
సాహిత్యం సమాజాన్ని జాగృతపరుస్తుంది. ప్రభావితం చేస్తుంది! ఉత్తమ సాహిత్యం వల్ల అత్యుత్తమ సమాజం
ఆవిష్కృతమవుతుంది. సమాజికపరమైన అన్ని అంశాలమీదా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తన ప్రభావాన్ని చూపే సాహితీవిమర్శకు సాహిత్యంలో ఓ ప్రత్యేకస్థానం ఉంది.తన హెచ్చరికల ద్వారా సాహిత్యాన్ని పక్కదారులు పట్టనీయకుండా, క్రమపరుస్తూ ఉత్తమ సాహిత్యంగా మలచగలుగుతున్నది విమర్శే! అందువల్ల విమర్శకులు పరోక్షంగా సాహిత్యాన్ని
చాలా వరకు ప్రభావితం చెయ్యగలుగుతారు.
ఆధునిక సాహిత్య విమర్శకులలో చిత్తూరు జిల్లాలో ముఖ్యులు వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు. డా|| కొత్వాలు అమరేంద్రగారు తమ ‘సీమ సాహితీరత్నాలు’ గ్రంథంలో వల్లంపాటిని విమర్శక ఘనాపాటిగా అభివర్ణించారు. వల్లంపాటి వారి రచనలు చదువుతున్నప్పుడు వారి సుస్వరం వింటున్నట్లే అనుభూతి కలుగుతుంది. అది వారి శైలి యొక్క ప్రత్యేకత!
చిత్తూరు జిల్లా ‘రొంపిచెర్ల’ మండలకేంద్రంలో లక్ష్మీదేవమ్మ, అశ్వర్ధమయ్య దంపతులకు 15-3-1937 తేదీన జన్మించారు వల్లంపాటి వెంకటసుబ్బయ్య.వీరి తాత రామచంద్రప్ప ఆ ప్రాంతంలో ప్రసిద్ధులు.
చిన్న వయసునుండీ మార్క్సిజాన్ని బాగా జీర్నించు కున్న వల్లంపాటి ఆధునిక సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యడానికి మునుపే ప్రాచీన సాహిత్యాన్ని కూడా ఎంతో లోతుగా తరచి చూసిన వ్యక్తి. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషలలోచాల చిన్నతనం నుండీనే వారికి మంచి ప్రావీణ్యం ఉండేది. అమరకోశం వారికి పునాది అంటారు త్యాగమూర్తి శర్మగారి లాంటి వారి సమీప బంధువులు. సాంబ నిఘంటువును తల్లక్రిందులుగా చెప్పగలిగే వారట వల్లంపాటి హైస్కూలు
రోజులలోనే!
జిల్లా పరిషత్ లో స్కూలు టీచరుగా జీవితాన్ని ప్రారంభించిన వీరు విద్యార్థులకు విద్యనందిస్తూనే తాము నిరంతర విద్యార్థిగా మారి తనలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకుంటూ మానవ మనస్తత్వాలకు, ఆలోచనలకు అద్దంపడుతూ సమకాలీన, సామాజిక సమస్యలను విశ్లేషిస్తూ రచనలు ప్రారంభించారు.
1958లో ఆంధ్రప్రభలో ప్రచురితమైన “అన్యథా శరణం నాస్తి” వీరిమొట్టమొదటి కథ. 1961లో ఆంధ్రపత్రికలో వారి కోరిక తీరినవేళ కథ ప్రచురితమయ్యే సమయానికి కథకులుగా మంచి ఖ్యాతి పొందారు. 1962లో ఆంధ్రప్రభ నిర్వహించిన నవలల పోటీలో వారి “ఇంద్రధనుస్సు” నవల ద్వితీయ బహుమతిని పొంది వీరిని మంచి నవలాకారులుగా నిలబెట్టింది.దూరతీరాలు, మంచు తెరలు, జానకి పెళ్ళి తదితర నవలలు వీరి లేఖిని నుండీ వెలువడ్డాయి.
స్కూలు టీచరు స్థాయిలోనే ఆగిపోకుండా ఎస్వీ యూనివర్శిటీ నుండీ ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్సు పట్టా పొంది, ఆంధ్రా యూనివర్శిటీ నుండీ బి.యడ్ తో మదనపల్లె బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో అధ్యాపక పదవిని చేపట్టారు.ఆపై హైదరాబాదు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీషు అండ్ ఫారెన్ లాంగ్వేజస్ నుండీ పి.జి. డిటిఇ మరియు యం.లిట్. పొందారు.
వ్యవస్థ పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలను కలిగివున్న వల్లంపాటి గారు నిరంతర సాహితీ అధ్యయనంతో తమ మేధస్సును పెంచుకుంటూ ప్రపంచ సాహిత్యాన్ని వివిధ కోణాల్లోంచీ లోతుగా పరిశీలించారు. ఆ అనుభవంతో వీరు అనేక ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. వాటిలో ముఖ్యమైనవి…1. చరిత్ర అంటే ఏమిటి?, 2. చరిత్రలో ఏం జరిగింది?, 3. ప్రపంచ చరిత్ర, 4. ప్రాచీన భారతదేశంలో ప్రగతి – సాంప్రదాయం, 5. నవల – ప్రజలు,6. ప్రాచీన భారతదేశ చరిత్ర, 7. లజ్జ
కన్నడమూలం వడీలాల్ నవలను కూడా వీరు కడుపుమంట’ పేరిట తెలుగులోకి అనువదించారు.వల్లంపాటి వారి ఆంగ్ల రచనలలో ముఖ్యమైన గ్రంథాలు ….
1. నోబుల్ ప్రయిజ్ ఫది డంగ్లింగ్ మెన్.షక్ సాల్వనిస్టు.
గ్విస్టిక్ డీవియేషన్ మొదలైనవి.
వీరు శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య, తిలక్, వివిన మూర్తి, సింగమనేని నారాయణ మొదలైన కథకుల పుస్తకాలను ఆంగ్లభాషలోనికి తర్జుమా చేశారు. ఇవన్నీఒక ఎత్తయితే ఎంతో మంది నవలాకారులకూ ‘నవలా శిల్పం’ , లెక్కకు మించిన కథకులకూ ‘కథాశిల్పం’, విమర్శకులకు ‘విమర్శా శిల్పం’ గ్రంథాలు వెలువరించి దిశా, నిర్దేశాలను చూపే
దీపధారిలా నిలచిపోయారు.ఇవన్నీ వీరు సాహిత్యవిమర్శకు లుగా ఖ్యాతిని పొందడానికి దోహదపడ్డాయి. ఆయన ఇతర రచనలలో ముఖ్యమైనవి 1. వల్లంపాటి సాహిత్య వ్యాసాలు, 2. అనుశీలన,
ఆధునికి తెలుగు కథా రచన మీద సశాస్త్రీయంగా, వివరణాత్మకంగా,విమర్శనాత్మకంగా, సులభ శైలిలలో గొప్ప విశ్లేషణలతో వ్రాయబడిన మొట్టమొదటి గ్రంథంగా సాహితీ ప్రముఖుల ప్రశంశలు పొందిన వీరి ‘కథాశిల్పం’ గ్రంథానికి

1999 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ వారి సాహితీ అవార్డు లభ్యమైంది.
శాస్త్రీయంగా ఉండేదే అసలైన విమర్శ అని ఘంటా పథంగా చెప్పే వల్లంపాటివారిని ఎంతగానో ప్రభావితపరచిన సాహిత్య విమర్శకులు ‘లీవిస్’. ఆ కమిట్మెంటుకు తమ జీవితాంతం కట్టుబడ్డారు వారు.
పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి పండితులతో సాన్నిహిత్యం కలిగి వుండిన వల్లంపాటి వారు సంస్కృత భాష మీద, పురాణ, ఇతిహాస గ్రంథాల మీద మంచి కమాండ్ కలిగి వుండేవారు. ఆకాశం నుండీ భూమి మీదకు దూకిన గంగా ప్రవాహంలా వారి నోటి గుండా మృదుగంభీరస్వరంతో ‘శివతాండవం’ పద్యాలన్నీ పాడేవారు.
కవి,పండితులు, ఉత్తమ కథకులు, నవలా కారులు,ఆధునిక విమర్శకులు అయిన వీరి సాహిత్య కృషికి లభ్యమైన పురస్కారాలు:
1. తాపీ ధర్మారావు స్మారక అవార్డు – 1995.
2. కొండేపూడి సాహిత్య అవార్డు – 1996.
3. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ అవార్డు – 1997.
4. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 1999
5. కుప్పంరెడ్డెమ్మ సాహితీ అవార్డు – చి.ర.సం. ద్వారా.
వల్లంపాటి చిట్టచివరి పరిశోధన సృజన రాయలసీమ లో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ.ఈగ్రంథం రాయలసీమ సాహిత్యకారులకు అత్యంత పఠనీయ గ్రంథం.
తీవ్ర అనారోగ్యంతో మృతికి చేరువలో ఉన్నప్పుడు సైతం గ్రంథ ధ్యానం లోనే గడిపారు. వారు అత్యుత్తమ నవల ఒక దానిని రాయాలి అనుకుంటూ , రాసే లోగానే నే 2.1. 2007 నాడు నిశ్శబ్దంగా నిష్క్రమించిన ఈ నిరంతర కృషీవలుని సాహితీ కృషిని అధ్యయనం చేయడమే మనం వారికి ఇవ్వగలిగిన నిజమైన నివాళి.
టి.ఎస్. ఎ. కృష్ణమూర్తి