ ప్రయత్నం ఎంత వరకు వుపకరిస్తుంది అని చప్పరించే కంటే, పెను తుఫానులో చిక్కుకున్న వాళ్ళకు పూచిక పుల్లైనా ఆసరా అయినట్లే కథాహిత్యంలో సుభాషిణి కథలు మానవ సంబంధాలలో రావాల్సిన మార్పుల పట్ల చొరవను ప్రదర్శిస్తాయి.

“డబ్బులు సంపాయించాలనే ఆశ వీనికి ఎట్ల పుట్టింది? వీని తలకాయలోకి ఎవరు ఎక్కిచ్చింటారు? ఎవరన్నా ఎక్కియ్యాల్నా వీళ్ళకు? అందరిన్నీ చూస్తుంటాడు …. ఇరవై నాలుగు గంటలూ టీవీ ముందరన్నా కూర్చోవాల్లా లేకుంటే కంప్యూటర్ ముందున్నా కూలబడాలా.  మధ్యలో సెల్లు ఒకటి! కళ్ళ ముందర రకరకాలవి కొత్తకొత్తవి కనిపిస్తాంటే వూరికే వుండలేరు….. కావాలనిపిస్తుంది” (’రమాదేవి కొడుకు’ పేజి.నె.99).

అమూల్య తల్లి సునీత, రమాదేవి ఎదుర్కొన్న మార్కెట్ సంక్షోభం కేవలం ఆ కుటుంబాలకు మాత్రమే సంబంధించింది కాదు.  మొత్తం సమాజానికి సంబంధించింది అనే విషయం గుర్తించబట్టే, రచయిత్రిలోని ఆవేదన ఈకథల్లోని పాత్రచిత్రీకరరణలో భాగమయ్యింది.

సుభాషిణి సృజించిన పాత్రల భాష, వాటిని మలచిన తీరు ఆమె స్థానిక జీవిత పరిశీలనకు నిదర్శనం.  కథను నిలకడగా మంచి ఎత్తుగడతో నడిపించడం ఆమె ప్రతికథలోను కనబడుతుంది.  కథకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించడం, పాత్రల మనోభావాలను నిశితంగా అభివ్యక్తం చేయడం, పాత్రల స్వభావాన్ని ప్రవర్తనను వాస్తవానికి దగ్గరగా చిత్రించారు.  అందుకే అక్కడక్కడ కొంత బూతుపదాలు దొర్లినప్పటికీ ఆయా సంధర్భాలలోఅవి సహజంగానే అనిపిస్తాయి.  ఒక దళిత స్త్రీ పెద్దరెడ్డిని ఆవిధంగా మాట్లాడాలంటే, (పరోక్షంలో ఐనాసరే!) ఎంత గుండె ధైర్యం కావాలో అంత గుండె ధైర్యాన్ని రచయిత్రి ఆ పాత్రలకు ఇచ్చారు.  ఈరమ్మ మామూలు స్త్రీ కాదు, శక్తివంతురాలు.  ఒక్క ఈరమ్మ పాత్ర కల్పనలోనే కాదు “అమూల్య”లోని సునీత, ’రెండు సంధర్వాలు’ కథలోని శ్రీలత పాత్రలు సాధారణత్వం నుండి అసాధారణీకరణ లోకి పర్యవసించిన పాత్రలు. ఈపాత్రచిత్రణలో స్త్రీల వ్యక్తిత్వ ,చైతన్యస్థాయిలను, కథాసంవిధాన కల్పనలో ఒకభాగంగా తెలుపుతుంది.

1980ల తర్వార తెలుగు కథాసాహిత్యం వస్తురూపాల్లో వచ్చిన మార్పుల్ని, అందుకు కారణమైన స్త్రీవాద భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడంలో స్త్రీవాద రచయిత్రుల కృషిలో భాగంగా కె. సుభాషిణి కథాసాహిత్య కృషిని ప్రస్తావించుకోకతప్పని సందర్భాన్ని ఆమె సృష్టించు కున్నారు.  అంతేకాదు ఎనభై దశకం తరువాత తలెత్తిన మరో అల ప్రాంతీయత.  1981 వ సంవత్సరంలో తెలంగాణా ఉద్యమం కొనసాగుతున్నప్పడే, రాయలసీమ వాసులుగా తాము కూడా ఎదుర్కొంటున్న సాంస్కృతిక వివక్షరూపాల్ని రాష్ట్రవిభజన దృష్టిపథంలోకి తీసుకోనిరావాలన్న తపనతో ఆమె ’గాయాలు ’దృతరాష్ట్ర కౌగిలి’ ’రెండు సంధర్బలు’ లాంటి సాంస్కృతిక విలువలున్న కథల్ని రాశారు. అలాగే ’కరువెవరికి’ కథను రాయలసీమ రచయితలకన్న భిన్నంగా అంటే, అందరూ రైతుల పక్షాన కరువు జీవితాన్ని సృజిస్తే, ఈమె రైతులందరు ఒక్కటి కాదన్న అవగాహనతో చిన్నరైతులు. వ్యవసాయ కూలీల పక్షంలో నిలబడి కథను నడిపించారు.

ఈకథా రచనకు తన సామాజిక వర్గంలోని దోపిడి మూలాలను చాలా దగ్గరగా చూడటం, స్థానీయత, మార్క్సిస్ట్, స్త్రీవాద  భావజాలంతో, స్థానిక ఉద్యమాలతో సుభాషిణికి గల సామీప్యం వలన ఈ కథకు ప్రత్యేకత చేకూరింది.ఇలాంటి వైవిధ్య కథాసాహిత్య కృషి, తెలుగు సాహిత్యంలో విలక్షణత్వాన్ని  సంతరించుకుంది.

K Sridevi

1 comment

Leave a Reply to Purushotham satheesh Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s