
సొదుం జయరాంను సీరియస్ రచయితలందరూ గొప్పరచయితగా పేర్కొంటారు. ఫ్రాన్స్ రచయిత గైడీమపాసా ప్రభావం తన కథల మీద వుందనీ ఆయన చెప్పేవాడు. అందువల్లనే ఆయన కథలన్నీ నిరాడంబరంగా అత్యంత
సంక్షిప్తంగా వుంటాయి. ఒక్కపదం, ఒక్క అక్షరం కూడా వృథాగా వుండకూడ దంటాడాయన. రా.రా. శిష్యవర్గంలో గురువును మించిన శిష్యుడాయన. ఆయన రాసిన ‘వాడిన మల్లెలు” కథను రా.రా. ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. రా.రా.వంటి విమర్శకుల సహచర్యం ఆయనను గొప్ప రచయితగా తీర్చిదిద్దింది. పాలగిరి విశ్వప్రసాద్ వంటి శిష్యుల సహకారం వల్ల, దాదాహయాత్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, శశిశ్రీ, డి.రామచంద్రరాజు సహవాసంవల్ల సొదుం జయరాం చివరి రోజుల్లోనూ కథలు వ్రాశారు. శశిశ్రీ సంపాదకులుగా ఉన్న “సాహిత్యనేత్రం” త్రైమాస పత్రికలో ఆయన కథలు వరుసగా ప్రచురింపబడ్డాయి. ‘విపుల’ ‘సాహితి’ వంటి మాస పత్రికల్లో ఆయన కథలు వచ్చాయి. ఆయన ‘మర్యాదస్తులు’ కథానిక
ఒక్కటి చాలు, ఆయన గొప్ప కథకుడనీ చెప్పడానికీ! ఈ కథ అంతర్జాతీయ స్థాయికి చెందిన కథ.వందలాది కథలు రాసిన రచయితలకంటే ఉత్తమ రచయిత సోదుం జయరాం. ఆయన ముందురాసిన వాడినమల్లెలు, సింహాద్రి స్వీట్ హోం’ కథా సంపుటాలలోని కథలను, కొత్తగా సంకలనాన్ని ప్రచురించాడు. ఆ సంకలనాన్ని తిరిగి ఈ మధ్యనే నూకారాం ప్రసాద్ రెడ్డి పెన్నేటి పబ్లికేషన్ ద్వారా ప్రచురించారు. 1986లో ఈయన రాసిన ‘కర్రోడిచావు’ రాసిన కథలను కలిపి 1991లో ‘సొదుం జయరాం కథలు’ సంకలనం వచ్చింది. పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి సొదుం జయరాం సాహిత్యనేత్రం ప్రచారం ద్వారా ‘రాతిపూలు’ సంకలనం తెచ్చారు.జయరాం రాసిన 12 కథలు రష్యా భాషలోకి, కొన్ని హిందీ,కన్నడ భాషలోకి అనువదింప బడినాయి.
ఆయన కథలతో పాటు ‘అగమ్యం’ నవలను కూడా రచించారు. ఇది స్వాతి మాసపత్రికకు అనుబంధంగా వచ్చింది. కథారచనలో ఎలాంటి సంక్షిప్తతకు ప్రాధాన్యతనిస్తారో అంతే సంక్షిప్తత నవలా రచనలో కూడా ఇచ్చారు. కథారచనలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మెలకువలు పాటించాలో రారా నుంచే నేర్చుకున్నారాయన.
(ఖలందర్ రాసిన కడప సాహితి నుండి)